Home » రాజాసాబ్ ప్రభాస్ మూవీ ఎలా ఉంది ? – రాజాసాబ్ మూవీ రివ్యూ

రాజాసాబ్ ప్రభాస్ మూవీ ఎలా ఉంది ? – రాజాసాబ్ మూవీ రివ్యూ

Spread the love

సినిమా కెరీర్ ప్రారంభంలో రెబెల్ స్టార్ కృష్ణంరాజు తమ్ముడి కొడుకుగానే ప్రభాస్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు

2002 లో ఈశ్వర్ మూవీలో ప్రభాస్ కనిపించగానే పెద్దనాన్నగారిలా ఈ కుర్రాడు కూడా ఒడ్డూ పొడుగు బావున్నాడు
ఆయన వారసత్వం నిలబెడతాడని కృష్ణంరాజు అభిమానులు ఆనాడే అంచనా వేశారు

ఇక అక్కడ్నుంచి వర్షం , పౌర్ణమి , ఛత్రపతి , డార్లింగ్ , మిస్టర్ పర్ఫెక్ట్ , మిర్చి సినిమాలతో వింటేజ్ హీరో లుక్ లో మెరిసి మెప్పించాడు

2015 లో ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి మూవీ ప్రభాస్ కెరీర్ ను అమాంతం శిఖరానికి చేర్చింది

ఎంతలా అంటే ఆ ఒక్క సినిమాతోనే ప్రభాస్ స్టార్ డమ్ పెరిగిపోయి పాన్ ఇండియా స్టార్ అయ్యాడు
ఇక అక్కడ్నుంచి ప్రభాస్ రేంజ్ మారిపోయింది

బాలీవుడ్ ఇండస్ట్రీ చూపులు ప్రభాస్ మీద పడ్డాయి
ఆదిపురుష్ , సలార్ , సాహో , కల్కి సినిమాలతో గ్లోబల్ స్టార్ రేంజికి ఎదిగాడు

బాలీవుడ్ నిర్మాతలకు సైతం ప్రభాస్ కాల్షీట్స్ దొరకని పరిస్థితి
పేరుమోసిన పెద్ద ,పెద్ద దర్శకులు ఇతడి డేట్స్ కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చింది

ఇటువంటి పరిణామాల నేపథ్యంలో మారుతి అనే ఓ మిడ్ రేంజ్ దర్శకుడి నుంచి ప్రభాస్ మూవీ పట్టాలెక్కుతుందని తెలిసి ఫాన్స్ ఆశ్చర్యపోయారు

గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఉన్న తమ హీరో ప్రభాస్ లోకల్ దర్శకుడి సినిమాకి ఎలా సైన్ చేసారని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు

ఆ ప్రశ్నలకు రాజాసాబ్ ట్రైలర్ ద్వారా దర్శకుడు మారుతి సమాధానం చెప్పారు
ట్రైలర్లో ప్రభాస్ లుక్ చూసిన అభిమానులు సాహో అనడంతో అప్పటికి వివాదం సద్దుమణిగింది

ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్లో మారుతి మాట్లాడుతూ రాజాసాబ్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అయి తీరుతుందని , ఎవరికైనా సినిమా నచ్చకపోతే తన ఇంటికొచ్చి ప్రశ్నించవచ్చని చెప్తూ తన అడ్రస్ కూడా ఇచ్చి ఫాన్స్ కు సవాల్ విసరడంతో సినిమా మీద హైప్ ఒక్కసారిగా పెరిగిపోయింది

ఈ పరిస్థితుల్లో రాజాసాబ్ జనవరి తొమ్మిదిన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయ్యింది

మరి దర్శకుడు మారుతి చెప్పినట్టు బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందా ?
రాజాసాబ్ మూవీ ప్రభాస్ రేంజికి తగ్గట్టుగా ఉందా ? అనేది ఇప్పుడు చూద్దాం

ఇదీ కథ :

సినిమా ప్రభాస్ చెప్పినట్టుగా నాయనమ్మ , మనవడి అనుబంధంతో మొదలౌతుంది

గంగాదేవి ( జరీనా వహాబ్ ) ఒకప్పటి దేవనగరి సంస్థానానికి చెందిన జమిందార్
గతాన్ని చాలావరకు మర్చిపోయిన ఈవిడ తన మనవడు రాజు ( ప్రభాస్ ) తో కలిసి గంగమ్మగా సామాన్య జీవితం గడుపుతూ ఉంటుంది

