Home » చిన్న సమస్యలకే జీవితం బోర్ కొడుతుందా ? అయితే ఒకసారి పద్మశ్రీ అవార్డు పొందిన యాసిడ్ బాధితురాలు మంగళ కపూర్ కథ చదవండి !

చిన్న సమస్యలకే జీవితం బోర్ కొడుతుందా ? అయితే ఒకసారి పద్మశ్రీ అవార్డు పొందిన యాసిడ్ బాధితురాలు మంగళ కపూర్ కథ చదవండి !

Spread the love

కేంద్రప్రభుత్వం 77 వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురష్కరించుకుని పద్మ అవార్డులను ప్రకటించింది

వారిలో ఉత్తరప్రదేశ్ కు చెందిన మంగళ కపూర్ ఒకరు
ఈవిడకు పద్మశ్రీ అవార్డు ఆషామాషీగా రాలేదు
ఒకరకంగా చెప్పాలంటే ఆ అవార్డుకు ఆమె అన్ని విధాలా అర్హురాలు

ఆవిడ జీవిత చరిత్ర చదివితే కళ్ళు చెమర్చక మానవు
హృదయం ద్రవించక మానదు
ఆమెకు జరిగిన అన్యాయం గురించి తల్చుకుంటే గుండె విలవిలలాడిపోక మానదు

మరీ భయస్తులైతే వామ్మో అనకుండా ఉండలేరు
స్ఫూర్తి పొందాలనుకునేవారికి మాత్రం ఆమె జీవితం అతి పెద్ద గైడ్

ఈ మంగళ కపూర్ గురించి చెప్పుకునేముందు చిన్న ఉపాధ్ఘాతం చెప్పుకుందాం

చిన్న చిన్న సమస్యలకే జీవితాలను అంతం చేసుకుంటున్న మహిళల గురించి ఈ మధ్య మనం తరచూ వార్తల్లో చూస్తున్నాం

టీవీలు ఆన్ చేస్తే చాలు అవే వార్తలు

సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రపంచంలో ఏ మూల ఏ సంఘటన జరిగినా బాధితుల సమాచారం క్షణాల్లో తెలిసిపోతుంది

వీటిలో కొన్ని చాలా పెద్ద సమస్యలు
మరికొన్ని అసలు సమస్యలే కావు
వచ్చిన చిక్కల్లా వాటిని బూతద్దంలో చూసే దృష్టి కోణంలోనే

ప్రేమించినవాడితో పెళ్లి చేయలేదని కొందరు ,
పోకిరీల బాధ తట్టుకోలేక మరికొందరు ,
తల్లితండ్రులు మందలించారని ఇంకొందరు అర్దాంతరంగా తమ జీవితాలను చాలించుకుంటున్నారు

వీటన్నింటికన్నా ఘోరమైన బాధలు పడింది పూలన్ దేవి

పెళ్ళిచేసుకుని పిల్లాపాపలతో గడపాల్సిన ఆమె జీవితం ఊహించని మలుపు తిరిగింది
పదే పదే ఆమె మీద పాశవికంగా అత్యాచారాలు జరిగాయి

ఇంకొకళ్ళయితే ఆ క్షణానే తమ జీవితాన్ని చాలించుకునేవాళ్ళు
కానీ ఈవిడ పిరికిపందలా ఆ పనిచేయలేదు

తనకు జరిగిన అన్యాయం మీద తిరగబడింది
పిల్లికి భయపడే ఆమె ఆడపులై మృగాళ్ల అంతు చూసింది

తనమీద అత్యాచారం జరిగిన చోటే రాక్షసులను భూమిలో పాతింది
పూలన్ దెబ్బకి అత్యాచారాల సంగతి అటుంచితే కనీసం మహిళల మీద కన్నెత్తి చూడటానికి కూడా మృగాళ్లు భయపడ్డారు

ఇక్కడ పూలన్ దేవి కథ గుర్తుచేయడం వెనుక ఉద్దేశ్యం అలాంటి బాధితురాళ్లు అందరూ తుపాకులు చేతబట్టాలని కాదు

మహిళలు ఆత్మస్థయిర్యం కోల్పోకుండా తమకు జరిగిన అన్యాయాల మీద పోరాటం చేయాలని ఆమె జీవితం చెప్పింది

ఇక గతంలో ఆడపిల్లల మీద ఇంకోరకంగా దాడులు కూడా జరిగాయి

అవే యాసిడ్ దాడులు
నిజానికి ఇది అత్యంత దుర్మార్గమైన దాడులు

ఈ దాడులతో ఛిద్రమైన రూపంతో ఆడపిల్లలు బతకలేరూ ? అలాగని చావనూ లేరు
బతికినంతకాలం జీవితం నరకప్రాయమే

కొంతమంది తట్టుకుంటారు .. మరికొంతమంది తట్టుకోలేరు

తనని కాదని వేరేవాడ్ని పెళ్లిచేసుకుంటుందని అక్కసుతో గతంలో తెలంగాణలోని వరంగల్ లో ఒక అమ్మాయి మీద జరిగిన యాసిడ్ దాడి గురించి గుర్తుంది కదా ?

