అందుకే సూపర్ స్టార్ కృష్ణ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అయ్యాడు..!

Spread the love

నేడే….ఈనాడే….

తెల్ల లాల్చీ పైజామా మెడలో నల్ల కండువా చుట్టుకుని పిడికిలి బిగించి గొంతెత్తి పాడటం మొదలుపెట్టాడు సూపర్ స్టార్ కృష్ణ

వెంటనే కృష్ణకు మద్దతుగా వేలాది గొంతులు జతకలిసాయి

ఆ వేలాది గొంతుల్లో నాది కూడా ఒకటి

ఈ కథేంటో తెల్సుకోవాలంటే రీలు 1982 సంవత్సరానికి తిప్పాలి

విజయవాడ గాంధీనగర్ అలంకార్ సెంటర్ బాటా షో రూమ్ రోడ్డులో సూపర్ స్టార్ కృష్ణ 200 వ సినిమా ఈనాడు షూటింగ్ జరుగుతుందని ఆనోటా ఈనోటా తెలిసి నేను గబ గబా అక్కడికి చేరుకుని అక్కడి దృశ్యం చూసి ఆశర్యపోయా

అప్పటికే వేలాది మంది జనంతో ఆ రోడ్డు నిండిపోయింది

అదికాదు నన్ను ఆశర్యపరిచింది

కృష్ణ ఒక క్రేన్ లో ఎక్కి నిల్చున్న తర్వాత మెల్లిగా గాల్లో షుమారు 50 అడుగుల పైకి లేచింది

అక్కడ్నించి కృష్ణ పిడికిలి బిగించి పాట అందుకుంటే కెమెరా బ్యాక్ డ్రాప్ లో పైన కృష్ణ.. కింద రోడ్డు మీద జనం కనపడతారు

నిజం చెప్పొద్దూ ,

కిందనుంచి అంత పైకి కృష్ణ వంక చూస్తే నాకే కళ్ళు తిరిగాయి

కృష్ణ మాత్రం తొణక్క బెణక్క పాట చరణం పూర్తయ్యేదాకా అదే ఫ్లోలో ఉండిపోయారు

అప్పుడు అనిపించింది ,

సూపర్ స్టార్ కృష్ణ అందుకే డేరింగ్ డాషింగ్ హీరో అయ్యారు కాబోలు అని !

ఆ పాటలో ఒక్క చరణం షూటింగ్ చెయ్యటానికి ఒక పూట పట్టింది

షూటింగ్ చూస్తున్న నాకు అంతా కొత్తగా అనిపించింది

కొసమెరుపు : షూటింగ్ చూడటానికి జనం తండోపతండాలుగా వస్తూనే ఉన్నారు.. అప్పుడే నాకో కొత్త విషయం తెలిసింది

సూపర్ స్టార్ మీద అభిమానంతో ఓ కుర్రాడు తెలిసిన వారి ద్వారా చెన్నై లో ఓ కార్యక్రమంలో కృష్ణ ని కలిసి ఆటోగ్రాఫ్ తీసుకుని వీలుంటే మీ షూటింగ్ చూడాలని నేను నా ఫ్రెండ్స్ అనుకుంటున్నాం..అంటే కృష్ణ యధాలాపంగా నవ్వి చూద్దాం అని వెళ్లిపోయారట

తర్వాత చాన్నాళ్లకు విజయవాడలో ఈనాడు మూవీ షూటింగ్ సందర్భంగా గతంలో ఆ కుర్రాడికి ఇచ్చిన మాట ప్రకారం ఆ కుర్రాడితో పాటు ఎంతమంది ఫ్రెండ్స్ వస్తే అంతమందినీ విజయవాడ రమ్మని సహాయకుల ద్వారా కబురంపారు సూపర్ స్టార్ !

కబురు తెలుసుకున్న ఆ కుర్రాడు సంతోషంతో ఎగిరి గంతేసి చెన్నై నుంచి ఫ్రెండ్స్ తో విజయవాడ దిగి షూటింగ్ లో పాల్గొన్నారు

ఇక సూపర్ స్టార్ 200 వ సినిమా పైగా సొంత బ్యానర్లో..అదీ పొలిటికల్ స్టొరీ..ఆ ప్రకంపనలు చెన్నై దాకా పాకటంతో అభిమానులు బస్సులు రైళ్లు పట్టుకుని విజయవాడ వచ్చేసారు

ఆ వచ్చినవాళ్ళందరికీ అయిన ఖర్చులు కృష్ణ భరించాడని తర్వాత తెలిసింది

అప్పుడు తెలిసింది కృష్ణ కు ఫాన్స్ పక్షపాతి అని ఎందుకు పేరొచ్చిందో అని !

పరేష్ తుర్లపాటి


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!