అన్నీ మర్చిపోయినా ఆమె తన భర్త కనకరాజును( సంజయ్ దత్ ) మాత్రం మర్చిపోదు

ఈ కనకరాజుకి డబ్బు పిచ్చి
ఆ డబ్బులను వెతుక్కుంటూ ఎప్పుడో వెళ్లిపోయిన కనకరాజు తిరిగి వెనక్కి రాడు

దాంతో తన భర్త జాడ తెలియక ఆందోళన పడుతున్న గంగమ్మ ఎలాగైనా సరే ఆయన ఆచూకీ కనుక్కోవాల్సిందిగా మనవడిని సతాయిస్తుంటుంది

నాయనమ్మ అంటే ప్రాణంగా భావించే రాజు తాత ఆచూకీ కనుగొనడం కోసం పట్నం బయలుదేరుతాడు

ఇక్కడ ఈ కనకరాజుకి కూడా ఓ చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది

తనకోసం వెతుకుతున్న రాజుని , అతడి మిత్ర బృందాన్ని మార్మిక విద్య ద్వారా నర్సాపురం అడవుల్లోని తన రాజమహల్ కు రప్పిస్తాడు
ఈ రాజమహల్ కి ఎంట్రీ మినహా ఎగ్జిట్ ఉండదు

రాజు , అతడి నాయనమ్మలు కనకరాజు కోసమే రాజమహల్ లోకి ప్రవేశిస్తే ఆశ్చర్యంగా అతడు మాత్రం వీళ్ళని చంపాలని ప్రయత్నిస్తాడు

దాంతో రాజు రాజమహల్ లో కనకరాజుని ఏ విధంగా ఎదుర్కొంటాడు ?
అసలు కనకరాజు ఫ్లాష్ బ్యాక్ ఏంటి ?
మొత్తమ్మీద రాజమహల్ లో ఏం జరుగుతుంది ? అనేది మిగతా కథలో తెలుస్తుంది

ఎలా ఉంది ?

ఫాంటసీ , హర్రర్ , కామెడీ మూడురకాల దినుసులను ఒకే మిక్సీలో వేసి గిర్రున తిప్పి బయటికి తీస్తే వచ్చిన బొమ్మ రాజాసాబ్

హర్రర్ మరియు ఫాంటసీ కాంబినేషన్లు సాధారణంగా బానే ఉంటాయి
దీనికి కొద్దిగా కామెడీ టచప్ ఇవ్వాలంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా స్క్రిప్ట్ వర్క్ చెయ్యాలి
ఈ విషయంలో దర్శకుడు మారుతి కొద్దిగా తడబడినట్టున్నాడు

ఎందుకంటే మొదటిరెండు మిర్చి బజ్జీ , పునుగుల్లా కాంబినేషన్లో కలిసిపోతాయి
దానికి కామెడీ యాడ్ చేస్తే అది వేరే మెనూ అవుతుంది

అయినా పర్లేదు భోజనం చేసిన తర్వాత వేసుకునే మిఠాయి పాన్ లా తియ్యగుంటే డైజెస్ట్ అయిపోతుంది
అదే కామెడీ వికటించి డోసు ఎక్కువైతే జర్దా పాన్ లా ఘాటు అనిపిస్తుంది

ఇక్కడే దర్శకుడు సబ్జెక్టు ను సరిగా హ్యాండిల్ చేయలేకపోయాడు

కామెడీ కోసం ముగ్గురు నలుగురు ఆర్టిస్టులను రంగంలోకి దింపినా ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు
ఆ బాధ్యత కూడా ప్రభాసే తీసుకుని నవ్వించటానికి ప్రయత్నం చేసాడు

ఒకరకంగా చెప్పాలంటే ఫాంటసీ , హర్రర్ , కామెడీ అనబడే మూడు జానర్లను ప్రభాస్ తన భుజాన వేసుకుని నడిపించాడు

బాహుబలి నుంచి ఒకరకమైన ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కుపోయిన ప్రభాస్ తిరిగి డార్లింగ్ స్టైల్లో అలరించాడు

ప్రథమార్థంలో హీరో , హీరోయిన్ల రొమాన్సు , డ్యూయెట్లు , నాలుగు కామెడీ సన్నివేశాలతో ఫక్తు రొటీన్ తెలుగు సినిమాల మాదిరే నడిచిపోతుంది

రాజమహల్ సన్నివేశాలు వచ్చినప్పటినుంచి కథనంపైన ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలుగుతుంది

పాటలు ముగ్గురు హీరోయిన్లతో గంతులు వేయడం కోసమే పెట్టినట్టున్నారు
మ్యూజికల్ హిట్ చేద్దామన్న ప్రత్యేక శ్రద్ద అయితే ఏమీ పెట్టలేదు

పైగా ఇంత భారీ బడ్జెట్ సినిమాకి సింగిల్ స్కిన్ షో సరిపోదు అనుకున్నారేమో ఏకంగా మూడు సంతూర్ చర్మ సౌందర్యాలను వెండి తెరమీద ఆరబోశారు

ఆ ముగ్గురిలో మాళవిక మోహన్ మినహా మిగిలిన ఇద్దర్నీ తైతక్కలాడటానికే తీసుకున్నట్టున్నారు

ద్వితీయార్థంలో కనిపించే రాజమహల్ , కనకరాజు మార్మిక విద్యలు , గంగమ్మ , కనకరాజుల ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు కొంత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి

ఎప్పుడైతే రాజమహల్ లోకి ఎంటర్ అవుతామో అప్పట్నుంచి గ్రాఫిక్ వర్క్స్ మొదలౌతాయి అని అర్ధం అన్నమాట

పర్లేదు.. విఎఫ్ఎక్స్ కోసం బాగానే ఖర్చు పెట్టినట్టున్నారు
క్వాలిటీ బాగానే ఉంది
కానీ కొన్ని సన్నివేశాల్లో సంజయ్ దత్ పాత్రను కూడా గ్రాఫిక్స్ లో లాగించేసారా అన్న అనుమానం వచ్చే విధంగా ఉన్నాయి

ఆడియో సిస్టం సరిగా లేదు
డబ్బింగ్ సినిమాల మాదిరి కొన్ని డైలాగులు సరిగా అర్ధం కాలేదు

ట్రైలర్ చూసిన అభిమానులు తమ హీరోని కొత్త లుక్ లో చూడబోతున్నామని బోలెడు సంతోషపడిపోయారు
అలాంటివాళ్ళు సినిమా చూస్తే కొంత నిరాశకు గురి కావొచ్చు
ఎందుకంటే ట్రైలర్లో చూపించిన ప్రభాస్ ఇందులో మాయం అయ్యాడు

ఓవరాల్ గా రాజాసాబ్ మూవీని ప్రభాస్ తన భుజాల మీద వేసుకుని నడిపించడానడంలో సందేహం లేదు

ఎలా చేసారు ?

రాజాసాబ్ మూవీలో ఎవరెవరు ఎలా చేసారు అని చెప్పుకోవాలంటే ముందుగా హీరో ప్రభాస్ గురించే చెప్పుకోవాలి

ఇప్పటిదాకా తాను చేసిన సీరియస్ పాత్రల ఇమేజ్ ప్రభావం ఈ సినిమా మీద పడకుండా పక్కనబెట్టి పాత సినిమాల్లో హీరో లెక్క హుషారుగా , జోష్ తో నటించే ప్రయత్నం చేసి అభిమానులను మెప్పించారు
ఇతడి లుక్ కూడా బావుంది

ఇక ఇప్పటిదాకా హీరో పక్కన ఒకరిద్దరు హీరోయిన్లను చూడటానికి అలవాటుపడ్డ మనం ముగ్గురు హీరోయిన్లతో కూడా సినిమాలు చూడటానికి అలవాటు పడాలి

ఈ ముగ్గురిలో మాళవిక మోహన్ పాత్రకు కొంచెం డెప్త్ ఉంది
నిధి అగర్వాల్ పాటలకోసం తీసుకున్నట్టున్నారు
మూడో అమ్మాయి రిద్ది ని ఎందుకు తీసుకున్నారో కూడా తెలీదు

