రాజాసాబ్ ప్రభాస్ మూవీ ఎలా ఉంది ? – రాజాసాబ్ మూవీ రివ్యూ

Spread the love

సినిమా కెరీర్ ప్రారంభంలో రెబెల్ స్టార్ కృష్ణంరాజు తమ్ముడి కొడుకుగానే ప్రభాస్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు . 2002 లో ఈశ్వర్ మూవీలో ప్రభాస్ కనిపించగానే పెద్దనాన్నగారిలా ఈ కుర్రాడు కూడా ఒడ్డూ పొడుగు బావున్నాడు . ఆయన వారసత్వం నిలబెడతాడని కృష్ణంరాజు అభిమానులు ఆనాడే అంచనా వేశారు .

ఇక అక్కడ్నుంచి వర్షం , పౌర్ణమి , ఛత్రపతి , డార్లింగ్ , మిస్టర్ పర్ఫెక్ట్ , మిర్చి సినిమాలతో వింటేజ్ హీరో లుక్ లో మెరిసి మెప్పించాడు . 2015 లో ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి మూవీ ప్రభాస్ కెరీర్ ను అమాంతం శిఖరానికి చేర్చింది .

ఎంతలా అంటే ఆ ఒక్క సినిమాతోనే ప్రభాస్ స్టార్ డమ్ పెరిగిపోయి పాన్ ఇండియా స్టార్ అయ్యాడు
ఇక అక్కడ్నుంచి ప్రభాస్ రేంజ్ మారిపోయింది . బాలీవుడ్ ఇండస్ట్రీ చూపులు ప్రభాస్ మీద పడ్డాయి..
ఆదిపురుష్ , సలార్ , సాహో , కల్కి సినిమాలతో గ్లోబల్ స్టార్ రేంజికి ఎదిగాడు .

బాలీవుడ్ నిర్మాతలకు సైతం ప్రభాస్ కాల్షీట్స్ దొరకని పరిస్థితి.. పేరుమోసిన పెద్ద ,పెద్ద దర్శకులు ఇతడి డేట్స్ కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చింది .

ఇటువంటి పరిణామాల నేపథ్యంలో మారుతి అనే ఓ మిడ్ రేంజ్ దర్శకుడి నుంచి ప్రభాస్ మూవీ పట్టాలెక్కుతుందని తెలిసి ఫాన్స్ ఆశ్చర్యపోయారు . గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఉన్న తమ హీరో ప్రభాస్ లోకల్ దర్శకుడి సినిమాకి ఎలా సైన్ చేసారని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు .

ఆ ప్రశ్నలకు రాజాసాబ్ ట్రైలర్ ద్వారా దర్శకుడు మారుతి సమాధానం చెప్పారు.. ట్రైలర్లో ప్రభాస్ లుక్ చూసిన అభిమానులు సాహో అనడంతో అప్పటికి వివాదం సద్దుమణిగింది .

ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్లో మారుతి మాట్లాడుతూ రాజాసాబ్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అయి తీరుతుందని , ఎవరికైనా సినిమా నచ్చకపోతే తన ఇంటికొచ్చి ప్రశ్నించవచ్చని చెప్తూ తన అడ్రస్ కూడా ఇచ్చి ఫాన్స్ కు సవాల్ విసరడంతో సినిమా మీద హైప్ ఒక్కసారిగా పెరిగిపోయింది .

ఈ పరిస్థితుల్లో రాజాసాబ్ జనవరి తొమ్మిదిన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయ్యింది .మరి దర్శకుడు మారుతి చెప్పినట్టు బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందా ?
రాజాసాబ్ మూవీ ప్రభాస్ రేంజికి తగ్గట్టుగా ఉందా ? అనేది ఇప్పుడు చూద్దాం

ఇదీ కథ :

సినిమా ప్రభాస్ చెప్పినట్టుగా నాయనమ్మ , మనవడి అనుబంధంతో మొదలౌతుంది . గంగాదేవి ( జరీనా వహాబ్ ) ఒకప్పటి దేవనగరి సంస్థానానికి చెందిన జమిందార్ . గతాన్ని చాలావరకు మర్చిపోయిన ఈవిడ తన మనవడు రాజు ( ప్రభాస్ ) తో కలిసి గంగమ్మగా సామాన్య జీవితం గడుపుతూ ఉంటుంది . అన్నీ మర్చిపోయినా ఆమె తన భర్త కనకరాజును( సంజయ్ దత్ ) మాత్రం మర్చిపోదు .

