Home » చూస్తున్న కొద్దీ మనకు సర్వం మాయ అనిపిస్తుంది – సర్వం మాయ మూవీ రివ్యూ

చూస్తున్న కొద్దీ మనకు సర్వం మాయ అనిపిస్తుంది – సర్వం మాయ మూవీ రివ్యూ

Spread the love

నిన్న రాత్రి ఓటిటిలు తిరగేస్తుంటే జియో హాట్ స్టార్ లో సర్వం మాయ అనే హర్రర్ కామెడీ సస్పెన్సు థ్రిల్లర్ మూవీ కనిపించింది

మనకేమో హర్రర్ సినిమాలు ఇష్టమని ఇంతకుముందే విన్నవించుకున్నాను కదా

డిస్క్రిప్షన్ చూస్తే ఇదేదో దయ్యం సినిమా అని అర్థమైంది
ఒరిజినల్ మూవీ మళయాళం అని కూడా అర్థమైంది

30 కోట్లతో తీసిన సినిమా కేరళలో ఇప్పటికే 150 కోట్లు వసూలు చేసిందని తెలిసి క్యూరియాసిటీ కలిగింది

తెలుగు డబ్బింగ్ లో కూడా మూవీ అందుబాటులో ఉందని తెలిసి చూద్దామని నిర్ణయం తీసుకోవడం జరిగింది

అయితే అసలే మళయాళ తెలుగు సినిమా
పైగా దయ్యం అంటున్నాడు

ఈ రాత్రివేళ ఒంటరిగా చూడటం అంత శ్రేయస్కరం కాదేమో? ఆలోచించుకో మిస్టర్ అని సిక్స్త్ సెన్స్ వార్నింగ్ ఇచ్చింది

ఏదైతే అది అయ్యిందిలే మన ధైర్యానికి ఒక పరీక్ష పెడదాం అనుకుని లైట్లేసుకుని సినిమా చూడటం మొదలుపెట్టా

సర్వం మాయలోకి వెళ్లి ఆ మాయా దయ్యాన్ని చూసిన తర్వాత భలే నచ్చేసింది

మాములుగా సినిమాల్లో మనోళ్లు ఇప్పటిదాకా ఆడ దయ్యం అంటే జుట్టు విరబోసుకుని , కోర పళ్లేసుకుని , తెల్ల కనుగుడ్లేసుకుని గాల్లో తేలుతూ భయపెడతాయని చూపించి మనల్ని ఫిక్స్ చేసేసారు కదా ?

కానీ ఈ మళయాళం దర్శకుడెవరండి బాబూ ?
దయ్యాన్ని కూడా ఇంత అందంగా చూపించాడు

సర్వం మాయ చూసిన తర్వాత దయ్యాలు కూడా ఇంత క్యూట్ గా ఉంటాయా ? అనిపించింది

ఇంతకీ ఈ సర్వం మాయ సంగతేంటో తెలుసుకుందాం

హర్రర్ సినిమాల్లో భయపెట్టడం వేరు
హర్రర్ సినిమాల్లో భయపెడుతూనే , నవ్విస్తూ ,ఎమోషనల్ టచ్ ఇవ్వడం వేరు

రెండూ ఒకటే జానర్

మొదటిది ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ఒకే లైన్ లో మనం కనెక్ట్ అయి ఉంటాం

కానీ రెండోదాంట్లో కాసేపు భయపడతాం , కాసేపు నవ్వుకుంటాం , కాసేపు ఎమోషన్ అవుతాం

సినిమా మొత్తం ఒకే మూడ్ లో సాగితే మధ్యలో ఎక్కడైనా మనకు బోర్ కొట్టే అవకాశం ఉంది

సర్వం మాయలో దర్శకుడు రెండో ఫార్ములానే ఫాలో అయ్యాడు

మొదట్లో దయ్యాన్ని చూసి భయపడతామా ?
రాన్రానూ అదే దయ్యంతో మనం ఫ్రెండ్లీ గా కనెక్ట్ అయిపోతాం

ఎవరైనా మనుషులతో కనెక్ట్ అవ్వాలనుకుంటారు
దయ్యంతో కనెక్ట్ అవడం ఏంటయ్యా బాబూ అనుకుంటున్నారా ?

