జటాధర దడా దడ.. ఇంకో పార్ట్ కూడా ఉంది !

Spread the love

జటాధరా మూవీ గురించి చెప్పుకునేముందు హీరో సుధీర్ బాబు గురించి కూడా చెప్పుకోవాలి. నిజానికి ఈ సుధీర్ బాబు టాలెంట్ ఉన్న నటుడే కానీ ఎందుచేతనో ఆయనకు సరైన అవకాశాలు దక్కలేదు . ఆరడుగుల ఆజానుబాహుడు , స్వయానా సూపర్ స్టార్ కృష్ణకు మేనల్లుడు ( కృష్ణ కూతురు ప్రియదర్శిని ఈయన వివాహం చేసుకున్నారు ) అయినా కూడా సుధీర్ బాబుకు సరైన అవకాశాలు దక్కలేదు . సరే , వారసత్వం , బంధుత్వాలు సినిమాల్లో ఎంట్రీ వరకే పనిచేస్తాయి . మిగిలిన కధంతా టాలెంట్ మాత్రమే డిసైడ్ చేస్తుంది అని కృష్ణ ఇద్దరు కొడుకుల చరిత్ర చూస్తే అర్థమైపోతుంది . కృష్ణ వారసత్వంగా ఆయన పెద్దకొడుకు రమేష్ సినిమాల్లోకి వచ్చినా నిలదొక్కుకోలేకపోయాడు . కానీ మహేష్ బాబు మాత్రం తన టాలెంట్ తో సినీ పరిశ్రమలో మరో సూపర్ స్టార్ అయ్యాడు .

సరే మళ్ళీ ఈ సుధీర్ బాబు విషయానికి వస్తే ఇతడి సినీ కెరీర్ 2010 లో ఏం మాయ చేసావే మూవీలో సపోర్టింగ్ రోల్ వేయడంతో ప్రారంభం అయ్యింది . 2012 లో శివ మనసులో శృతి సినిమాతో ఫుల్ లెన్త్ రోల్ దక్కింది . అక్కడ్నుంచి నేటివరకు యావరేజ్ గా సంవత్సరానికి ఒకట్రెండు సినిమాలు చేస్తూ వచ్చాడు . వీటిలో ప్రేమ కథా చిత్రం సినిమా ఒక్కటే ప్రేక్షకుల అంచనాలను అందుకుని సుధీర్ బాబుకు బాగా పేరు తెచ్చిపెట్టింది . మళ్ళీ ఇప్పుడు జటాధరా మూవీతో సరికొత్త ప్రయోగం చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు .
అసలు జటాధరా మూవీ గురించి చెప్పుకోవాలంటే రోజూ పేపర్ చదివేవాళ్ళకు బాగా అర్ధం అవుతుంది

మీరు పేపర్లు చూడండి.. ఫలానా గ్రామంలో లంకె బిందెల కోసం క్షుద్ర పూజలు జరిగాయనో ..ఫలానా గ్రామంలో లంకె బిందెల కోసం పొలంలో మట్టిని తవ్విన గుర్తు తెలియని వ్యక్తులు అనో .. లంకె బిందెల కోసం బలి ఇచ్చిన తాంత్రికులు అనో రకరకాల వార్తలు వస్తూ ఉంటాయి .

పూర్వం శత్రు రాజుల నుంచి కాపాడుకోవడానికి రాజులూ , బందిపోటు దొంగల నుంచి కాపాడుకోవడానికి ధనవంతులూ ఇంట్లో ఉన్న మణులు , మాణిక్యాలను , బంగారాన్ని లంకె బిందెల్లో దాచి భూముల్లో పాతి పెట్టి దాచుకునేవారు . ఈ లంకెబిందెలు అనే ఫార్ములా అప్పట్నుంచి తయారైంది అన్నమాట . అప్పట్లో ఇప్పట్లా బ్యాంకు లాకర్లవీ లేవు కదా .. అంచేత ఆ ఏర్పాట్లు అన్నమాట .

సరే ఎంత భూముల్లో పాతిపెట్టినా దోచుకునేవాడికి తవ్వడం ఓ లెక్కా ? అంచేత బందిపోటులు ఎంచక్కా తవ్వి లంకె బిందెలను పట్టుకుపోయేవాళ్లు . అంత భద్రంగా భూమిలో పాతిపెట్టినా దొంగవెధవలు దోచుకుపోవడంతో అందరూ షాక్ అయ్యారు బంగారాన్ని లాకర్లో అయితే పెట్టాం కానీ దానికి తాళం వేయడం మర్చిపోయాం అని గ్రహించారు పిచ్చి మారాజులు .

