Home » చరిత్ర మరువని సైనికుడు అరుణ్ ఖేత్రపాల్ కధే ఇక్కీస్ – అన్నట్టు ఈ మూవీ హీరో అగస్త్య నంద అమితాబ్ బచ్చన్ మనవడే !

చరిత్ర మరువని సైనికుడు అరుణ్ ఖేత్రపాల్ కధే ఇక్కీస్ – అన్నట్టు ఈ మూవీ హీరో అగస్త్య నంద అమితాబ్ బచ్చన్ మనవడే !

Spread the love

ఈ మధ్య బాలీవుడ్లో దేశభక్తి , సైన్యం , యుద్ధం నేపథ్యంలో వచ్చిన సినిమాలు కలెక్షన్ల సునామీలు రాబడుతున్నాయి

సీక్రెట్ ఆపరేషన్ ,స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఇటీవల రిలీజ్ అయిన దురంధర్ మూవీ ఇప్పటికీ వసూళ్లపరంగా దూసుకుపోతుంది

దురంధర్ మూవీ వాస్తవ సంఘటనల ఆధారంగా కథ రాసుకుని తెరకెక్కించారు

గతంలో ఇండియన్ ఇంటలిజెన్స్ డిపార్ట్మెంట్ కు చెందిన అధికారులు శత్రు దేశంలో స్పై ఆపరేషన్లు ఎలా చేసేవారో అందులో చూపించారు

అలాగే ఇక్కీస్ సినిమా కూడా 1971 లో జరిగిన ఇండో -పాక్ వార్ సమయంలో జరిగిన సంఘటనల ఆధారంగా కథ రాసుకుని తెరకెక్కించారు
కాకపోతే ఈ సినిమా పూర్తిగా ఇండో -పాక్ యుద్ధ నేపథ్యంలో సాగుతుంది

కాలేజీకి వెళ్లే విద్యార్థుల వయసులో ఉన్న ఓ కుర్రాడు దేశం కోసం ట్యాంకులు పట్టుకుని శత్రు దేశంతో ఏ విధంగా పోరాటం చేసాడో చూపించిన ఒక వాస్తవిక గాథ

అరుణ్ ఖేత్రపాల్

నిజానికి ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు అరుణ్ ఖేత్రపాల్ ఎవరో చాలామందికి తెలిసుండకపోవచ్చు

21 ఏళ్ళ వయసులోనే దేశం కోసం పోరాడి ప్రాణాలను అర్పించిన వీరుడే అరుణ్ ఖేత్రపాల్

దేశంతో నాకేం పని ? డబ్బులే సంపాదించుకోవాలంటే సైన్యంలోనే చేరాలా ? బోలెడు ఆదాయ మార్గాలు లేవా ? అని ఈ కుర్రాడు కూడా ఆ రోజు అనుకుంటే పాకిస్తాన్ యుద్ధ ట్యాంకులు అంగుళం అంగుళం దాటుకుంటూ ముందుకొచ్చేవి కావా ?

చక్కటి చదువు ఉంది
అందం , ఆస్తి అన్నీ ఉన్నాయి
కానీ వీటన్నిటికంటే అతడిలో దేశభక్తి కూడా ఎక్కువగానే ఉంది

తండ్రి ఆర్మీ ఆఫీసర్
దేశం కోసం సరిహద్దుల్లో పోరాడిన చరిత్ర ఉంది

అలుపెరగని పోరాటంతో యుద్దాలు చేసీ చేసీ రిటైర్ అయిన ఆయన కొడుకుని ఒక్కటే అడిగాడు
నీ జీవితమా ? దేశమా ? ఏదో ఒక్కటే కోరుకో

నీ జీవితమే ముఖ్యమనుకుంటే నచ్చిన జాబులో చేరిపో
దేశమే ముఖ్యమనుకుంటే మాత్రం సైన్యంలోనే చేరిపో అని సలహా ఇచ్చాడు

క్షణం ఆలోచించకుండా దేశమే ముఖ్యం అన్నాడు ఈ కుర్రాడు

ఆ క్షణాన ఆ కుర్రాడికి కూడా తెలీదు
తాను తీసుకున్న నిర్ణయం సరిహద్దుల్లో శత్రువుల నుంచి దేశాన్ని కాపాడుతుందని
ఆ పోరాటంలో తాను అమరుడై చరిత్రలో నిలిచిపోతానని
భవిష్యత్తులో తన కథనే సినిమాగా తీస్తారని
తన పాత్రలో తన అభిమాన నటుడు అమితాబ్ బచ్చన్ మనవడు నటిస్తాడని
తన తండ్రి పాత్రలో మరో అభిమాన నటుడు ధర్మేంద్ర నటిస్తాడని
ఇవేమీ తెలీదు

అతడికి తెలిసింది ఒక్కటే

శత్రు సైన్యాన్ని అంగుళం కూడా ముందుకు రానివ్వకుండా సరిహద్దుల్లో కావలి కాయాలని
దేశం , ధర్మం అంటూ 21 ఏళ్ళ యువకుడు కదన రంగంలోకి దిగాడు

నేటి తరానికి ఇటువంటి వీరుల కథలు తెలియాలి
అందుకే దర్శక , నిర్మాతలు మంచి ప్రయత్నం చేసారు

ఒక వీరుడి కథను ఎక్కువా , తక్కువా లేకుండా వాస్తవంగా చూపించారు

ఇంతకీ ఇక్కీస్ కధేంటి ?

కథ ప్రారంభమే ఇండియన్ ఆర్మీ మాజీ అధికారి ఎంఎల్ ఖేత్రపాల్ (ధర్మేంద్ర ) పాక్ పర్యటనతో మొదలౌతుంది

ఈయన గతంలో ఆర్మీలో పనిచేసినప్పుడు పరిచయాలు ఉన్న కొందరు పాత మిత్రులు రీ యూనియన్ లాంటిది ఏర్పాటు చేయడంలో ఎంఎల్ ఖేత్రపాల్ పాక్ పర్యటనకు వెళ్తాడు

అక్కడ ఈయన పర్యటనలో ఏర్పాట్లను పర్యవేక్షించే బాధ్యతను మరో ఆర్మీ మాజీ ఆఫీసర్ నిస్సార్ అహ్మద్ (జైదీప్ ఆహ్లావత్ ) తీసుకుంటాడు

పాక్ పర్యటనలో భాగంగా వివిధ ప్రదేశాలకు తిరుగుతున్న ఖేత్రపాల్ కు ఇండో -పాక్ వార్ లో తన కొడుకు మరణించిన ప్రదేశానికీ వెళ్తాడు
అక్కడ కొడుకు జ్ఞాపకాలు నెమరువేసుకునే క్రమంలో అరుణ్ ఖేత్రపాల్ కథ మొదలౌతుంది

అది 1971 ఇండో -పాక్ వార్ హోరాహోరీగా జరుగుతున్న సమయం
పాక్ సైన్యం నదిలో బాంబులు పెట్టి మన సైన్యాన్ని ముందుకురానివ్వకుండా కట్టడి చేస్తున్న సమయం
ఈ పరిస్థితుల్లో పాక్ సైన్యాన్ని తాను నిలువరిస్తానంటూ సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేత్రపాల్ (అగస్త్య నంద ) యుద్ధ రంగంలోకి దిగుతాడు

ఇక్కడినుంచి అరుణ్ ఖేత్రపాల్ చేసే సాహసాలు ఏంటి ?
యుద్ధ ట్యాంకులతో తరుముకొస్తున్న పాక్ సైన్యాన్ని ఎలా నిలువరించగలిగాడు?
అందుకోసం అతను తీసుకున్న యుద్ధ వ్యూహం ఏంటి ? అనేది మిగతా కథలో తెలుస్తుంది

ఎలా ఉందంటే ?

ఈ రోజు మనం క్షేమంగా ఉన్నామంటే దేశం కోసం ఇలాంటి సైనికులు చేసిన త్యాగాల ఫలితమే

దర్శక , నిర్మాతలు కూడా అరుణ్ ఖేత్రపాల్ కథను చేతిలో పెట్టుకుని సినిమాగా తీయడానికి ధైర్యం చాలక కొన్నేళ్లపాటు తమదగ్గరే పెట్టుకున్నారట

ఎందుకంటే సైనికుల త్యాగాలను తెలియచెప్పే ఇలాంటి సినిమాలు జనాలు చూస్తారో ? చూడరో ? అనే సందేహమట
కానీ ఆఖరికి ఎలాగైతేనేమి ధైర్యంగా సినిమా పూర్తి చేసి విడుదల చేసారు

స్మగ్లర్లు ,మాఫియా డాన్ , రౌడీల కథలు చూడటానికి మొదటిరోజే పెంచిన రేట్ల ప్రకారం టికెట్లు కొనుక్కుని చూడటానికి అలవాటు పడ్డ మనం కనీసం అప్పుడప్పుకైనా ఇలాంటి వీరుల కథలను సినిమాల్లో చూడాలి

ఇంకా ఏ మూలో మనలో దేశం , ధర్మం , భక్తి ఉండాలంటే ఇలాంటి సినిమాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది

ఆలోచించండి

21 ఏళ్ళ కుర్రాడు తన జీవితాన్ని వదిలేసుకొని దేశం కోసం ఎలా త్యాగం చేసాడో ఆలోచించండి

అదే సైన్యంలో పనిచేసిన తండ్రికి కొడుకు ఒక జ్ఞాపకంగా మిగిలిపోయాడు

దేశం కోసం అతడు తన జీవితాన్ని త్యాగం చేసాడని ఒక రిటైర్డ్ ఆర్మీ అధికారిగా సంతోషపడాలా ?

21 పుట్టినరోజు నాడు వేడుకలు కూడా జరుపుకోకుండా ఉన్నఫళంగా కదన రంగంలోకి దిగి అమరుడైన కొడుకును తల్చుకుంటూ కుమిలిపోవాలా ?

తండ్రీ , కొడుకుల మధ్య నడిచిన ఆ ఎమోషనల్ ఫీలింగ్స్ ఉన్నదున్నట్టుగా తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు

ఈ మూవీలో దర్శకుడు కథని రెండు ప్లాట్లుగా విడగొట్టుకున్నాడు

మొదటి ప్లాటులో కథానాయకుడి సౌర్యం , పరాక్రమం , లవ్ ట్రాక్ లను చూపిస్తూ , రెండో ప్లాటులో తండ్రి జ్ఞాపకాల నేపథ్యంలో సన్నివేశాలను నడిపించారు

కానీ సహజంగా ప్రేక్షకులకు కథానాయకుడి పరాక్రమమే ఎక్కువగా నచ్చుతుంది

కాకపోతే ప్రథమార్ధమంలో హీరో శిక్షణ , లవ్ ట్రాక్ లకు ఎక్కువ సమయం తీసుకోవడంతో కథ నెమ్మదిగా నడుస్తున్న ఫీలింగ్ వస్తుంది

రొటీన్ కమర్షియల్ ఫార్ములా సినిమాల్లో మాదిరి ఐదు నిమిషాలకోసారి బాంబుల మోతతో థియేటర్లు దద్దరిల్లవు కాబట్టి కొంతమందికి ఫస్టాఫ్ కొంత నిరాశ కలిగించవచ్చు

సెకండాఫ్ నుంచి కథ యుద్ధ రంగం మీదకు మళ్లుతుంది కాబట్టి మనకు కావాల్సిన యాక్షన్ సన్నివేశాలు కనిపిస్తాయి

కాకపోతే ఈ దర్శకుడు కొద్దిగా పాత కాలం వాడిలా ఉన్నాడు ( కానీ హార్రర్ సినిమాలు తీసిన రికార్డ్ కూడా ఈయనకి ఉందని ఆనక తెలిసింది )

