Home » ప్రపంచంలోనే ఎత్తైన శివలింగం బీహార్లోని విరాట్ రామ మందిరంలో !

ప్రపంచంలోనే ఎత్తైన శివలింగం బీహార్లోని విరాట్ రామ మందిరంలో !

Spread the love

ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం మరోనాలుగు రోజుల్లో బీహార్లోని తూర్పు చంపారన్ లో ఉన్న విరాట్ రామాయణ మందిరంలో ప్రతిష్టాపన చేయడానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి
ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం

210 టన్నుల మహా శివలింగం

జనవరి 17,2026 కోసం ప్రపంచంలోని శివభక్తులు యావత్తు ఎదురుచూస్తున్న రోజు
ఎందుకంటే ఆ రోజుకి ఓ విశిష్టత ఉంది

శివ భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రపంచంలోనే ఎత్తైన భారీ శివలింగం ప్రతిష్టాపనకు నోచుకోబోతుంది

షుమారు పది సంవత్సరాల పాటు వందలాదిమంది శిల్పులు పడ్డ కష్టానికి తుది రూపం వచ్చిన సందర్భం ఆసన్నమైంది

విగ్రహం చెక్కడానికి ఎంత కష్టపడ్డారో , విగ్రహాన్ని తరలించటానికీ అంతే కష్టపడ్డారు

అయితే ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో ఎటువంటి అంతరాయాలు లేకుండా విగ్రహం పూర్తి అవడమే కాదు గమ్యస్థానానికి కూడా సురక్షితంగా చేరుకుంది

వేద చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయం

మరో నాలుగు రోజుల్లో అంగరంగ వైభవంగా విగ్రహ ప్రతిష్టకు బీహార్లోని విరాట్ రామాయణ మందిర ప్రాంగణంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి

బీహార్లోని కైత్వాలియా గ్రామం హరహర మహాదేవ్ నినాదాలతో మారుమోగిపోతుంది
దేశంలోని వేద పండితులు , సాధువుల అడుగులు బీహార్ వైపు పడుతున్నాయి

మహా శివ లింగ ప్రతిష్టకు బీజం పడింది ఎప్పుడు ?

2013 లో మహావీర్ మందిర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 120 ఎకరాల స్థలంలో విరాట్ రామాయణ మందిర ఏర్పాటుకు అప్పటి ట్రస్ట్ కార్యదర్శి ఆచార్య కిషోర్ కునాల్ సంకల్పం తీసుకోవడం జరిగింది

ఈ మహాసంకల్పం తీసుకున్నదే తడవు ద్వారకా పీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి సమక్షము లో దేవాలయ పనులు ప్రారంభించారు

ఈ కార్యక్రమానికి అప్పటి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా హాజరయ్యారు

మొత్తం 120 ఎకరాల స్థలంలో 270 అడుగుల ఎత్తులో 18 గోపురాలు , 22 దేవాలయాలు ఉండేలా రూపకల్పన చేసారు

మొదటి దేవాలయంలో శివలింగ ప్రతిష్ట చేయడానికి ఏర్పాట్లు చేసారు

2030 నాటికి ఈ ప్రాజెక్ట్ మొత్తం పూర్తి చేయాలనే అంచనాతో పనులు మొదలుపెట్టారు
ఇందుకు అయ్యే ఖర్చు మొత్తం మహావీర్ మందిర్ ట్రస్ట్ వారే భరిస్తారు

ప్రజలనుంచి విరాళాలు ఆశించకుండా విగ్రహ ప్రతిష్టకు మహావీర్ ట్రస్ట్ స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయం

అంచనాల ప్రకారం ఈ విరాట్ రామ మందిర నిర్మాణం పూర్తి అయితే అయోధ్య బాల రామ మందిరం స్థాయిలో విరాజిల్లుతుంది

ఒకే ప్రాంగణంలో 22 దేవాలయాల సముదాయం నిర్మించాలనే ఆలోచన కార్యరూపం ధరిస్తే భవిష్యత్తులో కైత్వాలియా గ్రామం ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతోంది అనడంలో సందేహం లేదు

అయితే అయోధ్య బాల రామాలయంలో పోలిస్తే ఈ మందిర నిర్మాణానికి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల తోడ్పాటు ఎంతవరకు ఉన్నాయో పూర్తి సమాచారం లేదు

ఏదిఏమైనా చక్కటి సత్కార్యానికి పూనుకున్న మహావీర్ మందిర్ ట్రస్ట్ నిర్వాహకులు అభినందనీయులు

