Home » మిరాకిల్స్ చేసిన మిరాయ్ !

మిరాకిల్స్ చేసిన మిరాయ్ !

Spread the love

మిరాకిల్స్ చేసిన మిరాయ్

ఫాంటసీ , జానపద జానర్ లో నడిచే సినిమాలకు బలమైన కథ కన్నా వెండితెర మీద ప్రేక్షకుల కళ్ళకు కట్టుకునేలా నడిపించగలిగే కధనం , విజువల్స్ , బీజీఎమ్ ల మీద శ్రద్ద పెడితే విజయం సాధించవచ్చని మిరాయ్ నిరూపించింది

మిరాయ్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని స్వతహాగా సినిమాటోగ్రాఫర్ కావడంతో విజువల్స్ పరంగా శ్రద్ద తీసుకున్నాడు

అవే ఈ సినిమాకి హైలెట్

ఈ విజువల్స్ ప్రక్రియ మొత్తం స్థానిక టీమ్ తో హైదరాబాద్ స్టూడియోలోనే పూర్తి చేయడం ఆశ్యర్యం కలిగిస్తుంది

విదేశీ సాంకేతిక పరిజ్ఞానానికి ఏ మాత్రం తగ్గకుండా పూర్తి స్వదేశీ పరిజ్ణానంతోనే అద్భుతాలు సాధించిన చిత్రం మిరాయ్

ఇక కథ విషయానికి వస్తే , కళింగ యుద్ధంలో గెలిచినప్పటికీ లక్షలాది మంది సైనికులు మరణించడం అశోక చక్రవర్తిని బాధించింది

దాంతో తనలో ఉన్న శక్తులను తొమ్మిది గ్రంధాల్లో నిక్షిప్తం చేసి వాటిని తొమ్మిదిమంది యోధుల చేతిలో పెట్టి భవిష్యత్తులో మానవాళి రక్షణ కోసం మాత్రమే ఈ గ్రంధాలను వాడమని చెప్తాడు

అలా ఆ గ్రంధాలు ఒక తరం నుంచి మరో తరం యోధుల చేతుల్లోకి మారుతూ సురక్షితంగా ఉంటుంది

2000 వ సంవత్సరంలో తొమ్మిదో గ్రంధానికి రక్షకురాలు అయిన అంబిక ( శ్రీయ ) దివ్యదృష్టితో ఈ గ్రంధాల భవిష్యత్తును చూస్తుంది

దివ్యదృష్టిలో ఆమెకు మహావీర్ లామా అనే దుర్మార్గుడు యోధులనుంచి గ్రంధాలను సొంతం చేసుకున్నట్టు కనిపిస్తుంది

దానితో ఆమె కలవరపడి హిమాలయాల్లో కైలాస పర్వత శిఖరాలకు చేరుకొని అగస్త్య మహామునిని సలహా అడుగుతుంది

ఆయన తన తపశ్శక్తితో జరగబోయే ప్రమాదాన్ని చూసి మహావీర్ నుంచి గ్రంధాలను కాపాడే యోధుడు నీ కడుపులోనే ఉన్నాడని , అయితే ఇందుకోసం నువ్వు బిడ్డను త్యాగం చేస్తే 24 సంవత్సరాల తర్వాత వాడే గ్రంధాలను మహావీర్ పరం కాకుండా కాపాడతాడని చెప్తాడు

దాంతో అంబిక బిడ్డను కాశీలో వదిలేసి ఆశ్రమానికి వెళ్ళిపోతుంది

ఆలా ఆమె వదిలేసిన బిడ్డే వేద ( తేజ సజ్జా )

సరిగ్గా అతడికి 24 ఏళ్ళు రాగానే అంబిక ఆశ్రమం నుంచి విభ ( రితికా నాయక్ ) వేదాను వెతుక్కుంటూ వెళ్లి జరిగిన వృత్తాంతం చెప్తుంది

దానితో వేద మహావీర్ నుంచి గ్రంధాలను కాపాడేందుకు మిరాయ్ కోసం బయలుదేరుతాడు
మిరాయ్ అంటే త్రేతాయుగంలో రాముడి చేతిలో కోదండం

తన జన్మ వృత్తాంతం తెలుసుకున్న వేద ఆ గ్రంధాలను మహావీర్ నుంచి ఎలా కాపాడుకుంటాడు అనేదే మిగిలిన కథ

ఎవరెలా చేసారు ?

