Home » కొందరు అవార్డులకోసం వెతుక్కుంటూ వెళ్తారు..మరికొందరిని అవార్డులు వెతుక్కుంటూ వస్తాయి ..అటువంటి అన్ సంగ్ హీరోలు 45 మందిని పద్మశ్రీ అవార్డులు వరించాయి !

కొందరు అవార్డులకోసం వెతుక్కుంటూ వెళ్తారు..మరికొందరిని అవార్డులు వెతుక్కుంటూ వస్తాయి ..అటువంటి అన్ సంగ్ హీరోలు 45 మందిని పద్మశ్రీ అవార్డులు వరించాయి !

Spread the love

గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు చేసిన వ్యక్తులను భారత ప్రభుత్వం పద్మ అవార్డులతో సత్కరించడం అనాదిగా వస్తున్న సంప్రదాయమే

వీటిలో పద్మశ్రీ , పద్మభూషణ్ , పద్మవిభూషణ్ వంటి అవార్డులను క్యాటగిరీలను బట్టి ప్రధానం చేస్తారు

గతంలో ఈ అవార్డులు కేవలం సెలెబ్రిటీలకో , పైరవీకారులకో ప్రధానం చేసేవారనే విమర్శలు సోషల్ మీడియాలో ఉండేవి

అయితే ఆ విమర్శలకు చెక్ పెట్టే దిశగా కేంద్రప్రభుత్వం నూతన విధానాన్ని అనుసరించడం మొదలుపెట్టింది

అందులో భాగంగానే గత కొద్ది సంవత్సరాలుగా ఈ అవార్డులు సామాన్యులను కూడా వరిస్తున్నాయి

సామాన్యులు అంటే హోదాపరంగానే కానీ సేవల పరంగా కాదు

నిజానికి వీరు చేసిన సేవలతో పోలిస్తే ప్రస్తుతం దేశంలో సెలెబ్రిటీలమని చెప్పుకుంటున్న చాలామంది ఒక మెట్టు కిందనే ఉంటారు

సెలెబ్రిటీల మాదిరో , బడా పారిశ్రామికవేత్తల మాదిరో వీళ్ళదగ్గర లక్షల లక్షల ఆస్తులు లేవు , అంతస్తులు లేవు

అయితే అంతకుమించి చేతనైనంతలో సమాజానికి మంచి చెయ్యాలనే సత్సంకల్పం ఉంది

దురదృష్టవశాత్తు వీరి సేవలకు ఎటువంటి గుర్తింపు రాకుండానే గతంలో చాలామంది మహానుభావులు కాలగర్భంలో కలిసిపోయారు

తాము చేసినమంచి పనిని పదిమందికీ చెప్పుకోవడం , లేకపోతే రీల్స్ లోనో , యూ ట్యూబుల్లోనో లైకుల కోసమో , వ్యూస్ కోసమో ప్రచారం చేసుకుని సొమ్ము చేసుకోవడం తెలియని సామాన్యులు దేశంలో చాలామంది ఉన్నారు

అటువంటి సామాన్యులను గుర్తించి రాష్ట్రపతి చేతుల మీదుగా సత్కరించడం నిజంగా మంచి సంప్రదాయం

తాజాగా 77 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 45 మందికి అన్ సంగ్ హీరోస్ పేరిట పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు

వారిలో ఒకరు అంకెగౌడ

ఎవరీ అంకెగౌడ ?

పద్మశ్రీ అవార్డు వచ్చిందనగానే ఈయనెవరో పెద్ద సెలెబ్రిటీ అయ్యుంటాడని అనుకుంటున్నారా ?

కానేకాదు
ఒక సామాన్య బస్ కండక్టర్

కర్ణాటకలోని హరేలహళ్లికి చెందిన 75 ఏళ్ళ అంకెగౌడ వృత్తిరీత్యా ఒక సామాన్య బస్ కండక్టర్ గా పనిచేసాడు

ప్రవృత్తి రీత్యా మంచి సాహిత్యాభిలాషకారుడు
సాహిత్యమన్నా , పుస్తకాలన్నా ప్రాణం

ఆ అభిలాషతో తన ఇరవయ్యవ ఏట నుంచే పుస్తకాలు కొనడం , చదవడం మొదలుపెట్టాడు
అయితే చాలామంది తాము కొన్న పుస్తకాలను చదివిన తర్వాత పారెయ్యడమో , అమ్మేయడమో చేస్తారు

కానీ అంకెగౌడ మాత్రం అలా చేయలేదు

చదివిన పుస్తకాలను ఒకటొకటిగా భద్రపరచడం మొదలుపెట్టాడు
అదే సమయంలో కన్నడ సాహిత్యంలో పీజీ కూడా చేసాడు

కానీ కుటుంబ ఆదాయం అంతంత మాత్రంగా ఉండటంతో ఉదర పోషణార్థం బస్ కండక్టర్ ఉద్యోగంలో చేరాడు

ఉద్యోగం చేస్తూనే తన జీతంలో మూడొంతులు ఖర్చులకు ఉంచుకుని మిగిలినది పుస్తకాలకు ఖర్చు పెట్టేవాడు

ఉద్యోగం చేస్తున్న సమయంలోనే పెళ్లి కూడా కావడం , పిల్లవాడు కూడా పుట్టడంతో ఖర్చులు కూడా పెరిగాయి

ఈ రోజుల్లో బస్ కండక్టర్ ఉద్యోగంలో వచ్చే జీతం ఇంటి ఖర్చులకే పూర్తిగా సరిపోవు
అలాంటి వ్యక్తులు సామాజిక సేవ గురించి ఆలోచించగలరా ?
ముందు కుటుంబ పోషణ గడిస్తే చాలు అనుకుంటారు

కానీ ఈ అంకెగౌడ అలా కాదు
చిన్నప్పట్నుంచీ సాహిత్యాభిలాష మెండుగా ఉన్నవాడు

చిరిగిన చొక్కా అయినా వేసుకో కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో అన్న కందుకూరి వీరేశలింగం వారి మాటలను అక్షరాలా ఫాలో అయ్యాడు

నిజానికి అప్పట్లో ఆయన పరిస్థితి చిరిగిన చొక్కానే
వంటిమీద వేసుకోవడానికే సరైన దుస్తులు లేవు . ఇక అంతంత ఖరీదు పెట్టి పుస్తకాలు కొనుక్కునే స్థోమత ఏదీ ?

అయినాసరే మనసావాచా నమ్మిన ఆశయం కోసం ధైర్యంగా ముందుకెళ్లి సాహిత్య సేవలు చేసి పద్మశ్రీ అవార్డు దాకా ఎదిగాడు

కోట్ల ఆస్తిపాస్తులున్న చాలామంది ప్రముఖులు చేయలేని పనిని నెల జీతం మీద బతికే సామాన్య బస్ కండక్టర్ చేసాడు

అలాంటి మనిషికి ఇతర అక్టీవిటీస్ కూడా తోడైతే తలకు మించిన భారమే అవుతుంది

క్రమక్రమంగా ఇల్లంతా పుస్తకాలతో నిండిపోవడంతో వీళ్ళకి కూర్చునే జాగా కూడా లేకుండా పోయింది

తన ఇంటిని బుక్ మానె పేరుతో ఓ గ్రంధాలయంగా మార్చేశాడు

భర్తలోని సాహిత్య అభిలాష గమనించిన ఆయన ధర్మపత్ని కూడా అంకెగౌడకు సహకరించింది

దాంతో ఆయన జీవితం పుస్తకాల మధ్యనే కొనసాగుతుంది

ఇల్లంతా పుస్తకాలతో నిండిపోవడంతో ఒక మూల కాస్త జాగా ఉంచుకుని ఆ కుటుంబం జీవనం కొనసాగిస్తుంది

అలా అంకెగౌడ తన ఇరవయ్యవ ఏట మొదలెట్టిన బుక్ కలెక్షన్ 75 ఏట ఇప్పటికీ కొనసాగుతుంది

అలా ఒకటికాదు రెండు కాదు ఏకంగా రెండు కోట్ల పుస్తకాలను సేకరించాడు

దేశంలో పెద్ద పెద్ద గ్రంధాలయాల్లో కూడా దొరకని అరుదైన పుస్తకాలు అంకెగౌడ ఇంట్లో దొరుకుతాయి

18 వ శతాబ్దం మొదలుకుని నేటివరకు అంకెగౌడ దగ్గర దొరకని పుస్తకం అంటూ లేదు
సైన్సు , శాస్త్రం , టెక్నాలజీ , ఇలా ఏ రంగం తీసుకున్నా సంబంధిత పుస్తకాలు దొరుకుతాయి

అంకెగౌడ ఇల్లు ఎంత ఫేమస్ అయ్యిందంటే కొన్ని పుస్తకాల కోసం దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి కర్ణాటకలోని హరేలహళ్లి లోని అంకెగౌడ ఇంటికి వచ్చే సందర్శకులతో కిటకిటలాడిపోతూ ఉంటుంది

నిజానికి తనదగ్గర పుస్తకాలు చదవడానికి వచ్చేవారి నుంచి అద్దె వసూలు చేసినా అంకెగౌడ ఆస్తులు రెండంకెలు పెరిగేవి

కానీ ఆయన ఆశయం వ్యాపారం కాదు
తనలాంటి పదిమంది సాహిత్యాభిలాషులకు తన పుస్తకాలు ఉపయోగపడాలి

అందుకే బుక్ మానె కి వచ్చినవారినుంచి ఆయన నయాపైసా తీసుకోడు
పూర్తిగా ఉచితం

పోటీపరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు , ఖరీదు పెట్టి పుస్తకాలు కొనుక్కోలేని వాళ్ళు అంకెగౌడ గ్రంధాలయానికి వచ్చి కావాల్సిన బుక్స్ రిఫర్ చేసుకుంటారు

దశాబ్దాల పాటు సాహిత్య చేస్తున్న ఈయనకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం నూరు శాతం సరైన నిర్ణయం

ఇప్పుడు ఇంకో అన్ సంగ్ హీరో ఇందర్జిత్ సింగ్ సిద్ధూ గురించి చెప్పుకుందాం

ఎవరీ ఇందర్ జిత్ సింగ్ ?

తెలతెలవారుతున్న తరుణాన మెలుకువ వచ్చి కిటికీ తెరిచి చూస్తే కింద రోడ్డుమీద చదువుకున్న , ధనవంతుడిలా కనిపిస్తున్న ఓ ముసలాయన తోపుడు బండి మీద రాత్రి మనం పారబోసిన చెత్తను నిశ్శబ్దంగా ఎత్తిపోసి ఆ ప్రాంతాన్ని క్లీన్ గా ఉంచడం చూస్తుంటే మనకేం అనిపిస్తుంది ?

అయ్యో ! మనం నిర్లక్ష్యంగా పారబోసిన చెత్తను ఊడ్చి ఈ వయసులో ఈ ముసలాయన ఇంత కష్టపడుతున్నాడేంటి ?

మనం చేసిన తప్పుకు ఆయన శ్రమ తీసుకుంటున్నాడేంటి ? అని గిల్టీ గా అనిపించదూ ?

కానీ ఆ పెద్దాయన ఆలోచన వేరు

సమాజం పట్ల ఎవరో ఒకరు బాధ్యత తీసుకోకపోతే దేశమే గతిన ముందుకుపోతుంది అని ఆలోచించాడు

ఈ పని నాదికాదులే అని ఎవరికి వారు అనుకుంటే సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి?

అందుకే ఎవరో ఒకరు ముందుకు వచ్చి అడుగు వేయాలి
అప్పుడు ఆ అడుగుకి కొన్ని వందల అడుగులు బాసటగా నిలుస్తాయి అంటారు ఈ 88 ఏళ్ళ రిటైర్డ్ పంజాబ్ పోలీస్ DIG

ఓరోజు ఈయన నివాసం ఉండే చండీఘర్ లోని సెక్టార్ 49 లో అపరిశుభ్రతను గమనించాడు

దానికి తోడు కేంద్రప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛభారత్ పధకంలో ఈ సెక్టార్ వెనుకబడి ఉండటం ఆయనకు నచ్చలేదు

ఒక సినీ కవి చెప్పినట్టు ఎవరో వస్తారని , ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా అన్నట్టుగా ఈ సత్కార్యానికి మొదటి అడుగు తానే వెయ్యాలని నిర్ణయించుకున్నాడు

అంతే , అది మొదలు అందరూ నిద్రలో ఉండగానే ఈయన చీకట్లో నిద్రలేచి వీధుల్లో చెత్త ఊడ్చి పరిశుభ్రం చేయడం మొదలుపెట్టారు

అలా ఒకరోజు ,రెండ్రోజులు కాదు
పదేళ్ళపాటు రోడ్లమీద చెత్తను ఊడ్చి క్లీన్ సిటీగా మార్చాడు

మొదట్లో జనాలు పట్టించుకోలేదు కానీ రాన్రాను తమ సెక్టార్ ఇంత పరిశుభ్రంగా ఉండటం వెనుక ఓ 88 ఏళ్ళ రిటైర్డ్ DIG ప్రమేయం ఉందని తెలిసి ఆశ్చర్యపోయారు

కనీసం పబ్లిసిటీ కోసం అయినా ఈ రోడ్లు ఊడుస్తుంది తానేనని ఆయన ఏ ఒక్కరికీ చెప్పుకోలేదు

అదే విషయం ఆయన్ను అడిగితే పబ్లిసిటీ కోసం నేను ఈ పనిచేయడం లేదు . అందుకే రోడ్లు ఊడ్చేటప్పుడు కనీసం తన మొబైల్ ఫోన్ కూడా వెంట తెచ్చుకోనని ఆయన చెప్పారు.సమాజానికి నా వంతు బాధ్యతగా శరీరం సహకరించినంత వరకు పని చేస్తా అని చెప్పారు

కానీ ఎవరో ఆయనకు తెలియకుండా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది

ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది

డాక్టర్ ఆర్మీద ఫెర్నాండెజ్

ఇప్పుడు ఆసియాలోనే ఎవరూ చేయలేని పనిని మొదలుపెట్టి సత్కార్యానికి పూనుకుని ఎంతోమంది శిశువుల ప్రాణాలను కాపాడి పద్మశ్రీ అవార్డు పొందిన డాక్టర్ ఆర్మీద ఫెర్నాండెజ్ గురించి చెప్పుకుందాం

ఈవిడ ముంబైలోని సియాన్ హాస్పిటల్లో చైల్డ్ స్పెషలిస్ట్ డాక్టర్ గా పనిచేస్తున్నప్పుడు 1989 లో ఆసియాస్ ఫస్ట్ హ్యూమన్ మిల్క్ బ్యాంకు ను స్థాపించారు

ప్రీమెచ్యూర్ బేబీలకు , అనారోగ్యంతో పుట్టిన బేబీలకు ,ఇతర ఇన్ఫెక్షన్స్ ఉన్న బేబీలకు తల్లిపాలను అందించి ప్రాణాలను కాపాడే ఓ బృహత్తర కార్యక్రమానికి స్వీకారం చుట్టింది

ఆ రోజు ఆమె ప్రారంభించిన హ్యూమన్ మిల్క్ బ్యాంక్ వల్ల ఎందరో బేబీల ప్రాణాలు నిలిచాయి

షుమారు ముప్పై సంవత్సరాల పాటు హాస్పిటల్ తరపున సేవలు అందించిన ఆమె రిటైర్ అయినతరువాత కూడా చిన్నపిల్లల ఆరోగ్యం కోసం బస్తీల్లో అవగాహన కల్పించటానికి స్నేహ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి కార్యక్రమాలు చేయడం ద్వారా కృషి చేస్తున్నారు

Bhiklya Ladakya

పూర్వం వెదురు బొంగులతో తయారుచేసిన పిల్లనమోవి సంగతి అందరికీ తెలిసిందే

అలాగే మృదంగం , తబలా , సన్నాయి వంటి ఎన్నో వాయిద్యాలు ప్రకృతి ప్రసాదించిన వృక్షాల నుంచి తయారయినవే

వీటిలో కొన్ని అంతరించిపోగా మరికొన్ని వాడుకలో ఉన్నాయి

అంతరించిపోయిన వాటిలో అరుదైన వాయిద్యాన్ని 92 ఏళ్ళ Bhiklya తయారుచేసాడు

అడవిలో దొరికే కొన్ని వెదురు బొంగులు , సొరకాయ కలిపి ట్రైబల్ ఏరియాలలో ఉపయోగించే తర్ప అనే వాయిద్యాన్ని తయారుచేసాడు

తయారుచేయడమే కాదు ఆ వాయిద్యంతో అద్భుతమైన సంగీతాన్ని కూడా పలికించాడు
ఆయన కృషిని గుర్తించి ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది

అలాగే మూడువేల మొక్కలు నాటి తపోవనం సృష్టించిన కేరళకు చెందిన 92 ఏళ్ళ దేవకీ అమ్మకు , బస్టర్ లో షుమారు లక్షమందికి పైగా ట్రైబల్స్ కు అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించిన వృద్ధురాలు సునీత అమ్మకు పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు

అలాగే మిగిలిన అన్ సంగ్ హీరోస్ కూడా తమ తమ రంగాల్లో విశేష సేవలు చేసి విశిష్టమైన పద్మశ్రీ అవార్డులు పొందారు

ముగింపు : ఒక్కోసారి వ్యవస్థలు చేయలేని పనిని వ్యక్తులు చేస్తారు . ఏమాత్రం లాభాపేక్ష లేకుండా సమాజానికి సేవ చేసే సామాన్యులను గుర్తించి సత్కరించడం వల్ల సామాజిక బాధ్యత పెరగడమే కాకుండా ఇలాంటి సామాన్యులు మరింతమంది పుట్టుకొచ్చి సమాజానికి తమ వంతు సహకారం అందిస్తారు


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!