Home » నేటి రాజకీయాల్లో నీతులు మాయం – అంతా బూతుల మయం!

నేటి రాజకీయాల్లో నీతులు మాయం – అంతా బూతుల మయం!

Spread the love

మీరు గమనించారా ?

రాజకీయాల్లో కొత్త ట్రెండ్ మొదలైంది
విమర్శల స్థానంలో బూతులు రంగప్రవేశం చేసాయి

విధానపరమైన నిర్ణయాలపై చర్చకు బదులు వ్యక్తిగత జీవితాలు టార్గెట్ అవుతున్నాయి

ఆరోగ్యకరమైన పోటీకి బదులు విద్వేషపూరిత రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి

తాము గతంలో ప్రతిపక్షములో ఉన్నప్పుడు అధికార పక్షము అనుసరించిన కక్షపూరిత రాజకీయాలను వ్యతిరేకించిన అదే పార్టీలు తిరిగి అధికారంలోకి వస్తే అవే విధానాలను అనుసరిస్తున్నాయి

తాము అధికారంలో ఉన్నప్పుడు పోలీసుల తీరు బాగుందని కితాబు ఇచ్చే నాయకులూ , ప్రతిపక్షములోకి రాగానే అదే పోలీసుల తీరును తప్పు పడుతున్నారు

అధికార , ప్రతిపక్షాలు ఆడుకుంటున్న చదరంగంలో పోలీసులను పావులుగా వాడుకుంటున్నారు

గతంలో ఐదేళ్లు ప్రజాసమస్యల మీద పోరాటాలు చేసిన అధికార , ప్రతిపక్షాల స్థానంలో నేడు ప్రతీకార రాజకీయాలు ప్రవేశించాయి

గతంలో కార్యకర్త మీద కేసు పెడితే వార్త
ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి మీద కేసులు పెట్టకపోతే వార్త

ఇదే సంప్రదాయం ముందు ముందు కొనసాగితే మన పాలకులు ఎన్ని కేసుల్లో జైలుకు వెళ్లారు ? ఎన్ని కేసుల్లో శిక్షలు అనుభవించారు ? లాంటివి వార్తల్లో హెడ్ లైన్స్ అవుతాయి

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయి

ఇందులో తప్పెవరిది ? ఒప్పెవరిది ? అంటే సమాధానం చెప్పడం కష్టం
చెట్టు ముందా ? విత్తు ముందా ? అన్నట్టుంది

అయినా ఒకసారి రీలు వెనక్కి తిప్పి బూతు రాజకీయాలను విశ్లేషణ చేసుకుందాం

ఏపీలో ఏం జరిగింది ?

ముందుగా ఏపీ సంగతి తీసుకుంటే ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటిసారిగా టిడిపి అధికారంలోకి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టారు

ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ప్రతిపక్షానికి పరిమితం అవ్వాల్సివచ్చింది

ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి

నేటి డిజిటల్ యుగంలో ఎన్నికలను , రాజకీయాలను ప్రభావితం చేయడంలో సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషిస్తుంది

మెయిన్ స్ట్రీమ్ మీడియా దాదాపు ఒక్కో రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తుండటంతో అవి వండి వార్చే వార్తలకు విశ్వసనీయత పోయింది

ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియా రంగంలోకి వచ్చింది

సోషల్ మీడియా సమాచారం కూడా నూటికి నూరుపాళ్లు వాస్తవం కాకపోయినా ఏది నిజమో ? ఏది అబద్దమో ? వెంటనే తేలదు

ఈ లోపు శత్రువుకి జరగాల్సిన డామేజ్ జరిగిపోతుంది
తిమ్మిని బమ్మిని చేయడం అన్నమాట

వాడుకుంటే రాజకీయ నాయకులకు సోషల్ మీడియా బ్రహ్మాస్త్రం

అందుకే దాదాపు ప్రతి రాజకీయ పార్టీ సొంత సోషల్ మీడియాలు ఏర్పాటు చేసుకున్నాయి

ఆ సమయంలో వైఎస్ జగన్ భార్య భారతి మీద చాలా ట్రోలింగులు నడిచాయి

ప్రతిపక్ష వైఎసార్సీపి మీద విధానపరమైన రాజకీయ పోరాటం చేయాల్సిన స్థానంలో వ్యక్తిగత ధూషణలు రంగప్రవేశం చేసాయి

దురదృష్టవశాత్తు ఈ ట్రోలింగులకు రాజకీయాలతో సంబంధం లేని మహిళలు టార్గెట్ అయ్యారు

అప్పుడే ఈ దుష్ట సంప్రదాయానికి అడ్డుకట్ట వేసి ఉంటే బాగుండేది

రెండోసారి జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చారు

ఇప్పుడు వైసిపి సోషల్ మీడియా ట్రోలింగులకు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి టార్గెట్ అయ్యింది

ఏతావాతా ఇరు పార్టీల సోషల్ మీడియా ట్రోలింగుల వల్ల రాజకీయాలతో సంబంధం లేని ఇరువురు ముఖ్యమంత్రుల భార్యలు ఇబ్బంది పడ్డారు

ఇదికాకుండా నాయకులు వ్యక్తిగత ధూషణలతో కొత్త సంప్రదాయానికి నాంది పలికారు

ఈ ధూషణల పర్వం ఎక్కడిదాకా వెళ్లిందంటే క్యాబినెట్ మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును వ్యక్తిగతంగా వాడు , వీడు అని బహిరంగంగా సంభోదించే స్థాయికి వెళ్ళింది

అసెంబ్లీలో సైతం భువనేశ్వరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి బూతులు మాట్లాడటంతో ఎప్పుడూ గంభీరంగా ఉండే చంద్రబాబు సైతం పసిపిల్లవాడిలా భోరున ఏడ్చారు

ఈ రాజకీయాలు వ్యక్తిగత దూషణలతో ఆగిపోలేదు
వ్యక్తిగత దాడుల వరకు వెళ్ళింది

గన్నవరంలోనూ , మంగళగిరిలోనూ టిడిపి కార్యాలయాలను ధ్వంసం చేసారు

జోగి రమేష్ ఏకంగా కొన్ని కార్లలో అనుచరులను వేసుకుని చంద్రబాబు ఇంటిమీదికి వెళ్లారు

అచ్చంనాయుడు , కొల్లు రవీంద్ర , అయ్యన్నపాత్రుడు వంటి టిడిపి సీనియర్ నాయకుల మీద పోలీస్ కేసులు నమోదు అయ్యాయి

రఘురామకృష్ణం రాజు , పట్టాభి వంటి నాయకులైతే పోలీసులు తమమీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారని వాచిపోయిన కాళ్లనూ , చేతులనూ చూపించారు

ఈ వ్యక్తిగత ధూషణలు , వ్యక్తిగత దాడులకు అదనంగా క్లైమాక్సులో చంద్రబాబును కూడా అరెస్ట్ చేసి షుమారు 53 రోజులు జైల్లో పెట్టారు

సరే చట్టం ముందు అందరూ సమానమే
చట్టం తన పని తాను చేస్తుంది అనే రెడీమేడ్ కొటేషన్లు మనదగ్గర ఎలానూ ఉన్నాయి

కాబట్టి ఈ కేసులూ , అరెస్టులు రాజకీయపరమైన ప్రతీకార చర్యలా? లేకపోతే నిజంగానే అవినీతి జరిగిందా ? అనేది న్యాయస్థానాల్లో తేలేదాకా మనం తొందరపడి విశ్లేషణ చేయలేము

వైసిపి ప్రభుత్వం మాత్రం ఈ అరెస్టులపై స్పందిస్తూ పోలీస్ విధుల్లో తాము జోక్యం చేసుకోమని , చట్టం తనపని తాను చేస్తుందని చెప్పింది

అది చంద్రబాబుకు సంబంధించింది అయినా , జగన్ కు సంబంధించిన కేసు అయినా చట్టాలను గౌరవించే పౌరులుగా మనం న్యాయస్థానాల తీర్పును అంగీకరించాల్సిందే

కానీ ఈ క్రమంలో తమల్ని వేధించిన రాజకీయ నాయకుల పేర్లనూ , అధికారుల పేర్లనూ రెడ్ బుక్ లో రాసుకుంటున్నానని , తాము అధికారంలోకి వస్తే తప్పకుండా తగిన జవాబు ఇస్తామని అప్పట్లోనే లోకేష్ చెప్పారు