ఈ సినిమాకి మొదటి హీరో విజువల్స్.. అటువంటి విజువల్స్ వండర్ సాధించిన దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కూడా హీరోనే .. ఆ తర్వాతనే మిగిలిన వారి గురించి చెప్పుకోవాలి

ముఖ్యంగా పక్షి సన్నివేశంలోనూ , త్రేతాయుగం రాముడి సన్నివేశాల్లోనూ విజువల్స్ ఎఫెక్ట్స్ భారీగా కనిపిస్తాయి
తక్కువ ఖర్చుతో అంత రిచ్ విజువల్స్ సాధించడం పూర్తిగా దర్శకుడి ప్రతిభే

ఇదే రాజమౌళి చేతిలో పడితే బడ్జెట్ తో పాటు టైము కూడా భారీగానే ఖర్చయ్యేది

ఇక హీరో తేజ సజ్జా నట విశ్వ రూపాన్ని హనుమాన్ లో చూసాం

లక్కీ గా అతడికి మంచి కధలు పడుతున్నాయ్

మిరాయ్ లో కూడా తేజ సజ్జకు పెరఫార్మెన్సు కు స్కోప్ ఉన్న పాత్ర పడింది

అయితే హనుమాన్ లో అల్లరిచిల్లరిగా తిరిగే పాత్రలో మొదలైనట్టుగానే మిరాయ్ లో కూడా ప్రధమం లో అల్లరి పిల్లాడిగానే అతడి పాత్ర మొదలౌతుంది

ఎప్పుడైతే తన జన్మ వృత్తాంతం తెలుసుకుంటాడో అప్పుడే అతడిలోని హీరో బయటికి వస్తాడు

విభ పాత్ర పోషించిన హీరోయిన్ రితికా నాయక్ నటన పర్లేదు

వేద తల్లి అంబికా గా శ్రీయకు బరువైన పాత్ర పడింది
ఎమోషన్స్ చక్కగా పండించింది
ఈ సినిమాలో అంబికా పాత్రకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది కాబట్టి శ్రీయకు మంచి పాత్ర పడినట్టే లెక్క

ఇక ఈ సినిమాలో ప్రభాస్ కూడా మెరుస్తాడని సోషల్ మీడియాలో వచ్చిన పుకార్లకు చెక్ పెడుతూ అతడు కేవలం బిగినింగ్ లో తన వాయిస్ ఓవర్ మాత్రమే ఇచ్చాడు

ఇక చెప్పుకోవాల్సింది మంచు మనోజ్ నటన గురించి

కెరీర్ పరంగా గ్యాప్ వచ్చినప్పటికీ ఈ మధ్య తిరిగి కొన్ని సినిమాల్లో నటిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసాడు మంచు మనోజ్

ఈ మధ్య విడుదలైన భైరవం లో నటించినప్పటికీ మనోజ్ కి చెప్పుకోదగ్గ మార్కులు పడలేదు

ఆ లోటు మిరాయ్ తో తీరిపోయింది

మిరాయ్ లో మహావీర్ గా నెగిటివ్ షేడ్ లో ఉన్న పాత్రలో మంచు మనోజ్ జీవించేసాడు

ముఖంలో క్రూరత్వాన్ని , రౌద్రాన్ని పలికించడంలో మనోజ్ సక్సెస్ అయ్యాడు

అయితే మహావీర్ పాత్ర లో మనోజ్ ను ఇంకా శక్తిమంతంగా చూపించవచ్చు .. ఆ విషయంలో దర్శకుడు మనోజ్ ను పూర్తిగా వాడుకోలేదనిపిస్తుంది

ఇక వినోదం కోసం కిశోర్ తిరుమల , వెంకటేష్ మహాల సన్నివేశాలు జోరుగా సాగుతున్న కధకు స్పీడ్ బ్రేకర్ల మాదిరి అడ్డుపడినట్లు అనిపించింది

కొన్ని అనవసరమైన సన్నివేశాల వల్ల కథ అక్కడక్కడా సాగదీసినట్టు అనిపిస్తుంది

గౌరీ హర సంగీతం బావుంది

దర్శకుడు కార్తీక్ క్లైమాక్స్ మీద ఇంకాస్త శ్రద్ద పెట్టి ఉంటే బాగుండేది
బహుశా ఆ లోటు తీర్చడం కోసం పార్ట్ 2 తీస్తున్నట్టు ఉన్నారు

మిరాయ్ పార్ట్ 2 లో రానా

‘ ఇంత మహిమాన్వితమైన ఆ తొమ్మిది గ్రంధాలు నాకు కావాల్సిందే’ అంటూ క్లైమాక్స్ లో రానా ఎంట్రీ ఇవ్వడం పార్ట్ 2 కూడా ఉందన్న విషయాన్ని తెలియచేస్తుంది

రేటింగ్ : 3. 5 / 5

12-09-2025 న థియేటర్లలో రిలీజ్ అయ్యింది

నటీనటులు : తేజ సజ్జా , మంచు మనోజ్ , రితికా నాయక్ , శ్రీయ శరన్ , జగపతి బాబు
నిర్మాత : టిజి విశ్వ ప్రసాద్
సినిమాటోగ్రఫీ , దర్శకత్వం : కార్తీక్ ఘట్టమనేని


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *