మందుబాబులు సంవత్సరం అంతా తాగేది ఒకెత్తు
డిసెంబర్ 31 రాత్రి తాగేది ఇంకోకెత్తు
మిగతారోజుల సంగతి ఎలా ఉన్నా కొత్త సంవత్సరం సెలెబ్రేషన్స్ తో వీధుల్లో వీరు చేసే హంగామా అంతాఇంతా కాదు
నిజానికి డిసెంబర్ 31 కోసం మందుబాబులే కాదు ప్రభుత్వాలు కూడా ఎదురుచూస్తాయి
ఎందుకంటే ఒక్కరోజులోనే ప్రభుత్వ ఖజానాలో కాసులు కనకవర్షం కురిపిస్తాయి
ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే డిసెంబర్ ఆఖరి రోజును ప్రభుత్వాలు ఆదాయ వనరుగా చూస్తాయి
మందుబాబులు తాగే ప్రతి చుక్కా పైసల రూపంలో ట్రెజరీలో చేరతాయి
అందుకే ఈ అవకాశాన్ని జారవిడచుకోకుండా అర్ధరాత్రి వరకు మీ ఇష్టం వచ్చినంత మందు అమ్ముకోండి అని ప్రభుత్వాలు ఉదారంగా స్పెషల్ పర్మిషన్లు ఇచ్చేస్తాయి
మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని సినిమాల్లో బోలెడు ప్రకటనలు ఇచ్చే అవే ప్రభుత్వాలు పాత సంవత్సరం చివరి రోజు లిక్కర్ అమ్మకాలకు గేట్లు తెరవడం విధి ఆడే వింత నాటకం అనుకోవాలి
ఒక్కరోజులో లిక్కర్ ఆదాయం ఎంతో తెలుసా ?
తెలంగాణాలో డిసెంబర్ 31 రాత్రి షుమారు తొమ్మిది వందల కోట్ల రూపాయల లిక్కర్ అమ్మకాలు జరగగా అంతే విలువ కలిగిన మందు తాగుబోతుల పొట్టల్లోకి చేరింది
ఇది కేవలం ఒక్కరోజులో జరిగిన అమ్మకాలు మాత్రమే
ఇక డిసెంబర్ నెల మొత్తం లెక్కేసుకుంటే షుమారు 5 వేల కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి
ఇది మరొక రికార్డ్
ఈ రికార్డ్ రావడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి
డిసెంబర్ నెలలోనే తెలంగాణాలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో లిక్కర్ అమ్మకాలు ఆకాశానికి అంటాయి
ఎన్నికలప్పుడు మాత్రమే రికార్డు స్థాయిలో లిక్కర్ అమ్మకాలు జరగడం మన ప్రజాస్వామ్యానికి పెట్టే అతిపెద్ద పరీక్ష
మీరు గమనించారా ?
ఫలానా పధకం ద్వారా ప్రభుత్వానికి రికార్డ్ స్థాయిలో ఆదాయం వచ్చిందని ఎప్పుడైనా వార్తలు వచ్చాయా ?
ఎవరైనా చూసారా ?
చూసి ఉండరు
ప్రభుత్వ ఆదాయం అంటే లిక్కర్ ద్వారా వచ్చే ఆదాయం మాత్రమే అని ఘనంగా నమ్మే వ్యవస్థలు ఉన్నంతకాలం రికార్డులు ఇలాగే ఉంటాయి
మర్నాడు మీడియాలో రికార్డ్ స్థాయిలో లిక్కర్ ఆదాయం , చరిత్ర సృష్టించిన లిక్కర్ అమ్మకాలు ( లిక్కర్ కి కూడా ఘనమైన చరిత్ర ఉందని మనకి ఇలా గుర్తుచేస్తూ ఉంటారన్నమాట) లాంటి వార్తలు ప్రముఖంగా వస్తాయి
ఆల్ హ్యాపీస్
బోలెడన్ని డబ్బులొచ్చాయని ప్రభుత్వాలు హ్యాపీస్
తెల్లార్లు తాగి తైతక్కలాడామని మందుబాబు హ్యాపీస్
కానీ కొంతమంది సాధారణ ప్రజలను బాధించేవి ఇలాంటి వార్తలు కాదు
ఇంతకన్నా ఘోరమైనవి
నూతన సంవత్సర వేడుకల్లో విషాదం
మద్యం మత్తులో వేగంగా కారు నడిపి తొమ్మిదేళ్ల పాప మృతికి కారణమైన మందుబాబులు
మద్యం మత్తులో నిర్లక్ష్యంగా నడిపి ఫ్లై ఓవర్ మీదనుంచి పల్టీకొట్టిన కారులో ఉన్న యువకులు దుర్మరణం
ఆ క్రమంలో కిందనున్న ఇంకో కారుమీద పడటంతో వారికి తీవ్ర గాయాలు లాంటి వార్తలు
ఎందరి జీవితాల్లో విషాదాలు నింపాయో ఎంతమందికి తెలుసు?
తెల్లారి మత్తు దిగిన మందుబాబులు తిరిగి ఎవరి పనుల్లో వారు పడిపోతారు
నూతన సంవత్సర వేడుకల్లో లిక్కర్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని లెక్కపెట్టుకునే పనిలో బిజీగా ఉండి ప్రభుత్వాలు కూడా ఇలాంటి వార్తలను పెద్దగా పట్టించుకోవు
మహా అయితే ఇటువంటి సంఘటనలను పునరావృతం కానివ్వం అని అల్మారాలో దాచిన పాత ప్రకటనను మరోసారి చదివి చేతులకు దుమ్ము అంటకుండా దులుపుకుంటారు
కానీ నష్టపోయిన కుటుంబాల మనోవేదనలను తీర్చేదెవరు ?
పరిష్కారం ఏంటి ?
ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ ఆదాయ వనరుల గురించి ఆలోచన చేయనంతకాలం లిక్కర్ అమ్మకాలు ఏటికేడు పెరుగుతూనే ఉంటాయి
వైన్ షాప్ లైసెన్సులతో మొదలెట్టి , బార్లు , పబ్బుల ద్వారా వీలైనంత ఎక్కువ మొత్తం పిండేసుకోవాలనే ఆలోచిస్తారు
పెరిగిన లైసెన్స్ ఫీజుల ప్రభావం లిక్కర్ రేట్ల మీద పడతాయి
అంతిమంగా జేబుకు చిల్లుపడేది మందుబాబులకే
పూట గంజి తాగకుండా అయినా ఉండగలరు కానీ క్వార్టర్ చీప్ లిక్కర్ తాగకుండా ఉండలేని తాగుబోతులకు ఆకలి రాజ్యంలో కొదవలేదు
వారి బలహీనతే కార్పొరేట్లకు పెట్టుబడి
ఇది ఎక్కడిదాకా వెళ్లిందంటే రాజకీయ నాయకులు సైడ్ బిజినెస్ చేస్తూ నాలుగు రాళ్లు వెనకేసుకునేంతవరకు
దాని ఫలితమే ఎవడి బ్రాండ్లు వాడు తయారుచేసుకుని మార్కెట్లో విచ్చలవిడిగా అమ్మేసుకుంటున్నారు
అంతిమంగా వాళ్లకు జేబులు నిండుతున్నాయి
వీళ్లకు జేబులు చిల్లులు పడుతున్నాయి
చూస్తున్నారుగా ,
ఢిల్లీ లిక్కర్ స్కాం , ఏపీ లిక్కర్ స్కాం అంటూ మీడియాలో వస్తున్న వార్తలు
ఇంకో దశాబ్దానికి ఈ స్కాం వార్తలను కూడా అన్ని రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులు పంచుకునేట్టు ఉన్నారు
వాళ్ళు కూడా కేసులకు అలవాటు పడిపోయారు
కావాలంటే ఇంకో నాలుగు కేసులు పెట్టుకో , లిక్కర్ వ్యాపారంనుంచి పక్కకి వెళ్ళేది లేదని ఫుల్ బాటిల్ సాక్షిగా సవాల్ చేస్తున్నారు
అంతేతప్ప ఈ వ్యవస్థను ఎవరూ మార్చలేరు
ఎన్టీఆర్ కూడా తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొలినాళ్లలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు కోసం ప్రయత్నాలు చేసారు
ఫలితం లేకపోగా అక్రమ మద్యం ఏరులై పారింది
దానితో ఆయన ప్రయత్నాలు అటకెక్కాయి
దశల వారీగా మద్యపాన నిషేధం అమలుచేస్తామని నవరత్నాలలో ప్రామిస్ చేసిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు కూడా బెడిసికొట్టాయి
మద్యపాన నిషేధం గురించి ప్రభుత్వాలతో పోరాడే వావిలాల గోపాల కృష్ణయ్య లాంటి గొప్ప వ్యక్తులు కూడా ఇప్పుడు లేరు
అందుకే లిక్కర్ విషయంలో మార్పు రావాల్సింది తాగుబోతుల్లోనే
మద్యపాన నిషేధం గురించి చైతన్యం రావాల్సింది ప్రజల్లోనే
అంతదాకా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ మాదిరి మద్య ప్రాణ నష్టాలు జరక్కుండా పోలీసులు సాధ్యమైనంత కఠిన చర్యలు తీసుకోవాలి
ఈ విషయంలో హైదరాబాద్ పోలీసులు మంచి ప్రయత్నం చేసారు
మరీ ముఖ్యంగా సీపీ సజ్జన్నార్ గారు డిసెంబర్ 31 రాత్రి వేడుకల మీద స్పెషల్ ఫోకస్ పెట్టి మంచి ఫలితాలు సాధించారు
సీపీ సజ్జన్నార్ ఏం చెప్పారు ?
ప్రస్తుతం మనం సోషల్ మీడియా యుగంలో ఉన్నాం
పోలీసులు , నేరస్తులు కూడా సోషల్ మీడియా వాడకం ద్వారానే అనుకున్న ఫలితాలు సాధిస్తున్నారు
లాఠీకి పనిచెప్పేముందు ఈ అస్త్రాన్ని కూడా ప్రయోగించారు సజ్జన్నార్
జనాలకు తొందరగా రీచ్ అయ్యే విధంగా , అర్ధమయ్యే విధంగా సోషల్ మీడియా భాషలోనే ఆయన సుతిమెత్తగా తాగుబోతులకు వార్నింగ్ ఇచ్చారు
‘న్యూ ఇయర్ వేడుకలు , మీ సరదా మీ ఇష్టం
ప్రభుత్వం అనుమతించినంత వరకు , నిభందనలు అనుమతించినంతవరకు సెలెబ్రేట్ చేసుకోండి ..కాదనడం లేదు
కానీ తాగిన తర్వాత గమ్యస్థానాలకు సురక్షితంగా వెళ్లేందుకు ఒక్క క్షణం ఆలోచించండి
క్యాబ్ బుక్ చేసుకోవాలా ? కోర్ట్ మెట్లు ఎక్కాలా ? అనేది నిర్ణయించుకోండి’
డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ దొరికి ‘ నా గురించి తెలుసా ?’ అంటూ నెల్లూరు పెద్దారెడ్డి టైపులో మాట్లాడితే ‘ నీ గురించి అస్సలు తెలియదనే చెప్తాము
ఇంకా ముందుకెళ్లి ‘నేనెవరో తెలుసా ? మా నాన్న ఎవరో తెలుసా ?’ లాంటి డైలాగులు బయటికి వచ్చినా కూడా తెలీదనే చెప్తాం
ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి దొరికినవాళ్ల విషయంలో అలాంటి నెల్లూరు పెద్దారెడ్డిల మాట మా పోలీసులు అస్సలు పట్టించుకోరు
వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు దొరికినవాళ్ళని కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో శిక్ష పడితే పోలీస్ రికార్డులలో నమోదు అవడమే కాకుండా కెరీర్ పరంగా , సోషల్ పరంగా ఇబ్బందులు పడతారు
ఇవేమీ వద్దనుకుంటారా ?
నూతన సంవత్సర వేడుకలను సెలెబ్రేట్ చేసుకోండి
క్యాబ్ బుక్ చేసుకుని క్షేమంగా ఇళ్లకు చేరండి
అని సరిగ్గా ఒకరోజు ముందు మెసేజ్ ఇచ్చారు సీపీ సజ్జన్నార్
మరి సీపీ వార్నింగ్ ఫలితాలు ఇచ్చిందా ?
సజ్జన్నార్ కేవలం మెసేజ్ ఇచ్చి ఊరుకోలేదు
రోడ్లమీద తాగుబోతులను పరిగెత్తించారు
ఎప్పటిమాదిరే ఏదో నాలుగురోడ్ల కూడలిలో పోలీస్ టీములతో మొక్కుబడిగా ఆల్కహాల్ అనలైజర్ టెస్టులతో సరిపెట్టలేదు
ప్రతి ఏరియాకి స్పెషల్ పార్టీలను ఏర్పాటుచేసి పెట్రోలింగ్ డ్యూటీ అప్పచెప్పారు
మోటార్ బైకుల మీద వైన్ షాపులు , బార్ల పరిసరాలలో కాచుకుకూచున్న స్పెషల్ పార్టీ ఎవరైనా తాగుబోతులు బయటికి వచ్చి పొరపాటున బండి స్టార్ట్ చేసారా ? అంతే సంగతులు
వీపు విమానం మోత మోగించారు
ఎంతలా అంటే పోలీస్ దెబ్బలకు తాగుబోతులు వాహనాలను అక్కడే వదిలేసి ఉరికారు
ఇది కరెక్ట్ ఫార్ములా
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఎక్కడో రోడ్ల కూడలిలో ట్రాఫిక్ పోలీసులు బీట్ వేయడం వల్ల వచ్చే ఫలితాల కంటే మొబైల్ స్పెషల్ పార్టీల వల్ల ఎక్కువ ఫలితాలు వచ్చాయి
తాగి వాహనం తీస్తే పోలీసుల ట్రీట్ ఏ విధంగా ఉంటుందో మెయిన్ స్ట్రీమ్ లోనూ , సోషల్ మీడియాలోనూ చూసిన మందుబాబులు సొంత వాహనాలు ముట్టుకోవడానికి గజగజా వణికిపోయారు
దాంతో సీపీ సజ్జన్నార్ ఆశించిన ఫలితాలు వచ్చాయి
ప్రభుత్వానికి ఆదాయం , తాగుబోతులకు కిక్కు వచ్చింది
దీనితో సాధారణ ప్రజలకు అర్ధరాత్రి ముప్పులు కూడా తప్పాయి
సీపీ కృతజ్ఞతలు
తన ప్రయోగం మంచి ఫలితాలు ఇచ్చినందుకు సజ్జన్నార్ కూడా సోషల్ మీడియా వేదికగా సంతృప్తి వ్యక్తం చేసారు
‘థాంక్యూ హైదరాబాద్ .. నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరిగినందుకు సంతోషంగా ఉంది.. గత ఏడాదితో పోలిస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు చాలా తగ్గాయి .. ఎటువంటి అపశృతులు లేకుండా ప్రజలందరి సహకారంతోనే హైద్రాబాదులో నూతన సంవత్సర వేడుకలు సజావుగా జరిగాయని’ X వేదికగా ఆయన ధన్యవాదాలు చెప్పారు
ముగింపు : నిజమే ఈ ఫార్ములా మంచిగానే వర్కౌట్ అయ్యింది . డిసెంబర్ 31 అర్ధరాత్రి మందుబాబులు రోడ్ల మీద చేసే విన్యాసాలు మాములుగా ఉండవు . సైలెన్సర్లను తీసేసి బైకులు నడపటం , కార్ రేసింగులు పెట్టుకుని ప్రమాదాలు చేయడం లాంటి సంఘటనలు కంట్రోల్ అయ్యాయి . భవిష్యత్తులో కూడా పోలీసులు ఇటువంటి కఠిన చర్యలు తీసుకుంటే సాధారణ ప్రజలు ఇబ్బందులు పడకుండా కాపాడినవారు అవుతారు
ఈ సందర్భంగా సీపీగారికి ఒక సూచన
బార్లు , పబ్బులలో లిమిట్ దాటి ఆల్కహాల్ సేవించేవారి బిల్లులోనే క్యాబ్ చార్జీలు కూడా విధించేవిధంగా లిక్కర్ పాలసీలో మార్పులు చేస్తే మందుబాబులు సెల్ఫ్ డ్రైవింగ్ తో సొంత వాహనాల్లో ప్రయాణించే అవకాశాలు తగ్గుతాయి!