ఈ కనకరాజుకి డబ్బు పిచ్చి . ఆ డబ్బులను వెతుక్కుంటూ ఎప్పుడో వెళ్లిపోయిన కనకరాజు తిరిగి వెనక్కి రాడు . దాంతో తన భర్త జాడ తెలియక ఆందోళన పడుతున్న గంగమ్మ ఎలాగైనా సరే ఆయన ఆచూకీ కనుక్కోవాల్సిందిగా మనవడిని సతాయిస్తుంటుంది . నాయనమ్మ అంటే ప్రాణంగా భావించే రాజు తాత ఆచూకీ కనుగొనడం కోసం పట్నం బయలుదేరుతాడు .

ఇక్కడ ఈ కనకరాజుకి కూడా ఓ చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది . తనకోసం వెతుకుతున్న రాజుని , అతడి మిత్ర బృందాన్ని మార్మిక విద్య ద్వారా నర్సాపురం అడవుల్లోని తన రాజమహల్ కు రప్పిస్తాడు . ఈ రాజమహల్ కి ఎంట్రీ మినహా ఎగ్జిట్ ఉండదు .

రాజు , అతడి నాయనమ్మలు కనకరాజు కోసమే రాజమహల్ లోకి ప్రవేశిస్తే ఆశ్చర్యంగా అతడు మాత్రం వీళ్ళని చంపాలని ప్రయత్నిస్తాడు .

దాంతో రాజు రాజమహల్ లో కనకరాజుని ఏ విధంగా ఎదుర్కొంటాడు ?
అసలు కనకరాజు ఫ్లాష్ బ్యాక్ ఏంటి ?
మొత్తమ్మీద రాజమహల్ లో ఏం జరుగుతుంది ? అనేది మిగతా కథలో తెలుస్తుంది

ఎలా ఉంది ?

ఫాంటసీ , హర్రర్ , కామెడీ మూడురకాల దినుసులను ఒకే మిక్సీలో వేసి గిర్రున తిప్పి బయటికి తీస్తే వచ్చిన బొమ్మ రాజాసాబ్ .

హర్రర్ మరియు ఫాంటసీ కాంబినేషన్లు సాధారణంగా బానే ఉంటాయి . దీనికి కొద్దిగా కామెడీ టచప్ ఇవ్వాలంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా స్క్రిప్ట్ వర్క్ చెయ్యాలి . ఈ విషయంలో దర్శకుడు మారుతి కొద్దిగా తడబడినట్టున్నాడు .

ఎందుకంటే మొదటిరెండు మిర్చి బజ్జీ , పునుగుల్లా కాంబినేషన్లో కలిసిపోతాయి . దానికి కామెడీ యాడ్ చేస్తే అది వేరే మెనూ అవుతుంది . అయినా పర్లేదు భోజనం చేసిన తర్వాత వేసుకునే మిఠాయి పాన్ లా తియ్యగుంటే డైజెస్ట్ అయిపోతుంది . అదే కామెడీ వికటించి డోసు ఎక్కువైతే జర్దా పాన్ లా ఘాటు అనిపిస్తుంది .

ఇక్కడే దర్శకుడు సబ్జెక్టు ను సరిగా హ్యాండిల్ చేయలేకపోయాడు . కామెడీ కోసం ముగ్గురు నలుగురు ఆర్టిస్టులను రంగంలోకి దింపినా ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు . ఆ బాధ్యత కూడా ప్రభాసే తీసుకుని నవ్వించటానికి ప్రయత్నం చేసాడు .

ఒకరకంగా చెప్పాలంటే ఫాంటసీ , హర్రర్ , కామెడీ అనబడే మూడు జానర్లను ప్రభాస్ తన భుజాన వేసుకుని నడిపించాడు . బాహుబలి నుంచి ఒకరకమైన ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కుపోయిన ప్రభాస్ తిరిగి డార్లింగ్ స్టైల్లో అలరించాడు .

