పవన్ కళ్యాణ్ ను ఎలా చూడాలనుకుని అభిమానులు ఇన్నాళ్లు ఎదురుచూసారో ఆ విశ్వ రూపం OG లో కనిపిస్తుంది . నిజానికి అభిమానులు పవన్ కళ్యాణ్ ను పవర్ స్టార్ అని అభిమానంగా పిలుచుకుంటారు . ఇన్నాళ్లు పవన్ చేసిన సినిమాల్లో వాళ్ళకి పవర్ స్టార్ విశ్వ రూపం కనిపించలేదు . రొటీన్ లవ్ స్టోరీల్లో కొన్ని , యాక్షన్ డ్రామాలో కొన్ని మూవీస్ లో పవన్ కనిపించినా అభిమానులు ఆశించిన ఫైర్ అందులో మిస్ అయ్యింది . పవన్ని వారు ఫక్తు మాస్ హీరో రోల్ లో చూడాలనుకున్నారు . మొట్టమొదటిసారి అభిమానుల కోణంలో , అభిమానుల కోసం OG పేరుతో పవర్ స్టార్ థియేటర్లలో బ్లాస్ట్ చేయడానికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు .
సినిమా తీసిన దర్శకుడు సుజిత్ కూడా పవన్ అభిమాని కావడంతో ఫాన్స్ కోణంలో పవర్ స్టార్ ని సరికొత్త కోణంలో ఆవిష్కరించాడు . పవన్ కళ్యాణ్ తో నాలుగు పాటలు ఆరు ఫైట్లు ఉన్న రొటీన్ సినిమాలు అభిమానులు అస్సలు ఊహించుకోవడం లేదు . అందుకే పవర్ స్టార్ బాడీ లాంగ్వేజ్ కు సరిగ్గా సరిపోయే గ్యాంగ్ స్టర్ పాత్రని ఫిక్స్ చేసుకున్నాడు .
పవర్ స్టార్ తెర మీద కనిపిస్తే ఒక్కోడికి పూనకాలు రావాలి . ఫాన్స్ భాషలో చెప్పాలంటే కనీవినీ ఎరుగని ఏదో విధ్వంసం జరిగిపోవాలి . అలాంటి విధ్వంసం జరగాలంటే మరో డాన్ బయటికి రావాలి . అందుకే సుజిత్ ఈ పాయింట్ బేస్ చేసుకుని పవన్ కళ్యాణ్ కు తగ్గ కథను రాసుకున్నాడు .
కథ అంటే కొత్తగా రాసుకున్న కధేం కాదు . ఇంతకుముందు గ్యాంగ్ స్టర్ కాన్సెప్ట్ ప్రధానంగా ఉన్న సినిమాలు చాలా వచ్చాయి . అలాంటి కథే OG కూడా . ఇంకా చెప్పాలంటే సాహో మూవీలో లోపాలను సరిదిద్దుకుని చెప్పాలనుకున్న కథను బలమైన ఎలివేషన్ల ద్వారా పవన్ ఫాన్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా OG తీసాడు సుజిత్ .
మాములుగా ఇలాంటి గ్యాంగ్ స్టర్ పాత్రలు రజనీకాంత్ కు పడతాయి . కానీ లేట్ అయినా లేటెస్టుగా అన్న రజనీ డైలాగ్ మాదిరి ఆలస్యం అయినా పవన్ కళ్యాణ్ కి ఇన్నాళ్లకు ఫాన్స్ ఎదురుచూసిన హై వోల్టేజ్ పాత్ర పడింది . కాబట్టి OG చూస్తే పవన్ అభిమానులకు పూనకాలు గ్యారంటీనే అనడంలో ఎటువంటి సందేహం లేదు .
సరే , సినిమాలో పవర్ స్టార్ ఎలివేషన్ల మాదిరి ఇప్పటికే OG రివ్యూ ఎలివేషన్ ఎక్కువైపోయింది కాబట్టి ఇప్పుడు కథ విషయానికి వద్దాం .
కధేంటంటే ?
OG లో కథ గురించి సాధ్యమైనంత తక్కువగా మాట్లాడుకుంటేనే బాగుంటుంది . ముంబాయి , డాన్ , గ్యాంగ్ స్టర్ , చంపుకోవడాలు అన్ని క్రైమ్ కధల్లో ఉండేవే . ఇంతకుముందు చాలా సినిమాల్లో చూసేసాం . దాదాపు మన గ్యాంగ్ స్టర్ కధలన్నీ ముంబైతోనే ప్రారంభం అవుతాయి . ముంబైలో గ్యాంగ్ స్టర్ గా గడగడలాడించిన భాషా ని ( రజనీకాంత్ ) ఆల్రెడీ చూసేసాం . కేవలం రజనీనే కాదు అంతకుముందు చాలామందిని గ్యాంగ్ స్టర్ లను ముంబైలో చూసేసాం .
