హీరో చూస్తే శ్రీకాంత్ కొడుకు , బ్యానర్ చూస్తే మహానటి వంటి హిట్ మూవీ తీసిన స్వప్న దత్ వాళ్ళది, చిత్రాన్ని సమర్పించింది జీ స్టూడియోస్ వారు అవడంతో ఛాంపియన్ మూవీపై విడుదలకు ముందే ఇండస్ట్రీలో కొన్ని అంచనాలు ఏర్పడ్డాయి .
అలాఅని చిన్న హీరో కాబట్టి లో బడ్జెట్లో తీయలేదు . నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ పడకుండా షుమారు 40 కోట్లకు పైనే ఖర్చు పెట్టారు . దాంతో సినిమాకి టీజర్ రిలీజ్ సమయంలోనే కొంత హైప్ వచ్చింది .
మరి అంచనాలకు తగ్గట్టుగానే ఛాంపియన్ ఉందా ? లేదా ? అనేది ఇప్పుడు చూద్దాం
కథ ఏంటంటే ?
కథ మొదలు అవడమే భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత హైద్రాబాదు సంస్థానాన్ని భారత్ లో విలీనం చేయడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేస్తున్న ప్రయత్నాలతో మొదలౌతుంది .
మైఖేల్ విలియం సికింద్రాబాద్ తరపున ఆడే ఫుట్ బాల్ ప్లేయర్ . ఎప్పటికైనా ఇదే ఆటలో ఛాంపియన్ అయి ఇంగ్లాండ్ వెళ్ళిపోయి అక్కడే సెటిలైపోవాలనేది అతడి లక్ష్యం .
అయితే అతడు ఎదురు చూసిన అవకాశం ఓ రోజు రానే వచ్చింది . కానీ తండ్రి కారణంగా విలియం ఇంగ్లాండ్ అవకాశాలకు బ్రేక్ పడుతుంది .
ఈ పరిస్థితుల్లో తాము చెప్పిన విధంగా ఆయుధాలు తరలిస్తే అతడిని ఇంగ్లాండ్ చేర్చే బాధ్యత తాము తీసుకుంటామని ఓ ఆయుధ డీలర్ చెప్పడంతో విలియం అందుకు ఒప్పుకుంటాడు .
ఈ క్రమంలో అతడు అనుకోకుండా తెలంగాణలోని భైరాన్ పల్లి అనే గ్రామానికి చేరుకుంటాడు . అక్కడే మైఖేల్ కి చంద్రకళ (అనశ్వర రాజన్ ) పరిచయం అవుతుంది . మరోపక్క అదే సమయంలో గ్రామస్తులు రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తుంటారు .
ఈ పరిస్థితుల్లో మైఖేల్ ఏం చేస్తాడు ?
గ్రామస్తులతో కలిసి నిజాం సంస్థానానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాడా ? లేదా క్రీడాకారుడిగా ఇంగ్లాండ్ లో సెటిలైపోవాలనే తన లక్ష్యానికి అనుగుణంగా ఆయుధాలు తరలించి వెళ్ళిపోతాడా ? అనేది మిగిలిన కథలో తెలుస్తుంది
సినిమా ఎలా ఉందంటే ?
టైటిల్ చూడగానే ఇదేదో క్రీడానేపథ్యం ఉన్న సినిమా అనుకుంటాం . ఈ మధ్య ఓ తమిళ్ సినిమాలో కూడా దర్శకుడు హీరోతో క్రీడానేపథ్యం తీసుకుని అందులో కులవివక్షను మిక్స్ చేసి జనాల్లో వదిలి మంచి వసూళ్లను రాబట్టుకున్నాడు .
స్ట్రైట్ గా సందేశం అంటూ సినిమా తీసి వదిలితే జనాలకు ఎక్కకపోవచ్చు . తాను చెప్పాలనుకున్న సందేశాన్ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఇంట్రెస్టింగ్ మసాలాలు యాడ్ చేసి తీయడం ఒక ఆర్ట్. ఈ ఆర్ట్ లో ఇప్పటికే తమిళ , మళయాళ దర్శకులు ఆరితేరారు .
అలాంటి ఫార్ములాతోనే ఛాంపియన్ దర్శకుడు ప్రయత్నించి ప్రేక్షకులను కనెక్ట్ చేయడంలో కొంత విజయం సాధించారు . స్వాతంత్ర పోరాటాలు ,రజాకార్ మూవ్మెంట్ల గురించి ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి . ఆ మాటకొస్తే ఆ మధ్య డైరెక్ట్ రజాకార్ పేరుతో సినిమా వచ్చి మంచి కలెక్షన్లను రాబట్టుకుంది .