తమిళనాడులోని మహాబలిపురంలో శివలింగం చెక్కే పనులు మొదలు

ఈ ప్రతిపాదనలలో భాగంగా ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగాన్ని చెక్కే బాధ్యతను తమిళనాడులోని మహాబలిపురానికి చెందిన శిల్పికి అప్పచెప్పారు

అక్కడ శిల్పి 210 టన్నుల బరువున్న ఒకే నల్ల గ్రానైట్ రాతిని షుమారు పదేళ్ళపాటు శ్రమించి చెక్కి అద్భుతమైన శివలింగాన్ని తయారుచేసారు

దీని ఉపరితలం మీద 1008 సహస్ర లింగాలు కూడా చెక్కడం అదనపు ఆకర్షణగా నిలిచింది

ఇంతటి భారీ శివలింగం రూపుదిద్దుకోవడం ఆధ్యాత్మిక చరిత్రలోనే ఓ కొత్త అధ్యాయం అని పండితులు విశ్లేషించారు

గత వెయ్యేళ్ళ చరిత్రలో ఇంతటి భారీ విగ్రహ రూపకల్పన చేయడం ఇదే మొదటిసారి అని వారు అభిప్రాయపడుతున్నారు

ప్రస్తుతం ఉన్న అతిపెద్ద శివలింగం

ఇప్పటివరకు తమిళనాడులోని తంజావూర్ లో చోళ వంశ రాజు రాజరాజ చోళుడు ప్రతిష్టించిన శివలింగమే అతిపెద్దది

తంజావూర్ లోని ఈ విగ్రహానికి చారిత్రక నేపధ్యం కూడా ఉండటంతో నేటికీ శివ భక్తుల పూజలు అందుకుంటుంది

ఇప్పటికీ పండుగలు , పర్వదినాలకు భక్తులు తంజావూర్ కి పోటెత్తుతారు

కానీ ఇప్పుడు బీహార్లో ప్రతిష్టించబోయే శివలింగం ఆ రికార్డుని బద్దలుకొట్టింది

33 అడుగుల ఎత్తు , 33 అడుగుల చుట్టుకొలతతో 210 టన్నుల ఏకశిలా విగ్రహంతో రూపుదిద్దుకున్న ఈ శివలింగం ప్రపంచంలోనే ఎత్తైన శివలింగంగా రికార్డుని నమోదు చేసుకుంది

విగ్రహం తరలింపు

షుమారు పదేళ్ళపాటు శ్రమించి చెక్కిన ఈ భారీ శివలింగాన్ని మహాబలిపురం నుంచి 2,500 కిలోమీటర్ల దూరం అవతల ఉన్న బీహార్లోని తూర్పు చంపారన్ దగ్గర ఉన్న కైత్వాలియా గ్రామానికి రోడ్డు మార్గం ద్వారా చేరవేసే ఏర్పాట్లు జరిగాయి

210 టన్నుల ఏకశిలా విగ్రహ బరువును మోయగలిగే ప్రత్యేక రవాణా వాహనం మీదకు చేర్చి హరహర మహాదేవ్ అనే నినాదాలతో ప్రయాణం ప్రారంభించారు

ఈ కార్యక్రమంలో తమిళనాడుకి చెందిన శిల్పులతో పాటు పలువురు వేద పండితులు కూడా పాల్గొన్నారు

నెమ్మదిగా ప్రయాణం మొదలుపెట్టిన ఈ శకటం తమిళనాడు , ఆంధ్రప్రదేశ్ , మహారాష్ట్ర , మధ్యప్రదేశ్ రాష్ట్రాల మీదుగా షుమారు 45 రోజులపాటు ప్రయాణించి బీహార్లో అడుగుపెట్టింది

దారిపొడవునా భక్తులు రథానికి నీరాజనాలు పట్టారు

ఇక ఈ వాహనం బీహార్లో అడుగుపెట్టినప్పుడు అక్కడి ప్రజలు బ్రహ్మరధం పట్టారు

దారిపొడవునా విగ్రహానికి హారతులు ఇస్తూ , పూలు చల్లుతూ హరహర మహాదేవ్ నినాదాలతో హోరెత్తించారు

ఇక అడుగడుగునా భక్తులు హారతులు ఇస్తుండటంతో రధం కదలటానికి చాలా టైం తీసుకుంది

అక్కడ్నుంచి ఈ విగ్రహం తూర్పు చంపారన్ లోని కైత్వాలియా గ్రామానికి బయలుదేరింది

విగ్రహ ప్రతిష్టాపన ఎప్పుడు ?