అందుకే దర్శకుడు సుజిత్ OG కథను నేరుగా ముంబై నుంచి మొదలెట్టకుండా సరికొత్తగా జపాన్ నేపథ్యంతో మొదలెట్టాడు . కథాపరంగా ఇది తెలివైన పని . కధలో రొటీన్ ఫార్ములా విమర్శలు రాకుండా ఫ్రెష్ ఫీల్ తీసుకొచ్చాడు .
1970 లలో జపాన్ నుంచి కొందరు భారతీయులు తప్పించుకుని ఇండియాలో ముంబైకి వచ్చేస్తారు . అలా వచ్చినవాడే సత్య దాదా ( ప్రకాష్ రాజ్ ) ఈ సత్య దాదాతో పాటు వచ్చినవాడు ఓజాస్ గంభీర ( పవన్ కళ్యాణ్ ) . సత్య దాదా ఓజాస్ ను తన దత్త పుత్రుడిగా భావించుకుంటాడు . ఈ క్రమంలో ఇండియా వచ్చిన సత్య దాదా ముంబై పోర్ట్ లో వ్యాపారాలు చేస్తుంటాడు . సత్యదాదా కు అన్ని విషయాల్లో ఓజాస్ రక్షకుడిగా వ్యవహరిస్తుంటాడు .
అయితే అనుకోని పరిస్థితుల్లో ఓజాస్ ముంబై విడిచిపెట్టి వెళ్ళిపోతాడు . ఓజాస్ వెళ్ళిపోయిన తర్వాత ఓమి ( ఇమ్రాన్ హష్మీ ) ముంబైలో అడుగుపెట్టి సత్య దాదా మనుషులను చంపేస్తుంటాడు .
పదేళ్ల తర్వాత ఓజాస్ గంభీర తిరిగి ముంబైలో అడుగుపెడతాడు . ఇక్కడ్నుంచి అసలు కథ మొదలౌతుంది
సత్య దాదా రక్షకుడిగా ఉన్న ఓజాస్ గంభీర అతడ్ని ముంబైలో ఒంటరిగా విడిచిపెట్టి ఎందుకెళ్ళిపోతాడు ?
ఈ సమయంలో ఓజాస్ కు కణ్మణి ( ప్రియాంక మోహన్ ) తో పరిచయం ఎలా జరుగుతుంది?
భార్య తో జీవితం గడుపుతున్న ఓజాస్ తిరిగి ముంబై ఎందుకు వచ్చాడు ? అనేది మిగిలిన కథలో ఉంటుంది .
ఎలా ఉంది ?
చూసారుగా సింపుల్ గా కథ ఇదే . అయినా థియేటర్లలో ఫాన్స్ కి పూనకాలు ఎందుకు వస్తున్నాయి ?
అందుకు కారణం .. ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయే ఎలివేషన్ సీన్స్ , థియేటర్ టాప్ లేచిపోయే BGM . ఈ రెండే సినిమాకి కీలకం . దర్శకుడు సుజిత్ మొదటిసారిగా పవర్ స్టార్ ను కరెక్ట్ గా వాడుకున్నాడు . సినిమాలో పవర్ స్టార్ ఎంట్రీ కోసం ఫాన్స్ వేయికళ్లతో ఎదురు చూసేలా చేసాడు . పీకే , పీకే అని ఫాన్స్ చేత అర్ధగంట అరిపించి కానీ పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇప్పించలేదు సుజిత్ . పీకే ను స్క్రీన్ మీద దింపటమే భారీ ఎలివేషన్లతో దింపటంతో ఆకలి మీదున్న ఫాన్స్ కు ఫుల్ మీల్స్ దొరికినట్లయింది .
సుజిత్ అదే ఫ్లోలో వరుసగా పీకే ఎలివేషన్లు ఇచ్చుకుంటూ పోకుండా తెలివిగా ఫాన్స్ ను ఊరించి ఊరించి పదినిమిషాలకో సీన్ తో ఈలలు వేయించుకున్నాడు . ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ ముందు , తర్వాత పోలీస్ స్టేషన్ సన్నివేశాల్లో పవర్ స్టార్ విశ్వ రూపాన్ని మొత్తం ఒకేసారి చూపించేసాడు సుజిత్ .
ఇప్పుడు సాధారణ ప్రేక్షకుల వ్యూ గురించి కూడా రెండు మాటలు మాట్లాడుకుందాం. సినిమా సెకండాఫ్ కు వచ్చేసరికి గమనం కొద్దిగా గాడి తప్పినట్టు అనిపిస్తుంది . బిట్లు , బిట్లుగా వచ్చే సన్నివేశాలతో కొంత గందరగోళం అనిపిస్తుంది . బహుశా ఎడిటింగ్ లోపం కూడా అయ్యుంటుంది . క్లైమాక్సులో వచ్చే ఫైటింగ్ సీన్లు కూడా OG ని మానవాతీత శక్తి మాదిరి ఒక్కడే వందలాదిమంది ఫైటర్లతో ఫైట్ చేసే సన్నివేశాలు చూపించడం కొద్దిగా ఎబ్బెట్టుగా ఉంది .
పవన్ కళ్యాణ్ లవ్ స్టోరీలో డెప్త్ మిస్ అయ్యింది . తండ్రీ కొడుకులు కాకపోయినప్పటికీ ప్రకాష్ రాజ్ , పవన్ కళ్యాణ్ ల మధ్య అటువంటి అనుబంధం ఉన్నట్టు తెలుస్తుంది కానీ ఇద్దరి మధ్య భావోద్వేగ కోణాల్ని మరింత బలంగా ఆవిష్కరించి ఉంటే బాగుండేది .
లాజిక్కులు , ఎమోషన్లు , కథ లాంటి విషయాల్లో మరింత లోతుకు పోకుండా చూస్తే OG సాధారణ ప్రేక్షకులకు కూడా నచ్చుతుంది . టోటల్ గా సినిమాకి మొదటి హీరో పవన్ కళ్యాణ్ అయితే రెండో , మూడో హీరోలుగా సుజిత్ , తమన్ లని చెప్పవచ్చు .
ఎవరెలా చేసారు ?
ఇన్నాళ్లు ఫాన్స్ ఎదురుచూసిన గెటప్ లో పవన్ కళ్యాణ్ తన విశ్వ రూపం చూపించాడు . గ్యాంగ్ స్టర్ పాత్రకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ , డైలాగ్ డెలివరీ , కాస్ట్యూమ్స్ , గెటప్ కుదిరాయి . తమిళంలో రజనీ , తెలుగులో బాలయ్య మాదిరి పవన్ కళ్యాణ్ నుంచి కూడా ఇకపై అభిమానులు మరిన్ని గ్యాంగ్ స్టర్ పాత్రలు ఆశించవచ్చు .
హీరోయిన్ ప్రియాంక మోహన్ ఫ్రెష్ గా అందంగా కనిపించింది .
షరా మాములుగా ప్రకాష్ రాజ్ నటన బావుంది . రియల్ లైఫ్ లో బద్ద శత్రువులు అయిన ప్రకాష్ రాజ్ , పవన్ కళ్యాణ్ లు ఈ సినిమాలో తండ్రీ కొడుకుల అనుబంధం ఉన్న పాత్రల్లో నటించడం విశేషం . పవన్ కళ్యాణ్ ధీరోదాత్తం గురించి ప్రకాష్ రాజ్ ఎలివేషన్ డైలాగులు చెప్పడం ఇంకా విశేషం .
విలన్ గా నటించిన ఇమ్రాన్ హష్మీ పాత్రకు మొదట్లో భారీ హైప్ ఇచ్చారు . కానీ పవన్ కళ్యాణ్ ఎలివేషన్ల మధ్య ఇమ్రాన్ హష్మీ తేలిపోయాడు . అయినా నటన పరంగా బానే చేసాడు . అతడి పాత్రను మరింత శక్తిమంతంగా చూపించాల్సింది .
సాంకేతికత :
OG మూవీకి ప్రాణం పోసింది తమన్ అందించిన బీజీఎమ్ . కొన్ని సన్నివేశాల్లో తమన్ అందించిన బీజీఎమ్ పవన్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది .
సినిమాటోగ్రఫీ కూడా బాగుంది .
నిర్మాణ విలువలు బాగున్నాయి . సాంకేతిక పరమైన రిచ్ నెస్ సినిమాలో కనిపిస్తుంది .
విశ్లేషణ : పవన్ ఫాన్స్ కి OG పూనకాలు తెప్పిస్తుంది . సాధారణ ప్రేక్షకులకు మరీ బొరైతే కొట్టదు . కాకపోతే ఎవరైనా సరే OG లో డిఫరెంట్ పవన్ కళ్యాణ్ ను చూస్తారు . పవర్ స్టార్ లోని అసలైన ఫైర్ ను చూస్తారు . కథ సంగతి ఎలా ఉన్నా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో దర్శకుడు సుజిత్ OG ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు .
నటీనటులు : పవన్ కళ్యాణ్ , ప్రియాంక మోహన్ , ఇమ్రాన్ హష్మి , ప్రకాష్ రాజ్ ,శ్రీయ రెడ్డి , శుభలేఖ సుధాకర్ , సుహాస్ , రాహుల్ రవీంద్రన్ తదితరులు
సంగీతం : తమన్
నిర్మాత : డివివి దానయ్య
కథ , స్క్రీన్ ప్లే , దర్శకత్వం : సుజిత్
విడుదల : 25 -09 -2025
రేటింగ్ : 3 / 5
