Home » మీరు పవన్ ఫ్యాన్సా ? అయితే పూనకాలు లోడింగే .. మీరు సాధారణ ప్రేక్షకులా ? ఇలా రండి మాట్లాడుకుందాం ! – OG మూవీ రివ్యూ

మీరు పవన్ ఫ్యాన్సా ? అయితే పూనకాలు లోడింగే .. మీరు సాధారణ ప్రేక్షకులా ? ఇలా రండి మాట్లాడుకుందాం ! – OG మూవీ రివ్యూ

Spread the love

OG

పవన్ కళ్యాణ్ ను ఎలా చూడాలనుకుని అభిమానులు ఇన్నాళ్లు ఎదురుచూసారో ఆ విశ్వ రూపం OG లో కనిపిస్తుంది

ఎందుకంటే సినిమా తీసిన దర్శకుడు సుజిత్ కూడా పవన్ అభిమాని కావడంతో ఫాన్స్ కోణంలో పవర్ స్టార్ ని సరికొత్త కోణంలో ఆవిష్కరించాడు

అందుకే పవర్ స్టార్ బాడీ లాంగ్వేజ్ కు సరిగ్గా సరిపోయే గ్యాంగ్ స్టర్ పాత్రని ఫిక్స్ చేసుకున్నాడు

పవన్ కళ్యాణ్ తో నాలుగు పాటలు ఆరు ఫైట్లు ఉన్న రొటీన్ సినిమాలు అభిమానులు అస్సలు ఊహించుకోవడం లేదు

పవర్ స్టార్ తెర మీద కనిపిస్తే ఒక్కోడికి పూనకాలు రావాలి
ఫాన్స్ భాషలో చెప్పాలంటే కనీవినీ ఎరుగని ఏదో విధ్వంసం జరిగిపోవాలి

సుజిత్ ఈ పాయింట్ బేస్ చేసుకుని పవన్ కళ్యాణ్ కు తగ్గ కథను రాసుకున్నాడు

కథ అంటే కొత్తగా రాసుకున్న కధేం కాదు

ఇంతకుముందు గ్యాంగ్ స్టర్ కాన్సెప్ట్ ప్రధానంగా ఉన్న సినిమాలు చాలా వచ్చాయి
అలాంటి కథే OG కూడా

ఇంకా చెప్పాలంటే సాహో మూవీలో లోపాలను సరిదిద్దుకుని చెప్పాలనుకున్న కథను బలమైన ఎలివేషన్ల ద్వారా పవన్ ఫాన్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా OG తీసాడు సుజిత్

మాములుగా ఇలాంటి గ్యాంగ్ స్టర్ పాత్రలు రజనీకాంత్ కు పడతాయి

కానీ లేట్ అయినా లేటెస్టుగా అన్న రజనీ డైలాగ్ మాదిరి ఆలస్యం అయినా పవన్ కళ్యాణ్ కి ఇన్నాళ్లకు ఫాన్స్ ఎదురుచూసిన హై వోల్టేజ్ పాత్ర పడింది

కాబట్టి OG చూస్తే పవన్ అభిమానులకు పూనకాలు గ్యారంటీనే

సరే , సినిమాలో ఎలివేషన్ మాదిరి ఇప్పటికే OG రివ్యూ ఎలివేషన్ ఎక్కువైపోయింది

ఇక కథ విషయానికి వద్దాం

OG లో కథ గురించి సాధ్యమైనంత తక్కువగా మాట్లాడుకుంటేనే బాగుంటుంది

ముంబాయి , డాన్ , గ్యాంగ్ స్టర్ , చంపుకోవడాలు అన్ని క్రైమ్ కధల్లో ఉండేవే

అందుకే నేరుగా ముంబై నుంచి మొదలెట్టకుండా కథను సరికొత్తగా జపాన్ నేపథ్యంతో మొదలెట్టాడు దర్శకుడు

1970 లలో జపాన్ నుంచి కొందరు భారతీయులు అక్కడ్నుంచి తప్పించుకుని ఇండియాలో ముంబైకి వచ్చేస్తారు

అలా వచ్చినవాడే సత్య దాదా ( ప్రకాష్ రాజ్ ) ఈ సత్య దాదాతో పాటు వచ్చినవాడు ఓజాస్ గంభీర ( పవన్ కళ్యాణ్ )

సత్య దాదా ఓజాస్ ను తన పెంపుడు కొడుకుగా భావించుకుంటాడు

ఈ క్రమంలో ముంబై పోర్ట్ లో వ్యాపారాలు చేస్తుంటాడు సత్య దాదా

సత్యదాదా కు అన్ని విషయాల్లో ఓజాస్ రక్షకుడిగా వ్యవహరిస్తుంటాడు

అయితే అనుకోని పరిస్థితుల్లో ఓజాస్ ముంబై విడిచిపెట్టి వెళ్ళిపోతాడు

ఓజాస్ వెళ్ళిపోయిన తర్వాత ఓమి ( ఇమ్రాన్ హష్మీ ) ముంబైలో అడుగుపెట్టి సత్య దాదా మనుషులను చంపేస్తుంటాడు

పదేళ్ల తర్వాత ఓజాస్ గంభీర తిరిగి ముంబైలో అడుగుపెడతాడు

ఇక్కడ్నుంచి అసలు కథ మొదలౌతుంది

సత్య దాదా రక్షకుడిగా ఉన్న ఓజాస్ గంబీర అతడ్ని ముంబైలో విడిచిపెట్టి ఎందుకెళిపోతాడు ?