అఫ్కోర్స్ , ఈ కేసులో అప్పటి ఎస్పీ కఠిన చర్యలు తీసుకోవడంతో యాసిడ్ దాడులు చాలావరకు తగ్గాయనుకోండి

అయినా ఇప్పటికీ దేశంలో అడపాతడపా అక్కడక్కడా యాసిడ్ దాడులు జరుగుతూనే ఉన్నాయి

ఇప్పుడు మళ్ళీ మంగళ కపూర్ జీవితం దగ్గరికి వద్దాం

ఉత్తరప్రదేశ్ కు చెందిన మంగళ కపూర్ బాల్యం కూడా అందరి ఆడపిల్లల మాదిరే చదువు సంధ్యలతో , ఆటపాటలతో హాయిగా గడిచిపోతుంది

అయితే ఓ రోజు అనుకోకుండా దురదృష్టం ఆమెను పలకరించింది

చక్కగా చదువుకుని జీవితంలో స్థిరపడాల్సిన ఆమె జీవితంతో విధి వింత నాటకం ఆడింది

సరిగ్గా ఆమె పన్నెండో ఏట యాసిడ్ దాడి జరిగింది
అదికూడా మాములు దాడి కాదు

ముఖమంతా ఛిద్రమైపోయింది
కంటిచూపు వస్తుందో రాదో తెలీదు

ఆ అమ్మాయి ముఖాన్ని చూసిన చాలామంది డాక్టర్లు చేతులెత్తేశారు

ఎంత ప్లాస్టిక్ సర్జరీ చేసినా ఆమె ముఖాన్ని పూర్వపు స్థితికి తీసుకురావడం అసాధ్యం అని తేల్చేసారు

పైగా పోస్ట్ ఆపరేషన్ తర్వాత వచ్చే నొప్పిని ఆమె భరించడం కూడా చాలా కష్టమని చెప్పారు

పేషేంట్ విల్ పవర్ తో ఉంటే కొంతవరకు సరిదిద్దటానికి అవకాశం ఉంటుందని చెప్పారు
కాకపోతే జీవితంలో ఎప్పటికీ ఆమెకు అంతకుముందు ఉన్న ముఖ రూపు రాదు
ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ఏర్పడిన అతుకుల బొతుకుల ముఖంతోనే మిగిలిన జీవితాన్ని గడపాల్సి ఉంటుందని చెప్పారు

అప్పటికి ఆ అమ్మాయి వయసు చూస్తే పన్నెండేళ్ళు
ముందుముందు ఎంతో జీవితం ఉంది

సర్జరీ విషయంలో నిర్ణయం ఆమె చేతిలోనే పెట్టారు డాక్టర్లు

తనకు జరిగిన అన్యాయాన్ని తల్చుకుంటూ కుంగిపోలేదు ఆ పిల్ల
ఆత్మస్థయిర్యంతో జీవితాన్ని కొనసాగించడానికే నిర్ణయించుకుంది

తన ముఖాన్ని ఎంతవరకు సరిచేస్తారో అంతవరకు సరిచేయండి అని డాక్టర్లకు చెప్పింది
సర్జరీల వల్ల ఏర్పడే నొప్పిని భరించటానికి తాను సిద్ధం అని చెప్పింది

డాక్టర్లు సర్జరీ చేసారు

అయితే డాక్టర్లు ఆమె ముఖం మీద కన్నా కంటిచూపు మీద ఎక్కువ శ్రద్ద పెట్టి సర్జరీ చేయడంతో మంగళ కపూర్ కు చూపు దక్కింది

చూపు అయితే నిలిచింది కానీ ముఖ ఆకృతి రాలేదు
దానితో డాక్టర్లు మళ్ళీ సర్జరీ చేయాలన్నారు

ఆమె భయపడలేదు
సరే అంది

తోటి స్నేహితురాళ్ళు ఆడుతూ పాడుతూ స్కూళ్లకు వెళ్లి చదువుకుంటుండగా పన్నెండేళ్ల మంగళ కపూర్ మాత్రం నొప్పిని భరిస్తూ సర్జరీల మీద సర్జరీల కోసం హాస్పిటల్స్ చుట్టూ తిరిగింది

అలా ఒక రోజు కాదు రెండ్రోజులు కాదు
ఆరేళ్ళ పాటుహాస్పిటళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉంది

ఆమెకు ఒకటికాదు రెండు కాదు మొత్తం 37 సర్జరీలు చేసారు

ఇంకొకరైతే ఇన్ని సర్జరీలను తట్టుకునేవారా ?
ఇంకొకరైతే గాయాలు చేసే నొప్పిని భరించగలరా ?