ఇప్పుడు ఏపీలో తిరిగి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు

చెప్పినట్టుగానే లోకేష్ రెడ్ బుక్ బయటికి తీయడంతో ఒకరొకరుగా వైసీపీ నాయకుల మీద కేసులు బుక్ అయి అరెస్టులదాకా వెళ్ళింది

ఆ రోజు భువనేశ్వరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి దూషించిన వల్లభనేని వంశీ మీద కేసుపెట్టి అరెస్ట్ చేసారు

ఈ కేసులో సెక్షన్లు ఎంత పకడ్బందీగా పెట్టారంటే వంశీకి బెయిల్ కూడా దొరక్క కొన్ని నెలలపాటు జైల్లోనే ఉండాల్సివచ్చింది

ఆ ప్రభావం వల్లనో , ఇతర కారణాలో తెలీదు కానీ గతంలో టిడిపి మీద , చంద్రబాబు మీద దూకుడుగా వెళ్లిన వంశీ ప్రస్తుతానికి మౌనం పాటిస్తున్నారు

అలాగే కేవలం చీటికిమాటికి బాబుని దూషించడం కోసమే మీడియా ముందుకు వచ్చే కొడాలి నాని మౌన వ్రతం పాటిస్తున్నారు

లోకేష్ రెడ్ బుక్ లో రాసుకున్న చాలామంది ఐపీఎస్ అధికారులు పోస్టింగులు లేక గాల్లో ఉన్నారు

ఇంకో ఐపీఎస్ అధికారి అరెస్ట్ అయి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు

బాబు ఇంటిమీదికి వెళ్లిన జోగి రమేష్ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి మొన్ననే బెయిల్ మీద బయటికి వచ్చారు
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది కూడా అదే పరిస్థితి

ఈ నేపథ్యంలో తాజాగా అంబటి రాంబాబు , జోగి రమేష్ ఇళ్లకు టిడిపి కార్యకర్తలు నిప్పు పెట్టారు

తిరుమల లడ్డు నెయ్యిలో కల్తీ జరగలేదని సిట్ ప్రకటన చేయడంతో పాపప్రక్షాళన కార్యక్రమం అంటూ గుంటూరులో దేవాలయానికి బయలుదేరిన అంబటి రాంబాబుని దారిలో టిడిపి కార్యకర్తలు , పోలీసులు అటకాయించడంతో ఆయన సహనం కోల్పోయి బూతులు లంకించుకున్నారు

ఆ బూతులు చంద్రబాబును ఉద్దేశించే అన్నాడని భావించిన టిడిపి కార్యకర్తలు ఆగ్రహంతో అంబటి ఇంటిమీదికి వెళ్లి నిప్పు పెట్టారు

ఆ తర్వాత పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం , ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించడం జరిగాయి

తాను చంద్రబాబును ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదనీ , తనను తిట్టినవారిని మాత్రమే ఉద్దేశించి చేసానని , అయినా ఈ వయసులో అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని అంబటి ఆ తర్వాత వివరణ ఇచ్చుకున్నారు

ఇంకోపక్క ఇదే సమయంలో నారా లోకేష్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసాడని ఆగ్రహించిన టిడిపి కార్యకర్తలు జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టారు

ఇదీ ఇప్పటివరకు జరిగిన , జరుగుతున్న పరిణామాలు

ముగింపు :

పై ఆర్టికల్ చదివితే మనకు ఓ విషయం అర్ధమౌతుంది
ఇకపై మన రాజకీయాల్లో ప్రతీకార రాజకీయాలు కూడా భాగమైపోతాయి

ఇందులో దాపరికం ఏమీ లేదు
ఎవరికి వారు రేపు తాము అధికారంలోకి వస్తే ప్రతీకార చర్యలు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పేస్తున్నారు

ఎవరికి వారు బుక్కుల్లో ప్రత్యర్థుల పేర్లు , అధికారుల పేర్లూ రాసేసుకుంటున్నారు
అధికారంలోకి వస్తే రఫ్ఫా రఫ్ఫా అంటూ ఫ్లెక్సీలు వేస్తున్నారు

ఇందుకు ఉదాహరణ తాజాగా ఇరువురి నాయకుల ప్రకటన ఉంది

ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి పోలీసులతో , గుండాలతో కుమ్మక్కై మాపై వ్యక్తిగత దాడులు చేస్తున్నారు . రేపు మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఇదే పనిచేస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి ? అని మీడియాతో మాట్లాడుతూ చెవిరెడ్డి అన్నారు

మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో , మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం . మేము కూడా ఇదే పనిచేస్తే మీ పరిస్థితి ఏంటి ? అని జోగి రమేష్ అన్నారు

ఇదే మాటలు గతంలో కొంతమంది టిడిపి నాయకులు కూడా అన్నారు

ఏ పార్టీవారు అయినా సరే ఇటువంటి రాజకీయాలు మంచిది కాదు

విధానపరమైన నిర్ణయాలపైన ఆరోగ్యకరమైన చర్చలు చేయకుండా వ్యక్తిగత ధూషణలకు పాల్పడటం ఏ పార్టీకైనా సరైన పద్దతి కాదు

పాలనలో పోటీపడకుండా ప్రతీకార రాజకీయాలు చేయడం ఏ రాజకీయ పార్టీకి మంచిది కాదు

రాజకీయ వైరుధ్యం ఉన్న ప్రత్యర్థి పార్టీ నాయకుల మీద , ఇళ్ల మీద వ్యక్తిగత భౌతిక దాడులు చేయడం ఏ పార్టీకైనా సరైన విధానం కాదు

అధికారంలో ఉన్నప్పుడు పోలీసుల విధుల్లో జోక్యం చేసుకోవడం , వాడుకోవడం ,ప్రతిపక్షములో ఉన్నప్పుడు అదే పోలీసుల తీరును వ్యక్తిగతంగా విమర్శించడం సరైన పద్ధతి కాదు

దీనివల్ల ముందు ముందు పోలీసుల ఆత్మస్థయిర్యం దెబ్బతిని వారి విధుల మీద ప్రభావం చూపిస్తుంది

అధికార ,ప్రతిపక్ష పార్టీలు తమ పార్టీ నాయకులకు పబ్లిక్ లో ఎలా మాట్లాడాలో కౌన్సిలింగ్ ఇవ్వాలి
మర్యాదపూర్వకమైన భాషకు ప్రజల్లో ఎప్పటికీ గుర్తింపు , గౌరవం ఉంటుంది

అన్నిటికన్నా ముఖ్యమైనది పార్టీ అధినేతలు తమ క్యాడర్ చేసే తప్పులను సమర్ధించకుండా ముందే కఠిన చర్యలు తీసుకుంటే ప్రజల్లో విలువ పెరుగుతుంది

ఇవేమీకాదు మేము ఇప్పటిలానే వ్యవహరిస్తాం అంటారా ?

అన్నీ గమనిస్తున్న ఓటరు తన తీర్పును నిశ్శబ్దంగా ఎన్నికల్లో చెప్తాడు

తాము ప్రతిపక్షములో ఉన్నప్పుడు అధికార పక్షము ఏ విధంగా అయితే కక్షపూరిత రాజకీయాలు చేసిందో, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన మేమూ అదే విధంగా కక్షపూరిత రాజకీయాలు చేస్తాం అనుకునేవారు ఓటరు ఈ అధికార మార్పిడిని ఎందుకు చేసాడో ఒక్కసారి ఆలోచించుకోండి

నిజంగా మీరు ఓటరు మనసులోని ఆలోచనను పసిగడితే కక్షపూరిత రాజకీయాలను వెంటనే వదిలేసి పాలనలో అభివృద్ధిపై దృష్టి పెడతారు

మీరెప్పుడైతే అభివృద్ధి మీద దృష్టి పెట్టారో ఓటరు తిరిగి మిమ్మల్నే అధికారంలో కూర్చోబెట్టాలని దృష్టి పెడతాడు

అధికారం దక్కించుకోవడానికి ఇంతకుమించిన సింపుల్ ఫార్ములా మరోటి లేదు!


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!