ఈ సమయంలో కణ్మణి ( ప్రియాంక మోహన్ ) తో పరిచయం ఎలా జరుగుతుంది ?

భార్య తో జీవితం గడుపుతున్న ఓజాస్ తిరిగి ముంబై ఎందుకు వచ్చాడు ? అనేది మిగిలిన కథలో ఉంటుంది

చూసారుగా సింపుల్ గా కథ ఇదే

అయినా థియేటర్లలో ఫాన్స్ కి పూనకాలు ఎందుకు వస్తున్నాయి ?

అందుకు కారణం .. ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయే ఎలివేషన్ సీన్స్ , థియేటర్ టాప్ లేచిపోయే BGM . ఈ రెండే సినిమాకి కీలకం

పీకే , పీకే అని ఫాన్స్ చేత అర్ధగంట అరిపించి కానీ పవన్ కళ్యాణ్ ను దింపలేదు సుజిత్

పీకే ను స్క్రీన్ మీద దింపటమే భారీ ఎలివేషన్ లతో దింపటంతో ఆకలి మీదున్న ఫాన్స్ కు ఫుల్ మీల్స్ దొరికినట్లయింది

సుజిత్ అదే ఫ్లోలో వరుసగా పీకే ఎలివేషన్లు ఇచ్చుకుంటూ పోకుండా తెలివిగా ఫాన్స్ ను ఊరించి ఊరించి పదినిమిషాలకో సీన్ తో ఈలలు వేయించుకున్నాడు

ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ ముందు , తర్వాత పోలీస్ స్టేషన్ సన్నివేశాల్లో పవర్ స్టార్ విశ్వ రూపాన్ని మొత్తం ఒకేసారి చూపించేసాడు సుజిత్

ఇప్పుడు సాధారణ ప్రేక్షకుల వ్యూ గురించి కూడా రెండు మాటలు మాట్లాడుకుందాం

సెకండాఫ్ వచ్చేసరికి సినిమా గమనం కొద్దిగా గాడి తప్పినట్టు అనిపిస్తుంది

బిట్లు , బిట్లుగా వచ్చే సన్నివేశాలతో కొంత గందరగోళం అనిపిస్తుంది

పవన్ కళ్యాణ్ లవ్ స్టోరీలో డెప్త్ మిస్ అయ్యింది

తండ్రీ కొడుకులు కాకపోయినప్పటికీ ప్రకాష్ రాజ్ , పవన్ కళ్యాణ్ ల మధ్య అటువంటి అనుబంధం ఉన్నట్టు తెలుస్తుంది కానీ ఇద్దరి మధ్య భావోద్వేగ కోణాల్ని మరింత బలంగా ఆవిష్కరించి ఉంటె బాగుండేది

లాజిక్కులు , ఎమోషన్లు , కథ లాంటి విషయాల్లో మరింత లోతుకు పోకుండా చూస్తే OG సాధారణ ప్రేక్షకులకు కూడా నచ్చుతుంది

టోటల్ గా సినిమాకి మొదటి హీరో పవన్ కళ్యాణ్ అయితే రెండో , మూడో హీరోలుగా సుజిత్ , తమన్ లని చెప్పవచ్చు

హీరోయిన్ ప్రియాంక మోహన్ ఫ్రెష్ గా అందంగా కనిపించింది

రియల్ లైఫ్ లో బద్ద శత్రువులు అయిన ప్రకాష్ రాజ్ , పవన్ కళ్యాణ్ లు ఈ సినిమాలో తండ్రీ కొడుకుల అనుబంధం ఉన్న పాత్రల్లో నటించడం విశేషం

పవన్ కళ్యాణ్ ధీరోదాత్తం గురించి ప్రకాష్ రాజ్ ఎలివేషన్ డైలాగులు చెప్పడం ఇంకా విశేషం

షరా మాములుగా ప్రకాష్ రాజ్ నటన బావుంది

విలన్ గా నటించిన ఇమ్రాన్ హష్మీ పవన్ కళ్యాణ్ ఎలివేషన్ల మధ్య తేలిపోయాడు . అయినా నటన పరంగా బానే చేసాడు

సాంకేతిక పరమైన రిచ్ నెస్ సినిమాలో కనిపిస్తుంది

ముగింపు : పవన్ ఫాన్స్ కి OG పూనకాలు తెప్పిస్తుంది . సాధారణ ప్రేక్షకులకు మరీ బొరైతే కొట్టదు !
OG 25-09-2025 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ అయ్యింది

నటీనటులు : పవన్ కళ్యాణ్ , ప్రియాంక మోహన్ , ఇమ్రాన్ హష్మి , ప్రకాష్ రాజ్ ,శ్రీయ రెడ్డి , శుభలేఖ సుధాకర్ , సుహాస్ , రాహుల్ రవీంద్రన్ తదితరులు
సంగీతం : తమన్
నిర్మాత : డివివి దానయ్య
కథ , స్క్రీన్ ప్లే , దర్శకత్వం : సుజిత్
రేటింగ్ : 3 / 5

పరేష్ తుర్లపాటి


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *