Home » మాస్ జాతరలో మాస్ మహారాజ్ కధేంటి ?

మాస్ జాతరలో మాస్ మహారాజ్ కధేంటి ?

Spread the love

ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలను గమనించారా ?

పాత వస్తువులకే కొత్త లేబుల్ వేసి అమ్మేస్తున్నారు

మాఫియా డాన్ కధలు తీసేటప్పుడు ఒక విలన్ అవయవాలు స్మగ్లింగ్ చేస్తే , ఇంకోడు గోల్డ్ వాచీలు స్మగ్లింగ్ చేస్తాడు
ఒకడు డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తే , ఇంకోడు గంజాయి స్మగ్లింగ్ చేస్తాడు

ఒక్కో సినిమాలో ఒక్కో విలన్ ఒక్కో పదార్దాన్ని స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడన్నమాట

ఫైనల్ గా విలన్ని హీరో చావబాది జెండా ఎగరవేయడంతో మూడు గంటలు ఉగ్గబట్టి కూర్చున్న ప్రేక్షకులు లేచి బయటికి పరిగెడతారు

అన్ని సినిమాల్లో ఇతివృత్తం ఒకటే ఉంటుంది
లేబుల్స్ మార్చి ఒకరెంబడి ఒకరు సినిమాలు తీసి జనాల మీదకి వదుల్తుంటారు

మన హీరో గతంలో ఇదే ఫార్ములాతో సైనికుడి పాత్ర పోషించాడా , హీరో గతంలో పోలీస్ పాత్రలో నటించేసాడా ?

నో ప్రాబ్లమ్

ఇందులో పోలీసుని రైల్వే పోలీస్ చేసేయండి

విలన్ స్మగ్లింగ్ చేయడానికి అన్ని సరుకులూ అయిపోయాయా ?

నో ప్రాబ్లమ్

ఇందులో గంజాయిని వాడేద్దాం

ఆల్రెడీ ఘాటీలో గంజాయి వాడేసారుగా
ఆ .. ప్రేక్షకులకు అంత గుర్తుండి ఛస్తుందా ? కానిచ్చేయండి

సినిమాలో హీరో ఉంటాడు కాబట్టి అతగాడి పక్కన యెగిరి గంతులు వేయడానికి ఓ హీరోయిన్ ఉంటుంది
అలా గెంతులు వేయడానికి శ్రీలీల ను మించి ఎవరున్నారు ?
ఆమెకే హీరోయిన్ అవకాశం

ఇక రవితేజను ఎలా చూపించాలి ?
ఆయన్ని కొత్తగా చూపించేది ఏముంది ?

ఎలాగూ మాస్ మహారాజ్ అనే బ్రాండ్ ఉంది కదా
నాలుగు ఎలివేషన్లు , ఆరు పాటలు , పన్నెండు ఫైట్లు చాలవూ ? ఇవి చాలవూ మాస్ జాతరకు ?

ఇంకేముంది సినిమా రెడీ అయిపొయింది

ఇప్పుడు మాస్ జాతర గురించి మాట్లాడుకుందాం ,

లక్ష్మణ్ భేరి ( రవి తేజ ) తెలంగాణలోని వరంగల్ పట్టణంలో రైల్వే పోలీస్ ఉద్యోగం చేస్తుంటాడు
పేరుకి రైల్వే పోలీస్ లెక్కనే కానీ అన్యాయం కనిపిస్తే అతడికి హద్దులు తెలియవు
ఎంతటివాడినైనా చీల్చి చెండాడుతాడు

అలా మంత్రి గారి కొడుకుతో గొడవ జరిగి కొట్టడంతో లక్ష్మణ్ ని ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి జిల్లా అడవివరం గ్రామానికి ట్రాన్స్ఫర్ చేస్తారు

అక్కడ శివుడు ( నవీన్ చంద్ర ) అనే వ్యక్తి రైళ్ల ద్వారా కలకత్తాకు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు ( ఈ గంజాయి వేరు .. ఘాటీ సినిమాలో విలన్ స్మగ్లింగ్ చేసిన గంజాయి వేరులెండి )

ఈ శివుడికి కానిస్టేబుల్ నుంచి ఎస్పీ వరకు అందరి సహకారం ఉంటుంది
అలాటిచోటకు వచ్చి పడతాడు లక్ష్మణ్

అడవివరంలో అందరి సహకారం ఉన్న శివుడ్ని కొత్తగా వచ్చిన ఈ రైల్వే ఎసై ఎలా ఎదుర్కొంటాడు ?
శివుడి గంజాయి వ్యాపారాన్ని ఎలా అడ్డుకుంటాడు ? అనేది మిగతా కధలో తెలుస్తుంది

ఎవరెలా చేసారు ?