సర్వం మాయ చూడండి
మీరు కూడా మాయతో కనెక్ట్ అవుతారు

సర్వం మాయ కధేంటి ?

సినిమా మొదలవడమే ఓ మ్యూజికల్ నైట్ తో మొదలౌతుంది

ఆ మ్యూజికల్ నైట్ చేస్తున్న టీమ్ లో ఒక్క ప్రబెందు నంబూద్రి కి (నివిన్ పౌలి) మినహా మిగిలిన అందరికీ విదేశాల్లో షో ఇవ్వడానికి వీసాలు మంజూరు అవుతాయి

వీసా రిజెక్ట్ అయిన ప్రభా నంబుద్రే ప్రస్తుత సర్వం మాయలో కథానాయకుడు

కుటుంబ నేపధ్యం దృష్ట్యా ఇతను కేరళలోని ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు

ఇతడి తండ్రి , అన్నలు వంశపారంపర్యంగా వచ్చిన పౌరోహిత్యాన్ని కొనసాగిస్తుండగా ప్రభా మాత్రం తన జీవితంలో జరిగిన ఓ సంఘటనతో దేవుడి మీద నమ్మకం కోల్పోయి తన ప్యాషన్ అయిన గిటారిస్టుగా సెటిల్ అవుదాం అనుకుంటాడు

అందుకని సొంతూరినుంచి వెళ్ళిపోయి అవకాశాల కోసం వెతుక్కుంటుంటాడు

అయితే అతడికి వీసా రాకపోవడంతో కొన్నాళ్ళు స్టేజి షోలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి

దాంతో తిరిగి సొంతూరికి వస్తాడు

మ్యూజిక్ షోలు లేకపోవడంతో ఖాళీగా ఉండటం ఎందుకని వరసకు బావ అయిన రూపేష్ నంబూద్రి ( అజు వర్గీస్ ) సాయంతో పౌరోహిత్యాలకు అటెండ్ అవుతూ ఉంటాడు

పేరుకి రూపేష్ కు సాయంగా పౌరోహిత్యాలు చేయడానికి ప్రభా కూడా వెళ్తాడు కానీ కార్యక్రమం మొత్తం రూపేషే చేస్తుంటాడు . ప్రభా కేవలం అసిస్టెంట్ గా సాయం చేస్తుంటాడు

ఈ పరిస్థితుల్లో అనుకోకుండా రూపేష్ కిందపడి గాయాలపాలవడంతో ఓ కుటుంబంలో కుర్రాడికి పట్టిన దయ్యాన్ని వదిలించడానికి హోమం చెయ్యాలని ప్రభాను ఒక్కడినే పంపిస్తాడు

ప్రభా ఆ ఇంటికి వెళ్లి వచ్చీ రాని విద్యతో హోమం చేస్తాడు

కానీ ఆశ్చర్యంగా హోమం పూర్తికాగానే ఆ కుర్రాడికి పట్టిన దయ్యం వదిలిపోయి లేచి కూర్చుంటాడు

హోమం పూర్తిచేసి ఇంటికొచ్చిన ప్రభా ఆ రాత్రి నిద్రలో ఒక అమ్మాయి తన గదిలోకి వచ్చినట్టు , తన ఫోన్ వాడుతున్నట్టు గుర్తిస్తాడు

ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరికీ ఆమె కనపడకుండా కేవలం తనకు మాత్రమే కనపడటంతో భయపడతాడు

ఇంతకీ అర్ధరాత్రి వేళ ప్రభా గదిలోకి వచ్చిన ఆ అమ్మాయి ఎవరు ?

అసలు అతడి గదిలో తిష్టవేసింది అమ్మాయా ? ఆడ దయ్యమా ?

ఆమె రాకతో ప్రభా జీవితంలో అనూహ్యంగా వచ్చిన మార్పులేంటి ?

అసలు ఆ మాయ ప్రభా వెంట ఎందుకు పడుతుంది ?
అనేవి మిగిలిన కథనంలో తెలుస్తాయి

ఎలా ఉంది ?

ముందే చెప్పాను కదా

ఇప్పటిదాకా ఆడ దయ్యాలంటే తెల్ల చీర కట్టుకుని జుట్టు విరబోసుకుని గాల్లో తిరుగుతుంటాయని అనేకానేక సినిమాల్లో చూసేసాం కదా

కానీ అదే ఆడ దయ్యాన్ని క్యూట్ గా చూపిస్తే ఎలా ఉంటుంది ?

మన పక్కనే ఉండి అల్లరి చేస్తూ , ఆటపట్టిస్తూ , సాయం చేస్తుంటే ఏమనిపిస్తుంది ?

అరె.. దయ్యమైతేనేమి ? పిల్ల ఇంత అందంగా ఉంది అనిపించదూ

పోనీ మనకేవన్నా హాని చేస్తుందా ? అంటే అదీ లేదు
పైగా జీవితంలో ఎదగాలన్న మన లక్ష్యానికి చేయూత అందిస్తే ఎలా ఉంటుంది ?

దయ్యం సాయంతో మన జీవితం అమాంతం గుడ్ టర్న్ తీసుకుంటే ఎలా ఉంటుంది ?

అసలీ ఆలోచనే వెరైటీగా ఉంది కదా ?

సర్వం మాయలో మొట్టమొదట ఆ ఆడ దయ్యం మాయ (రియా శిబూ ) ను చూసిన ప్రభా భయపడతాడు
మనమూ భయపడతాం

అప్పుడు మాయ అంటుంది

నన్ను చూసి ఎందుకు భయపడతావ్ ?
నేను నీకేమన్నా హాని చేస్తున్నానా ?
పైగా కెరీర్ విషయంలో నేను నీకు సాయం చేస్తున్నాను కదా ?
అని తనగురించి చెప్తుంది

అసలు దయ్యం ఇంట్రడక్షన్ సింపుల్ గా ఉంటుంది

గాలికి కిటికీలు ఊగడాలు ఉండవు
కుక్కల ఏడ్పులు , నక్కల ఊళలు ఉండవు
అర్ధరాత్రి కరెంట్ పోవడాలు ఉండవు

సింపుల్గా ఓ రాత్రివేళ ప్రభాకు మెలుకువ వచ్చి చూస్తే ఎదురుగా ఓ అమ్మాయి కింద కూర్చుని అతడి ఫోనులో చాటింగ్ చేస్తూ కనిపిస్తుంది

ఆమె చెప్పింది విన్న తర్వాత ప్రభాకు కూడా కొద్దిగా ధైర్యం వస్తుంది

అలా అనుకోకుండా దయ్యంతో స్నేహం చేస్తున్న కొద్దీ అతను మాయలో పడతాడు

ఎప్పుడైతే ప్రభా దయ్యంతో స్నేహం చేయడం మొదలుపెడతాడో మనకు హర్రర్ మూవీ చూస్తున్నామన్న ఫీలింగ్ పోయి ఫీల్ గుడ్ మూవీ చూస్తున్నామన్న ఫీలింగ్ వస్తుంది

భయం స్థానంలో కాసేపు నవ్వుకుంటాం
నవ్వుకుంటున్నంతలోనే ఎమోషన్ అవుతాం

మాయ చక్కటి చిక్కటి ప్రేమ కథ గురించి తెలుసుకున్న తర్వాత హృదయం మెలిపెట్టినట్టు అవుతుంది

ఎక్కడో కలుక్కుమంటుంది ?

