“బాలు గారూ ! మీరు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి .. కొన్నాళ్ళు పాటలు ఆపండి .. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం ” హెచ్చరిస్తూ చెప్పాడు డాక్టర్
“డాక్టర్ సాబ్ ! ఏమన్నారు ? ప్రాణాలకు ప్రమాదమా ? గాయకుడికి మరణం ఉంటుంది కానీ గానానికి మరణం ఎక్కడుంది ? ప్రతి నిమిషం.. ప్రతి చోట .. ఇదే పాట .. ఇలాగె పాడుకోనీ.. ” అంటూ ఐసీయూ బెడ్ మీద నుంచే పాట అందుకున్నారు బాలు
డాక్టర్లు తల పట్టుకున్నారు
అప్పటికే కోవిడ్ వల్ల ఆయన ఊపిరితిత్తులోకి ఇన్ఫెక్షన్ చేరింది
పాటలు పాడటం వల్ల లంగ్స్ మీద ప్రెజర్ పడి మరింత డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది
కానీ బాలు గారు వినట్లేదే ?
ప్రాణాలు పోతాయని చెప్తుంటే పాటే నా ప్రాణం అంటారేవిఁటి ?
పాట ఆగితేనే ప్రాణం పోతుందని ఏదేదో చెప్తున్నారేంటి ?
అసలు ఆ పాట కోసమే కదా ఈయన ఎవరు చెప్తున్నా వినకుండా విమానంలో హైదరాబాద్ పోయి పాడుతా తీయగా అంటూ నాలుగు పాటలు పాడి కోవిడ్ బారిన పడి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు
ఎలా ఈయన చేత పాటలు ఆపించడం అని డాక్టర్లు తలలు పట్టుకున్నారు
ఓ పక్క ట్రీట్మెంట్ జరుగుతుంది
మరోపక్క ఆయన పాడుకుంటూనే ఉన్నాడు
అలా ఒకటి కాదు రెండు కాదు యాభై రోజుల పాటు పాడుకుంటూనే ఉన్నాడు
రోజు రోజుకీ .. పాట పాటకీ ఆయన శక్తి హరించుకుపోతుండటం తెలుస్తూనే ఉంది
మెల్లిగా మృత్యువు కూడా కొద్ది కొద్దిగా ఆయన దరికి సమీపిస్తూనే ఉంది
అయినా గాన గంధర్వుడు అంత తేలిగ్గా పాటను వదిలేస్తాడా ?
నెవ్వర్
తన ఒంట్లో శక్తి హరించుకు పోతున్న సంగతి గ్రహించి డాక్టర్లను పిలిపించి తనకిష్టమైన పాటలు వినిపించాలని చీటీ మీద రాసి వాళ్ళకిచ్చాడు
చీటీ చదివిన డాక్టర్లకు కన్నీరు ఆగలేదు
ఏంటి ? ఈయనలోని శక్తి ?
ఒకపక్క శరీరం లో ఓపిక నశించి నిస్సత్తువ ఆవహించినా , ట్రీట్మెంట్ గాయాలు మనిషిని బాధిస్తున్నా లెక్కచేయకుండా పాట .. పాట .. అంటున్నాడేవిటి ?
ఓ మహానుభావా ! అసలు ఎవరువయ్యా నువ్వు ?
పాట కోసమే పుట్టావా ?
అందుకే కొడుక్కి చరణ్ అని , కూతురికి పల్లవి అని పేర్లు పెట్టుకున్నావా ?
పాటను ఇంతలా ప్రేమించే మనిషి భూలోకంలో మరొకరున్నారా ?
బాలు కు వైద్యం చేస్తున్న బృందం కన్నీటితో అప్పటికప్పుడు ఆయన గదిలో స్పీకర్లు పెట్టించి బాలుకిష్టమైన పాటలు ప్లే చేసారు
తనకిష్టమైన పాటలు వినిపిస్తుండటంతో బాలు ముఖంలో ఎక్కడలేని సంతోషం వచ్చింది
నర్సుల వంక చూస్తూ చిరునవ్వుతో చేతులతో థంప్స్ అప్ ఎమోజీ చూపించాడు
పాటలు మోగుతూనే ఉన్నాయి .. పాటలు మోగుతూనే ఉన్నాయి
చిన్నప్పుడు చందమామ రావే జాబిల్లి రావే అని అమ్మ పాడుతుంటే హాయిగా నిద్రపోయిన బుడతడి మళ్లే బాలు హాయిగా నిద్రలోకి జారుకున్నాడు
పాటలు వింటూనే అలాగే.. అలాగే.. అమరగాయకుడు శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు
డాక్టర్లు గదిలోకి వచ్చి చూస్తే బాలు గారు నిర్జీవంగా ఉన్నారు
కానీ స్పీకర్లలో ఆయన పాటలు వినిపిస్తూనే ఉన్నాయి
గాయకుడికి మరణం ఉంటుంది కానీ గానానికి మరణం ఉండదు అని బాలు గారు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి అక్కడి నర్సుల కళ్లలోనుంచి కన్నీటి బొట్లు జలజలా రాలాయి
ఈరోజు బాలు గారు పాటను ఇక్కడే మనకు వదిలిపెట్టి భౌతికంగా దేహాన్ని విడిచిపెట్టిన రోజు
భౌతికంగా ఈరోజు ఆయన మన మధ్య లేకపోయినా పాటలో సజీవంగా ఉన్నారు
అమరగాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారికి నివాళులు !
