Home » యూపీఏ (ఇండి కూటమి) వైపు జగన్ అడుగులు పడుతున్నాయా ? నిజమేనా ? అసలు పెళ్ళిలో ఏం జరిగింది ?

యూపీఏ (ఇండి కూటమి) వైపు జగన్ అడుగులు పడుతున్నాయా ? నిజమేనా ? అసలు పెళ్ళిలో ఏం జరిగింది ?

Spread the love

నిన్న చెన్నైలో జరిగిన వైఎస్ జగన్ కజిన్ కుటుంబంలో జరిగిన వివాహ వేడుక సోషల్ మీడియాలో సరికొత్త రాజకీయ చర్చకు నాంది పలికింది

విశేషం ఏంటంటే ఈ వివాహ వేడుకల్లోని దృశ్యాలను వైసీపీతో పాటు టిడిపి సోషల్ మీడియా వింగ్ కూడా ఫొటోలతో , కథనాలతో హోరెత్తించింది

వివాహ వేడుకల్లో వైఎస్ జగన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారని ,తమిళ నటులు ,నాయకులూ ఆయనతో కలిసి దిగిన ఫోటోలను వైసిపి సోషల్ మీడియా వింగ్ ఇంటర్నెట్ లో పంచుకున్నారు

మరోపక్క టిడిపి సోషల్ మీడియా వింగ్ కూడా వివాహ వేడుకల్లో జగన్ వ్యవహరించిన తీరును ప్రస్తావిస్తూ కథనాలు అల్లింది

వాటిలో ప్రధానమైంది ఏంటంటే త్వరలో జగన్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ( ఇండియా ) కూటమిలో చేరతారని , అందుకు ఈ వివాహ వేడుకలే వేదిక అయ్యిందని రాసుకొచ్చారు

నాకు ఆశ్చర్యం వేసింది

ఆ కథనాన్ని పోస్ట్ చేసింది కూడా టిడిపి సోషల్ మీడియా వింగ్ కు సంబంధించిన వ్యక్తి

ఈ కథనం పై టిడిపి నాయకత్వం అధికారికంగా స్పందించకపోయినా ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వింగ్ లో సర్క్యులేట్ అవుతుంది కాబట్టి కొంత ప్రాధాన్యత ఉంటుంది

ఇంతకీ ఆ కథనం పూర్తి పాఠం ఏంటి ?
వైఎస్ జగన్ నిజంగానే యూపీఏ వైపు అడుగులు వేస్తారా ?
అసలు పెళ్ళిలో ఏం జరిగింది ?

చిన్న విశ్లేషణ చేసుకుందాం

వైఎస్ జగన్ పెద్దనాన్న జార్జిరెడ్డి కుమారుడు సునీల్ రెడ్డి కొడుకు సాహిల్ రెడ్డి వివాహ వేడుకలు ఆదివారం నాడు చెన్నైలోని లీలా ప్యాలస్ హోటల్లో అంగరంగ వైభవంగా జరిగింది

ఈ వేడుకలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు , ఆంధ్రప్రదేశ్ మాజీముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా హాజరు అయ్యారు

మరోపక్క ఈ వివాహ వేడుకలకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ , డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తో సహా పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు

రాజకీయ నాయకులతో పాటు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన నటులు సూర్య , కార్తీ , విజయ్ వంటి నటులు కూడా హాజరయ్యారు

అయితే ఈ వివాహ వేడుకల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజంగానే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు

తమిళ సినీ నటులు సూర్య , కార్తీ లు జగన్ ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని పలకరించారు

మరో తమిళ నటుడు , రాబోయే తమిళనాడు ఎన్నికల్లో తలపడటానికి సిద్ధం అవుతున్న టీవీకే అధ్యక్షుడు తలపతి విజయ్ అయితే జగన్ కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆయన పక్కనే కూర్చుని ముచ్చటించారు

ఈ సమయంలో సహజంగా అందరి దృష్టి వీరిద్దరిపైననే పడుతుంది . అలా పడింది కూడా

ఎందుకంటే విజయ్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమి కట్టి ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధం అవుతున్నారు

మరోపక్క ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ ముందునుంచీ బీజేపీ కి వ్యతిరేకంగా ఉంది

ఇలాటి పరిస్థితుల్లో స్టాలిన్ ఈ వేడుకలో వైఎస్ జగన్ ను కలవడం రకరకాల ఊహాగానాలకు తెర తీసింది

నిజానికి తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా జగన్ కు ఆత్మీయపూర్వకంగా నమస్కరించి పలకరించారు కానీ ఆయనతో విడిగా మాట్లాడినట్టు కనిపించలేదు

ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో కొన్ని కథనాలు సర్క్యులేట్ అవుతున్నాయి

వాటిలో ప్రధానమైన అంశాలు ఏంటంటే ,

ఇప్పటివరకు జగన్ పట్ల సానుకూల వైఖరి అవలంభించిన బీజేపీ కేంద్ర నాయకత్వం తిరుమల లడ్డూ వ్యవహారంలో యూ టర్న్ తీసుకుని ఆయనకు వ్యతిరేకంగా టిడిపి , జనసేనలు చేస్తున్న ఆరోపణలను బాహాటంగా సమర్దిస్తుంది కాబట్టి వైఎస్ జగన్ కూడా మోడీకి , బీజేపీ కి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారని రాసారు

అందులో భాగంగా వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమిలో చేరి తమిళనాడు ఎన్నికల్లో ఎన్డీయే కు వ్యతిరేకంగా పనిచేస్తారని , జగన్ రాకకు కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ కూడా ఓకే చెప్పేశారని రాసుకొచ్చారు

ఈ మొత్తం డీల్ తెరవెనుక ఉండి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నడిపించారని రాసారు

టూకీగా ఆ కథనం సారాంశం ఇది

ఇప్పుడు వైఎస్ జగన్ సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ కూటమిలో చేరడం ఎంతవరకు సాధ్యమౌతుందో విశ్లేషణ చేసుకుందాం

పై కథనం చదివినప్పుడు వైఎస్ జగన్ మొండితనం , పట్టుదల గురించి తెలిసినవాళ్లకు ఏమర్థమౌతుంది ?

కొన్ని సందేహాలు వస్తాయి

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత సోనియా చెప్పినట్టు నడుచుకుని రాజీ పడి ఉంటే అతడి రాజకీయ ప్రస్థానం ఎలా ఉండేదో తెలీదు కానీ ఇప్పటికీ ఎదుర్కుంటున్న కేసులు ఉండేవి కావని ప్రతి ఒక్కరికి తెలుసు

షుమారు 18 నెలలు జైల్లోనే గడిపినప్పటికీ జగన్ కాంగ్రెస్ పార్టీతో కానీ , సోనియాతో కానీ రాజీ చేసుకుందామనే ఆలోచనే చేయలేదు

సొంతంగా పార్టీ పెట్టుకుని తన బలం సరిపోతుందో లేదో తెలియకపోయినా ఎన్నికలకు మొండిగా ఒంటరిగానే వెళ్ళాడు కానీ పొత్తు ఆలోచనలు చేయలేదు

బీజేపీ తో పొత్తు లేకపోయినప్పటికీ అధికారంలోకి వచ్చాక సత్సంబంధాలే మెయింటైన్ చేసారు

గడిచిన ఎన్నికల్లో టిడిపి , జనసేన , బీజేపీ లు కూటమి కట్టినా పొత్తు ఆలోచన చేయలేదు

చేతిలో అధికారం జారిపోయినా బీజేపీ కేంద్ర నాయకత్వంతో తన సంబంధాలు కాపాడుకుంటూ వచ్చారు

ఒకరకంగా చెప్పాలంటే గడిచిన ఎన్నికల ముందు వరకు బీజేపీ అగ్ర నాయకులు మోడీ , అమిత్ షా వంటి నాయకులతో చంద్రబాబు కన్నా వైఎస్ జగన్ తోనే సంబంధాలు బాగుండేవి

ఒకానొక సమయంలో బీజేపీ తో చంద్రబాబు వైరం రాజకీయ వైరం నుంచి వ్యక్తిగత వైరంగా మారింది

మోడీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీతో కూటమి కట్టి ప్రచారం చేయడం , తిరుపతి పర్యటనలో టిడిపి కార్యకర్తలు అమిత్ షా కాన్వాయ్ మీద రాళ్ల దాడి చేయడం వంటి అంశాలు బాబును మోడీ , అమిత్ షా లకు దూరం చేసాయి

దరిమిలా రాహుల్ కూటమి నుంచి బాబు బయటికి వచ్చినా బీజేపీ పెద్దలతో ఆయన సంబంధాలు మెరుగుపడలేదు

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన బాబు ఒకానొక దశలో మోడీ అప్పాయింట్మెంట్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది

2024 ఎన్నికలకు ముందువరకు దాదాపు ఇదే పరిస్థితి కొనసాగింది

మరోపక్క బీజేపీ వైఎస్సార్సీపీ ని తన రాజకీయ ప్రత్యర్థిగానే భావించింది తప్ప వైఎస్ జగన్ను వ్యక్తిగత శత్రువుగా భావించలేదు

అందుకే పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లుల విషయంలో జగన్ సహకారం తీసుకుంది
జగన్ కూడా బీజేపీ కేంద్ర నాయకత్వంతో స్నేహపూర్వక వైఖరి కొనసాగిస్తూ వచ్చారు

కానీ గడిచిన ఎన్నికల నాటికి దక్షిణాదిన కూడా తమ జెండా ఎగరాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది

ఉత్తరాదిన బలం పుంజుకున్న బీజేపీ దక్షిణాది రాష్ట్రాల వైపు దృష్టి సారించింది
వాటిలో ఏపీ కూడా ఒకటి

అయినప్పటికీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి ఏపీలో అధికారంలోకి రావడం కష్టమన్న సంగతి బీజేపీ కి కూడా తెలుసు

సొంతంగా అధికారంలోకి రాకపోయినా ఏపీలో నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలని బీజేపీ భావించింది