అరెరే ! ఇంత అందమైన అమ్మాయి మాయకు ఇలా జరిగి ఉండాల్సింది కాదే ? అనిపిస్తుంది

ఇక కేరళలో ప్రభా ఇల్లు భలే ఉంటుంది
ఇప్పటికీ పల్లెల్లో మనకు అలాంటి మండువా లోగిళ్ళు కనిపిస్తూ ఉంటాయి

ఆ ఇంట్లో ఒకప్పటి ఉమ్మడి కుటుంబాల మాదిరి తండ్రి , అన్న , కొడుకులూ కలుసుకోవడం బాగుంది

ప్రభా ఫోనులో ఆ అమ్మాయి తనకు కావాల్సిన డ్రెస్సులు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడంతో , ప్రభా ఆడవాళ్ళ దుస్తులు ఎందుకు తెప్పిస్తున్నాడో అర్ధం కాక ఇంట్లో వాళ్ళు అనుమానంగా చూడటం , ఫ్లైట్లో వెళ్తుంటే ఇంకో అమ్మాయి బాడీలోకి ప్రవేశించిన మాయ సరిగ్గా అతడు మాట్లాడే టైముకి ఆ బాడిలోనుంచి వెళ్ళిపోయి ప్రభాను ఆటపట్టించడం , ప్రభా అన్నతో కలిసి కారులో వెళ్తుంటే వెనకనుంచి మాయ మాట్లాడటం , రూపేష్ నంబూద్రిని ఆట పట్టించడం వంటి మాయ సరదా అల్లరి క్యూట్ గా ఉంది

మాములుగా మళయాళం సినిమాలు స్లోగా నడుస్తాయనే పేరుంది
ఇదీ అంతే
ఫస్టాఫ్ స్లోగా నడుస్తుంది

మాయ ఎంటర్ అయిన తర్వాత కథ చకచకా ముందుకెళ్తుంది

మాయ అల్లరి , ప్రభాను , రూపేష్ ను ఆట పట్టించడం ,మాయ అల్లరిని ఆస్వాదిస్తూ ఆమెకు డెలులు అని పేరుపెట్టి ప్రభా పిలవడం వంటి సన్నివేశాలతో పరుగులు పెట్టిన కథ క్లైమాక్సులో హఠాత్తుగా మాయ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లడంతో గుండెలు తడి అవుతాయి

ముందునుంచీ మాయకు తన గతం గురించి తెలీదు
ఆఖరికి తన పేరేంటో కూడా తెలీదు
ప్రీ క్లైమాక్సులో ఆమె అసలు స్టోరీ రివీల్ అవుతుంది

అదేంటో ఇక్కడ చెప్పకూడదు
సినిమాలో చూస్తేనే బాగుంటుంది

క్లైమాక్సులో ప్రభా మాయ ఇంటికి వెళ్తాడు
అక్కడ మాయ ఫోటో చూసి భావోద్వేగానికి లోనవుతాడు

అప్పుడు అతడి తల్లి మాయ ప్రేమించిన వ్యక్తి గురించి చెప్తుంది
ఆశ్చర్యంగా ఆ వర్ణన ప్రభాకు సరిపోతుంది
ఈ ట్విస్ట్ మనకు సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది

ఒకటిమాత్రం నిజం

సినిమా అయిపోయిన తర్వాత కూడా మాయ చాలాసేపు మనల్ని వెంటాడుతుంది
అందమైన ఆ ముఖం , ఆ అల్లరి గుర్తుకొస్తూనే ఉంటాయి
బహుశా అదే సర్వం మాయ అయ్యుంటుంది

ఎవరెలా చేసారు ?

సినిమాలో ఓ ఇరవై ముప్పై క్యారెక్టర్లు ఉంటే ఎవరెలా చేసారో ? చెప్పుకోవచ్చు

కానీ సర్వం మాయలో మనకు అతికొద్దిమంది క్యారెక్టర్లు మాత్రమే కనిపిస్తారు
ఆ కొద్దిమందిలో రియా శిబూ లేకపోతే సినిమా లేదు

సర్వం మాయలో అసలు మాయంతా మాయగా నటించిన రియాదే
పేరుకు దయ్యమే కానీ మనకా ఫీలింగ్ రాకుండా క్యూట్ గా అల్లరి చేసింది

సన్నివేశానికి తగ్గట్టుగా ఆమె ప్రదర్శించిన హావభావాలు మెప్పిస్తాయి

సినిమా ఆమె రాకముందు ఒకరకంగా , ఆమె వచ్చిన తర్వాత ఇంకోరకంగా పరుగులు పెట్టింది

దర్శకుడు ఆమె పాత్రను చాలా తెలివిగా డిజైన్ చేసాడు

ఓ సన్నివేశంలో మాయ నిజంగా దయ్యంలా తెల్ల చీర కట్టుకుని , జుట్టు విరబోసుకుని , కోర దంతాలతో ప్రభాను భయపెట్టాలని చూస్తుంది

ఆమె అందంగా ఉన్నప్పుడు భయపడిన ప్రభా దయ్యం రూపంలో ఉన్న మాయను చూసి మాత్రం వెక్కిరిస్తాడు

సినిమా అంతా ఆ పాత్రతో ప్రభాకు అటాచ్మెంట్ పెట్టించి ప్రీ క్లైమాక్సులో మాత్రం హార్ట్ టచింగ్ సీన్ తో ముగించాడు

ఇక ప్రభా పాత్రలో వేసిన నివిన్ పౌలి సింపుల్ గా బాగానే చేసాడు
కామెడీ పేరుతో ఎక్కడా ఓవర్ యాక్షన్ చేయకుండా సన్నివేశాలకు తగ్గట్టు నటించాడు

సాంకేతికత :

అసలుకే కేరళ అందాలకు పెట్టింది పేరు

ఆ అందాలను మంచి కెమెరా పనితనంతో రెట్టింపు చేసి చూపిస్తే నయానందకరమే కదా

మండువా లోగిలి ఇంట్లో చూరు నుంచి వర్షం పడటం , పల్లెటూరి అందాలను నాచురల్ గా చూపించడంలో ఫోటోగ్రఫీకి మంచి మార్కులు పడతాయి

నేపధ్య సంగీతం కూడా బావుంది

భారీ బడ్జెట్ సినిమాల తరహాలో ఎక్కువ ఖర్చు పెట్టకపోయినా నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి

విశ్లేషణ :

సినిమాలో దయ్యం ఉంది కాబట్టి పూర్తిగా ఇదేదో హర్రర్ సినిమా అనుకుంటే తప్పులో కాలేసినట్టే . కాసేపు మాయ దయ్యం కాదనుకుంటే ఇదో అందమైన ప్రేమ దృశ్య కావ్యం అవుతుంది . లేదూ మాయ నిజంగానే దయ్యం అనుకుందామా ? అయినా నష్టం లేదు . ఓ అందమైన దయ్యం చేసిన అల్లరి మనకు హాయిగా అనిపిస్తుంది . హర్రర్ సినిమా కాబట్టి సినిమా అంతా డార్క్ మోడ్ లో ఉంటుంది ? చెవులు చిల్లులు పడే శబ్దాలు ఉంటాయి ? అనుకుంటున్నారా ? అదేం ఉండదు . హాయిగా కోనేటి ఒడ్డున కూర్చుని కబుర్లు చెప్పుకునే మాయ , ప్రభా నంబూద్రీలు కనిపిస్తారు . అసభ్యత , అశ్లీలతలు లేవు కాబట్టి ఫ్యామిలీతో కలిసి నిరభ్యంతరంగా చూడొచ్చు

నటీనటులు : నివిన్ పౌలి , రియా శిబూ
దర్శకత్వం : అఖిల్ సత్యన్
విడుదల : జియో హాట్ స్టార్
రేటింగ్ : 3.5 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!