సుదీర్ఘ విరామం తర్వాత వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు మీద అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు . అభిమానులే కాదు ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఏపీ డిప్యూటీ సీఎం అయిన తరువాత రిలీజ్ అవుతున్న సినిమా కాబట్టి సినీ ఇండస్ట్రీలోనూ , పొలిటికల్ కారిడార్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు .. ఊహాగానాలు ఉన్నాయి . ఈ అంచనాలకు తోడు గత విధానానికి భిన్నంగా పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ సినిమా ప్రమోషన్ బాధ్యత భుజాన వేసుకున్నాడు .
ఇదిలా ఉండగా హరిహర వీరమల్లు మూవీ ఇలా క్లాప్ కొట్టి అలా బయటికి వచ్చిన సినిమా కాదు . ఎన్నో బాలారిష్టాలు పడింది . పవన్ రాజకీయాల్లో బిజీ అయిన సమయంలో మొదలై డిప్యూటీ సీఎం అయిన తర్వాత బయటికి వచ్చింది . అసలు ఒక దశలో ఈ సినిమా ఆగిపోయిందన్న ప్రచారం కూడా నడిచింది . పవన్ కళ్యాణ్ డేట్లు అడ్జస్ట్ కాక డూప్ తో చాలా సన్నివేశాలు చిత్రీకరించారని టాక్ కూడా వచ్చింది . అయినా సరే చారిత్రాత్మక నేపధ్యం ఉన్న హరిహర వీరమల్లు బయటికి వస్తే చాలని అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూసారు . అందులోనూ వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ సరికొత్త గెటప్ లో కనిపించడంతో అభిమానుల్లో ఈ సినిమా పట్ల ఆసక్తి పెరిగింది .
అందుకే అభిమానులను నిరాశ పర్చకుండా ఈ సినిమా ప్రమోషన్ బాధ్యతను పవన్ కళ్యాణ్ స్వయంగా తన భుజాన వేసుకున్నాడు . పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రచారం చేయడంతో ఐదేళ్లుగా వాయిదాపడుతూ వస్తున్న వీరమల్లు సినిమా తాలూకు నైరాశ్యంలో ఉన్న ఆయన అభిమానుల్లో కూడా కొత్త జోష్ వచ్చింది . ఇన్ని అంచనాల మధ్య హరిహర వీరమల్లు పాన్ ఇండియా సినిమా నిన్న జులై 24 వ తేదీన వరల్డ్ వైడ్ థియేటర్లలో రిలీజ్ అయ్యింది .
ఇప్పుడు సినిమా ఎలా ఉందో చూద్దాం .
కధేంటంటే ?
కథ విషయానికి వస్తే 16 వ శతాబ్దం నేపధ్యంగా తీసుకున్నారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఢిల్లీ పీఠంలో కూర్చుని మతమార్పిడుల కోసం దేశంలో అరాచకాలు సృష్టిస్తుంటాడు . మతం మారని హిందువులపై జిజియా పన్ను విధించి బాధలు పెడుతుంటాడు . ఔరంగజేబు అరాచక పాలనతో విసిగిపోయిన ప్రజలు బాధతో అలమటిస్తున్న సమయంలోనే మరోపక్క తెల్ల దొరలు యథేచ్ఛగా ప్రజలను దోచుకోవడం మొదలుపెట్టారు . దీనితో ఒకపక్కన మొగలుల అరాచకాలు , మరోపక్క తెల్లదొరల దోపిడీలతో ప్రజలు దిక్కు తోచని స్థితితో ఉండిపోతారు .
ఈ పరిస్థితుల్లో కథానాయకుడు వీరమల్లు ఎంట్రీ అవుతాడు . నిజానికి ఈ వీరమల్లు తల్లితండ్రులు ఎవరో కూడా తెలీదు . నదిలో కొట్టుకొచ్చిన బాలుడ్ని ఒడ్డున ఉన్న గ్రామస్తులు చేరదీసి పెంచుతారు . పెరిగి పెద్దవాడు అయిన వీరమల్లు పేదలకు అండగా నిలబడి పోరాడుతూ ఉంటాడు . ఒకరకంగా చెప్పాలంటే 16 వ శతాబ్దపు రాబిన్ హుడ్ మాదిరి ధనికుల దగ్గర దోచి పేదలకు పంచిపెడుతూ ఉంటాడు వీరమల్లు .
ఇదిలా ఉండగా ఒకసారి బందర్ నుంచి హైదరాబాద్ నవాబ్ కుతుబ్ షాహి దగ్గరకు తీసుకెళ్తున్న వజ్రాలపై కన్నేసి తన బలగం సాయంతో అక్కడి సిపాయిల మీద పోరాటం చేసి ఆ వజ్రాలను సొంతం చేసుకుంటాడు .
వీరమల్లు పోరాట పటిమ తెలుసుకున్న నవాబ్ కుతుబ్ షాహి ఢిల్లీ సుల్తాన్ ఔరంగజేబు సింహాసనం పై ఉన్న అత్యంత విలువైన కోహినూర్ వజ్రాన్ని దొంగిలించి తీసుకొచ్చే బాధ్యత అప్పచెబుతాడు . అందుకు సమ్మతించి ఔరంగజేబు దగ్గర ఉన్న కోహినూర్ వజ్రాన్ని సాధించేందుకు ఢిల్లీ బయలుదేరతాడు వీరమల్లు .
క్లుప్తంగా ఇదీ స్టోరీ లైన్ . ఈ స్టోరీ లైన్ సినిమా రిలీజుకు ముందే చాలామందికి తెలుసు. ఎందుకంటే సినిమా ప్రమోషన్ సమయంలోనే పవన్ కళ్యాణ్ స్వయంగా స్టోరీ లైన్ రివీల్ చేసారు . అయితే కధలో చారిత్రాత్మక నేపధ్యాన్ని వాడుకున్నారు కానీ కొన్ని సన్నివేశాలు వివాదాస్పదంగా ఉండే అవకాశం ఉందని భావించి ముందు జాగ్రత్త చర్యగా హరిహర వీరమల్లు కల్పిత కధగా డిస్క్లైమర్ ఇచ్చారు .
ఇప్పుడు మళ్ళీ కథ విషయానికి వస్తే ఔరంగజేబు నుంచి ఆ వజ్రాన్ని తీసుకురావడానికి ఏ కారణం చేత వీరమల్లు ఒప్పుకుంటాడు ?
వీరమల్లు మనసు పారేసుకున్న పంచమి ( నిధి అగర్వాల్ ) ఎవరు ?
పంచమికి.. వీరమల్లు కోహినూర్ వజ్రాన్ని సాధించటానికి మధ్య ఉన్న లింక్ ఏంటి ?
ఔరంగజేబు సామ్రాజ్యంలోకి వీరమల్లు అడుగుపెట్టగలిగాడా ? తదితర విషయాలు మిగిలిన కధనంలో తెలుస్తాయి
సినిమా ఎలా ఉంది ?
ఈ ప్రశ్నకు చప్పున బావుంది అని చెప్పలేం అలాగే బాలేదు అనీ చెప్పలేం . ఎందుకంటే బాగుంది అని ఫస్టాఫ్ లో అనుకుంటుండగానే సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాల్లో బాలేదు అని అనుకుంటాం .
కథ విషయానికి వస్తే హిస్టారికల్ నేపథ్యం తీసుకున్నప్పటికీ ముందే కల్పిత కధనం అని హింట్ ఇవ్వబట్టి సరిపోయింది కానీ 16 వ శతాబ్దం కధలో 18 వ శతాబ్దం చార్మినార్ చూపించటం కొంత అసహజంగా ఉంది . ప్రధమార్థంలో యాక్షన్ సన్నివేశాలు .. పోరాట దృశ్యాలు బాగున్నాయి . చార్మినార్ దగ్గర మల్లయోధులతో జరిగే పోరాట సన్నివేశాల్లోనూ .. పోర్ట్ ఫైట్ సన్నివేశాలు అభిమానులకు ఖచ్చితంగా నచ్చుతాయి . ఫస్టాఫ్ లో వచ్చిన కొల్లగొట్టినాదిరో పాట బావుంది .
పవన్ కళ్యాణ్ నుంచి అభిమానులు ఎటువంటి నటన కోరుకుంటారో అదే ఇందులో దొరుకుతుంది . దానికి తోడు పవన్ గెటప్ ఖచ్చితంగా అభిమానులను అలరిస్తుంది . నిజ జీవితంలో పవన్ ఆశయాలకు అనుగుణంగా ఉండేలా అక్కడక్కడా సంభాషణలను , సన్నివేశాలను తీర్చిదిద్దినట్టు ఉన్నారు . అందుకే తనను తాను సనాతన ధర్మ పరిరక్షకుడిగా కొన్ని సన్నివేశాల్లో ఎక్స్పోజ్ చేసుకున్నారు . వీరమల్లు లో సనాతన ధర్మం తరపున పోరాడే పాత్రలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ గా కనిపిస్తారు .
ఒకపక్క సనాతన ధర్మాన్ని కాపాడే నాయకుడిగా ప్రొజెక్ట్ చేస్తూనే మరోపక్క అభినవ రాబిన్ హుడ్ ను పోలిన పోరాట సన్నివేశాలు పెట్టడంతో అభిమానులకు పూనకాలు రావడం ఖాయం . వజ్రాల దొంగతనం చేయడానికి వచ్చిన వీరమల్లు ఎంట్రీ సన్నివేశంలో అభిమానులకు పాత పవర్ స్టార్ కనిపిస్తాడు . ఒకరకంగా వీరమల్లు ను పవన్ కళ్యాణ్ ఆవాహన చేసుకుని మరీ నటించాడు . ముఖ్యంగా పులిని కట్టడి చేసే సన్నివేశం అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది . వీరమల్లు ఎలివేషన్స్ విషయంలో పవన్ కళ్యాణ్ స్థాయికి తగ్గట్టుగానే సన్నివేశాలు రూపొందించారు .
ఇక పవన్ గత సినిమాలతో పోలిస్తే వీరమల్లు హిస్టారికల్ నేపథ్యంలో తీసిన సినిమా కాబట్టి పవన్ గెటప్ ఎలా ఉంటుందో ? లుక్ ఎలా ఉంటుందో ? అని ఎదురు చూసిన అభిమానుల సందేహాలను పటాపంచలు చేస్తూ వీరమల్లు గెటప్ లో పవన్ కళ్యాణ్ ఇమిడిపోయాడు . రెగ్యులర్ ఫార్మాట్ లో పవన్ ను చూడటానికి అలవాటు పడిన అభిమానులకు వీరమల్లు గెటప్ లో సరికొత్తగా కనిపిస్తాడు . ఒకరకంగా వీరమల్లు సినిమాలో పవర్ స్టార్ వన్ మ్యాన్ షో నడిచింది . సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర కాసేపు పక్కకి తప్పుకుంటే తిరిగి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా ? అని అభిమానులు ఎదురు చూసేలా అయన నటన ఉంది .
ఇదంతా ఇలా ఉండగా సినిమాలో అక్కడక్కడా కొన్ని లోపాలు లేకపోలేదు . అన్నిటికన్నా నాసిరకం గ్రాఫిక్స్ లోపం స్పృష్టంగా కనిపించింది . మరీ ముఖ్యంగా గుర్రాలను పరిగెత్తించేటప్పుడు గ్రాఫిక్స్ సాయంతో చేసారని స్పృష్టంగా తెలిసిపోతుంది . ఓ సన్నివేశంలో పవన్ కళ్యాణ్ గుర్రం మీద వెళ్తుంటే కెమెరా అటూఇటూ ఊగడం మినహా గుర్రం పరిగెడుతున్నట్టు ఎక్కడా అనిపించదు . గ్రాఫిక్స్ విషయంలో పవన్ అభిమానులు కూడా అసంతృప్తి వ్యక్తం చేసారు .
ఎవరెలా చేసారు ?
ఎవరెలా చేసారంటే ముందుగా పవన్ కళ్యాణ్ గురించే చెప్పుకోవాలి . ఒకరకంగా వన్ మ్యాన్ ఆర్మీ మాదిరి సినిమా మొత్తాన్ని ఆయన తన భుజాల మీద వేసుకుని నడిపించాడు . 16 శతాబ్దపు కధానాయకుడి పాత్రలో అతడి గెటప్ ఆకట్టుకుంటుంది . ఎప్పటిలాగానే అతడి డైలాగులు కొన్ని పేలాయి . కాకపోతే ఫస్టాఫ్ లో పవన్ చేత కామెడీ చేయిద్దామనే ప్రయత్నం కొద్దిగా ఎబ్బెట్టు గా ఉంది .
హీరోయిన్ నిధి అగర్వాల్ మేకప్ కొద్దిగా ఎబెట్టుగా అనిపించింది . కానీ కొన్ని సన్నివేశాల్లో ఆమెకు కూడా పెర్ఫార్మన్స్ చూపించే అవకాశం వచ్చినప్పటికీ హావభావాల విషయంలో మరికొంత ఇంప్రూవ్ చేసుకుంటే బాగుండేది .
ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ క్రూరత్వాన్ని బాగానే ప్రదర్శించాడు. ఇటీవల కన్నుమూసిన సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు కూడా చిన్న పాత్రలో మెరిశారు .
మురళీశర్మ , సత్యరాజ్ సచిన్ ఖేడ్కర్ నటనలో పెద్ద లోపాలేమీ లేదు .. అలవాటైన పాత్రల్లో ఒదిగిపోయారు . సునీల్ , నాజర్ ,అయ్యప్ప శర్మ , సుబ్బరాజు తదితరులు పవన్ కళ్యాణ్ సరసన కన్పిస్తారు .
అనసూయ , పూజిత ఓ పాటలో మెరిశారు .
సాంకేతికత
సాంకేతికత విషయంలో చక్కటి సంగీతం అందించి కీరవాణి న్యాయం చేసాడనే చెప్పాలి . చారిత్రాత్మక నేపధ్యం ఉన్న కథ కావడంతో సినిమాకి బీజీఎమ్ ప్రముఖ పాత్ర వహిస్తుంది . ఆ పరంగా బాగానే ఉంది .
సంభాషణల విషయంలో సాయి మాధవ్ బుర్రా రాసిన” జనం మెచ్చేవాడే సైనికుడు అవుతాడు .. జనసైనికుడు అవుతాడు ” అనే పంచ్ డైలాగులు బానే పేలాయి .
సినిమాటోగ్రఫీ పర్లేదు కానీ కెమెరా పనితనంలో అక్కడక్కడా కొన్ని లోపాలు కనిపిస్తాయి . ముఖ్యంగా గ్రాఫిక్ వర్క్ కొద్దిగా నాసిరకంగా ఉంది .
విశ్లేషణ
చాలాకాలం తర్వాత పవర్ ఫుల్ పాత్రలో విభిన్నమైన గెటప్ లో పవర్ స్టార్ నుంచి వచ్చిన హరిహర వీరమల్లు సినిమా అభిమానులకు పూర్తి కనువిందు చేస్తుంది . ఇక సాధారణ ప్రేక్షకులకు సినిమాలో కొన్ని సన్నివేశాలు సాగతీతలా ఉండటం , సరైన గ్రాఫిక్ వర్క్ లేకపోవడం వంటి అంశాలు నచ్చకపోవచ్చు .
ఇంటర్వెల్ ముందు ఔరంగజేబు కోట సన్నివేశాలు భారీ ఎత్తున చూపించటంతో జనాలకు ద్వితీయార్థం మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది . కానీ దర్శకుడు జ్యోతి కృష్ణ రెండో భాగంలో వారి ఆశల మీద నీళ్లు జల్లాడు . స్టోరీ సాగదీత మినహా కొత్తదనం చూపించలేకపోయాడు. కధనంలో ప్రధమార్ధంలో ఉన్నంత వేగం ద్వితీయార్థంలో లేదు
విజువల్స్ పరంగా పూర్ క్వాలిటీని గమనించి స్వయంగా పవన్ కళ్యాణ్ అభిమానులే అసంతృప్తి వ్యక్తం చేసారు . ఈ లోపాన్ని పవన్ కళ్యాణ్ కూడా గుర్తించి త్వరలో సాంకేతిక నిపుణుల సాయంతో సినిమాలో విజువల్స్ క్వాలిటీ మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు .
తొలుత ఈ కథను రాసుకున్న దర్శకుడు క్రిష్ సరిగ్గా వీరమల్లు ప్రాజెక్టు పట్టాలమీదకు వెళ్లిన సమయంలో తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టడంతో మొదటి భాగంలోనూ , రెండో భాగంలోనూ కొంత వ్యత్సాలు కన్పిస్తాయి . కథ విషయంలో ఇద్దరి దర్శకుల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది . ముగింపులో అసలైన యుద్ధం రెండో భాగంలో చూడండి అని హింట్ ఇచ్చారు కాబట్టి వీరమల్లు , ఔరంగజేబుల మధ్య పోరాట సన్నివేశాలు ఆ భాగంలో చూపిస్తారు అనుకోవాలి . ఈ సినిమాని ప్రముఖ నిర్మాత ఎ ఎమ్ రత్నం నిర్మించారు .
అంతిమంగా ఫస్టాఫ్ బాగుంది .. సెకండాఫ్ బాగుండాల్సింది .
నటీనటులు : పవన్ కళ్యాణ్ , నిధి అగర్వాల్ , బాబీ డియోల్ , రఘుబాబు తదితరులు
సంగీతం : ఎం ఎం కీరవాణి
సినిమాటోగ్రఫీ : జ్ఞాన శేఖర్
నిర్మాత : ఎ ఎం రత్నం
దర్శకత్వం : క్రిష్ జాగర్లపూడి , జ్యోతికృష్ణ
రేటింగ్ 2.5 / 5