స్కూలుకు వెళ్ళడాలు లేవు
స్నేహితురాళ్ళతో ఆడుకోవడాలు లేవు
ఎంతసేపు హాస్పిటల్సు , సర్జరీలు

సరదాగా గడవల్సిన బాల్యం చూస్తుండగానే దాటిపోయింది
ఇంకొకరైతే ఇన్ని కష్ఠాలను భరించగలిగేవారా ?

అద్దంలో ముఖం చూసుకోవాలంటేనే భయపడే పరిస్థితులు ఉన్నప్పుడు ఇంకెందుకీ జీవితం అనిపించదూ ?

ఇక్కడే మంగళ కపూర్ అబల మాదిరి ఆలోచించలేదు
సబలగా మారి తన జీవితాన్ని పునర్నిర్మించుకోవాలని భావించింది

గతాన్ని తల్చుకుంటూ కుమిలిపోలేదు
భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకోవాలా ? అని ఆలోచించింది

పాత గాయాలను తవ్వకుండా తన మనసు దృష్టి మరల్చేందుకు సంగీతం వైపు ఫోకస్ చేసింది

సంగీత సాధనలో లీనమై శరీరం చేసిన గాయాలను ఒకటొకటిగా మర్చిపోవడం నేర్చుకుంది

ఇందుకు ఎంతో సాధన అవసరం

కానీ కఠోర సాధనతో మంగళ కపూర్ సాధించింది
శాస్త్రీయ సంగీతంలో గమకాల మీద పట్టు సాధించింది

నేర్చుకోవడం నుంచి డాక్టరేట్ పొందేదాకా దాకా వెళ్ళింది ఆమె సాధన

తను నేర్చుకోవడమే కాదు పదిమంది పిల్లలకు విద్యను పంచింది

ఎక్కడ యాసిడ్ దాడి బాధితురాలు పన్నెండేళ్ల మంగళ కపూర్
ఎక్కడ సంగీతంలో డాక్టరేట్ పొందిన మంగళ్ కపూర్

శాస్త్రీయ సంగీతంలో చేసిన పరిశోధనలకు డాక్టరేట్ పొందటమే కాదు బెనారస్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ కొలువు సంపాదించుకుని వందలాదిమంది విద్యార్థులకు మార్గదర్శిగా మంగళ కపూర్ నిలిచారు

ఇప్పటికీ నిరుపేద విద్యార్థులకు ఉచితంగా విద్యాబోధన చేస్తున్నారు

చూసారా ఆవిడ జీవితం ఎంత స్ఫూర్తివంతంగా ఉందో

నిజంగా చిన్న చిన్న సమస్యలను బూతద్దంలో చూసుకుని డీలాపడిపోతున్న మహిళలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన జీవిత చరిత్ర మంగళ కపూర్ ది

ఇప్పటికీ మంగళ కపూర్ ముఖంలో సర్జరీలు చేసిన గాయాలు కనిపిస్తూనే ఉంటాయి

తాను కోరుకున్న ముఖ ఆకృతి రాకపోయినా , సర్జరీ ద్వారా వచ్చిన అతుకుల ముఖాన్ని తల్చుకుంటూ డీలా పడిపోయి నిరాశలో కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో వందలాదిమంది విద్యార్థులకు ఉచితంగా విద్యాబోధన చేయడాన్ని మించిన గొప్ప విజయం ఏముంటుంది ?

అందుకే ఆమె సాధించిన విజయాలకు గానూ కేంద్ర ప్రభుత్వం ఎడ్యుకేషన్ అండ్ లిటరేచర్ క్యాటగిరీలో మంగళ కపూర్ కి పద్మశ్రీ అవార్డు ప్రకటించింది

నిజంగా మీరు గ్రేట్ అమ్మా

రాజకీయ పైరవీలతో కొంతమంది అనర్హులకు పద్మ అవార్డులు దక్కుతున్నాయనే మా ఆవేదన మీలాంటి అర్హురాలికి దక్కడంతో తొలగిపోయింది

అన్నట్టు అన్ సంగ్ హీరోస్ పేరిట దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మరో 45 మందికి కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించింది

వారిలో కూడా ఒక్కో రంగానికి ఒక్కొక్కరు చేసిన సేవలు చూస్తుంటే ఖచ్చితంగా పద్మ అవార్డులకు అర్హులు అనిపించింది

వారిలో కేరళకు చెందిన 92 ఏళ్ళ దేవకీ అమ్మ ఒకరు

ఈవిడ ఏకంగా 44 ఏళ్లపాటు శ్రమించి ఏకంగా అడవిని సృష్టించింది
ఐదెకరాల్లో షుమారు మూడు వేల మొక్కలను నాటి తపోవనం నిర్మించింది
వారి జీవిత చరిత్ర గురించి ఇంకో పోస్టులో తెలుసుకుందాం

ఇటువంటి గొప్ప మహిళల జీవితం గురించి అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది
వీలుంటే ఇక్కడ కనిపిస్తున్న ఫేస్ బుక్ , వాట్సాప్ , ఇతర సోషల్ మీడియా ఐకాన్ల ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేయగలరు


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!