Home » భానుచందర్ నిరీక్షణ సినిమా చూసారుగా .. దాన్ని తలదన్నే సన్నివేశం నిజంగానే జరిగింది .. చదవండి !

భానుచందర్ నిరీక్షణ సినిమా చూసారుగా .. దాన్ని తలదన్నే సన్నివేశం నిజంగానే జరిగింది .. చదవండి !

Spread the love

నిరీక్షణ సినిమా చాలామంది చూసే ఉంటారు

అందులో తీవ్రవాది అనే అనుమానంతో భాను చందర్ ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చకుండా అన్ని స్టేషన్లు తిప్పుతూ చిత్ర హింసలు పెడతారు

ఆఖర్లో తాము అసలు తీవ్రవాది బదులు అమాయకుడైన భాను చందర్ ను పొరపాట్న అరెస్ట్ చేశామని తెల్సుకుని వదిలేస్తారు
అప్పటికే అతడి జీవితం సగం ముగిసిపోతుంది

ఏ తప్పూ చేయకపోయినా కేవలం పోలీసుల అనుమానం వల్ల లాకప్పుల్లో ఇరుక్కుపోయి ప్రేమించిన అమ్మాయికి దూరం అయి నరకయాతనలు పడతాడు

ఇలాంటి సంఘటనే నిజ జీవితంలో కూడా జరిగింది

కానీ ఇది లవ్ స్టోరీ కాదు
బీటెక్ చదువుకుంటున్న ఓ విద్యార్థికి ఎదురైన అనుభవం

చీరాలలో ఓ అర్థరాత్రి వేళ నక్సలైట్ అనే అనుమానంతో యాంటీ నక్సలైట్ స్పెషల్ బ్రాంచ్ స్వాడ్ వాళ్ళు ఓ ఇంటి మీద ఎటాక్ చేసి ఒక కుర్రాడ్ని పట్టుకుపోయారు

సంఘటన జరిగింది అర్థరాత్రి
వచ్చిన వాళ్ళు ప్రైవేట్ కార్లలో వచ్చారు

అందరూ మఫ్టీలో ఉన్నారు
అందరి దగ్గర రివాల్వర్లు ఉన్నాయ్

ఒక్క క్షణం ఇంట్లో వాళ్లకు ఏమీ అర్ధం కాలేదు

బీ టెక్ చదువుకుంటున్న కుర్రాడ్ని ఏ కారణంతో అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారని అడిగినా సమాధానం లేదు

ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి కార్లో పడేసి ఎంత వేగంగా వచ్చారో అంతే వేగంగా వెళ్ళిపోయారు
ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది

ఇంట్లో వాళ్ళు గాభరాగా స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి జరిగింది చెప్పారు

రిపోర్ట్ రాసివ్వండి ఎంక్వైరీ చేస్తాం అని పంపేశారు

ఆ రోజు నుంచి ప్రతి రోజూ స్టేషన్కు వెళ్లి తమవాడి జాడ ఏమన్నా తెలిసిందా అని పోలీసులను అడగటం..ఇంకా ట్రేస్ కాలేదు..ట్రేస్ అయితే మేమే ఇన్ఫాం చేస్తాం ..అని పోలీసులు చెప్పటం నిత్య కృత్యం అయిపోయింది

ఇక లాభం లేదని స్థానికంగా ఉన్న ఒక లాయర్ను కలిసి తమకు పోలీసుల మీదే అనుమానంగా ఉందని గోడు వెళ్లబోసుకున్నారు
లాయర్ కోర్టులో పిటిషన్ వేసాడు

స్థానిక పోలీసుల మీద అనుమానంగా ఉందనీ సెర్చ్ వారంట్ అడిగాడు
న్యాయవాది కోర్ట్ ఆర్థర్ తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్లు అన్నీ గాలించారు

ఎక్కడా దొరకలేదు ?
ఆ కుర్రాడి ఆచూకీ ఎలా కనుక్కోవడం ?

పోనీ శత్రువులు ఎవరన్నా ఆ కుర్రాడ్ని కిడ్నాప్ చేసారా ? అనుకుంటే అసలా కుర్రాడికి శత్రువులే లేరు
పోనీ డబ్బుల కోసమా అనుకుంటే వాళ్లకు ఆస్తిపాస్తులే లేవు

అటు చూస్తే మిస్సింగ్ కుర్రాడి గురించి పోలీసుల నోటినుంచి ఒక్కమాట కూడా బయటికి రావడం లేదు

వీళ్ళ పరిస్థితి చూసి జాలేసి ,
“మీరేం కంగారు పడకండి పై కోర్టుకు వెళ్దాం అని ధైర్యం చెప్పాడు లాయర్

