ముత్యాల ముగ్గుకు యాభైఏళ్లు !

Spread the love

ముత్యాల ముగ్గుకు యాభైఏళ్లు !

ఒక్కసారిగా ఆకాశమంతా కారం ఆరబోసినట్టుగా సిందూరవర్ణాలంకృతం చేసేస్తాడు.

సూర్యోదయాన సుమనోహరమైన మధురోహలు, సుప్రభాతపు సుస్వరాలు, సలలితమైన పూల ఘుమఘుమలూ.. ఇవన్నీ మనందరికీ జీవితాన మరువలేని నిత్యసంతోషాలు.

ఎటువంటి ఖరీదూ పెట్టకుండా ఆ ప్రకృతి ప్రసాదించిన అనల్పమైన ఆనందాలు.

అయితే ఈ దృశ్యంలో నిలువెత్తు తెలుగుదనంతో పంచెకట్టుకుని, తెల్లటి లాల్చీ, పైన ఒక కండువా వేసుకుని వెనక్కుతిరిగి ఆ ముదురు రంగుల ఆకాశాన్ని కుదురుగా చుట్టపొగల మధ్య ఆస్వాదించే ఒకానొక ఆసామి  కనబడతాడు. వెంటవెనకనుంచి వందలాది వాద్యపరికరాల్ని ఒకే శ్రుతిలో హాలంతా దద్దరిల్లేలా వినిపిస్తాడు మన మహదేవన్.

అంత తెల్లవారే  కాసేపట్లో అక్కడొక అనూహ్యమైన సంభాషణ జరగబోతోందన్న ఊహే మనకందకుండా చేస్తాడు.

‘నారాయడొచ్చాడ్సార్!’ అన్నమాట తెలుగిళ్లలో కొన్ని తరాలపాటు మారుమోగిపోయింది.

‘వచ్చాడా తీసుకొచ్చావా?’ అన్న వ్యంగ్యోక్తి ఇప్పటికీ మనందరికీ నవ్వు తెప్పిస్తుందే తప్ప, ‘చంపేసి, డిక్కీలో పడుకోబెట్టేశారమ్మా దుర్మార్గులూ..  వీళ్ల జిమ్మడిపోనూ!’ అని తిట్టుకోవాలనిపించదు.

ఇంతవరకూ తెలుగు చలనచిత్రాల్లో ఎందరో దర్శకులు ప్రతినాయక పాత్రల్ని తెరమీద ఆవిష్కరించిన తీరుతెన్నులన్నీ గమనిస్తే కెమెరాని పాదాల దగ్గరనుంచి పైదాకా మెల్లిగా నడుపుతూ, ముఖం దగ్గరకు రాగానే మొటిమలో, గుంటలో, కత్తిగాట్లో, బుర్రమీసాలో, తెల్లని కనుపాపలో, వికారమైన ముఖ కవళికలో చూపి, మనలో ఒకరకమైన ఉద్విగ్నతనీ, భయాన్నీ రేకెత్తించే ప్రయత్నాలు చేశారు.

ఇంకొందరైతే విలన్లకి వాద్యపరికరాల పట్ల మోజున్నట్టూ, కష్టకాలంలోనూ, కోపం వచ్చినపుడూ మృదంగం వాయిస్తున్నట్టో, వేణువు ఊదుకుంటూ తిరుగుతున్నట్టో చూపించి కూడా మన దృష్టిని ఆకర్షించారు.

 మరికొంతమంది విశాలమైన పళ్లెంలో రాక్షసుడిలా బోలెడంత బిర్యానీని, అందులో మాంసఖండాల్నీ చీల్చిచెండాడుతూ హడలెత్తించే విలన్లనీ చూపించారు.

కానీ మన బాపు కుంచెతో కుర్రకారుని వెర్రెత్తించే కుందనపు బొమ్మల్ని గీసే సుందర చిత్రకారుడు

అతడు వేసిన  దేవుళ్ళ బొమ్మలు చూస్తే చెయ్యెత్తి దణ్ణవెట్టాలనిపిస్తుంది. ఆ చేతినుంచి జాలువారిన బుడుగుల్ని చూస్తే ఎంత అల్లరి చేసినా కొడదామని ఎత్తిన చేయి  దించాలనీ అనిపిస్తుంది.

అటువంటి అమాయకులుంగారు ఇటువంటి విలన్ని ఇంతందంగా, ఒళ్లంతా గగుర్పొడిచేంతలా, మళ్లీ అంతలోనే ఆ పంచెకట్టూ, మీసకట్టులతో, చేతిలో విలాసంగా కాలే చుట్టతో చూడగానే ‘మన గోపాల్రావు మావయ్యలా లేడూ?’ అనిపించేంత సహజంగానూ తయారుచేశాడు.

 మనింట్లో పిల్ల పెళ్లికి పదిరోజుల ముందే వచ్చేసి దగ్గరుండి పందిళ్లేయించే పనిమంతుడైన పెద్దమనిషిలానూ  చూపించాడు.

ఆ గోదారిజిల్లా మాట వింటే నీరెండలో గలగలా స్నానంచేసిన అనుభూతీ, కొబ్బరితోటలో కాయ దింపిస్తూ పెత్తనం చెలాయించే ఆసామీలా కనబడతాడే తప్ప కొంపలుముంచే కాంట్రాక్టర్లా అనిపించడు.

 కేవలం రూపం ద్వారా మనలో భయాన్నీ, జుగుప్సనీ, ద్వేషాన్నీ రగిలించడం, ‘ఏక్షణాన ఏంచేస్తాడో బాబోయ్!’ అనేంత ఒళ్లు జలదరింతనీ కలిగించడు ఈ కాంట్రాక్టరు.

 సరదాగా నవ్వుతూ, నవ్విస్తూ, ఎదుటివాడు తనని బోల్తాకొట్టించేలా ఉంటే కనిపెట్టడానికి ఓ భజంత్రీల మేళంతో మనందరికీ కావలసినంత వినోదాన్ని పంచుతాడు.

అంత దుర్మార్గుడూ పెచ్చక్ష నారాయడంటే పడిసచ్చిపోతాడు. పొద్దున్నే పరగడుపున అతగాడికి సేవచెయ్యాలంటాడు.

కలాపోసనుండాలంటాడు. లేకపోతే మడిసికీ, గొడ్డుకీ తేడా ఏటని మనల్ని నిలదీస్తాడు.

ఈ మనిషికి ఇది పునర్జన్మ. అతనిలో ఉన్న విద్వత్తంతా ఆ మాటవిరుపులోనే దాగివుందన్న రహస్యాన్ని కనిపెట్టారు బాపురమణలు.

 తమ ప్రజ్ఞంతా ఉపయోగించారు. సినిమా మొత్తం ఒకవైపు, ఈయన్ని ఇంకోవైపూ త్రాసులో కూర్చోబెట్టుకున్నారు.

బాపు అంతవరకూ తెలుగందాలతో తెరనిండా ముగ్గులేసేస్తాడు. ఎగిరిపడే అందంతో అందని మామిడికాయల్ని దొంగచాటుగా తెంపుకోవడాలు, ఏటిగట్లమీద విన్యాసాలు, పడుచుపిల్ల చెయ్యందించడాలు …అన్నీ చూపిస్తాడు.

చురుకైన చూపుల బాణాలు తగిలి, మరింత మురిపెంతో, పరిచయమైనా లేని ఆడపిల్ల అన్న విచక్షణ కూడా మరిచి ‘ఎంత పెద్దకళ్లు!’ అనేశాడు. ఆమాట విన్న మరుక్షణమే సిగ్గుతో కళ్లు మూసేస్తుంది. మళ్లీ వివశుడై ‘మూసినా బానే ఉన్నాయి!’ అంటూ మరొకసారి బయటికే అనేస్తాడు.

పెళ్లింట్లో పేకాడుకునే పదిమందినీ, ఓమూలకి చేరబడి సిగరెట్టు కాల్చుకునే శ్రీధరాన్నీ ఒకే ఫ్రేములో బంధించి మనదైన వాతావరణాన్ని పందిట్లో పరుస్తాడు.

అనుకోని పరిస్థితుల్లో పెళ్లి ఆగిపోతుంది. ధనసహాయం చేసిన చెయ్యి మంచిది కాదన్న అపవాదు విన్న శ్రీధరం బాధతో బలమైన నిర్ణయం తీసేసుకుంటాడు.

పదిమంది ముత్తయిదువుల మెడల్ని తాకివచ్చిన తాళిబొట్టును చేతిలోకి తీసుకుంటాడు. కానీ మరుక్షణమే లక్ష్మి మెళ్లో కట్టెయ్యడు. తన అనుమతి కొరకై ఒక్కలిప్త ఆగుతాడు.

పీటలమీద పెళ్లి ఆగిపోయిందన్న హఠాత్పరిణామంతో వేదనననుభవిస్తున్న లక్ష్మి సజలాలైన కన్నుల్ని పైకెత్తి శ్రీధరాన్ని చూస్తుంది.

ఆ కళ్లే తనను మావిడితోపులో నిలదీశాయి.

ఆ సోగకళ్లలో ఇప్పుడు పీటల మీద పెళ్లి ఆగిపోయిందన్న ఆవేదన,

ఆగర్భ శ్రీమంతుడైన శ్రీధరం తనను పెళ్లాడబోవడమేమిటన్న ఆశ్చర్యం,

ఒకవేళ తనపైన జాలితో అటువంటి చర్యకు పాల్పడ్డాడా అన్న అనుమానం… ఈ మూడూ ఒకేసారి  కలగలిసిన భావన!

దృశ్యాన్నిబట్టి కన్నులతోనే కలకలం సృష్టించే అవకాశమొకటి ఉందని, ఎటువంటి వాద్యపరికరాలు, ఎలివేషన్లు, గ్రాఫిక్ సాంకేతికతా కూడా అవసరం లేకుండా దశాబ్దాల తరబడి మనందరం గుర్తుంచుకునేంత అద్భుతంగా ఆ సన్నివేశాన్ని చిత్రీకరించవచ్చని బాపు నిరూపించాడు

తీరా అత్తవారింట అడుగుపెట్టిన మరుక్షణం అవమానాల పాలవ్వడం కాసేపట్లోనే మళ్లీ అంగీకరింపబడటం చూస్తాము

పెద్దకళ్లతో చేసే గమ్మత్తునీ, పడకింట ప్రేమగా అందించే తమలపాకుల చిలకల్నీ, మాండొలిన్ స్వరాల మత్తులో తొలినాళ్లలో తొణికిసలాడే అనంతమైన ప్రణయాన్నీ తెరమీద చూపించి మనందరికీ ఒక కళాప్రదర్శనశాలలో తిరుగాడుతున్న భావనను  కలగజేశారు.

వేకువజామున చిక్కటి మబ్బులా పరుచుకున్న నల్లటి కురుల మీదుగా కెమెరాని అలా తిప్పి, సరిగ్గా ముద్దబంతిలా విచ్చుకున్న ఆ అమ్మాయి ముఖం దగ్గర ఆపుతారు.

ముత్యమంత పసుపుతో ముఖానికెంత ఛాయ కలుగుతుంది

ముచ్చటైన ఆ ముఖాన్ని చూసినా మనకంతే హాయనిపిస్తుంది.

డబ్బున్న ఆసామీయే అయినా మన శ్రీధరానిది రసాస్వాదన చేసే హృదయం.

 గోదారిలో మృదువుగా సాగిపోయే పడవమీద మనసారా మనువాడిన మగువను తీసుకుని, సారె సామాన్లతో తన ఊరికి బయలుదేరుతాడు

సన్నగా గాలికెగిరే తెల్లటి పంచె, లాల్చీలతో హుందాగా నిలబడి, మరింత కోమలమైన పదాలతో పాటందుకుంటాడు.

ఆ పాట పడవకన్నా సరళంగా నడిచిపోతుంది. ఎటువంటి అలలూ, అలజడులూ లేకుండా, అలవోకగా సాగే ఆ మృదుమధుర గీతం ప్రతి కొత్తపెళ్లికూతురుకీ ఆస్వాదనామృతం.

నీడల్ని చూస్తూ గోడలపై బొగ్గుతో రూపాన్ని చిత్రించడం, ఆ సూటైన ముక్కు, చురుకైన గెడ్డంతో అందమైన శ్రీధరాన్ని మరింత అందంగా ఒంటిగీతల మధ్య బంధించే కొంటె ఆలోచన బాపూది కాక ఇంకెవరిది?

ఇప్పుడంటే టైమర్ల సెల్ఫీలతో మూతీముక్కూ వికారంగా పెట్టి ఫొటోలు తీసుకుంటున్నాం కానీ  అప్పుడంతా పరుగులేగా? ఆ ఫొటోకోసం వాళ్లిద్దరూ చేసిన విన్యాసాల వినోదాన్నీ హాయిగా చూపిస్తారు.

ఇన్నింటి మధ్యా ఈ కాంట్రాక్టరు విలక్షణంగా నిలబడేలా మరో  ప్రత్యేకమైన రచన చేసుకున్నారు ఆ కొంటెగాళ్లు.

 కొబ్బరి బొండాల్లో జిన్ను నింపడాలు, తమతో పనిబడి వచ్చిన వాళ్లలో ఉండే బలహీనతల్ని చిత్రాల్లో బంధించి ఇరికించే తుంటరి ఆలోచనలు, మాటల మత్తులో పడేసి, సర్వనాశనం చేసేంతవరకూ వదలని కుతంత్రాలు ఈ కాంట్రాక్టరు ప్రత్యేకతలు!

ఇదంతా వినోదాత్మకంగా నడుస్తూ, మనలో ఎటువంటి పగనీ, కోపాన్నీ రగిలించకుండా సాగుతుంది. అసలు చమత్కారం అదే

ఇంతవరకూ నేను చూసిన  తెలుగు సినిమాలన్నిటిలోకి  విలన్ని ఇంత అమోఘంగా ఇంట్రడ్యూస్ చేసింది మాత్రం ముత్యాలముగ్గులోనే!

జగదీశ్ కొచ్చెర్లకోట


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!