Home » హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ సినిమాల్లో ఛాంపియన్ అవుతాడా ? – ఛాంపియన్ మూవీ రివ్యూ

హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ సినిమాల్లో ఛాంపియన్ అవుతాడా ? – ఛాంపియన్ మూవీ రివ్యూ

Spread the love

హీరో చూస్తే శ్రీకాంత్ కొడుకు , బ్యానర్ చూస్తే మహానటి వంటి హిట్ మూవీ తీసిన స్వప్న దత్ వాళ్ళది, చిత్రాన్ని సమర్పించింది జీ స్టూడియోస్ వారు అవడంతో ఛాంపియన్ మూవీపై విడుదలకు ముందే ఇండస్ట్రీలో కొన్ని అంచనాలు ఏర్పడ్డాయి

అలాఅని చిన్న హీరో కాబట్టి లో బడ్జెట్లో తీయలేదు
నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ పడకుండా షుమారు 40 కోట్లకు పైనే ఖర్చు పెట్టారు

దాంతో సినిమాకి టీజర్ రిలీజ్ సమయంలోనే కొంత హైప్ వచ్చింది

మరి అంచనాలకు తగ్గట్టుగానే ఛాంపియన్ ఉందా ? లేదా ? అనేది ఇప్పుడు చూద్దాం

కథ ఏంటంటే ?

కథ మొదలు అవడమే భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత హైద్రాబాదు సంస్థానాన్ని భారత్ లో విలీనం చేయడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేస్తున్న ప్రయత్నాలతో మొదలౌతుంది

మైఖేల్ విలియం సికింద్రాబాద్ తరపున ఆడే ఫుట్ బాల్ ప్లేయర్

ఎప్పటికైనా ఇదే ఆటలో ఛాంపియన్ అయి ఇంగ్లాండ్ వెళ్ళిపోయి అక్కడే సెటిలైపోవాలనేది అతడి లక్ష్యం

అయితే అతడు ఎదురు చూసిన అవకాశం ఓ రోజు రానే వచ్చింది
కానీ తండ్రి కారణంగా విలియం ఇంగ్లాండ్ అవకాశాలకు బ్రేక్ పడుతుంది

ఈ పరిస్థితుల్లో తాము చెప్పిన విధంగా ఆయుధాలు తరలిస్తే అతడిని ఇంగ్లాండ్ చేర్చే బాధ్యత తాము తీసుకుంటామని ఓ ఆయుధ డీలర్ చెప్పడంతో విలియం అందుకు ఒప్పుకుంటాడు

ఈ క్రమంలో అతడు అనుకోకుండా తెలంగాణలోని భైరాన్ పల్లి అనే గ్రామానికి చేరుకుంటాడు

అక్కడే మైఖేల్ కి చంద్రకళ (అనశ్వర రాజన్ ) పరిచయం అవుతుంది

మరోపక్క అదే సమయంలో గ్రామస్తులు రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తుంటారు

ఈ పరిస్థితుల్లో మైఖేల్ ఏం చేస్తాడు ?

గ్రామస్తులతో కలిసి నిజాం సంస్థానానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాడా ? లేదా క్రీడాకారుడిగా ఇంగ్లాండ్ లో సెటిలైపోవాలనే తన లక్ష్యానికి అనుగుణంగా ఆయుధాలు తరలించి వెళ్ళిపోతాడా ? అనేది మిగిలిన కథలో తెలుస్తుంది

సినిమా ఎలా ఉందంటే ?

టైటిల్ చూడగానే ఇదేదో క్రీడానేపథ్యం ఉన్న సినిమా అనుకుంటాం

ఈ మధ్య ఓ తమిళ్ సినిమాలో కూడా దర్శకుడు హీరోతో క్రీడానేపథ్యం తీసుకుని అందులో కులవివక్షను మిక్స్ చేసి జనాల్లో వదిలి మంచి వసూళ్లను రాబట్టుకున్నాడు

స్ట్రైట్ గా సందేశం అంటూ సినిమా తీసి వదిలితే జనాలకు ఎక్కకపోవచ్చు

తాను చెప్పాలనుకున్న సందేశాన్ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఇంట్రెస్టింగ్ మసాలాలు యాడ్ చేసి తీయడం ఒక ఆర్ట్

ఈ ఆర్ట్ లో ఇప్పటికే తమిళ , మళయాళ దర్శకులు ఆరితేరారు

అలాంటి ఫార్ములాతోనే ఛాంపియన్ దర్శకుడు ప్రయత్నించి ప్రేక్షకులను కనెక్ట్ చేయడంలో కొంత విజయం సాధించారు

స్వాతంత్ర పోరాటాలు ,రజాకార్ మూవ్మెంట్ల గురించి ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి

ఆ మాటకొస్తే ఆ మధ్య డైరెక్ట్ రజాకార్ పేరుతో సినిమా వచ్చి మంచి కలెక్షన్లను రాబట్టుకుంది

ఇప్పుడు మళ్ళీ అదే రజాకార్ గొడవల నేపథ్యంలో సినిమా తీస్తే సాధారణ ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోవచ్చు

అందుకే దర్శకుడు తెలివిగా అదే కథను బ్యాండిన్ లో వేసి ఇంగువ పోపుతో తిరగమాతేసి కొత్తరకం ఘుమఘుమలతో వండి వార్చాడు

ఆ పోపు పేరే హీరో ఫుట్ బాల్ ప్లేయర్ నేపధ్యం
ఆ తిరగమాతే భైరాన్ పల్లి ప్రజల పోరాటాలు

కథ పరంగా మనకు తెలిసిన కథే

హైద్రాబాదు సంస్థానం భారత్ లో కలపడానికి వ్యతిరేకించిన నిజాం గ్రామాల్లో ఉచకోతలు కోయడానికి రజాకార్లను ప్రోత్సహించాడు

వాళ్ళని బైరాన్ పల్లి గ్రామస్తులు ఎదుర్కున్న చారిత్రక సన్నివేశాలు రికార్డులలో నమోదు అయ్యింది

అందుచేత ఛాంపియన్ మూవీలో కథనమే ప్రముఖ పాత్ర పోషిస్తుంది

తెలిసిన విషయాలను ఎంత కొత్తగా చెప్పగలరు అనేదాని మీదే విజయం ఆధారపడి ఉంటుంది

ఆ పరంగా దర్శకుడు సినిమాటిక్ లిబర్టీ తీసుకుని కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ రాసుకుని పూర్తి కథను అల్లుకున్నాడు

ఇక ఈ సినిమాలో ప్రథమార్థం అంతా దాదాపు హీరో ఆటలు , ఇంగ్లాండ్ వెళ్లాలన్న అతడి లక్ష్యాలు చూస్తే హీరో ఫుట్ బాల్ ఛాంపియన్ అవడం కోసం రాసుకున్న కథ అనుకుంటాం

కానీ ఎప్పుడైతే హీరో భైరాన్ పల్లి వస్తాడో అక్కడ్నుంచి అసలు కథలోకి వస్తాం
నిజానికి సినిమా మీద ఇంట్రెస్ట్ అప్పటినుంచే మొదలౌతుంది

సీరియస్ గా సాగిపోతున్న సినిమాలో సడెన్గా లవ్ ట్రాక్ ఎంటరవుతుంది

అంటే టోటల్ గా కథను ఎమోషనల్ , నిజాం పాలన ,రజాకార్ గొడవలు , హీరో లవ్ ట్రాక్ , అనే నాలుగు భాగాలుగా విడగొట్టుకుని రాసుకున్నట్టున్నారు

అన్ని మషాలాలు కవర్ అవ్వాలని దర్శకుడి ఆలోచన కాబోలు

ఎలాతిప్పినా కొన్ని సన్నివేశాలు చూస్తుంటే మనకు ఆ మధ్య వచ్చిన రజాకార్ సినిమా గుర్తుకొస్తుంది

ఫస్టాఫ్ రొటీన్ సినిమాలా అనిపించినా సెకండాఫ్ భైరాన్ పల్లి గ్రామస్తుల పోరాట సన్నివేశాల నేపధ్యం కొంత ఉత్సుకతను కలిగిస్తుంది

దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత రాజిరెడ్డి పాత్రలో తెరమీద కనిపించిన నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాలో ఒక ఆకర్షణ గా నిలిచాడు

ఓవరాల్ గా పతాక సన్నివేశాలు బాగా వచ్చాయి

ఎవరెలా చేసారంటే ?

మైఖేల్ విలియం పాత్ర పోషించిన రోషన్ హీరో శ్రీకాంత్ కొడుకు
ఇతడి మొదటి సినిమా పెళ్లిసందడితో శ్రీకాంత్ కొడుకుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు

ఈ సినిమాతో హీరో రోషన్ అని చెప్పుకునేలా ఓ మెట్టు పైకి ఎదిగాడు

ఛాంపియన్ అవడం కోసం మూడేళ్లకుపైగా కష్టపడ్డాను అని చెప్తున్నాడు ఈ కుర్రాడు
సినిమా చూస్తే రోషన్ కష్టం కనిపిస్తుంది

నటనలో కానీ , డైలాగ్ డెలివరీలో కానీ మంచి ఈజ్ కనిపిస్తుంది

ఇతడి తండ్రి శ్రీకాంత్ కూడా మెల్లిమెల్లిగా తన నటనను ప్రూవ్ చేసుకుంటూ ఒక్కో సినిమాతో అంచెలంచెలుగా పైకెదిగాడు

శ్రీకాంత్ ఖాతాలో కూడా మంచి హిట్ సినిమాలు పడ్డాయి
కాకపోతే సినిమా కెరీర్ మొదట్లో ఆయన లవ్ ట్రాక్ లో హీరోయిజం చూపించే పాత్రలు చేస్తూ సెకండాఫ్ లో ఖడ్గమ్ వంటి సినిమాలో సీరియస్ పాత్రలు పోషించి మెప్పించాడు

కానీ ఇక్కడ రోషన్ తీసుకున్న పాత్ర రజాకార్ నేపధ్యంలోది

మాములుగా అయితే ఆ పాత్రకు రోషన్ లాంటి లేత ముఖం కాకుండా శ్రీకాంత్ లాంటి గంభీరత ఉన్న ఫేస్ కావాలి

ఇటువంటి పాత్రలు చేయాలంటే రోషన్ ఇంకా రాటుదేలాలి
అయినా పర్లేదు
మంచి ప్రయత్నం చేసాడు

ఇక మళయాళం నుంచి పట్టుకొచ్చిన హీరోయిన్ అనశ్వర రాజన్ నటన బాగానే ఉంది కానీ డబ్బింగ్ విషయంలో ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది

రోషన్ పక్కన ఈ అమ్మాయి బాగానే నప్పింది

ఒకప్పుడు హీరో పాత్రలు కూడా వేసి సెకండ్ ఇన్నింగ్స్ లో దాదాపు సినిమాలనుంచి కనుమరుగైపోయిన నందమూరి కళ్యాణ చక్రవర్తి ముప్పైఏళ్ళ తర్వాత ఉరి పెద్ద రాజిరెడ్డి పాత్రలో కనిపించాడు

ఇది నందమూరి అభిమానులను అలరిస్తుంది

చిత్ర సమర్పకురాలు స్వప్న దత్ తండ్రి అశ్వని దత్ ఎన్టీఆర్ తో సుదీర్ఘకాలం సినిమాలు తీసి ఉండటంతో ఆ కుటుంబంతో ఉన్న అనుబంధం కారణంగా బహుశా కళ్యాణ చక్రవర్తిని తిరిగి కెమెరా ముందుకు తీసుకువచ్చినట్టున్నారు

సుందరయ్యగా మురళీశర్మ నటన బానే ఉంది
నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో సంగీత్ ప్రతాప్ నటన పర్లేదు
జబర్దస్త్ కామెడీ నటుడు రచ్చరవికి మంచి పాత్ర పడింది

సాంకేతికంగా ఎలా ఉంది ?

స్వాతంత్య్రం నాటి రోజుల నేపథ్యంలో తీసే సినిమాలకు సాంకేతిక పనితీరు చాలా ముఖ్యం

ఎందుకంటే ఆనాటి లొకేషన్లు , వస్త్రధారణ , డైలాగ్ డెలివరీ , ఇలా అన్నిటిపట్ల ప్రత్యేక శ్రద్ద ఉండాలి

ఛాంపియన్ సినిమా కూడా 1948 కాలం నాటిది కాబట్టి ఆ రోజులను కళ్ళముందుకు తీసుకురాగలగాలి

మహానటిలో కూడా వెనుకటి కాలాన్ని కళ్ళముందు విజయవంతంగా ఆవిష్కరించిన స్వప్న దత్ సిస్టర్స్ ఈ సినిమాలో కూడా ఆ పరంగా సక్సెస్ అయ్యారు

మిక్కీ జె మేయర్ సంగీతం బాగానే ఉంది
ఎడిటింగ్ పరంగా ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది
నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి

ముగింపు : ఓవరాల్ గా సినిమా ఎలా ఉందంటే తెలిసిన కథే అయినప్పటికీ కొత్తరకంగా చూపించడంతో కొంతమందికి కనెక్ట్ అవుతుంది

నటీనటులు : రోషన్ , అనశ్వర రాజన్ ,నందమూరి కళ్యాణ చక్రవర్తి , మురళి శర్మ తదితరులు
సంగీతం : మిక్కీ జె మేయర్
నిర్మాత : ప్రియాంక దత్ , స్వప్న దత్
దర్శకుడు : ప్రదీప్ అద్వైతం
విడుదల : 25-12-2025
రేటింగ్ : 3 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!