ఇది జరిగి వారం అవుతుంది

ఓ రోజు ఆ కుర్రాడి తాలూకు బంధువు..నాకు స్నేహితుడు కూడా అయిన వ్యక్తి విజయవాడ వచ్చాడు

జరిగినదంతా నాకు చెప్పి కుర్రాడు అమాయకుడు..చదువుకుంటున్న వాడు..ఎలాగైనా సేవ్ చెయ్యమని అడిగాడు

సరే అని లోకాల్గా తెలిసిన లాయర్లను , తోటి జర్నలిస్ట్ మిత్రులను ఎంక్వైరీ చేస్తే ఒక రోజు ముందు ఎవరో కుర్రాడ్ని స్పెషల్ బ్రాంచ్ టీమ్ అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పుతున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది

లాయర్ల గోల పడలేక అనుమానితులను రకరకాల స్టేషన్లు తిప్పటం స్పెషల్ స్కాడ్ కు అలవాటే

ఎంక్వైరీ స్టేజీ కాబట్టి అదీ తీవ్రవాద సంబంధ కేసుల్లో పోలీసులు అనుమానితులను లాకప్పులో వేయ కుండా తిప్పుతుంటారు
చివరికి ఒక స్టేషన్లో ఉండొచ్చనే ఇన్ఫర్మేషన్ వచ్చింది

నేనూ నా ఫ్రెండూ..ఇంకో లాయర్ ఫ్రెండ్ కలిసి ఆ పోలీస్ స్టేషన్కు వెళ్లాం

స్టేషన్ రైటర్ని కలిసి నన్ను నేను పరిచయం చేసుకుని విషయం చెప్పా

తమ స్టేషన్లో అలాంటి కుర్రాడ్ని ఎవరూ తీసుకురాలేదని చెప్పాడు
కావాలంటే చూడండని లాకప్ కూడా చూపించాడు

వాళ్ళలో ఆ కుర్రాడు లేడు

సరే అని బయటికి వస్తుండగా SI టేబుల్ కింది నుంచి మూలుగులు వినిపించాయ్
ఠక్కున డౌట్ వచ్చి కిందికి వంగి చూశాం

ఓ కుర్రాడు SI టేబుల్ కి గొలుసులతో కట్టేయబడి ఉన్నాడు
స్పృహలో లేడు..మూలుగుతున్నాడు

మా ఫ్రెండ్ గుర్తు పట్టి వీడు మా కుర్రాడే అని చెప్పాడు

అప్పుడు రైటర్ని అడిగితే అసలు విషయం ఎవరికీ చెప్పొద్దంటూ అసలు విషయం చెప్పాడు

ఆ కుర్రాడికి నక్షలైట్లతో సంబంధాలు ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ తో యాంటీ నక్సల్స్ స్కాడ్ కస్టడీలోకి తీసుకున్నారు
ఎంక్వైరీ లో కనెక్షన్స్ లేవని తెలిసింది

అంచేత వాళ్ళే కుర్రాడ్ని రేపు మీ ఇంట్లో అప్పచెబుతారు
కుర్రాడి భవిష్యత్ దృష్ట్యా జరిగిన విషయం ఇంతటితో మర్చిపోండి
ఎందుకంటే రచ్చ చేసుకుంటే నష్టపోయేది మీరూ మేమూ కాదు కుర్రాడే అని పోలీసు భాషలో చెప్పాడు ఆ రైటర్

బయటికి వచ్చాక కోర్టుకు వెళ్దాం అని చెప్పా మా ఫ్రెండుతో

“ఆ రైటర్ చెప్పింది నిజమే..దెబ్బలదేముంది..నాల్రోజుల్లో తగ్గిపోతాయ్..కానీ వాడి భవిష్యత్ ముఖ్యం..రేపు మా వాడ్ని అప్పచెబుతాం అన్నారు గా..చూద్దాం..రేపు కూడా అప్పచెప్పకపోతే అప్పుడే కోర్టు నుంచి వారంట్ తెచ్చుకుందాం వదిలెయ్” అన్నాడు మా ఫ్రెండ్

మర్నాడు సాయంత్రం మా ఫ్రెండ్ చీరాల నుంచి ఫోన్ చేసి చెప్పాడు
కుర్రాడు ఇంటికి చేరాడని

మా ఫ్రెండ్ గాడి ‘ నిరీక్షణ ‘ ఫలించి కధ సుఖాంతం అయినందుకు ఊపిరి పీల్చుకున్నా
ఇది జరిగి మూడు దశాబ్దాల పైనే అయ్యింది !!

పరేష్ తుర్లపాటి


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *