హరిహర వీరమల్లు టాక్ ఏంటి ?

Spread the love

హరిహర వీరమల్లు టాక్ ఏంటి ?

సుదీర్ఘ విరామం తర్వాత వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు మీద అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు

అభిమానులే కాదు ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఏపీ డిప్యూటీ సీఎం అయిన తరువాత రిలీజ్ అవుతున్న సినిమా కాబట్టి సినీ ఇండస్ట్రీలోనూ , పొలిటికల్ కారిడార్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు .. ఊహాగానాలు ఉన్నాయి

ఈ అంచనాలకు తోడు గత విధానానికి భిన్నంగా పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ సినిమా ప్రమోషన్ బాధ్యత భుజాన వేసుకున్నాడు

పవన్ కళ్యాణ్ ప్రచారంతో ఐదేళ్లుగా వాయిదాపడుతూ వస్తున్న వీరమల్లు సినిమా తాలూకు నైరాశ్యంలో ఉన్న ఆయన అభిమానుల్లో కూడా కొత్త జోష్ వచ్చింది

ఇన్ని అంచనాల మధ్య హరిహర వీరమల్లు పాన్ ఇండియా సినిమా నిన్న జులై 24 వ తేదీన వరల్డ్ వైడ్ థియేటర్లలో రిలీజ్ అయ్యింది

ఇప్పుడు సినిమా ఎలా ఉందో చూద్దాం

కథ విషయానికి వస్తే 16 వ శతాబ్దం నేపధ్యంగా తీసుకున్నారు

మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఢిల్లీ పీఠంలో కూర్చుని మతమార్పిడుల కోసం దేశంలో అరాచకాలు సృష్టిస్తుంటాడు

మతం మారని హిందువులపై జిజియా పన్ను విధించి బాధలు పెడుతుంటాడు

ఔరంగజేబు అరాచక పాలనతో విసిగిపోయిన ప్రజలు బాధతో అలమటిస్తున్న సమయంలోనే మరోపక్క తెల్ల దొరలు యథేచ్ఛగా ప్రజలను దోచుకోవడం మొదలుపెట్టారు

ఈ పరిస్థితుల్లో కథానాయకుడు వీరమల్లు ఎంట్రీ అవుతాడు

16 వ శతాబ్దపు రాబిన్ హుడ్ మాదిరి ధనికుల దగ్గర దోచి పేదలకు పంచిపెడుతూ ఉంటాడు వీరమల్లు

బందర్ నుంచి హైదరాబాద్ నవాబ్ కుతుబ్ షాహి దగ్గరకు తీసుకెళ్తున్న వజ్రాలపై కన్నేసి తన బలగం సాయంతో సిపాయిల మీద పోరాటం చేసి వజ్రాలను సొంతం చేసుకుంటాడు

వీరమల్లు పోరాట పటిమ తెలుసుకున్న నవాబ్ కుతుబ్ షాహి ఢిల్లీ సుల్తాన్ ఔరంగజేబు సింహాసనం పై ఉన్న అత్యంత విలువైన కోహినూర్ వజ్రాన్ని దొంగిలించి తీసుకొచ్చే బాధ్యత అప్పచెబుతాడు

అందుకు సమ్మతించి ఔరంగజేబు దగ్గర ఉన్న కోహినూర్ వజ్రాన్ని సాధించేందుకు ఢిల్లీ బయలుదేరతాడు వీరమల్లు

క్లుప్తంగా ఇదీ స్టోరీ లైన్

ఈ స్టోరీ లైన్ సినిమా రిలీజుకు ముందే చాలామందికి తెలుసు

ఎందుకంటే సినిమా ప్రమోషన్ సమయంలోనే పవన్ కళ్యాణ్ స్వయంగా స్టోరీ లైన్ రివీల్ చేసారు

అయితే ఔరంగజేబు నుంచి ఆ వజ్రాన్ని తీసుకురావడానికి ఏ కారణం చేత వీర మల్లు ఒప్పుకుంటాడు ?

వీరమల్లు మనసు పారేసుకున్న పంచమి ( నిధి అగర్వాల్ ) ఎవరు ?

పంచమికి.. వీరమల్లు కోహినూర్ వజ్రాన్ని సాదించటానికి మధ్య ఉన్న లింక్ ఏంటి ?

ఔరంగజేబు సామ్రాజ్యంలోకి వీరమల్లు అడుగుపెట్టగలిగాడా ? తదితర విషయాలు కథలో భాగంగా సాగిపోతుంటాయి

సినిమా ఎలా ఉంది ?

ఈ ప్రశ్నకు చప్పున బావుంది అని చెప్పలేం అలాగే బాలేదు అనీ చెప్పలేం

ఎందుకంటే బాగుంది అని ఫస్టాఫ్ లో అనుకుంటుండగానే సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాల్లో బాలేదు అని అనుకుంటాం

కథ విషయానికి వస్తే హిస్టారికల్ నేపథ్యం తీసుకున్నప్పటికీ ముందే కల్పిత కధనం అని హింట్ ఇవ్వబట్టి సరిపోయింది కానీ 16 వ శతాబ్దం కధలో 18 వ శతాబ్దం చార్మినార్ చూపించటం కొంత అసహజంగా ఉంది

ప్రధమార్థంలో యాక్షన్ సన్నివేశాలు .. పోరాట దృశ్యాలు బాగున్నాయి

చార్మినార్ దగ్గర మల్లయోధులతో జరిగే పోరాట సన్నివేశాల్లోనూ .. పోర్ట్ ఫైట్ సన్నివేశాలు అభిమానులకు ఖచ్చితంగా నచ్చుతాయి

ఫస్టాఫ్ లో వచ్చిన కొల్లగొట్టినాదిరో పాట బావుంది

ఇక పవన్ కళ్యాణ్ నటన విషయానికి వస్తే సినిమాలో కధానాయకుడి పాత్ర ద్వారా తన నిజ జీవిత ఆశయాలను సృశించే ప్రయత్నం చేసారు

వీరమల్లు లో సనాతన ధర్మం తరపున పోరాడే పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపిస్తారు

ఒకపక్క సనాతన ధర్మాన్ని కాపాడే నాయకుడిగా ప్రొజెక్ట్ చేస్తూనే మరోపక్క అభినవ రాబిన్ హుడ్ ను పోలిన పోరాట సన్నివేశాలు పెట్టడంతో అభిమానులకు పూనకాలు రావడం ఖాయం

ఒకరకంగా వీరమల్లు ను పవన్ కళ్యాణ్ ఆవాహన చేసుకుని మరీ నటించాడు

ముఖ్యంగా పులిని కట్టడి చేసే సన్నివేశం అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది

వీరమల్లు ఎలివేషన్స్ విషయంలో పవన్ కళ్యాణ్ స్థాయికి తగ్గట్టుగానే సన్నివేశాలు రూపొందించారు

ఇక పవన్ గత సినిమాలతో పోలిస్తే వీరమల్లు హిస్టారికల్ నేపథ్యంలో తీసిన సినిమా కాబట్టి పవన్ గెటప్ ఎలా ఉంటుందో ? లుక్ ఎలా ఉంటుందో ? అని ఎదురు చూ సిన అభిమానుల సందేహాలను పటాపంచలు చేస్తూ వీరమల్లు గెటప్ లో పవన్ కళ్యాణ్ ఇమిడిపోయాడు

ఒకరకంగా వీరమల్లు సినిమాలో పవర్ స్టార్ వన్ మ్యాన్ షో నడిచింది

హీరోయిన్ నిధి అగర్వాల్ మేకప్ కొద్దిగా ఎబెట్టుగా అనిపించింది

కానీ కొన్ని సన్నివేశాల్లో ఆమెకు కూడా పెర్ఫార్మెన్స చూపించే అవకాశం వచ్చినప్పటికీ హావభావాల విషయంలో మరికొంత ఇంప్రూవ్ చేసుకుంటే బాగుండేది

ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ క్రూరత్వాన్ని బాగానే ప్రదర్శించాడు

ఇటీవల కన్నుమూసిన సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు కూడా చిన్న పాత్రలో మెరిశారు

మురళీశర్మ , సత్యరాజ్ సచిన్ ఖేడ్కర్ నటనలో పెద్ద లోపాలేమీ లేదు .. అలవాటైన పాత్రల్లో ఒదిగిపోయారు

సునీల్ , నాజర్ ,అయ్యప్ప శర్మ , సుబ్బరాజు తదితరులు పవన్ కళ్యాణ్ సరసన కన్పిస్తారు

అనసూయ , పూజిత ఓ పాటలో మెరిశారు

సంగీతం విషయంలో కీరవాణి న్యాయం చేసాడనే చెప్పాలి

సాయి మాధవ్ బుర్రా రాసిన” జనం మెచ్చేవాడే సైనికుడు అవుతాడు .. జనసైనికుడు అవుతాడు ” అనే పంచ్ డైలాగులు బానే పేలాయి

ఇంటర్వెల్ ముందు ఔరంగజేబు కోట సన్నివేశాలు భారీ ఎత్తున చూపించటంతో జనాలకు ద్వితీయార్థం మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది

కానీ దర్శకుడు జ్యోతి కృష్ణ రెండో భాగంలో వారి ఆశల మీద నీళ్లు జల్లాడు

స్టోరీ సాగదీత మినహా కొత్తదనం చూపించలేకపోయాడు

కధనంలో ప్రధమార్ధంలో ఉన్నంత వేగం ద్వితీయార్థంలో లేదు

విజువల్స్ పరంగా పూర్ క్వాలిటీ సృష్టంగా కనిపిస్తుంది

ఈ లోపాన్ని పవన్ కళ్యాణ్ కూడా గుర్తించి త్వరలో సాంకేతిక నిపుణుల సాయంతో సినిమాలో విజువల్స్ క్వాలిటీ మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు

తొలుత ఈ కథను రాసుకున్న దర్శకుడు క్రిష్ సరిగ్గా వీరమల్లు ప్రాజెక్టు పట్టాలమీదకు వెళ్లిన సమయంలో తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టడంతో మొదటి భాగంలోనూ , రెండో భాగంలోనూ కొంత వ్యత్సాలు కన్పిస్తాయి

కథ విషయంలో ఇద్దరి దర్శకుల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది

ముగింపులో అసలైన యుద్ధం రెండో భాగంలో చూడండి అని హింట్ ఇచ్చారు కాబట్టి వీరమల్లు , ఔరంగజేబుల మధ్య పోరాట సన్నివేశాలు ఆ భాగంలో చూపిస్తారు అనుకోవాలి

ఈ సినిమాని ప్రముఖ నిర్మాత ఎ ఎమ్ రత్నం నిర్మించారు

అంతిమంగా ఫస్టాఫ్ బాగుంది .. సెకండాఫ్ బాగుండాల్సింది

రేటింగ్ 2. 5 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!