అప్పుడు వేశారు బంధనాలు . ఈ బంధనాలు వేయడం అంటే ఆధునిక భాషలో చెప్పాలంటే తాళాలు వేయడం అన్నమాట . ఆ తాళాలను కూడా ఎవరూ బద్దలుకొట్టలేనంత స్ట్రాంగ్ ఏర్పాట్లు చేసుకున్నారు . లంకె బిందెలను భూముల్లో పాతి నాగ బంధనం , పిశాచ బంధనం వంటి రకరకాల బంధనాలు రకరకాల బంధనాలు వేసేవారు.

ఇప్పుడు ఒకవేళ బందిపోట్లు లంకె బిందెల కోసం భూములు తవ్వితే ఈ బంధనాలు వల్ల అక్కడికక్కడే టపా కట్టేవారని ఓ కథ ఉండేది .

ఆగండాగండి

జటాధరా మూవీ రివ్యూ అని చెప్పి చరిత్ర రాస్తున్నా అనుకుంటున్నారా ?
క్లుప్తంగా జటధరా మూవీ స్టోరీ ఇదే . ఆ లంకె బిందెల వార్తల పేపర్ కటింగులను తీసుకుని స్టోరీ అల్లేసుకుని సుధీర్ బాబుతో దర్శకుల వారు మూవీ తీసేశారన్న మాట .

సరే , ఇప్పుడు ఈ జటధరా స్టోరీ ఏంటో కూడా చూద్దాం

కధేంటంటే ?

ఈ మూవీలో శివ ( సుధీర్ బాబు ) దయ్యాలను నమ్మడు. ( కానీ అలాంటి వాడికే కదా దయ్యాలు కనిపించేది ) . పైగా ప్రత్యేకంగా దయ్యాలు ఎక్కడున్నాయా అని అతడు రీసెర్చ్ కూడా చేస్తూ ఉంటాడు .

ఓ రోజు రుద్రారం అనే గ్రామంలో ఇతడి స్నేహితుడు అనుమానాస్పదంగా మరణించడంతో విషయమేంటో కనుక్కుందామని ఆ గ్రామానికి బయలుదేరతాడు . ఈ విషయం అతడి తల్లితండ్రులకు ( రాజీవ్ కనకాల , ఝాన్సీ ) తెలిసి శివని ఎట్టి పరిస్థితుల్లో రుద్రారం గ్రామం వెళ్లవద్దని చెప్తూ ఓ ఫ్లాష్ బ్యాక్ చెప్తారు .

అయినా సరే తల్లితండ్రుల మాట పట్టించుకోకుండా శివ రుద్రారం వెళ్తాడు .

అప్పుడు శివకి రుద్రారం గ్రామంలో ఎటువంటి పరిస్థితులు ఎదురౌతాయి ?
ఇంతకీ శివ తల్లితండ్రులు చెప్పిన ఫ్లాష్ బ్యాక్ ఏంటి ?
రుద్రారం గ్రామానికి శివకు ఉన్న కనెక్షన్స్ ఏంటి ?
రుద్రారం గ్రామంలో పాడుబడ్డ ఇంటిలో ధన పిశాచం ఉండటం వెనుక అసలు కధేంటి ? అనే విషయాలు మూవీలో తెలుస్తాయి .

సినిమా ఎలా ఉంది ?

సినిమా ఎలా ఉందో చెప్పాలంటే కథ వింటే చాలు అర్థమైపోతుంది . నిజానికి జటాధరా స్టోరీ కొత్తగా రాసుకున్నది ఏమీ కాదు . గతంలో కూడా ఇలాంటి కధాంశాలతో కొన్ని సినిమాలు వచ్చాయి . దానికి కొనసాగింపుగా ఈ మూవీ ఉంది . ముందే చెప్పినట్టు పేపర్ కటింగులు చూసి కథ రాసుకున్నట్టు ఉంది .

ఈ దయ్యాలు , పిశాచాలు ప్రధాన పాత్రల్లో గతంలో కూడా చాలా సినిమాలు వచ్చాయి. థియేటర్లో ఏసీ ఫుల్లుగా వేస్తే ప్రేక్షకులు ఎలాగూ గజగజా వణుకుతారు . కానీ ఏసీ వేయకపోయినా ప్రేక్షకుడు గజగజా వణికితేనే హర్రర్ మూవీకి గిట్టుబాటు అన్నమాట .

ఆ గిట్టుబాటు ఇందులో లేదు . పిశాచాన్ని పిశాచంలానే చూపించి ప్రేక్షకులను భయపెట్టాలి. అంతే కానీ పిశాచం పేరు ముందు ధన ఉందికదా అని లలితా జ్యువెలర్స్ బంగారం మొత్తాన్ని ఒంటి మీద దిగేసుకొని ధన పిశాచం వచ్చింది భయపడండి అంటే భయపడకపోగా ఆడ ప్రేక్షకులు ఆ బంగారం డిజైన్ల గురించి ముచ్చటించుకునే ప్రమాదం ఉంది . అంచేత దయ్యాల మీద సినిమాలు తీసేవాళ్ళు పాత విఠలాచార్య సినిమాలు చూడాలని మనవి .

