తెలంగాణలోని మేడారం జాతరలో కోవా బన్ అమ్ముకునే వ్యక్తిపై జరిగిన అమానవీయ సంఘటన ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది
వీడియోలు చూసిన నెటిజన్ల కంట తడి పెట్టిస్తుంది
అయ్యో ..కూటికోసం , కూలికోసం పట్టణం వచ్చిన పేదవాడికి ఎంత కష్టం ? ఎంత నష్టం అంటూ ప్రతిఒక్కరూ ఆవేదన చెందుతున్నారు
మహాకవి ఇటువంటి వాళ్ళ గురించే ఎప్పుడో ప్రస్తావించాడు అంటూ కొంతమంది గుర్తు చేసుకుంటున్నారు
దేవుడు చేసిన మనుషులు సినిమాలో అనుకుంటా ఎన్టీఆర్ ఒక పాటలో మంచిని సమాధి చేస్తారా ? ఇది మనుషులు చేసే పనియేనా ? అంటాడు
మేడారం జాతరలో కోవా బన్ అమ్ముకునే చిరు వ్యాపారిని ఒక యూ ట్యూబ్ ఛానల్ వాళ్ళు చుట్టుముట్టి ప్రశ్నలతో వేధిస్తున్న దృశ్యాలను చూస్తుంటే ఆ పాట గుర్తుకొచ్చింది
డిజిటల్ యుగం వచ్చిన తర్వాత రేటింగులు , వ్యూస్ , లైకులు వరదలా వచ్చి మానవత్వాన్ని తన్నుకుపోతున్నాయి
అక్రమ వ్యాపారాలు చేస్తూ కోట్లు సంపాదించుకుంటున్న బడా వ్యాపారస్తుల మీద పడాల్సిన కెమెరా కళ్ళు దురదృష్టవశాత్తు వీధి వ్యాపారాలు చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్న పేదవాడి మీద పడుతున్నాయి
జర్నలిజం కనుమరుగై ఎర్నలిజం వికృత రూపంలో నడి బజారులో కరాళ నృత్యం చేస్తుంది
జర్నలిజం పేరుతో కొంతమంది ఎర్నలిస్టులు చేస్తున్న వికృత విన్యాసాలకు పేదవాడే బలి అవుతున్నాడు
మేడారం జాతరలో జరిగింది కూడా అదే
ఇంతకీ జాతరలో ఏం జరిగింది ?
చిరు వ్యాపారులకు నాలుగు పైసలు వచ్చేది ఇటువంటి జాతరల వల్లనే
అందులోనూ తెలంగాణాలో జరిగే మేడారం జాతర గురించి చెప్పాలంటే ఒకరకంగా చిరు వ్యాపారులకు పండుగలాంటిది
ఎందుకంటే ప్రతిష్టాత్మకమైన ఈ జాతరకు తెలంగాణలోని నలుమూలల నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు
భక్తుల తాకిడి కోట్లలో ఉంటుందని అంచనా
అందుకే ఈ జాతర ఎప్పుడొస్తుందా ? అంటూ ఏడాది పొడవునా ఎదురు చూసేవాళ్ళలో అందరికన్నా ముందు తోపుడు బండి వాళ్ళే ఎక్కువగా ఉంటారు
వీళ్ళలో పుల్ల ఐస్ మొదలుకుని , మరమరాలు , మిక్చర్లు , బజ్జీలు ,పునుగులు ,దోశ బండి , ఇడ్లీ బండి , సోడా బండి ఇలా ఒకటేమిటి రకరకాల స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు ఉంటారు
జాతర కోసం సమీప గ్రామాలనుంచి తోపుడు బళ్లతో వచ్చి పగలూ , రాత్రి అక్కడే ఉండిపోతారు
అలా వచ్చిన వాడే ఈ కోవా బన్ అమ్మే వ్యక్తి
ఇంట్లోనే సరుకులను తయారుచేసుకుని గ్రామం నుంచి తెల్లవారు జామున సైకిల్ మీద మేడారం వచ్చి రాత్రి పొద్దుపోయేవరకు కోవా బన్ లు అమ్మడం అతడి వృత్తి
ఇంత చేసి ఒక్కో బన్ ఖరీదు పది రూపాయలు మాత్రమే
50 కోవా బన్నులు అమ్మితే మొత్తం 500 రూపాయలు వస్తాయి
అందులో అతడి లాభం వంద రూపాయలు మాత్రమే
గట్టిగా కష్టపడి ఓ పది కేజీల కోవా బన్నులు అమ్మితే వెయ్యి రూపాయల లాభం వస్తుంది
ఆ విధంగా పది రోజులు నిద్రాహారాలు మాని అతడు కష్టపడితే పది రోజులకు ఓ పదివేలు సంపాదిస్తాడు
ఆ పదివేలే తన కుటుంబాన్ని కొంతకాలం పోషించుకోవడానికి అతడికి జీవనాధారం అవుతుంది
దీని వెనుక అతడి కష్టం ఎంత ఉంటుందో ఆలోచించండి
ఇంతా చేసి అతడి కష్టం విలువ పది వేలు
ఆ పదివేలు కూడా ప్రభుత్వాలు ఓట్ల కోసం ఇచ్చే ఉచితాలతో వచ్చిన సొమ్ము కాదు
ఓటుకు నోటుతో సంపాదించిన సొమ్ము కాదు
బ్యాంకులకు లోన్లు ఎగ్గొట్టిన సొమ్ము కాదు
లిక్కర్ స్కాం లో వచ్చిన సొమ్ము కాదు
ఇసుక మాఫియాలో దక్కిన వాటా కాదు
ప్రభుత్వ అనుమతులు లేకుండా కట్టిన అక్రమ కట్టడాలతో వచ్చిన సొమ్ము కాదు
అయినకాడికి లంచాలు నొక్కేసి సంపాదించిన సొమ్ము కాదు
చీప్ లిక్కర్ , కల్తీ కల్లు అమ్మితే వచ్చిన సొమ్ము కాదు
ప్రాజెక్టులలో నొక్కేసిన కమిషన్లతో వచ్చిన సొమ్ము కాదు
రోడ్డు పక్కన సైకిల్ మీద కోవా బన్నులు అమ్ముకునే చిరు వ్యాపారి కష్టపడి సంపాదించుకున్న సొమ్ము అది
అలాగే యధాప్రకారం రోజూలానే జాతరలో కోవా బన్నులు అమ్ముతుండగా ఓ యూ ట్యూబ్ ఛానల్ వారు అతడ్ని చుట్టుముట్టి ప్రశ్నలతో వేధించడం మొదలుపెట్టారు
హఠాత్తుగా కెమెరాలతో కొంతమంది తన చుట్టుముట్టేసరికి ముందు అతడు బిత్తరపోయాడు
అవును చిరు వ్యాపారి కాబట్టి బిత్తరపోయాడు .
అదే వేల కోట్లు ఎగ్గొట్టి దర్జాగా విదేశాలకు పారిపోయి ఇంటర్వ్యూలు ఇచ్చే శ్రీమాన్ విజయ్ మాల్యా , నీరజ్ మోడీలు ఇలా బిత్తరపోరు కదా?
అసలు వాళ్ళు బిత్తరపోవడానికి ఇలా అడిగే పౌరుషం ఉన్న గొట్టాలు ఏవీ ?
ఒకవేళ వీళ్ళు అడిగినా వాళ్ళు ఏం చేస్తారో వీళ్లకు తెలుసు ?
అందుకే అడగరు
అదే రోజుకి వంద రూపాయలు సంపాదించుకునే కోవా బన్ను అమ్ముకునే వ్యక్తినైతే గొట్టం చూపించి భయపెట్టవచ్చు అనుకున్నారేమో ?
అందుకే ఇంటరాగేషన్ మొదలుపెట్టారు
“లీటరు పాలు 80 రూపాయలు ఉంటే పది రూపాయలకు కోవా బన్ను ఎలా అమ్ముతున్నావ్ ? ఊ.. చెప్పు ” చుట్టూ జనం చేరడంతో వ్యూస్ బాగానే వచ్చేటట్టు ఉన్నాయనుకుని గద్దించింది యాంకరమ్మ
“మేడం ..మేము ఇంట్లో తయారుచేసుకుని అమ్ముతాం మేడం .. ఇందులో మాకు మిగిలేది పది రూపాయలే మేడం ” దీనంగా చెప్పాడు . ఈ పది రూపాయలు కూడా ఎక్కడ పోతాయో ? అని అతడికి కుటుంబం గుర్తుకొచ్చింది
” లేదు నువ్వు కల్తీ చేసి అమ్ముతున్నావ్ ? ఇవి తింటే పిల్లల ఆరోగ్యాలు ఏమైపోవాలి ?చెప్పూ .. మాట్లాడు ?” మళ్ళీ అదే గద్ధింపు
తనను గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న నేరగాడిలా ఇంటరాగేషన్ చేస్తుండటంతో అతడికి కళ్ళంబడి నీళ్లు వచ్చాయి
“లేదు మేడం ..వచ్చే ఆ పది రూపాయల కోసం అలాంటి పనులు చేయం మేడం ..కష్టపడి సంపాదించుకుంటాం .. మా పిల్లలకు కూడా ఇవే పెడ్తా మేడం ” ఆత్మాభిమానంతో చెప్పాడు అతడు
” ఓహో ఇదో నాటకాలా ? అయితే నువ్వు తిని చూపించు ?” వెటకారంగా అడిగింది గొట్టం
మారు మాట్లాడకుండా బన్ను తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు
ఎలాగైనా తన నిర్దోషిత్వాన్ని నిరోపించుకోవాలనే తపన అతడి ముఖంలో కనిపిస్తుంది
ఈ పది రూపాయల సంపాదన కూడా లేకపోతే రేపటినుంచి కుటుంబం పరిస్థితి ఏంటి అనే దిగులు అతడి కళ్ళలో కనిపించింది
అంతే మరో ఆలోచన లేకుండా బన్ను మీద బన్ను తీసుకుని నోట్లో కుక్కుకున్నాడు
గొంతు పొలమారింది
దగ్గు వచ్చింది
కళ్ళలో నీళ్లు వస్తున్నాయి
చుట్టూ అంతమంది జనం మూగి చోద్యం చూస్తున్నారు
గ్లాసుడు నీళ్లు ఇచ్చేవారేరి ?