ప్రథమార్థంలో హీరో , హీరోయిన్ల రొమాన్సు , డ్యూయెట్లు , నాలుగు కామెడీ సన్నివేశాలతో ఫక్తు రొటీన్ తెలుగు సినిమాల మాదిరే నడిచిపోతుంది . రాజమహల్ సన్నివేశాలు వచ్చినప్పటినుంచి కథనంపైన ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలుగుతుంది .

పాటలు ముగ్గురు హీరోయిన్లతో గంతులు వేయడం కోసమే పెట్టినట్టున్నారు.. మ్యూజికల్ హిట్ చేద్దామన్న ప్రత్యేక శ్రద్ద అయితే ఏమీ పెట్టలేదు . పైగా ఇంత భారీ బడ్జెట్ సినిమాకి సింగిల్ స్కిన్ షో సరిపోదు అనుకున్నారేమో ఏకంగా మూడు సంతూర్ చర్మ సౌందర్యాలను వెండి తెరమీద ఆరబోశారు. ఆ ముగ్గురిలో మాళవిక మోహన్ మినహా మిగిలిన ఇద్దర్నీ తైతక్కలాడటానికే తీసుకున్నట్టున్నారు .

ద్వితీయార్థంలో కనిపించే రాజమహల్ , కనకరాజు మార్మిక విద్యలు , గంగమ్మ , కనకరాజుల ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు కొంత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి . ఎప్పుడైతే రాజమహల్ లోకి ఎంటర్ అవుతామో అప్పట్నుంచి గ్రాఫిక్ వర్క్స్ మొదలౌతాయి అని అర్ధం అన్నమాట .

పర్లేదు.. విఎఫ్ఎక్స్ కోసం బాగానే ఖర్చు పెట్టినట్టున్నారు.. క్వాలిటీ బాగానే ఉంది.. కానీ కొన్ని సన్నివేశాల్లో సంజయ్ దత్ పాత్రను కూడా గ్రాఫిక్స్ లో లాగించేసారా అన్న అనుమానం వచ్చే విధంగా ఉన్నాయి .

ఆడియో సిస్టం సరిగా లేదు.. డబ్బింగ్ సినిమాల మాదిరి కొన్ని డైలాగులు సరిగా అర్ధం కాలేదు.

ట్రైలర్ చూసిన అభిమానులు తమ హీరోని కొత్త లుక్ లో చూడబోతున్నామని బోలెడు సంతోషపడిపోయారు . అలాంటివాళ్ళు సినిమా చూస్తే కొంత నిరాశకు గురి కావొచ్చు . ఎందుకంటే ట్రైలర్లో చూపించిన ప్రభాస్ ఇందులో మాయం అయ్యాడు .

ఓవరాల్ గా రాజాసాబ్ మూవీని ప్రభాస్ తన భుజాల మీద వేసుకుని నడిపించడానడంలో సందేహం లేదు .

ఎలా చేసారు ?

రాజాసాబ్ మూవీలో ఎవరెవరు ఎలా చేసారు అని చెప్పుకోవాలంటే ముందుగా హీరో ప్రభాస్ గురించే చెప్పుకోవాలి .

ఇప్పటిదాకా తాను చేసిన సీరియస్ పాత్రల ఇమేజ్ ప్రభావం ఈ సినిమా మీద పడకుండా పక్కనబెట్టి పాత సినిమాల్లో హీరో లెక్క హుషారుగా , జోష్ తో నటించే ప్రయత్నం చేసి అభిమానులను మెప్పించారు . ఇతడి లుక్ కూడా బావుంది .

ఇక ఇప్పటిదాకా హీరో పక్కన ఒకరిద్దరు హీరోయిన్లను చూడటానికి అలవాటుపడ్డ మనం ముగ్గురు హీరోయిన్లతో కూడా సినిమాలు చూడటానికి అలవాటు పడాలి .

ఈ ముగ్గురిలో మాళవిక మోహన్ పాత్రకు కొంచెం డెప్త్ ఉంది . నిధి అగర్వాల్ పాటలకోసం తీసుకున్నట్టున్నారు . మూడో అమ్మాయి రిద్దిని ఎందుకు తీసుకున్నారో కూడా తెలీదు .

కథకు కనకరాజు పాత్ర కీలకం . ఈ పాత్రకు సంజయ్ దత్ ను తీసుకోవడం వరకు ఓకే.. కానీ అంతటి బాలీవుడ్ నటుడ్ని తెరమీదకు తీసుకొచ్చినప్పుడు పాత్ర తీరుతెన్నులను ప్రేక్షకులకు మరింత కనెక్ట్ అయ్యే విధంగా తీర్చిదిద్దడంలో దర్శకుడు జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది .

గంగాదేవి పాత్ర పోషించిన జరీనా వహాబ్ నటన బాగానే ఉంది .
ఇక కీలక పాత్రలో కనిపించిన సముద్రఖని షరామామూలుగా బాగానే నటించాడు .

రాజాసాబ్ లో కామెడీ మిక్సింగ్ కోసం సప్తగిరి , సత్య , వీటివి గణేష్ తదితర కామెడీ యాక్టర్లను రంగంలోకి దించారు కానీ ఆశించిన స్థాయిలో కామెడీ పండలేదు . సరిగా వాడుకోవాలే కానీ థియేటర్లలో నవ్వులు పూయించటానికి సత్య ఒక్కడు చాలు .

సాంకేతికత పరిస్థితి ఏంటి ?

సినిమాకి నేపధ్య సంగీతం అందించింది తమన్ అనగానే ఆయన లెవెల్లో ఇందులో కూడా బీజీఎమ్ అద్దిరిపోతుంది అనుకున్నవాళ్ళకి కొద్దిగా నిరాశ మిగులుతుంది . సరే బీజీఎమ్ సంగతి ఎలా ఉన్నా మ్యూజికల్ గా పాటలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి .

సినిమాటోగ్రఫీ బాగానే ఉంది . 600 కోట్లు ఖర్చు పెట్టి తీసాం అని మేకర్స్ చెప్పారు.. ఆ పరంగా నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి .

కథలో కొత్త పాయింట్లు సరిగానే రాసుకున్న దర్శకుడు మారుతి తెరమీదకెక్కించేసరికి తడబడ్డాడు.. స్క్రీన్ ప్లే లోపం స్పృష్టంగా కనిపిస్తుంది. ప్రభాస్ ఇమేజ్ కోసం అనవసరంగా అతికించిన సన్నివేశాలు మూవీకి మైనస్ .

విశ్లేషణ : దర్శకుడు కథలో మూడు జానర్లు కలిపి మిక్స్ చేసి ప్రభాస్ చేతిలో పెట్టినా అతడు తనవంతుగా అభిమానులకు బంగారు పళ్లెంలో పెట్టడానికి గట్టిగానే కృషి చేసాడు.. ఈ సినిమా పరంగా ఏవన్నా లోపాలు ఉన్నాయంటే అవి పూర్తిగా దర్శకత్వ వైఫల్యం వల్ల ఏర్పడినవే .. అడుగులు తడబడి సినిమా విడుదల ఆలస్యమైనప్పుడే ఇందులో విషయం అభిమానులకు అర్థమై ఉండాలి .

నటీనటులు : ప్రభాస్ , సంజయ్ దత్ , సముద్ర ఖని , మాళవిక మోహన్ , నిధి అగర్వాల్ , రిద్ది కుమార్ తదితరులు
సంగీతం : తమన్
సినిమాటోగ్రఫీ : కార్తీక్ పళని
నిర్మాత : టిజి విశ్వ ప్రసాద్
దర్శకుడు : మారుతి
విడుదల : 09-01-2026
రేటింగ్ : 2.5 / 5


Spread the love

2 thoughts on “రాజాసాబ్ ప్రభాస్ మూవీ ఎలా ఉంది ? – రాజాసాబ్ మూవీ రివ్యూ

  1. ఈ సినిమా గురించి విడుదలైన మొదటి రోజే “చెత్త సినిమా” అని పోస్టు పెట్టాను. నా అభిప్రాయం సరైందని మర్నాడు వచ్చిన రివ్యూలు ధృడ పర్చాయి. మీ సమీక్ష చాలా సున్నితమైనది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!