ఇంకోటేంటంటే మనం దయ్యాలు , పిశాచాలు , లంకె బిందెలు అంటూ భయంకరమైన భయపెట్టే ఇతివృత్తాలను తీసుకున్నప్పుడు ప్రేమలు , దోమలు చూపెడితే ప్రేక్షకులకు పంటి కింది రాయిలా కటక్కున మండుద్ది . ఈ మూవీలో హీరో , హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలు హైదరాబాద్ గల్లీల్లో ఉండే ఎత్తైన స్పీడ్ బ్రేకర్ల మాదిరి అడ్డొస్తూ ఉంటాయి . ఈ స్పీడ్ బ్రేకర్ల వల్ల ఫాస్ట్ గా వెళ్తుంది అనుకున్న బండికి సడెన్ బ్రేకులు పడుతూ ఉంటాయి.

ఎవరెలా చేసారు ?

శివ పాత్ర పోషించిన హీరో సుధీర్ బాబు సిన్సియర్ గా కష్టపడ్డాడు .. నటన పరంగా అతడ్ని తప్పు పట్టడానికి ఏమీ లేదు .. లోపమల్లా దర్శకత్వంలోనే ఉంది .

సుధీర్ కి జోడీగా నటించిన దివ్య కోస్లా నటన పర్లేదు
నెగిటివ్ షేడ్ లో శిల్ప శిరోడ్కర్ నటన కూడా పర్లేదు
ధన పిశాచిగా చేసిన సోనాక్షి సిన్హా భయపెట్టలేకపోగా రకరకాల డిజైన్ల బంగారు ఆభరణాలు వేసి ప్రేక్షకులను మురిపించింది .

ఓవరాల్ గా కథని సరైన విధంగా వెండి తెర మీద ప్రెజెంట్ చేయలేకపోయిన దర్శక వైఫల్యం జటధరా . అన్నట్టు ఈ సినిమాకి ఇద్దరు దర్శకులు .. బహుశా సరైన కో ఆర్డినేషన్ లేకపోవడం కూడా కారణం అయ్యుండొచ్చు . ఇంకో అన్నట్టు ఈ జటాధర దడా దడ రెండో పార్ట్ కూడా ఉన్నదట !

సాంకేతికత

రాజీవ్ రాజ్ అందించిన సంగీతం యావరేజ్ గా ఉంది . అలాగే సమీర్ కళ్యాణి అందించిన సినిమాటోగ్రఫీ కూడా యావరేజ్ గానే ఉంది . హర్రర్ జానర్ సినిమాలకు బీజీఎమ్ , సినిమాటోగ్రఫీలు ప్రాణం పోస్తాయి . కానీ ఈ మూవీలో ఆ రెండూ మిస్ అయ్యాయి .

విశ్లేషణ

హర్రర్ జానర్ మూవీలు ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చే అవకాశాలు ఉన్నాయి . కథ మనకు తెలిసిందే అయినా కధనంలో కొన్ని లోపాలు కొట్టుకుపోతాయి . స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ మీద దర్శకుడు మరింత శ్రద్ద పెట్టి ఉంటే బాగుండేది . ఎన్నుకున్న కధాంశం పాతది అయినాకూడా కధనంలో ఆ లోపాలు అధిగమించేలా మరింత శ్రద్ద పెట్టి ఉంటే బాగుండేది . దానికితోడు ఫస్టాఫ్ లో చాలా సన్నివేశాలు సాగతీత కోసం సృష్టించినట్టుగా ఉన్నాయి . సెకండాఫ్ లో అసలు స్టోరీ మొదలైంది అనుకునేలోపు రొటీన్ రొడ్డకొట్టుడులోకి వెళ్ళిపోయి గాడి తప్పింది . ప్రెజెంట్ ట్రెండింగ్ కు అనుగుణంగా దర్శకుడు స్క్రిప్ట్ పకడ్బందీగా రాసుకుని ఉండాల్సింది .

నటీనటులు : సుధీర్ బాబు , సోనాక్షి సిన్హా , శిల్పా శిరోద్కర్ , దివ్య కోస్లా , రాజీవ్ కనకాల , జాన్సీ తదితరులు
నిర్మాత : ఉమేష్ కుమార్ బన్సల్
దర్శకత్వం : అభిషేక్ జైస్వాల్ , వెంకట్ కళ్యాణ్
విడుదల : 07-11-2025
రేటింగ్ : 2 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!