అప్పుడు అనిపించింది
మంచిని సమాధి చేస్తారా ? ఇది మనుషులు చేసే పనియేనా ? మనలో పాపం చేయనివాడు ఎవరో చెప్పండి ? ఏ దోషం లేనివాడూ ఎవరో చెప్పండి అని ఆ సినీ కవి ఇలాంటి వాళ్ళ గురించే ఎప్పుడో రాసాడు అని
విప్లవ కవితలు సమాజంలోనుంచే పుట్టుకొస్తాయి
అందుకే మహాకవి కూడా తన కవితల్లో ఇలాంటి వాళ్ళ గురించి రాసాడు
ముగింపు :
నిజంగా అతడు బన్ను కోవా కల్తీ చేసి ఉంటే క్షమార్హమైన నేరమే . కానీ అతడు కల్తీ చేశాడా ? లేదా ? అనేది తేల్చడానికి అధికార వ్యవస్థలు ఉన్నాయి . చట్టాలు ఉన్నాయి . అలాగే వికారాబాదులో తయారుచేస్తున్న కోవాలో కల్తీ జరిగిందని లాబ్ పరీక్షల్లో తేలిన తర్వాత పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేసారు . కానీ అదేమీ నిర్ధారణ కాకుండా టిఆర్పి కోసమో , వ్యూస్ కోసమో రోజు పొట్టపోసుకునే ఒక చిరు వ్యాపారిని గొట్టాలతో మీదపడిపోయి నడిరోడ్డు మీద ఇంటరాగేట్ చేసే హక్కు ఎవరికీ లేదు. చట్టం చేసే పనిని గొట్టాలు చేయకూడదు . వ్యూస్ కోసం అతడి చిరు వ్యాపారాన్ని బద్నాం చేసారు . ఇప్పుడు ఒకవేళ ఆ బన్ను కోవాలో ఎటువంటి కల్తీ లేదని తేలితే అతడికి జరిగిన అవమానానికి ఎవరు బాధ్యత వహిస్తారు ? ఈ వీడియోల వల్ల వ్యాపారం దెబ్బతిని అతడి కుటుంబం రోడ్డున పడితే ఎవరు బాధ్యత వహిస్తారు ?
ఈ పరిణామాల తర్వాత అతడి తండ్రి ఒక వీడియోలో మాట్లాడుతూ ” కోవా బన్నులు అమ్మితే మాకేమీ వేలల్లోనో, లక్షల్లోనో లాభాలు రావు .. తిప్పి తిప్పి కొడితే మాములు రోజుల్లో రోజుకు ఐదు వందలు కూడా రావు . ఆ డబ్బులతోనే మా కుటుంబాలను పోషించుకోవాలి . నిజంగా మేము కల్తీ చేస్తే మా కాపురాలు మట్టి ఇళ్లలో ఉండవు . పెద్ద పెద్ద కల్తీ చేసేటోల్ల మాదిరే మేడల్లో ఉండేవాళ్ళం . ఈ రచ్చ వల్ల రేపట్నుంచి మేము కోవా బన్ను అమ్మేదెలా ? ఆ పది రూపాయలు సంపాదించుకుని కుటుంబాలను పోషించుకునేది ఎలా ?” అని కన్నీరు పెట్టుకున్నాడు
కాబట్టి ఔత్సాహిక యూ ట్యూబ్ ఛానల్స్ వారెవరన్నా ఉంటే మీ టీఆర్పీల కోసం , వ్యూస్ కోసం ఇటువంటి చిరు వ్యాపారులను టార్గెట్ చేయకండి
కార్పొరేట్ బిల్డింగుల్లో వ్యాపారాలు చేస్తూ కల్తీకి పాల్పడుతున్న బడా వ్యాపారస్తులను నిలదీయండి
ఆ మధ్య టీవీ నైన్ న్యూస్ ఛానల్ వారు తెలంగాణా ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేసి హైద్రాబాదులో పెద్ద పెద్ద రెస్టారెంట్లలో జరుగుతున్న కల్తీని బయటపెట్టారు
వీలుంటే అలాంటివి ట్రై చేయండి
అదీ కాకుండా కులాన్ని బట్టో , మతాన్ని బట్టో మనుషులను టార్గెట్ చేయకండి !
