Home » నేటితో పుల్వామా దాడికి ఏడేళ్లు-అమర జవానులకు నివాళులు – అసలు ఆ రోజేం జరిగింది?

నేటితో పుల్వామా దాడికి ఏడేళ్లు-అమర జవానులకు నివాళులు – అసలు ఆ రోజేం జరిగింది?

Spread the love

ఈ మధ్య వచ్చిన అమరన్ సినిమా చూసారా ?

అందులో మేజర్ ముకుందన్ ఆధ్వర్యంలో కొంతమంది సైనికులు ఓ మిలిటరీ ఆపరేషన్ కోసం వ్యానులో బయలుదేరుతారు

వ్యానులో వెళ్తుండగా సైనికులకు తమ కుటుంబాలు గుర్తుకొస్తాయి
ఈ ఆపరేషన్ పూర్తి చేసుకుని సజీవంగా వెనక్కి వస్తామో లేదో తెలీదు

దారిలోనే ఉగ్రవాదులు ఏ క్షణాన ఎటువైపునుంచి అటాక్ చేస్తారో తెలీదు
అందులో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరికీ తమ ప్రాణాలకు గ్యారంటీ లేదని తెలుసు

ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగితే సొంతూళ్లలో తమకోసం ఎదురు చూసే కుటుంబాల పరిస్థితి ఏంటని ఒక్క క్షణం దిగులు పడతారు

అప్పుడు మేజర్ ముకుందన్ వాళ్లతో చెప్తాడు

మిలిటరీ యూనిఫార్మ్ వేసుకున్నప్పుడే దేశం కోసం మనం త్యాగాలకు సిద్దపడ్డామని అందరం గుర్తుపెట్టుకోవాలి అని చెప్తూ సైనికుల మూడ్ డైవర్ట్ చేయడానికి దేశభక్తి గీతాలు పాడటం మొదలుపెడతాడు

సైనికులకు దేశభక్తి గీతాలను మించిన ఛార్జింగ్ ఏముంటుంది ?
మేజర్ ముకుందన్ తో పదం పదం కలుపుతూ దేశభక్తి నినాదాలు చేస్తారు

అయితే వారు అనుమానపడినట్టుగానే దారిలో టెర్రరిస్టులు వారి వ్యాన్ మీద అటాక్ చేస్తారు

సినిమాలో ఈ సన్నివేశం చూస్తుంటేనే మనసు చివుక్కుమంటుంది

అలాంటిది మన సైనికుల మీద నిజంగా దాడి జరిగి 40 మంది ప్రాణాలు పొతే మనసు బాధతో ఎంత విలవిలలాడిపోతుంది?

సరిగ్గా ఏడేళ్ల క్రితం 2019 ఫిబ్రవరి 14 న జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో మన సైనికుల మీద ముష్కరులు దాడి చేసి పొట్టన పెట్టుకున్నప్పుడు జాతి యావత్తు శోక సంద్రంలో మునిగిపోయింది

ఒకరుకాదు ఇద్దరు కాదు
ఆ దాడుల్లో ఏకంగా 40 మంది వీర జవానులు నేలకొరిగారు

అమర జవాన్లకు నివాళులు అర్పిస్తూ ఒకసారి వారి త్యాగాన్ని గుర్తు చేసుకుందాం

పుల్వామా దాడికి ముందు జమ్మూలో పరిస్థితులు ఏంటి ?

జమ్మూ కాశ్మీర్ లో ప్రత్యేకంగా పుల్వామా వ్యాలీలో తరచూ ఉగ్రదాడులు జరుగుతున్నాయని రక్షణ శాఖకు చెందిన ఇంటలిజెన్స్ విభాగాలు గుర్తించాయి

2014 నుంచి జమ్మూకాశ్మీర్లో ప్రత్యేకంగా సైనికుల మీద తరచూ ఉగ్రమూకలు దాడులు చేస్తున్నాయని గుర్తించారు

అంతకుముందు మొత్తం టెర్రరిస్ట్ దాడుల్లో 70 శాతానికి పైగా దాడులు సైనికులను టార్గెట్ చేస్తూ జరిగినవే అని కేంద్రానికి నివేదికలు వెళ్లాయి

ఐదేళ్ల కాలంలో ఈ రేషియో విపరీతంగా పెరిగిపోయింది

2014 నుంచి 2018 వరకు జరిగిన టెర్రరిస్ట్ అటాక్ లలో ఎక్కువగా పుల్వామా రీజియన్ లోనే జరిగినట్టు నివేదికల్లో పేర్కొన్నారు

ఈ కాలంలో ముష్కరులు షుమారు 13 వందలమందిని పొట్టనబెట్టుకున్నారని పోలీస్ రికార్డులలో నమోదు అయి ఉంది

కొంతమంది టెర్రరిస్టులు పుల్వామా నుంచే తమ కార్యకలాపాలను సాగిస్తున్నారని , అందువల్లనే ఈ రీజియన్లో దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని కేంద్ర నిఘా సంస్థలకు నివేదికలు అందించారు

పొరుగు దేశం నుంచి ఉగ్రవాదులు జొరబడకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ జమ్మూ లో దాడులు జరుగుతుండటంతో మిలిటెంట్లు స్థానికంగానే శిక్షణ పొందుతున్నారని పసిగట్టారు

ముఖ్యంగా పుల్వామా రీజియన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని రక్షణ శాఖ అధికారులు నిర్ణయించుకున్నారు

అందులో భాగంగానే అధికారుల ఆదేశాలతో 2019 ఫిబ్రవరి 14 న 78 వాహనాలలో 2 ,500 మంది సీఆర్పీఎఫ్ జవానులు జమ్మునుంచి బయలుదేరారు

ఇందాక సినిమాలో చూపించినట్టు వ్యానుల్లో బయలుదేరుతున్నప్పుడు ప్రతి ఒక్కరి మనసులో దేశమాత గురించిన ఆలోచనలే

ఆ క్షణాన వారికి తమ కుటుంబాలు గుర్తుకు రాలేదు
ఉగ్రదాడులతో చిన్నాభిన్నం అయిపోతున్న కుటుంబాల గురించే ఆలోచనలు వచ్చి ఉంటాయి

తమ ప్రాణం అడ్డుపెట్టి అయినా పది ప్రాణాలు కాపాడాలనే కృత నిశ్చయంతో ఉన్నారు

ఇన్నాళ్లు దేశం కోసం చేసిన సేవలు వేరు
ఇకపై చేయబోయే సేవలు వేరని ఆ క్షణాన వారికి తెలుసు

నేరుగా శత్రు స్థావరాల వైపు వెళ్తుండటంతో ఏ క్షణాన ఎటువైపు నుంచి దాడులు జరుగుతాయో కూడా తెలీదు

సొంతూళ్లలో ఉన్న తమ కుటుంబాలను తిరిగి కలుస్తామో లేదో తెలీదు
అసలు మరుక్షణంలో ప్రాణాలతో ఉంటామో లేదో కూడా తెలీదు

అయినా భయపడలేదు
అడుగు వెనక్కి వేయలేదు

ఆనాడు ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్టు వ్యానుల్లో ప్రయాణిస్తున్న సైనికుల అందరి లక్ష్యం ఒకటే

జమ్మూలో ఉగ్రవాదం అంతానికి పోరాటం చేయాలి
ముష్కరులను పట్టుకుని చట్టానికి అప్పగించాలి

అంతే ఒక్కసారిగా దేశభక్తి నినాదాలతో వ్యానులు హోరెత్తిపోయాయి
సరిగ్గా ఆ సమయంలోనే ఊహించని సంఘటన జరిగింది

ఏం జరిగింది ?

మొత్తం సైనికులు ప్రయాణిస్తున్న 78 వాహనాలు ఒకదానివెనుక ఒకటి పరుగులు పెడుతూ పుల్వామా జిల్లాలోకి అడుగుపెట్టాయి

సరిగ్గా సాయంత్రం 3.30 నిమిషాలకు నేషనల్ హైవే నుంచి అవంతీపురా పట్టణంలోని లేతిపురా దగ్గర మలుపు తిరుగుతుండగా అనుకోని సంఘటన జరిగింది

20 సంవత్సరాల వయసున్న అదిల్ అహ్మద్ అనే ముష్కరుడు మహీంద్రా స్కార్పియోలో పేలుడుపదార్దాలతో సీఆర్పీఎఫ్ వాహనాల కాన్వాయిని ఢీకొట్టాడు

ఆ పేలుళ్ల ధాటికి వాహనాలు గాల్లోకి లేచి రోడ్డు అవతల పడ్డాయి
అందులో ప్రయాణిస్తున్న జవానులు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డారు

40 మంది జవానులు అక్కడికక్కడే మరణించారు
చాలామందికి తీవ్ర గాయాలు అయ్యాయి

సమాచారం అందుకున్న లోకల్ బెటాలియన్ గాయపడినవారిని శ్రీనగర్లోని ఆర్మీ బేస్ హాస్పిటల్లో చేర్పించారు

జమ్మూకాశ్మీర్లో గత మూడు దశాబ్దాల కాలంలో జరిగిన అతి పెద్ద ఉగ్ర దాడి పుల్వామా అటాక్

ఈ వార్త తెలిసిన వెంటనే యావత్తు దేశం ఉలిక్కిపడింది
నేతలు దిగ్బ్రాంతి చెందారు

ఈ అటాక్ చేసింది ఎవరు ?

పాకిస్తాన్ కు చెందిన జైషే ఉగ్ర సంస్థ ఈ దాడి తామే చేశామని వీడియో రిలీజ్ చేసింది

అయితే సీఆర్పీఎఫ్ వ్యానులను స్కార్పియో జీపుతో వచ్చి ఢీకొట్టిన సూసైడ్ బాంబర్ ఎవరు అనే కోణంలో ఏజెన్సీలు దర్యాప్తు మొదలుపెట్టాయి

వారి దర్యాప్తులో పూల్వమాకు చెందిన 20 సంవత్సరాల వయసున్న 12 తరగతి చదువుతున్న అదిల్ అహ్మద్ అనే విద్యార్థి మిస్సింగ్ కేసు స్థానిక పోలీస్ స్టషన్లో నమోదు అయి ఉంది

ఏజెన్సీలు లోతుగా దర్యాప్తు చేయడంతో అతడే అదిల్ అహ్మద్ అని తేలింది

జమ్మూలో చదువుకుంటున్న యువతకు కొన్ని ఉగ్ర సంస్థలు శిక్షణ ఇచ్చి తమ కార్యకలాపాలకు ఉపయోగించుకుంటున్నారని , వారిలో అదిల్ ఒకరని తేలింది

ఇదిలాఉండగా ఈ దాడి వెనుక పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థకు సంబంధాలు ఉండటంతో కేసును భారత ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది

భారత ప్రభుత్వ రియాక్షన్ ఏంటి ?

పుల్వామా దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవానులు ప్రాణాలు కోల్పోయారని తెలియగానే ప్రధాని నరేంద్ర మోడీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు

ఆ దాడిలో ప్రమేయం ఉన్న ఉగ్రవాదులను మట్టుపెట్టడంలో భాగంగా అవసరమైన నిర్ణయాలు తీసుకోవడానికి సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు

కాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ హైలెవెల్ సమావేశం నిర్వహించి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు

వాటిలో భాగంగా అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఒక ప్రకటన చేస్తూ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ జాబితా నుంచి పాకిస్తాన్ పేరును తొలగిస్తున్నట్టు ప్రకటించారు

అంతేకాదు పాకిస్తాన్ దేశంతో అన్ని ట్రేడ్ డీల్స్ ను రద్దు చేసుకుంటున్నట్టు అనౌన్స్ చేసారు

ఉగ్ర సంస్థలకు పాకిస్తాన్ చేస్తున్న సాయాన్ని దౌత్య మార్గాల ద్వారా ప్రపంచ దేశాల దృష్టికి తీసుకువచ్చింది

ప్రభుత్వ పరంగా తీసుకున్న చర్యలకు అన్నివైపుల నుంచి విశేష మద్దతు వచ్చింది
రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు సైన్యానికి సంఘీభావం ప్రకటించాయి

అమెరికా , చైనా , రష్యాలతో సహా ప్రపంచంలోని 45 దేశాలు పుల్వామా దాడిని ఖండించాయి

ఈ రోజుకి పుల్వామా దాడి జరిగి ఏడేళ్లు

పుల్వామా దాడి జరిగి నేటికీ ఏడేళ్లు అయినా సరే ఇప్పటికీ దేశం యావత్తు జవానుల త్యాగాలు మర్చిపోలేదు

వారి త్యాగాలను గుర్తుచేసుకుంటూ ఈరోజు ప్రధాని మోడీ తో సహా పలువురు మంత్రులు , ప్రతిపక్ష నాయకులు నివాళులు అర్పించారు !


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!