ఈ సినిమాలో హీరో ఆది గురించి చెప్పుకునేటప్పుడు ముందుగా ఆయన తండ్రి సాయి కుమార్ గురించి కూడా కొద్దిగా చెప్పుకోవాలి . డబ్బింగ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో పనిచేస్తూనే చిన్న చిన్న పాత్రలను పోషిస్తూ కెరీర్ మొదలుపెట్టిన సాయి కుమార్ అనతికాలంలోనే చక్కటి క్యారక్టర్ ఆర్టిస్టుగా ఎదిగాడు .
ముఖ్యంగా నేనేరా పోలీస్ అంటూ ఈయన చెప్పే డైలాగులకు థియేటర్లు దద్దరిల్లిపోయేవి
అంత హై పిచ్ లో ఆపకుండా డైలాగ్ చెప్పడంలో సాయికుమార్ ది అందెవేసిన చేయి . తెలుగునాటే కాదు కన్నడనాడులో కూడా సాయికుమార్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది .
ఈయనే కాదు ఇతని కుటుంబంలో అందరికీ గొంతే బలమైన సాధనం . ఆ గొంతు వల్లే ఆ కుటుంబంలో మూడు తరాలు సినిమా రంగంలో అవిశ్రాంతంగా కొనసాగుతున్నారు . ఆ మధ్య అదే కుటుంబం నుంచి సాయి కుమార్ కొడుకు ఆది కూడా సినీ రంగప్రవేశం చేసాడు .
ఇతడికి కూడా కుటుంబపరంగా వచ్చిన గొంతు ఉంది.. తండ్రి నుంచి నేర్చుకున్న నటన ఉంది కానీ ఎందుకో ఆది సినిమాలు బాక్స్ ఆఫీసులో సరైన వసూళ్లను రాబట్టలేకపోయాయి . దాదాపు ఇరవై సినిమాలు చేసినప్పటికీ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో సక్సెస్ కోసం ఆది పట్టువదలని విక్రమార్కుడిలా రెండేళ్ల గ్యాప్ తీసుకుని మరీ శంబాలతో మరో ప్రయత్నం చేసాడు .
మరి ఈసారైనా అతడి ప్రయత్నం ఫలించిందా ? లేదా ? అనేది ఇప్పుడు చూద్దాం .
కధేంటి ?
కథ 1980 ల నేపథ్యంలో రాసుకున్నారు . శంబాల అనే గ్రామంలో ఆకాశం నుంచి ఉల్క పడుతుంది. ఈ గ్రామానికి వెయ్యేళ్ళ చరిత్ర ఉండటం , ఉల్క సరిగ్గా ఇదే గ్రామంలో పడటంతో కథ మొదలౌతుంది. ఈ ఉల్క ప్రభావమో మరొకటో తెలీదు కానీ అప్పట్నుంచి గ్రామంలో వింతలు జరుగుతూ ఉంటాయి.
మనుషులు విచిత్రంగా ప్రవర్తించడం , చంపుకోవడాలు , చచ్చిపోవడాలూ నిత్యకృత్యాలు అవుతుంటాయి . ఆవు నుంచి పాలకు బదులు రక్తం రావడంతో మూఢ నమ్మకాలతో గ్రామస్తులు బెంబేలెత్తిపోతారు . ఉల్క రూపంలో బండ భూతం తమ గ్రామంలోకి ప్రవేశించి ఇవన్నీ చేయిస్తుందని హడలి పోతారు .
మరోపక్క ఉల్క గురించిన వార్తలు తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం ఖగోళ శాస్త్రజ్ఞుడు విక్రమ్ (ఆది సాయికుమార్ ) ను పరిశోధనల నిమిత్తం శంబాల పంపిస్తుంది . ఇక్కడ్నుంచి సైన్సుకి , శాస్త్రానికి మధ్య సంఘర్షణ మొదలౌతుంది .
విక్రమ్ చూస్తే పక్కా సైన్సును నమ్మే శాస్త్రజ్ఞుడు . గ్రామంలో చూస్తే మూఢనమ్మకాలను మాత్రమే నమ్మి నిజమనుకుని భయపడుతున్న ప్రజలు .
ఈ పరిస్థితుల్లో శంబాలలో ఏం జరుగుతుంది ? విక్రమ్ ఉల్క రహస్యాలను ఛేదిస్తాడా ? శంబాలలో గుడి పూజారి కూతురు దేవి విక్రమ్ కు ఎందుకు సాయం చేస్తుంది ?
టోటల్ గా శంబాలలో జరుగుతున్న మిస్టరీని విక్రమ్ ఎలా పరిష్కరిస్తాడు? అనేది మిగతా కథనంలో తెలుస్తుంది .
ఎలా ఉందంటే ?
సైన్సు , శాస్త్రానికి మధ్య సంఘర్షణల నేపథ్యంలో గతంలో చాలా సినిమాలు వచ్చాయి . మరీ ముఖ్యంగా పల్లెల్లో ఉండే మూఢ నమ్మకాలను హీరోలు ఏ విధంగా పరిష్కరిస్తారు అనే పాయింట్ ఆధారంగా కధలు రాసుకుని తీసిన సినిమాలు బోలెడు వచ్చాయి .
అయినా సరే ఈ లైనుకి కాస్తంత హర్రర్ మసాలా యాడ్ చేస్తే ఒక వర్గం ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తుంది . ఇది కూడా అలాంటిదే . ఇటువంటి ఇతివృత్తం ఉన్న సినిమాలకు కథ కన్నా కథనమే ఎక్కువ బలాన్ని ఇస్తుంది .
స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసేటప్పుడు ప్రేక్షకులకు ఉత్సుకత కలిగించేలా ఎవరెంత జాగ్రత్తగా
కథనాన్ని నడిపించగలరు అనే పాయింట్ మీదే సినిమా విజయం ఆధారపడుతుంది . ఆ పరంగా శంబాల దర్శకుడు స్టూడియోలో కొంత హోమ్ వర్క్ చేసాడనిపిస్తుంది .
కధాంశం బట్టి మూఢ నమ్మకాలు , భయపట్టే సన్నివేశాలు బాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నట్టున్నాడు . బాగానే భయపెట్టాడు . ఆ మాత్రం భయపెట్టకపోతే సినిమా కిక్ ఇవ్వదు .
అసలు శంబాల అనే టైటిల్ సినిమాకి సగ బలం . టైటిల్ కి ఇంట్రడక్షన్ గా వెయ్యేళ్ళ చరిత్ర యాడ్ చేయడంతో హర్రర్ ఫ్లేవర్ తగిలింది . దానికి తోడు గ్రామంలో తీసిన సీన్స్ పండాయి . పండటం అంటే బాగుందని కాదు , భయపెట్టిందని అర్ధం .
ముఖ్యంగా రైతు రాములు ( రవి వర్మ ) ఆవు పాలు పితికితే రక్తం రావడం , అలాగే మీసాల లక్ష్మణ్ , ఇంద్రనీల్ పాత్రలను జాగ్రత్తగా వాడుకుని కొంత భయోత్పాతాన్ని సృష్టించారు . రొటీన్ కధల మాదిరి దయ్యాలు , భూతాల జోలికి పోకుండా ఉల్కా శకలం పడటం దగ్గర్నుంచి కథను మొదలుపెట్టడంతోనే దర్శకుడి తెలివి బయటపడుతుంది .
సైన్సుకు , శాస్త్రానికి మధ్య నడిచే సంఘర్షణ గురించి చెప్పాలంటే శంబాలలో ఉల్క పడాలి
అప్పుడే కథకు కొత్తదనం వస్తుంది . అలాగే గ్రామానికి వెయ్యేళ్ళ చరిత్ర ఉందని చెప్పడంతోనే దర్శకుడు ప్రేక్షకులను హిస్టరీలోకి తీసుకుపోయాడు .
ఇలాంటి హిస్టారిక్ నేపధ్యం ఉన్న కథల్లో భయం , క్యూరియాసిటీ , ఉత్కంఠత ప్రధాన పాత్రలు పోషిస్తాయి . ఆ మూడు దినుసులను సమపాళ్లలో రంగరించి వదలటంతో టీజర్లో చూపించిన విధంగానే సినిమా ప్రేక్షకులకు కొంత థ్రిల్ ను పంచుతుంది .
కాకపోతే ఫస్టాఫ్ లో శంబాల గ్రామంలో మూఢ నమ్మకాలు , ఉల్క గురించి చెప్పడానికి ఎక్కువ సమయం కేటాయించడంతో అసలు కథలోకి రాక కొంత అసహనం అనిపిస్తుంది . ఇంటర్వెల్ ముందునుంచి అసలైన ట్విస్టులతో కథ నడవటంతో మళ్ళీ గాడిలో పడినట్టు అయ్యింది .
ఇక సెకండాఫ్ నుంచి పరిశోధనలలో భాగంగా విక్రమ్ రంగంలోకి దిగడంతో కథ చకచకా పరుగులు పెడుతుంది . ముఖ్యంగా కథనంలో అక్కడక్కడా బయటపడ్డ చిన్నచిన్న లోపాల నుంచి ప్రేక్షకుల దృష్టి మరలించే విధంగా హర్రర్ సన్నివేశాలను రూపొందించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు .
హర్రర్ సీన్స్ లో ఆ లోపాలు కొట్టుకుపోయాయి . మీసాల లక్ష్మణ్ , రవి వర్మ , ఇంద్రనీల్ పాత్రల ద్వారా తనకు కావాల్సిన హర్రర్ ను ఆయన రాబట్టుకున్నాడు .
ఎవరెలా చేసారంటే ?
సాయికుమార్ ఫ్యామిలీలో అందరూ చక్కటి నటులుగా తమని తాము ప్రూవ్ చేసుకున్నవాళ్ళే . అందుకే దశాబ్దాలుగా ఆ కుటుంబం సినీ రంగంలో కొనసాగుతుంది . అదే ఫ్యామిలీనుంచి వచ్చిన ఆది సాయికుమార్ కూడా సక్సెస్ కోసం నాలుగేళ్లుగా కష్టపడుతున్నాడు .
కానీ దురదృష్టవశాత్తు అతడికి సక్సెస్ కన్నా ఫెయిల్యూర్స్ ఎక్కువగా వచ్చాయి . అయినా ఆత్మస్థయిర్యం కోల్పోకుండా రెండేళ్ల తర్వాత శంబాలతో ప్రేక్షకుల ముందుకువచ్చారు . శంబాలలో ఆది సాయికుమార్ నటనలో లోపం లేదు . గట్టిగా కష్టపడ్డాడు .
మంచి టోన్ ఉంది కాబట్టి డైలాగ్ డెలివరీ కూడా బావుంది . హర్రర్ నేపధ్యం ఉన్న సినిమా కాబట్టి ముఖంలో హావభావాలు కూడా బాగానే పలికించాడు .
హీరోయిన్ అర్చనా అయ్యర్ కు కథాబలం ఉన్న పాత్ర పడింది . తనకిచ్చిన పాత్రలో బాగానే మెప్పించింది .
పైన చెప్పిన ముగ్గురు రవి వర్మ , ఇంద్రనీల్ , మీసాల లక్ష్మణ్ పాత్రలు కథకు ఆయువుపట్టు లాంటివి.
ఆయా పాత్రల్లో ఆ ముగ్గురూ తమ పరిధిమేరకు నటించి భయపెట్టారు .
సాంకేతికత ఎలా ఉందంటే ?
హర్రర్ నేపధ్యం ఉన్న సినిమాలకు బీజీఎమ్ ఉపిరిలాంటిది . బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎంత మోగితే సన్నివేశం అంత పేలుతుంది . ఆ పరంగా చరణ్ పాకాల గట్టిగానే మోగించారు .
హర్రర్ సినిమాలన్నీ దాదాపు చీకట్లోనే నడుస్తాయి . చీకటి అంటే లైట్లన్నీ ఆపి షూటింగ్ చేయడం కాదు . చూసే ప్రేక్షకుడికి చీకట్లో ఏదో జరుగుతుందనే ఫీలింగ్ రావాలి . కటిక చీకటిలో కూడా చూపించాలనుకున్న దృశ్యాన్ని భయపెట్టేలా చూపించాలంటే మంచి కెమెరా పనితనం ఉండాలి .
ఇక్కడ కెమెరా బాగానే భయపెట్టింది .
నిర్మాణ విలువల మీద ఇంకొంచెం శ్రద్ద పెట్టి ఉంటే బాగుండేది .
ఎందుకంటే ఇలాంటి సినిమాలకు రాజీ పడని నిర్మాణం కూడా అవసరం. కొన్ని సన్నివేశాల్లో ఆ లోపం కనిపిస్తుంది .
ముగింపు : ఈ మధ్య సినిమాల్లో దర్శకులు ఓ కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు . తాము చెప్పాలనుకున్న పాత కథలనే కొత్త పాయింటుతో వెండితెర మీద ఆవిష్కరిస్తున్నారు . ఈ మార్పు లేటెస్ట్ సినిమాలు చూసిన ఎవరికైనా అర్ధం అవుతుంది . శంబాల కూడా అంతే.
డైరెక్టుగా దయ్యాలు ,భూతాలు అంటూ ప్రేక్షకులను భయపెట్టకుండా ఆకాశం నుంచి ఉల్కను భూమ్మీదకు దింపి దానికి సైన్సును జోడించి నమ్మకాల మీద యుద్ధం ప్రకటించాడు . ఎందుకంటే అలా ఉల్కను దింపకపోతే ఆల్రెడీ చాలా సినిమాల్లో ఈ బండ భూతాలను చూసి చూసి ప్రేక్షకుడు భయపడటం ఎప్పుడో మానేసాడు . అందుచేత ఈ ఉల్క ఏర్పాటు అన్నమాట .
సరే ఏదిఏమైనా కాసేపు హర్రర్ జోన్ లోకి వెళ్లి వద్దాం అనుకున్నవాళ్ళకి ఈ సినిమా నచ్చుతుంది . ఈ గోల వద్దు అనుకున్నవాళ్ళకి అస్సలు నచ్చదు .
నటీనటులు : ఆది సాయికుమార్ , అర్చనా అయ్యర్ , రవివర్మ , హర్షవర్ధన్ తదితరులు
సంగీతం : శ్రీచరణ్ పాకాల
సినిమాటోగ్రఫీ : ప్రవీణ్
నిర్మాత : మహీధర్ రెడ్డి
దర్శకత్వం : యుగంధర్ ముని
విడుదల : 25 -12 -2025
రేటింగ్ : 2.5 / 5