ఇప్పుడు మళ్ళీ అదే రజాకార్ గొడవల నేపథ్యంలో సినిమా తీస్తే సాధారణ ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోవచ్చు . అందుకే దర్శకుడు తెలివిగా అదే కథను బ్యాండిన్ లో వేసి ఇంగువ పోపుతో తిరగమాతేసి కొత్తరకం ఘుమఘుమలతో వండి వార్చాడు .
ఆ పోపు పేరే హీరో ఫుట్ బాల్ ప్లేయర్ నేపధ్యం . ఆ తిరగమాతే భైరాన్ పల్లి ప్రజల పోరాటాలు .
కథ పరంగా మనకు తెలిసిన కథే ,
హైద్రాబాదు సంస్థానం భారత్ లో కలపడానికి వ్యతిరేకించిన నిజాం గ్రామాల్లో ఉచకోతలు కోయడానికి రజాకార్లను ప్రోత్సహించాడు . వాళ్ళని బైరాన్ పల్లి గ్రామస్తులు ఎదుర్కున్న చారిత్రక సన్నివేశాలు రికార్డులలో నమోదు అయ్యింది .
అందుచేత ఛాంపియన్ మూవీలో కథనమే ప్రముఖ పాత్ర పోషిస్తుంది . తెలిసిన విషయాలను ఎంత కొత్తగా చెప్పగలరు అనేదాని మీదే విజయం ఆధారపడి ఉంటుంది . ఆ పరంగా దర్శకుడు సినిమాటిక్ లిబర్టీ తీసుకుని కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ రాసుకుని పూర్తి కథను అల్లుకున్నాడు .
ఇక ఈ సినిమాలో ప్రథమార్థం అంతా దాదాపు హీరో ఆటలు , ఇంగ్లాండ్ వెళ్లాలన్న అతడి లక్ష్యాలు చూస్తే హీరో ఫుట్ బాల్ ఛాంపియన్ అవడం కోసం రాసుకున్న కథ అనుకుంటాం .
కానీ ఎప్పుడైతే హీరో భైరాన్ పల్లి వస్తాడో అక్కడ్నుంచి అసలు కథలోకి వస్తాం . నిజానికి సినిమా మీద ఇంట్రెస్ట్ అప్పటినుంచే మొదలౌతుంది . సీరియస్ గా సాగిపోతున్న సినిమాలో సడెన్గా లవ్ ట్రాక్ ఎంటరవుతుంది .
అంటే టోటల్ గా కథను ఎమోషనల్ , నిజాం పాలన ,రజాకార్ గొడవలు , హీరో లవ్ ట్రాక్ , అనే నాలుగు భాగాలుగా విడగొట్టుకుని రాసుకున్నట్టున్నారు . అన్ని మషాలాలు కవర్ అవ్వాలని దర్శకుడి ఆలోచన కాబోలు .
ఎలాతిప్పినా కొన్ని సన్నివేశాలు చూస్తుంటే మనకు ఆ మధ్య వచ్చిన రజాకార్ సినిమా గుర్తుకొస్తుంది . ఫస్టాఫ్ రొటీన్ సినిమాలా అనిపించినా సెకండాఫ్ భైరాన్ పల్లి గ్రామస్తుల పోరాట సన్నివేశాల నేపధ్యం కొంత ఉత్సుకతను కలిగిస్తుంది .
దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత రాజిరెడ్డి పాత్రలో తెరమీద కనిపించిన నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాలో ఒక ఆకర్షణ గా నిలిచాడు .
ఓవరాల్ గా పతాక సన్నివేశాలు బాగా వచ్చాయి .
ఎవరెలా చేసారంటే ?
మైఖేల్ విలియం పాత్ర పోషించిన రోషన్ హీరో శ్రీకాంత్ కొడుకు . ఇతడి మొదటి సినిమా పెళ్లిసందడితో శ్రీకాంత్ కొడుకుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు . ఈ సినిమాతో హీరో రోషన్ అని చెప్పుకునేలా ఓ మెట్టు పైకి ఎదిగాడు .
ఛాంపియన్ అవడం కోసం మూడేళ్లకుపైగా కష్టపడ్డాను అని చెప్తున్నాడు ఈ కుర్రాడు
సినిమా చూస్తే రోషన్ కష్టం కనిపిస్తుంది . నటనలో కానీ , డైలాగ్ డెలివరీలో కానీ మంచి ఈజ్ కనిపిస్తుంది . ఇతడి తండ్రి శ్రీకాంత్ కూడా మెల్లిమెల్లిగా తన నటనను ప్రూవ్ చేసుకుంటూ ఒక్కో సినిమాతో అంచెలంచెలుగా పైకెదిగాడు .
శ్రీకాంత్ ఖాతాలో కూడా మంచి హిట్ సినిమాలు పడ్డాయి . కాకపోతే సినిమా కెరీర్ మొదట్లో ఆయన లవ్ ట్రాక్ లో హీరోయిజం చూపించే పాత్రలు చేస్తూ సెకండాఫ్ లో ఖడ్గమ్ వంటి సినిమాలో సీరియస్ పాత్రలు పోషించి మెప్పించాడు .
కానీ ఇక్కడ రోషన్ తీసుకున్న పాత్ర రజాకార్ నేపధ్యంలోది . మాములుగా అయితే ఆ పాత్రకు రోషన్ లాంటి లేత ముఖం కాకుండా శ్రీకాంత్ లాంటి గంభీరత ఉన్న ఫేస్ కావాలి . ఇటువంటి పాత్రలు చేయాలంటే రోషన్ ఇంకా రాటుదేలాలి .
అయినా పర్లేదు
మంచి ప్రయత్నం చేసాడు .
ఇక మళయాళం నుంచి పట్టుకొచ్చిన హీరోయిన్ అనశ్వర రాజన్ నటన బాగానే ఉంది కానీ డబ్బింగ్ విషయంలో ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది .
రోషన్ పక్కన ఈ అమ్మాయి బాగానే నప్పింది .
ఒకప్పుడు హీరో పాత్రలు కూడా వేసి సెకండ్ ఇన్నింగ్స్ లో దాదాపు సినిమాలనుంచి కనుమరుగైపోయిన నందమూరి కళ్యాణ చక్రవర్తి ముప్పైఏళ్ళ తర్వాత ఉరి పెద్ద రాజిరెడ్డి పాత్రలో కనిపించాడు . ఇది నందమూరి అభిమానులను అలరిస్తుంది .
చిత్ర సమర్పకురాలు స్వప్న దత్ తండ్రి అశ్వని దత్ ఎన్టీఆర్ తో సుదీర్ఘకాలం సినిమాలు తీసి ఉండటంతో ఆ కుటుంబంతో ఉన్న అనుబంధం కారణంగా బహుశా కళ్యాణ చక్రవర్తిని తిరిగి కెమెరా ముందుకు తీసుకువచ్చినట్టున్నారు .
సుందరయ్యగా మురళీశర్మ నటన బానే ఉంది
నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో సంగీత్ ప్రతాప్ నటన పర్లేదు
జబర్దస్త్ కామెడీ నటుడు రచ్చరవికి మంచి పాత్ర పడింది.
సాంకేతికంగా ఎలా ఉంది ?
స్వాతంత్య్రం నాటి రోజుల నేపథ్యంలో తీసే సినిమాలకు సాంకేతిక పనితీరు చాలా ముఖ్యం .
ఎందుకంటే ఆనాటి లొకేషన్లు , వస్త్రధారణ , డైలాగ్ డెలివరీ , ఇలా అన్నిటిపట్ల ప్రత్యేక శ్రద్ద ఉండాలి. ఛాంపియన్ సినిమా కూడా 1948 కాలం నాటిది కాబట్టి ఆ రోజులను కళ్ళముందుకు తీసుకురాగలగాలి. మహానటిలో కూడా వెనుకటి కాలాన్ని కళ్ళముందు విజయవంతంగా ఆవిష్కరించిన స్వప్న దత్ సిస్టర్స్ ఈ సినిమాలో కూడా ఆ పరంగా సక్సెస్ అయ్యారు .
మిక్కీ జె మేయర్ సంగీతం బాగానే ఉంది
ఎడిటింగ్ పరంగా ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది
నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి .
ముగింపు : ఓవరాల్ గా సినిమా ఎలా ఉందంటే తెలిసిన కథే అయినప్పటికీ కొత్తరకంగా చూపించడంతో కొంతమందికి కనెక్ట్ అవుతుంది .
నటీనటులు : రోషన్ , అనశ్వర రాజన్ ,నందమూరి కళ్యాణ చక్రవర్తి , మురళి శర్మ తదితరులు
సంగీతం : మిక్కీ జె మేయర్
నిర్మాత : ప్రియాంక దత్ , స్వప్న దత్
దర్శకుడు : ప్రదీప్ అద్వైతం
విడుదల : 25-12-2025
రేటింగ్ : 3 / 5