జనవరి 17, 2026 న మొదటి దేవాలయంలో ఈ భారీ శివలింగ విగ్రహ ప్రతిష్టాపనకు ఏర్పాట్లు జరిగాయి

ఆ రోజు విశిష్టత ఏంటి ?

ఆ రోజు మాఘ కృష్ణ చతుర్దశి అయ్యింది

శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు
అదే రోజు మొదటిసారిగా శివుడు లింగ రూపంలో కనిపించాడని హిందువుల విశ్వాసం

గ్రహాల కూడికల దృష్ట్యా ఆ రోజు శివ పూజకు విశేష దినం
ఒకరకంగా శివరాత్రి వంటి పర్వదినం

అందుచేతనే మహావీర్ ట్రస్ట్ వారు పండితుల సూచనలతో ఆ రోజున విగ్రహ ప్రతిష్టకు ముహూర్తం నిర్ణయించారు

ఆలయ సూపరింటెండెంట్ మీడియాకి ఇచ్చిన సమాచారం ప్రకారం ,

ఆ రోజున కైలాస మానస సరోవరం , గంగోత్రి , హరిద్వార్ , ప్రయాగ్ రాజ్ , సోన్పూర్ తదితర ఐదు పవిత్ర ప్రదేశాలనుంచి తీసుకొచ్చిన పుణ్య జలాలతో ప్రాణప్రతిష్ట నిర్వహించబడుతుంది

శివలింగ ప్రతిష్ట సమయంలో హెలీకాఫ్టర్లనుంచి పూల వర్షం కురిపిస్తారు

ప్రఖ్యాత వేద పండితుడు భగవత్ ఝా ఆధ్వర్యంలో శాస్త్రోస్తక నియమాలను ఆచరిస్తూ ప్రాణప్రతిష్ట చేస్తారు

అంతకుముందు సంప్రోక్షణలో భాగంగా చేసే క్రతువుల్లో దేశంలోని పవిత్ర నదులు , సంగమ ప్రాంతాలనుంచి తీసుకొచ్చిన మట్టి , నీరును ఉపయోగిస్తారు

అష్టకమల యంత్రం నిర్దేశకాల ప్రకారం ఎనిమిది దిక్కులా ఎనిమిది శివ రూపాలను ప్రతిష్టిస్తారు
మధ్యలో శివ పార్వతులను సహస్త్ర రూపంలో ప్రతిష్టిస్తారు

అక్కడ్నుంచి ఆగమ శాస్త్రాల ప్రకారం పండితులచే వేద పారాయణం , యజ్ఞయాగాదుల క్రతువులు ప్రారంభం అవుతాయి

ఆ రోజు ఉదయం ఎనిమిది గంటలనుంచి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి

కార్యక్రమ అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ ఏర్పాట్లు చేసారు

ఇప్పటికే పెద్దఎత్తున సాధువులు , పండితులు కైత్వాలియా గ్రామానికి చేరుకున్నారని తెలుస్తుంది

ఈ కార్యక్రమానికి కేంద్రం నుంచి కానీ రాష్ట్రంనుంచి గానీ ప్రముఖులను ఎవర్ని పిలుస్తున్నారు అనే వివరాలు తెలియాల్సి ఉంది

ముగింపు : ఈ భారీ శివలింగ ప్రతిష్ట నిజంగా ఆధ్యాత్మిక చరిత్రలో కొత్త అధ్యాయం సృష్టిస్తుంది . 120 ఎకరాల సువిశాలమైన విరాట్ రామ మందిర ప్రాంగణంలో నిర్మిస్తున్న 22 దేవాలయాల సముదాయంలో మొదటి ఆలయంలో ఈ భారీ శివలింగ ప్రతిష్ఠతో బీహార్ ఆధ్యాత్మిక చరిత్రలో కొత్త పేజీని తెరిచింది . ఈ ఆలయ నిర్మాణం పూర్తి అయితే భవిష్యత్తులో బీహార్ కూడా భక్తుల రాకతో పర్యాటక కేంద్రంగా విలసిల్లుతుంది . ఇంతటి సత్కార్యానికి పూనుకున్న మహావీర్ ట్రస్ట్ వారికీ అభినందనలు . ప్రభుత్వం కూడా ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆర్థికంగా కాకపోయినా మౌలిక వసతుల కల్పనలో తగు ప్రోత్సాహం అందిస్తే సంస్థలకు మరింత చేయూత అందించిన వారు అవుతారు


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!