ఇంతకీ ఈయన్ని ఎందుకు పాతకాలం డైరెక్టర్ అంటున్నానంటే ఇంతకుముందు వచ్చిన చాలా సినిమాల్లో యుద్దమంటే అవతలోడ్నిరప్పా ,రప్పా వేసుకుంటూ వెళ్లిపోవడమే అన్న మోడల్లో చూపించారు

కానీ ఈయన మాత్రం యుద్ధ రంగంలో కూడా నీతి ఉంటుందని చెప్పడానికి ప్రయత్నించాడు

బహుశా ఆ రోజు యుద్ధం చేసిన అరుణ్ ఖేత్రపాల్ యుద్ధ నీతిని ఫాలో అయ్యుంటాడు

అందుకే అరుణ్ ఖేత్రపాల్ చేతికి శత్రు సైనికులు చిక్కినా బందీలుగా చూస్తాడే తప్ప చంపడు

నిజానికి ఈ నిబంధన ఆర్మీలో ఉంటుంది
కానీ యుద్ధ సమయంలో ఎవరూ ఆ రూల్ ని పాటించరు

అది అక్కడి ఆర్మీ నాయకుల విచక్షణాధికారాల బట్టి ఉంటుంది

గతంలో ఇలా మనకు దొరికిన పాక్ సైనికులను వారి దేశానికి అప్పగించడం జరిగింది
అలాగే మన సైనికులను వారు కూడా అప్పగించడం జరిగింది

సరే , ఈ యుద్ధ నీతిని అలా ఉంచితే యుద్ధ రంగంలో ఆ కుర్రాడు చేసిన పోరాటాలు చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది

ప్రాణాలంటే అస్సలు లెక్క ఉండదు
ఎంతసేపూ శత్రువులను అంగుళం కూడా ముందుకు అడుగు వేయనీకుండా ఆపటం మీదే లక్ష్యం ఫోకస్

ఇలాంటి పోరాటాలకు చాలా గట్స్ కావాలి
మాములు మనుషులు చేయలేరు

ఒకపక్క కళ్ళముందే సహచరులు నేల రాలిపోతుంటారు
కనీసం కడసారి నివాళులు అర్పించటానికి కూడా సమయం ఉండదు

మరోపక్కతరుముకొస్తున్న శత్రువులను తిప్పికొట్టాలి

ఇవన్నీ నింపాదిగా కూర్చుని ఆలోచించుకుని చేసే పోరాటాలు కావు
అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి

విజయమో , వీర స్వర్గమో తేల్చుకోవాలి

ఇక్కడ అరుణ్ ఖేత్రపాల్ తన సహచర ఆర్మీ అధికారులతో కలిసి అదే చేసాడు
ఆ పోరాటంలో వీర స్వర్గానికి చేరుకున్నాడు

సినిమా మొత్తం ఒకెత్తు
సినిమాలో ఆఖరి సన్నివేశాల్లో చూపించిన యుద్ధం మరొకెత్తు
ఈ సినిమాకి హైలెట్ యుద్ధ సన్నివేశాలే

ఎవరెలా చేసారంటే ?

ధర్మేంద్ర ఈ సినిమాలో నటించటానికే తన ప్రాణాలను ఉగ్గబట్టుకుని ఉన్నారా ? అనిపించింది

ఆఖరి రోజుల్లో , ఆఖరి పాత్రలో ఆయనకు మంచి రోల్ పడింది

దేశం కోసం పోరాడి అమరుడైన సైనికుడికి తండ్రిగా నటించటం నిజంగా ఆయనకు గొప్ప రోల్ దొరికినట్టే

పైగా వ్యక్తిగతంగా కూడా ధర్మేంద్రకు దేశం , సైన్యం ,దేశం కోసం యుద్ధం , అంటే అభిమానం ఎక్కువ

అందుకే ఆ పాత్రలో నటించి సంతృప్తిగా వెళ్లిపోయారు ధరమ్ జీ

ఇక ఆయన కొడుకు అరుణ్ ఖేత్రపాల్ పాత్రలో నటించిన అగస్త్య నంద నటన కూడా బావుంది
ఇక్కడ ఈ అగస్త్య నంద గురించి కూడా కొద్దిగా చెప్పుకోవాలి

యితడు అమితాబ్ బచ్చన్ మనవడు కావడంతో స్వతహాగా సినిమాల మీద ఇంట్రెస్ట్ ఏర్పడింది

కానీ అగస్త్య తల్లితండ్రులది బిజినెస్ నేపధ్యం కాబట్టి అతడిని సినిమాలకు దూరంగా ఇంగ్లాండ్ లో చదువులకు పంపించారు

కానీ అగస్త్యకు సినిమా రంగం మీద మక్కువ ఉండటంతో చదువుకుంటూనే యాక్టింగ్ కోర్సులో కూడా జాయిన్ అయి నటనలో శిక్షణ పొందాడు

కొన్ని స్టేజ్ షోలు చేసిన తర్వాత కాన్ఫిడెన్స్ రావడంతో తల్లితండ్రులు కూడా అగస్త్యకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు

ఈ కుర్రాడి వయసు 26 సంవత్సరాలే కాబట్టి ఆర్మీ శిక్షణలోనూ , హీరోయిన్ తో ప్రేమను పండించడంలో సరిపోయాడు

కానీ యుద్ధ రంగంలో అలాంటి స్మూత్ నెస్ పండిస్తే నడవదు
రౌద్రం మాత్రమే ఇక్కడ నడుస్తుంది

అతడి శరీర తత్త్వం దృష్ట్యా దర్శకుడు యుద్ధ సన్నివేశాల్లో ఈ కుర్రాడిని చూపించేటప్పుడు ఇంకొంచెం అగ్రెసివ్ గా చూపించి ఉంటే బాగుండేది

రిటైర్డ్ ఆర్మీ అధికారి నిస్సార్ అహ్మద్ పాత్రలో జైదీప్ ఆహ్లావత్ నటన బావుంది

సాంకేతికంగా ఎలా ఉంది ?

ఇలాంటి సినిమాల్లో డ్యూయెట్లు ఎక్స్పెక్ట్ చేయకపోవడమే మంచిది

సీరియస్ గా సాగిపోతున్న కథనానికి ఆ పాటలు స్పీడ్ బ్రేకర్ల మాదిరి అడ్డుతగులుతూ ఉంటాయి మినహా ప్రయోజనం ఏమీ ఉండదు
అప్పటికీ సెకండాఫ్ లో ఓ పాటను అలాగే ఇరికించారు

యుద్ధ సన్నివేశాలను రియలిస్టిక్ గా చూపించాలంటే ఫోటోగ్రఫీ బాగుండాలి
అనిల్ మెహతా కెమెరా పనితీరు బాగానే ఉంది

ఎప్పుడో 1971 కాలంలో జరిగిన యుద్ధం కాబట్టి అప్పటి దుస్తులు , నేటివిటీ , లొకేషన్లు ఫీల్ చెడకుండా చూపించాలంటే విఎఫ్ఎక్స్ పనితీరు కూడా బాగుండాలి
ఆ పరంగా క్వాలిటీ కనపడుతుంది

ముగింపు : రొటీన్ గంజాయి హీరోల కథలు చూసీ , చూసీ విసుగెత్తిపోయిన సినిమా లవర్స్ కు , దేశం కోసం ,ధర్మం కోసం ఆలోచన చేసే యువకులకు , సైన్యం మీద ప్రత్యేక అభిమానం ఉన్న ఇతర ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది

నటీనటులు : అగస్త్య నంద , ధర్మేంద్ర , జైదీప్ ఆహ్లావత్ , సిమర్ భాటియా తదితరులు
దర్శకత్వం : శ్రీరామ్ రాఘవన్
రేటింగ్ : 4 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!