కథకు కనకరాజు పాత్ర కీలకం
ఈ పాత్రకు సంజయ్ దత్ ను తీసుకోవడం వరకు ఓకే
కానీ అంతటి బాలీవుడ్ నటుడ్ని తెరమీదకు తీసుకొచ్చినప్పుడు పాత్ర తీరుతెన్నులను ప్రేక్షకులకు మరింత కనెక్ట్ అయ్యే విధంగా తీర్చిదిద్దడంలో దర్శకుడు జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది

గంగాదేవి పాత్ర పోషించిన జరీనా వహాబ్ నటన బాగానే ఉంది
ఇక కీలక పాత్రలో కనిపించిన సముద్రఖని షరామామూలుగా బాగానే నటించాడు

రాజాసాబ్ లో కామెడీ మిక్సింగ్ కోసం సప్తగిరి , సత్య , వీటివి గణేష్ తదితర కామెడీ యాక్టర్లను రంగంలోకి దించారు కానీ ఆశించిన స్థాయిలో కామెడీ పండలేదు
సరిగా వాడుకోవాలే కానీ థియేటర్లలో నవ్వులు పూయించటానికి సత్య ఒక్కడు చాలు

సాంకేతికత పరిస్థితి ఏంటి ?

సినిమాకి నేపధ్య సంగీతం అందించింది తమన్ అనగానే ఆయన లెవెల్లో ఇందులో కూడా బీజీఎమ్ అద్దిరిపోతుంది అనుకున్నవాళ్ళకి కొద్దిగా నిరాశ మిగులుతుంది

సరే బీజీఎమ్ సంగతి ఎలా ఉన్నా మ్యూజికల్ గా పాటలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి

సినిమాటోగ్రఫీ బాగానే ఉంది

600 కోట్లు ఖర్చు పెట్టి తీసాం అని మేకర్స్ చెప్పారు
ఆ పరంగా నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి

కథలో కొత్త పాయింట్లు సరిగానే రాసుకున్న దర్శకుడు మారుతి తెరమీదకెక్కించేసరికి తడబడ్డాడు
స్క్రీన్ ప్లే లోపం స్పృష్టంగా కనిపిస్తుంది
ప్రభాస్ ఇమేజ్ కోసం అనవసరంగా అతికించిన సన్నివేశాలు మూవీకి మైనస్

విశ్లేషణ : దర్శకుడు కథలో మూడు జానర్లు కలిపి మిక్స్ చేసి ప్రభాస్ చేతిలో పెట్టినా అతడు తనవంతుగా అభిమానులకు బంగారు పళ్లెంలో పెట్టడానికి గట్టిగానే కృషి చేసాడు.. ఈ సినిమా పరంగా ఏవన్నా లోపాలు ఉన్నాయంటే అవి పూర్తిగా దర్శకత్వ వైఫల్యం వల్ల ఏర్పడినవే .. అడుగులు తడబడి సినిమా విడుదల ఆలస్యమైనప్పుడే ఇందులో విషయం అభిమానులకు అర్థమై ఉండాలి

నటీనటులు : ప్రభాస్ , సంజయ్ దత్ , సముద్ర ఖని , మాళవిక మోహన్ , నిధి అగర్వాల్ , రిద్ది కుమార్ తదితరులు
సంగీతం : తమన్
సినిమాటోగ్రఫీ : కార్తీక్ పళని
నిర్మాత : టిజి విశ్వ ప్రసాద్
దర్శకుడు : మారుతి
విడుదల : 09 -01 -2026
రేటింగ్ : 2.5 / 5


Spread the love

2 thoughts on “రాజాసాబ్ ప్రభాస్ మూవీ ఎలా ఉంది ? – రాజాసాబ్ మూవీ రివ్యూ

  1. ఈ సినిమా గురించి విడుదలైన మొదటి రోజే “చెత్త సినిమా” అని పోస్టు పెట్టాను. నా అభిప్రాయం సరైందని మర్నాడు వచ్చిన రివ్యూలు ధృడ పర్చాయి. మీ సమీక్ష చాలా సున్నితమైనది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!