సరిగ్గా ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ రూపంలో గేమ్ ఛేంజర్ ఎంటర్ అయ్యాడు

అది కూడా వైసిపి ప్రభుత్వం బాబును అరెస్ట్ చేసి జైల్లో పెట్టడంతో బయటపడింది
అప్పుడే పొత్తు నిర్ణయాలకు అంకురార్పణ జరిగింది

నిజానికి బాబును అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు నారా లోకేష్ ,పురంధరేశ్వరిని వెంటపెట్టుకుని ఢిల్లీ వెళ్లి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కలిసినప్పటికీ ఆయన నుంచి బాబుకు అనుకూలంగా ఆశించిన స్థాయిలో సానుకూల స్పందన రాలేదు

ఈ పరిస్థితుల్లో టిడిపితో జనసేన పొత్తును పవన్ కళ్యాణ్ ప్రకటించారు
ఆయన ప్రకటించడమే కాదు కూటమిలో జత కట్టడానికి బీజేపీ ని కూడా ఒప్పించారు

ఈ పరిస్థితుల్లో కూడా ఎన్నికలకు ఒంటరిగానే వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు

పర్యవసానంగా అధికారం కోల్పోయి కేవలం 11 స్థానాలకే ఆయన పరిమితం కావాల్సి వచ్చింది

అయినా కూడా జగన్ కు వచ్చిన 40 శాతం ఓటింగ్ సంగతి ప్రత్యర్థి పార్టీలు మర్చిపోలేదు

ఆ 40 శాతం ఓటింగును తగ్గించటానికి తిరుమల లడ్డూ అంశం ప్రధాన అస్త్రమైంది

ప్రస్తుతం ఆ అంశం మీదే ఇరు పార్టీలు హోరాహోరీగా ఆరోపణలు చేసుకుంటున్నాయి

ఈ పరిస్థితుల్లో జగన్ మోడీని కాదని రాహుల్ గాంధీతో డీల్ కుదుర్చుకుంటాడా ?

తన రాజకీయ భవిష్యత్తుకు అడ్డంకిగా నిలిచిన సోనియాతోను , ఆవిడ పార్టీతోనూ జగన్ ఏవిధంగా పొత్తు పెట్టుకుంటాడు?

అసలు మోడీతో విడిపోయేంత గొడవలు జగన్ కు ఏమున్నాయి ?

లడ్డూ వివాదంలో కూడా బీజేపీ నాయకులు , వి హెచ్ పి నాయకుల నుంచి విమర్శలు వచ్చాయేమో కానీ నేరుగా మోడీ కానీ , అమిత్ షా కానీ విమర్శలు చేసారా ?

బీజేపీ ని కాదని పక్క రాష్ట్రానికి పోయి మరీ జగన్ డీఎంకే అండ్ కో కు అనుకూలంగా ప్రచారం చేసి సాధించేది ఏముంటుంది ?

ఇండియా కూటమిలో చేరడం వల్ల జగన్ కు వచ్చే అదనపు రాజకీయ మైలేజీ ఏముంటుంది?

కాంగ్రెస్ తో కలవాలంటే ముందు చెల్లిని ఒప్పించాలని , రాజీ చేసుకోవాలని జగన్ కు తెలీదా ?

ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఇండియా కూటమి సాధించిన ఫలితాలను చూసిన జగన్ ఏ రకంగా ఆ కూటమితో పొత్తు పెట్టుకోవాలని అనుకుంటాడు ?

ఇప్పటికే లడ్డూ వివాదంలో విమర్శలు ఎదుర్కుంటున్న జగన్ హిందూ మత విశ్వాసాలను బహిరంగంగా విమర్శించిన స్టాలిన్ కూటమితో ఎలా పొత్తు పెట్టుకుంటారు ?

పెళ్ళిలో కొందరు నాయకులు క్యాజువల్ గా కలిసినంతమాత్రాన జగన్ అర్దాంతరంగా తన పొలిటికల్ స్ట్రాటజీలు మార్చుకుంటాడా ?

నా విశ్లేషణ ప్రకారం జగన్ యూపీఏ కూటమిలోకి వెళ్తాడని అనుకోవడం లేదు

దయచేసి ఈ ఆర్టికల్ జగన్ కు అనుకూలంగానో , చంద్రబాబుకు వ్యతిరేకంగానో రాసినట్టు భావించకండి

చెన్నైలో జరిగిన వివాహ వేడుకల్లో కొంతమంది తమిళ నాయకులు కలవడంతో జగన్ త్వరలో యూపీఏ లో చేరతారు అనే ఊహాగానాలతో సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చను చూసిన తర్వాత నా విశ్లేషణను తెలియచేసాను

అలా అని ఈ విశ్లేషణ లో తెలియచేసిన ప్రకారమే రాజకీయాలు నడుస్తాయనే నియమం ఏమీ లేదు

కాకపోతే ఇప్పటిదాకా పొత్తుల విషయంలో జగన్ అనుసరించిన తీరును గమనిస్తే ఆయన కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏతో పొత్తు పెట్టుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అని అనిపిస్తుంది !


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!