టూరిజం అధికారులూ .. ఓపాలి అనంతగిరి హిల్స్ మీద లుక్కేయండి !
పర్యాటక రంగం మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టాలే కానీ దాన్ని మించిన చక్కటి ఆదాయ వనరు మరోటి ఉండదు
అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులు నిరుపయోగంగా మారిపోతున్నాయి
దక్షిణాది రాష్ట్రాల్లో టూరిజం విషయంలో కేరళ , తమిళనాడు మెరుగ్గా ఉంటాయి
ప్రకృతి పరంగా కేరళలో చక్కటి అందాలను ఆస్వాదించే అవకాశం ఉండగా .. రమణీయమైన ప్రకృతి దృశ్యాలతో పాటు చక్కటి దేవాలయాల సందర్శనకు తమిళనాడు అనువుగా ఉంటుంది
అలాగే ఆయా రాష్ట్రాల్లో అధికారుల శ్రద్ద వల్ల మౌలిక సదుపాయాల కల్పనతో టూరిజం రంగం ముందుంది
ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నానంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా చక్కటి టూరిజానికి అనువైన ప్రదేశాలు ఉన్నాయి
కానీ ప్రభుత్వాల అశ్రద్ధ వల్లో .. అధికారుల నిర్లక్ష్యం వల్లనో కానీ పర్యాటక రంగం ఆశించిన విధంగా అభివృద్ధి చెందలేదు
తెలంగాణాలో హైద్రాబాదుకు 75 కిలోమీటర్ల దూరంలో వికారాబాదు సమీపంలో ఫారెస్ట్ ఏరియాలో ప్రకృతి రమణీయత ఉట్టిపడే అనంతగిరి హిల్స్ ఉంది
చుట్టూ చిన్న చిన్న కొండలతో పచ్చందాలు పరుచుకుని పర్యాటకులను చూపు తిప్పుకోనీయవు
ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే షుమారు వెయ్యి సంవత్సరాల క్రితం స్వయంభువుగా వెలిసిన అనంత పద్మనాభ స్వామి కోవెల ఉంది
చుట్టూ పచ్చని చెట్ల మధ్యలో ప్రశాంతమైన వాతావరణంలో వెలసిన కోవెల భక్తులను ఆధ్యాత్మిక భావనతో కట్టిపడేస్తుంది
అక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలో పురాతన శివాలయం ఉంది
పచ్చని పంట పొలాల మధ్యలో ఉన్న శివాలయం భక్తులకు మానసిక ప్రశాంతతను ఏర్పరుస్తుంది
అనంతగిరి హిల్స్ కేవలం భక్తులకు మాత్రమే కాదు పర్యాటకులకు కూడా చక్కటి అనుభూతిని ఇచ్చే ప్రదేశం
అనంత పద్మనాభ స్వామి గుడి నుంచి షుమారు 20 కిలోమీటర్లు వెళితే వ్యూ పాయింట్ వస్తుంది
మీరు వ్యూ పాయింట్ ఎంట్రన్స్ లోకి రాగానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గార్డ్ వెహికల్ పార్కింగ్ కి టోకెన్ ఇచ్చి 50 రూపాయలు తీసుకుంటాడు
అలా అని ముందుకెళ్లి పార్కింగ్ ఎక్కడుందా అని చూస్తే మనకేమీ కనిపించదు
అక్కడ కొంత ఖాళీ స్థలం కనిపిస్తుంది
మనం అదే పార్కింగ్ అనుకోవాలి
మేము వెళ్ళినప్పుడు వర్షం పడటంతో ఆ ఖాళీ స్థలం అంతా బురదతో నిండిపోయింది
సరే వ్యూ పాయింట్ చూద్దామని ఒక ఐదు వందల మీటర్లు నడుచుకుంటూ వెళితే చెరువు కనిపిస్తుంది
వ్యూ పాయింట్ అంటే అక్కడ చిన్న రిజర్వాయర్ చుట్టూ చెరువు ఉంటుంది
అక్కడ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళో , కాంట్రాక్టరో తెలీదు కానీ ఒక చిన్న టెంటులో ఓ కుర్రాడు బల్ల వేసుకుని టికెట్లు కొడుతున్నాడు
తెడ్డు వేసుకుని సెల్ఫ్ డ్రైవ్ చిన్న పడవ అయితే ముప్పై నిమిషాలకు ఇద్దరికీ 300 రూపాయలు తీసుకుంటాడు
పెడెస్టెల్ బోట్ అయితే 400 రూపాయలు తీసుకుంటాడు
టికెట్ తీసుకున్నవాళ్ళకి లైఫ్ జాకెట్లు ఇస్తారు
ఓ అర్ధగంట చెరువులో షికారు చేసి రావొచ్చు అన్నమాట
ఒకవేళ నీటి ప్రమాదాలు ఏర్పడితే గజ ఈతగాళ్లను సైతం సిద్ధంగా ఉంచారు
ఇంతవరకు బానే ఉంది
కానీ వచ్చిన పర్యాటకులు కూర్చుని సేద తీరడానికి కనీస సౌకర్యాలు లేవు
ఎంతమంది వచ్చినా నిలబడాల్సిందే
పోనీ నేల మీద కూర్చుందామా అంటే నేలంతా చెత్తాచెదారంతో తడిగా ఉండటంతో కింద కూర్చోలేం
టూరిజం అధికారులు కాస్త శ్రద్ద పెడితే వ్యూ పాయింట్ అద్భుతంగా తీర్చిదిద్దవచ్చు
చెరువు గట్టు అంతా చక్కటి లాన్ వేస్తె చూడటానికి అందంగా ఉండటంతో పాటు పర్యటకులు సేద తీరడానికి అనువుగా ఉంటుంది
అక్కడే చిన్నపిల్లల కోసం ప్లే ఏరియా ఏర్పాటు చేసి టికెట్లు పెడితే ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు పర్యాటకులు ఎంజాయ్ చేస్తారు
ఇక వచ్చిన పర్యాటకులకు సరైన టాయిలెట్ సదుపాయాలు లేవు
యూరినల్స్ కోసం అక్కడే ఒక పెయిడ్ మొబైల్ వ్యాన్ ఏర్పాటు చేసారు కానీ పూర్తి అపరిశుభ్రంగా ఉంది
టూరిజం అధికారులు శ్రద్ద తీసుకుని శాశ్వత ప్రాతిపదికన పబ్లిక్ టాయిలెట్ సిస్టం అందుబాటులోకి తీసుకువస్తే మహిళలు ఇబ్బంది పడకుండా ఉంటారు
ఇక అక్కడికి వచ్చిన పర్యాటకులకు ఫుడ్ కావాలంటే రోడ్ సైడ్ కాకా హోటళ్లే దిక్కు
పోనీ అక్కడ ఫుడ్ బావుంటుందా అంటే అదీ లేదు
ధరలు చూస్తే నిలువు దోపిడీ
పట్టించుకునే నాధుడు లేనప్పుడు అంతే ఉంటుంది కదా
అధికారులు హరిత హారం రెస్టారెంట్లు ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తే బావుంటుంది
అక్కడ్నుంచి తిరిగొస్తుంటే ట్రెక్కింగ్ పాయింట్ కనిపిస్తుంది
ట్రెక్కింగ్ చేయాలనుకునే పర్యాటకులు ఆ కొండల్లోకి పోయి సాయంత్రానికి తిరిగి రావాలి
నిజానికి ఈ ట్రెక్కింగ్ లో థ్రిల్ యెంత ఉంటుందో ఆదమరిస్తే కిల్ కూడా అంతే ఉంటుంది
రైనీ సీజన్లో ఈ ట్రెక్కింగ్ మరీ డేంజర్ .. కాలు జారితే అంతే సంగతులు
మొన్న మేము వెళ్ళినప్పుడు వర్షంలో కుర్రకారు ట్రక్కింగ్ చేస్తూ ఎక్కడికో వెళ్లిపోతున్నారు
ఇక్కడ కూడా పట్టించుకునే నాధుడు లేడు
ప్రాణాపాయం సంగతి అలా ఉంచితే పోకిరీల బారి నుంచి అమ్మాయిలకు రక్షణ కల్పించే కనీస ఏర్పాట్లు ఏవి ?
నిర్మానుష్యమైన ఆ ప్రాంతంలో చిన్న సెక్యూరిటీ పోస్ట్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది
చివరగా ప్రభుత్వ పెద్దలు .. టూరిజం అధికారులు కొంచెం శ్రద్ద పెడితే అనంతగిరి హిల్స్ అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందడమే కాకుండా ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మారుతుంది అనడంలో సందేహం లేదు !
పరేష్ తుర్లపాటి