రవితేజ గురించి కొత్తగా చెప్పేది ఏమీ లేదు
మాస్ పాత్రలకు అతడు పెట్టింది పేరు

ఫైట్లు , పాటల్లో అభిమానులకు పూనకాలు తెప్పించడంలో మాస్ మహారాజ్ స్పెషలిస్ట్

అందుకే సామజవరగమన వంటి రొమాంటిక్ కామెడీ సినిమాకి స్టోరీ రాసి మెప్పించిన భాను బోగవరపు కేవలం రవితేజను హీరోగా ఊహించుకుని రాసుకున్న కథతో మాస్ జాతర పేరుతొ దర్శకుడిగా లైట్సాన్ యాక్షన్ కెమెరా అంటూ మూవీని తెరకెక్కించాడు

ఇక్కడే పొరపాటు జరిగింది
కధలో కొత్తదనం మిస్ అయ్యింది

ఆల్రెడీ మాస్ ముద్ర పడిపోయిన రవితేజను అదే మాస్ ఇమేజ్ తో మరోసారి చూసేసరికి ప్రేక్షకులకు కొత్తగా కనెక్ట్ అయ్యింది ఏమీ లేదు

ప్రేక్షకులు రవి తేజను ఇదే స్టైల్ లో.. ఇంకా చెప్పాలంటే ఇంతకంటే పవర్ ఫుల్ స్టైల్ లో విక్రమార్కుడు సినిమాలో ఎప్పుడో చూసేసారు

కాబట్టి మాస్ జాతర లో రవితేజను చూస్తుంటే కొత్తదనం ఏమీ కనిపించలేదు

దానికి తోడు మాములు పోలీసుని రైల్వే పోలీసుగా మార్చి పాత యూనిఫార్మ్ కి కొత్త రేట్ స్టిక్కర్ వేసి షో రూమ్ లో పెట్టారు

కాకపోతే ఈ సినిమాలో రవితేజ మాస్ అప్పీయరెన్సు , డైలాగులు , ఫైట్లు , పాటలు ఖచ్చితంగా ఆయన అభిమానులకు నచ్చుతుంది

ఇక కథలో కూడా కొత్తదనం లోపించింది
గతంలో ఇదే తరహాలో చాలా సినిమాలు వచ్చాయి

ఇక హీరోయిన్ శ్రీలీల గురించి చెప్పుకోవాలంటే హీరో పక్కన గెంతులు వేయడానికే ఆ అమ్మాయిని తీసుకున్నారా అన్నట్టుంది

శివుడిగా నవీన్ చంద్ర విలనిజం బాగానే పండించాడు

ఇక హీరో తాత గా రిటైర్డ్ ఆర్మీ అధికారి హనుమాన్ భేరి పాత్ర పోషించిన రాజేంద్ర ప్రసాద్ నటన మిక్సెడ్ గా ఉంది

అటు రిటైర్డ్ ఆర్మీ పాత్రలో గంభీరత ఒలకపోయాల్సిన సమయంలో మధ్య మధ్యలో కామెడీ ట్రాక్ కూడా ప్రయత్నించడం డిఫరెంట్ గా అనిపిస్తుంది

పైగా ఈ సినిమా ఫ్లాప్ అయితే ఇక సినిమాల్లో నటించను అని అయన ప్రతిజ్ఞ కూడా చేసారు

ఇక సినిమా నిర్మాణంలో చిత్ర నిర్మాత నాగవంశీ ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు పెట్టారు
ఆయన పెట్టిన ఖర్చు మాస్ జాతరలో కనిపిస్తుంది

భీమ్స్ సంగీతం బావుంది

ఓవరాల్ గా మాస్ జాతర రవితేజ అభిమానులను పెద్దగా నిరుత్సాహపరచదు
అలాగే సామాన్య ప్రేక్షకులను పెద్దగా ఉత్సాహపరచదు

నటీనటులు : రవితేజ , శ్రీలీల , నవీన్ చంద్ర , రాజేంద్ర ప్రసాద్
రచన , దర్శకత్వం : భాను భోగవరపు
నిర్మాత : సూర్యదేవర నాగవంశీ
విడుదల తేదీ : 1-11-2025
రేటింగ్ : 2. 5 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *