విజయవాడ సింగ్ నగర్ , పాయకాపురం వైపు వాయువేగంతో దూసుకెళ్తున్న వంగవీటి మోహన రంగా కారు గాంధీనగరం వచ్చేసరికి సడెన్గా ఆగిపోయింది
“ఏమైంది ? కారు ఎందుకు ఆగింది ?” వంగవీటి ప్రశ్న
“అన్నా ! బండిలో పెట్రోల్ అయిపోయింది..ఇంజిన్ అందుకోవడం లేదు”అనుచరుడి జవాబు
ఈ సంఘటన షుమారు నాలుగున్నర దశాబ్దాల క్రితం జరిగింది
అయితే ఈ సంఘటన వెనుక చిన్న నేపధ్యం కూడా ఉంది
అప్పటికి వంగవీటి మోహన రంగా రాజకీయ ప్రస్థానం మొదలవ్వలేదు
జననాయకుడిగా ప్రజల్లో తిరుగుతున్న రోజులు
విజయవాడ బుడమేరుకు వరదలు వచ్చి జనాలు తట్టాబుట్టలతో రోడ్డున పడ్డారని తెలిసింది
విషయం తెలియగానే వంగవీటి క్షణం ఆలస్యం చేయలేదు
ముంచుకొస్తున్న వరదలనుంచి వీలైంతమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి అనేది ఆయన మదిలో ఉన్న ఆలోచన
అయితే అప్పటికి ఆయనకి జన బలం మినహా ధన బలం లేదు
రాజకీయ పార్టీల అండ లేదు
అయినాసరే రోజువారీ కూలితో జీవితాలు నెట్టుకొస్తున్న బడుగు బలహీన వర్గాలు కూటికి లేక రోడ్డున పడ్డారని తెలిసిన వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా బుడమేరు వరద ప్రాంతానికి బయలుదేరారు
నిజానికి పదిమంది వరద బాధితులకు ఒక్క పూట భోజనం పెట్టే ఆర్థిక స్థోమత కూడా ఆయనకు లేదు
కనీసం బాధితులను దగ్గరలోని పునరావాస కేంద్రాలకు తరలిస్తే ప్రభుత్వ సాయమన్నా అందుతుందని ఆయన ఆలోచన
అదిగో అప్పుడు జరిగింది పై సంఘటన
కారులో పెట్రోల్ లేక ఆగిపోవడంతో ఒక్క క్షణం అనుచరులకు ఏం చెప్పాలో తెలీదు
కానీ మోహన రంగా మాత్రం క్షణం ఆలస్యం చేయకుండా కారు దిగి రోడ్డు మీద వెళ్తున్న సైక్లిస్టుని ఆపి సింగ్ నగర్ దగ్గర డ్రాప్ చేయమని అడగడంతో ఆయన దగ్గర పెట్రోల్ కొట్టించడానికి డబ్బులు లేవని అనుచరులకు అర్థమైంది
ఒక పక్కన తమ నాయకుడు ఎలాగైనా బుడమేరు ముంపు బాధితులను ఆదుకోవాలనే తొందరలో ఉన్నాడు
అలాగని ఆయన్ని ఒక్కడినే పంపించడం అనుచరులకు ఇష్టం లేదు
ఇంకోపక్కన పెట్రోల్ కొట్టించడానికి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు లేవు
ఏం చేయాలో తెలియక దిక్కులు చూస్తున్న సమయంలో నడిరోడ్డుమీద వంగవీటి కారు ఆగడం చూసి అటుగా వెళ్తున్న ఆయన అభిమాని ఒకరు విషయం తెలుసుకుని అప్పటికప్పుడు పెట్రోల్ క్యాన్ తెప్పించి కారులో పోయించడంతో సమస్య పరిష్కారం అయ్యింది
తిరిగి వంగవీటి కారులో కూర్చున్న తర్వాత బుడమేరు ముంపు ప్రాంతాల వైపు కదిలింది
అక్కడ చూస్తే పరిస్థితి ఘోరంగా ఉంది
జనాలు కట్టుబట్టలతో రోడ్లమీద పడి ఏడుస్తున్నారు
మరోవైపు ఇదే విధంగా ఇంకో 12 గంటలు బుడమేరు ముంపు కొనసాగితే ఆ ప్రాంతం పూర్తిగా మునిగిపోయే అవకాశాలు ఉన్నాయని , కాబట్టి బాధితులు వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని రేడియో వార్తల్లో చెప్తున్నారు
అయినా సరే చాలామంది తమ గూడు చెదిరిపోతుందేమో అన్న భయాందోళనలతో అక్కడ్నుంచి కదలడం లేదు
మరోపక్క అప్పటికే బుడమేరు ముంపు నడుం లోతుకి చేరుకుంది
కారు దిగిన వంగవీటి మోహన రంగా క్షణం ఆలస్యం చేయకుండా నడుం లోతు వరదలో దిగి ఎదురు వెళ్లడం మొదలుపెట్టాడు
వరదకు ఎదురెళ్ళడం ప్రాణాలకు ప్రమాదం అని ఒడ్డున ఉన్నవారు హెచ్చరిస్తున్నా ఆయన వినిపించుకోలేదు
ముంపులో ఇరుక్కుపోయిన వాళ్ళని ఎలాగైనా రక్షించాలని అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్లడం ప్రారంభించాడు
నిజానికి ఇది చాలా రిస్క్ తో కూడుకున్న వ్యవహారం
ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా వరదలో కొట్టుకుపోవడం ఖాయం
ఎవరీ కుర్రాడు ?
ఎక్కడ్నుంచి వచ్చాడు ?
ఏమిటితని ధైర్యం ?
వ్యవస్థలు చేయాల్సిన పనిని ఈ కుర్రాడు తన భుజాన వేసుకుని ప్రాణాలకు తెగించి బుడమేరులో ఎందుకు దిగాడు ?
దీనివల్ల ఇతడికి ఏమిటి లాభం ?
పోనీ ఏ రాజకీయ పార్టీ నాయకుడో అనుకుందాం అంటే ముందూ , వెనుకా ఏ జెండా లేదు
తమను కాపాడమని ఒకటికి పదిసార్లు పిలిస్తే కానీ రాని నాయకులున్న రోజుల్లో ఈ కుర్రాడు ఎవరూ పిలవకుండానే పరిగెత్తుకుంటూ ఎలా వచ్చాడు ?
ఒడ్డున నిల్చుని చూస్తున్న జనంలో రకరకాల ప్రశ్నలు ?
అదే జనంలో ఎవరో అరిచారు
“అతను ఎవరో కాదురా .. వంగవీటి మోహన రంగా .. మన రాధాగారి తమ్ముడు “
అంతే అప్పటికి ఈ కుర్రాడి గురించి జనానికి తెలిసింది అంతవరకే
అప్పటికే విజయవాడలో వంగవీటి రాధా యూనియన్ నాయకుడిగా ఎదుగుతున్న రోజులు నడుస్తున్నాయి
కమ్యూనిస్టులతో కలిసి ప్రస్థానం మొదలుపెట్టిన వంగవీటి రాధా తరువాతి రోజుల్లో సొంతంగా విద్యార్థి , కార్మిక సంఘాల నాయకుడిగా ఎదుగుతూ విజయవాడ చుట్టుపక్కల బడుగు బలహీన వర్గాల నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు
అటువంటి రాధా తమ్ముడు రంగా అనే గుర్తింపు ఉండేది
రాధా అప్పటికే యూనియన్ నాయకుడిగా బిజీగా ఉండేవారు
అదే సమయంలో వంగవీటి రంగా జనంలో తిరుగుతూ బిజీగా ఉండేవారు
కానీ ఆ క్షణాన ఆ జనాలకు తెలీదు
భవిష్యత్తులో ఇదే కుర్రాడు తన ఆశయాల సాధన కోసం రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి కార్పొరేటర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదుగుతాడని , రాధా తమ్ముడు రంగా అనే పేరునుంచి రంగా అన్న రాధా అనే స్థాయికి ఎదుగుతాడని , రాజకీయాల్లో ఉవ్వెత్తున ఎగసి పడిన కెరటం మాదిరి ప్రస్థానం కొనసాగిస్తాడని , ఇదే కుర్రాడి పేరును 75 సంవత్సరాలుగా జనం గుండెల్లో పెట్టుకుని ఊరూ వాడా విగ్రహాలు కట్టిస్తారని ఆ క్షణాన జనాలకు తెలీదు
ఇంకోపక్కన నడుం లోతులో దిగిన వంగవీటి ముందుకెళ్తున్న కొద్దీ నీటి ప్రవాహం గుండెలను తాకడం మొదలుపెట్టింది
ఆశ్చర్యం ఏంటంటే ఆయన అలా ముందుకెళ్తున్న సమయంలో చేతికి తాడు తగలడంతో ఆసరా దొరికిందని పట్టుకుని చూస్తే అది పాము
ఇంకొకరైతే భయపడి వెనక్కి వచ్చేసేవాడు
జనాలను రక్షించడం మాట దేవుడెరుగు
ప్రాణాలతో ఉంటే బలుసాకు తిని బతకొచ్చు అని వెనకడుగు వేసేవారు
కానీ చేతిలో పామును చూసి రంగా బెదరలేదు
దాన్ని దూరంగా విసిరి ముందుకే వెళ్లారు
బాధితులను చేరుకొని పునరావాస కేంద్రాలకు తరలి వెళ్ళడానికి వారిని ఒప్పించారు
ఏం మాయ చేసాడో ఏమిటో కానీ అప్పటిదాకా కదలని జనం వంగవీటి చెప్పడంతో ఆశ్చర్యంగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆయన వెనుక నడిచారు
సరిగ్గా బాధితులను తరలించడం పూర్తి అవగానే ఉదయం రేడియోల్లో చెప్పినట్టు ఆ ప్రాంతాన్ని బుడమేరు వరద ముంచెత్తింది
ఆ క్షణాన రంగా రిస్క్ తీసుకుని ప్రాణాలకు తెగించి బుడమేరు నుంచి తమను కాపాడకపోతే కుటుంబాలను కోల్పోయేవాళ్లమని బాధితులు కన్నీరు పెట్టుకున్నారు
ఆ రోజునుంచి రంగా మకాం పునరావాస కేంద్రాలకు మారింది
దాతలు ఇచ్చిన ఆహారాన్ని పంచిపెట్టడం , ప్రభుత్వ సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం జరిగింది
దాంతో పార్టీలకతీతంగా జనం రంగాను ఓన్ చేసుకున్నారు
రంగా నాయకత్వ విజయ రహస్యం అదే
తన చేతిలో ధనం లేకపోయినా నిత్యం జనంలో ఉండేవాడు
జనం మధ్యలో ఉండే తత్వమే ఆయన్ని జన నాయకుడిగా తీర్చి దిద్దింది
ఒక్కోసారి వ్యవస్థలు చేయలేని పని వ్యక్తులు చేస్తారు
నాయకులు ఎక్కడో కర్మాగారాల్లోనుంచి తయారవ్వరు
జనంలోనుంచే పుట్టుకొస్తారు
బాధితులు అన్నా అని పిలిస్తే నేనున్నా అంటూ సర్వకాల సర్వావస్థలందు ధైర్యంగా ముందుకొచ్చి నిలబడేవాడే జన నాయకుడు అవుతాడు
నేటి రోజుల్లో రాజకీయాలు అనేవి లాభసాటి వ్యాపారంగా మారిపోయింది
పూర్వీకులు సంపాదించిన ఆస్తులను పెంచుకోవడానికి కొంతమంది రాజకీయాల్లో చేరతారు. మరికొంతమంది కొత్త ఆస్తులు సంపాదించుకోవడానికి రాజకీయాల్లో చేరతారు. ఇంకొంతమంది కేసులనుంచి తప్పించుకోవడానికి రాజకీయాలను ఎంచుకుంటారు
గుట్కా , జూదం నడిపినవాళ్లు కూడా చట్ట సభల్లో ప్రవేశిస్తున్నారు
కానీ చేతిలో చిల్లిగవ్వ లేకుండా జనం కోసం తపన పడినవానినేమనాలి ?
ఇవాళ్టి రోజుల్లో కార్పొరేటర్ కూడా ఖరీదైన ఫార్చునర్ కారుల్లో తిరుగుతున్నారు
కానీ కారులో పెట్రోల్ పోయించుకోవడానికి కూడా డబ్బులు లేని స్థాయినుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగినా కూడా సొంతిల్లు లేని నాయకుడు వంగవీటి
ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రభుత్వం ఇచ్చిన లోనుతో మహీంద్రా జీపు కొనుక్కున్నారు
రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పి సీఎం క్యాండిడేట్ స్థాయికి ఎదిగినా కేవలం గుండెల్లో పెట్టుకుని చూసుకునే జనాల్ని మినహా ఆస్తులు , అంతస్తులు సంపాదించుకోలేకపోయిన వంగవీటి తన 41 ఏటనే హత్యకు గురై కన్నుమూశారు
వంగవీటి మోహన రంగాకు అత్యంత సన్నిహితుడు పైన చెప్పిన బుడమేరు సంఘటనకు ప్రత్యక్ష సాక్షి
ఆ రోజు కారులో రంగాతో పాటు బుడమేరు వెళ్లిన అనుచరులలో ఈయన కూడా ఒకరు
ఆయనే వంగవీటితో తన అనుభవాలను రచ్చబండ కబుర్లతో పంచుకున్నారు
ఈ ఆర్టికల్ షేర్ చేయదల్చుకున్నవారు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ , ఫేస్ బుక్ , ఇతర సోషల్ మీడియా ఐకాన్స్ ద్వారా షేర్ చేయొచ్చు
