ఈ సినిమాలో హీరో ఆది గురించి చెప్పుకునేటప్పుడు ముందుగా ఆయన తండ్రి సాయి కుమార్ గురించి కూడా కొద్దిగా చెప్పుకోవాలి
డబ్బింగ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో పనిచేస్తూనే చిన్న చిన్న పాత్రలను పోషిస్తూ కెరీర్ మొదలుపెట్టిన సాయి కుమార్ అనతికాలంలోనే చక్కటి క్యారక్టర్ ఆర్టిస్టుగా ఎదిగాడు
ముఖ్యంగా నేనేరా పోలీస్ అంటూ ఈయన చెప్పే డైలాగులకు థియేటర్లు దద్దరిల్లిపోయేవి
అంత హై పిచ్ లో ఆపకుండా డైలాగ్ చెప్పడంలో సాయికుమార్ ది అందెవేసిన చేయి
తెలుగునాటే కాదు కన్నడనాడులో కూడా సాయికుమార్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది
ఈయనే కాదు ఇతని కుటుంబంలో అందరికీ గొంతే బలమైన సాధనం
ఆ గొంతు వల్లే ఆ కుటుంబంలో మూడు తరాలు సినిమా రంగంలో అవిశ్రాంతంగా కొనసాగుతున్నారు
ఆ మధ్య అదే కుటుంబం నుంచి సాయి కుమార్ కొడుకు ఆది కూడా సినీ రంగప్రవేశం చేసాడు
ఇతడికి కూడా కుటుంబపరంగా వచ్చిన గొంతు ఉంది.. తండ్రి నుంచి నేర్చుకున్న నటన ఉంది కానీ ఎందుకో ఆది సినిమాలు బాక్స్ ఆఫీసులో సరైన వసూళ్లను రాబట్టలేకపోయాయి
దాదాపు ఇరవై సినిమాలు చేసినప్పటికీ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో సక్సెస్ కోసం ఆది పట్టువదలని విక్రమార్కుడిలా రెండేళ్ల గ్యాప్ తీసుకుని మరీ శంబాలతో మరో ప్రయత్నం చేసాడు
మరి ఈసారైనా అతడి ప్రయత్నం ఫలించిందా ? లేదా ? అనేది ఇప్పుడు చూద్దాం
కధేంటి ?
కథ 1980 ల నేపథ్యంలో రాసుకున్నారు
శంబాల అనే గ్రామంలో ఆకాశం నుంచి ఉల్క పడుతుంది
ఈ గ్రామానికి వెయ్యేళ్ళ చరిత్ర ఉండటం , ఉల్క సరిగ్గా ఇదే గ్రామంలో పడటంతో కథ మొదలౌతుంది
ఈ ఉల్క ప్రభావమో మరొకటో తెలీదు కానీ అప్పట్నుంచి గ్రామంలో వింతలు జరుగుతూ ఉంటాయి
మనుషులు విచిత్రంగా ప్రవర్తించడం , చంపుకోవడాలు , చచ్చిపోవడాలూ నిత్యకృత్యాలు అవుతుంటాయి
ఆవు నుంచి పాలకు బదులు రక్తం రావడంతో మూఢ నమ్మకాలతో గ్రామస్తులు బెంబేలెత్తిపోతారు
ఉల్క రూపంలో బండ భూతం తమ గ్రామంలోకి ప్రవేశించి ఇవన్నీ చేయిస్తుందని హడలి పోతారు
మరోపక్క ఉల్క గురించిన వార్తలు తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం ఖగోళ శాస్త్రజ్ఞుడు విక్రమ్ (ఆది సాయికుమార్ ) ను పరిశోధనల నిమిత్తం శంబాల పంపిస్తుంది
ఇక్కడ్నుంచి సైన్సుకి , శాస్త్రానికి మధ్య సంఘర్షణ మొదలౌతుంది
విక్రమ్ చూస్తే పక్కా సైన్సును నమ్మే శాస్త్రజ్ఞుడు
గ్రామంలో చూస్తే మూఢనమ్మకాలను మాత్రమే నమ్మి నిజమనుకుని భయపడుతున్న ప్రజలు
ఈ పరిస్థితుల్లో శంబాలలో ఏం జరుగుతుంది ?
విక్రమ్ ఉల్క రహస్యాలను ఛేదిస్తాడా ?
శంబాలలో గుడి పూజారి కూతురు దేవి విక్రమ్ కు ఎందుకు సాయం చేస్తుంది ?
టోటల్ గా శంబాలలో జరుగుతున్న మిస్టరీని విక్రమ్ ఎలా పరిష్కరిస్తాడు? అనేది మిగతా కథనంలో తెలుస్తుంది
ఎలా ఉందంటే ?
సైన్సు , శాస్త్రానికి మధ్య సంఘర్షణల నేపథ్యంలో గతంలో చాలా సినిమాలు వచ్చాయి
మరీ ముఖ్యంగా పల్లెల్లో ఉండే మూఢ నమ్మకాలను హీరోలు ఏ విధంగా పరిష్కరిస్తారు అనే పాయింట్ ఆధారంగా కధలు రాసుకుని తీసిన సినిమాలు బోలెడు వచ్చాయి
అయినా సరే ఈ లైనుకి కాస్తంత హర్రర్ మసాలా యాడ్ చేస్తే ఒక వర్గం ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తుంది
ఇది కూడా అలాంటిదే
ఇటువంటి ఇతివృత్తం ఉన్న సినిమాలకు కథ కన్నా కథనమే ఎక్కువ బలాన్ని ఇస్తుంది
స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసేటప్పుడు ప్రేక్షకులకు ఉత్సుకత కలిగించేలా ఎవరెంత జాగ్రత్తగా
కథనాన్ని నడిపించగలరు అనే పాయింట్ మీదే సినిమా విజయం ఆధారపడుతుంది
ఆ పరంగా శంబాల దర్శకుడు స్టూడియోలో కొంత హోమ్ వర్క్ చేసాడనిపిస్తుంది
కధాంశం బట్టి మూఢ నమ్మకాలు , భయపట్టే సన్నివేశాలు బాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నట్టున్నాడు
బాగానే భయపెట్టాడు
ఆ మాత్రం భయపెట్టకపోతే సినిమా కిక్ ఇవ్వదు
అసలు శంబాల అనే టైటిల్ సినిమాకి సగ బలం
టైటిల్ కి ఇంట్రడక్షన్ గా వెయ్యేళ్ళ చరిత్ర యాడ్ చేయడంతో హర్రర్ ఫ్లేవర్ తగిలింది
దానికి తోడు గ్రామంలో తీసిన సీన్స్ పండాయి
పండటం అంటే బాగుందని కాదు , భయపెట్టిందని అర్ధం
ముఖ్యంగా రైతు రాములు ( రవి వర్మ ) ఆవు పాలు పితికితే రక్తం రావడం , అలాగే మీసాల లక్ష్మణ్ , ఇంద్రనీల్ పాత్రలను జాగ్రత్తగా వాడుకుని కొంత భయోత్పాతాన్ని సృష్టించారు
రొటీన్ కధల మాదిరి దయ్యాలు , భూతాల జోలికి పోకుండా ఉల్కా శకలం పడటం దగ్గర్నుంచి కథను మొదలుపెట్టడంతోనే దర్శకుడి తెలివి బయటపడుతుంది
సైన్సుకు , శాస్త్రానికి మధ్య నడిచే సంఘర్షణ గురించి చెప్పాలంటే శంబాలలో ఉల్క పడాలి
అప్పుడే కథకు కొత్తదనం వస్తుంది
అలాగే గ్రామానికి వెయ్యేళ్ళ చరిత్ర ఉందని చెప్పడంతోనే దర్శకుడు ప్రేక్షకులను హిస్టరీలోకి తీసుకుపోయాడు
ఇలాంటి హిస్టారిక్ నేపధ్యం ఉన్న కథల్లో భయం , క్యూరియాసిటీ , ఉత్కంఠత ప్రధాన పాత్రలు పోషిస్తాయి
ఆ మూడు దినుసులను సమపాళ్లలో రంగరించి వదలటంతో టీజర్లో చూపించిన విధంగానే సినిమా ప్రేక్షకులకు కొంత థ్రిల్ ను పంచుతుంది
కాకపోతే ఫస్టాఫ్ లో శంబాల గ్రామంలో మూఢ నమ్మకాలు , ఉల్క గురించి చెప్పడానికి ఎక్కువ సమయం కేటాయించడంతో అసలు కథలోకి రాక కొంత అసహనం అనిపిస్తుంది
ఇంటర్వెల్ ముందునుంచి అసలైన ట్విస్టులతో కథ నడవటంతో మళ్ళీ గాడిలో పడినట్టు అయ్యింది
ఇక సెకండాఫ్ నుంచి పరిశోధనలలో భాగంగా విక్రమ్ రంగంలోకి దిగడంతో కథ చకచకా పరుగులు పెడుతుంది
ముఖ్యంగా కథనంలో అక్కడక్కడా బయటపడ్డ చిన్నచిన్న లోపాల నుంచి ప్రేక్షకుల దృష్టి మరలించే విధంగా హర్రర్ సన్నివేశాలను రూపొందించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు
హర్రర్ సీన్స్ లో ఆ లోపాలు కొట్టుకుపోయాయి
మీసాల లక్ష్మణ్ , రవి వర్మ , ఇంద్రనీల్ పాత్రల ద్వారా తనకు కావాల్సిన హర్రర్ ను ఆయన రాబట్టుకున్నాడు
ఎవరెలా చేసారంటే ?
సాయికుమార్ ఫ్యామిలీలో అందరూ చక్కటి నటులుగా తమని తాము ప్రూవ్ చేసుకున్నవాళ్ళే
అందుకే దశాబ్దాలుగా ఆ కుటుంబం సినీ రంగంలో కొనసాగుతుంది
అదే ఫ్యామిలీనుంచి వచ్చిన ఆది సాయికుమార్ కూడా సక్సెస్ కోసం నాలుగేళ్లుగా కష్టపడుతున్నాడు
కానీ దురదృష్టవశాత్తు అతడికి సక్సెస్ కన్నా ఫెయిల్యూర్స్ ఎక్కువగా వచ్చాయి
అయినా ఆత్మస్థయిర్యం కోల్పోకుండా రెండేళ్ల తర్వాత శంబాలతో ప్రేక్షకుల ముందుకువచ్చారు
శంబాలలో ఆది సాయికుమార్ నటనలో లోపం లేదు
గట్టిగా కష్టపడ్డాడు
మంచి టోన్ ఉంది కాబట్టి డైలాగ్ డెలివరీ కూడా బావుంది
హర్రర్ నేపధ్యం ఉన్న సినిమా కాబట్టి ముఖంలో హావభావాలు కూడా బాగానే పలికించాడు
హీరోయిన్ అర్చనా అయ్యర్ కు కథాబలం ఉన్న పాత్ర పడింది
తనకిచ్చిన పాత్రలో బాగానే మెప్పించింది
పైన చెప్పిన ముగ్గురు రవి వర్మ , ఇంద్రనీల్ , మీసాల లక్ష్మణ్ పాత్రలు కథకు ఆయువుపట్టు లాంటివి
ఆయా పాత్రల్లో ఆ ముగ్గురూ తమ పరిధిమేరకు నటించి భయపెట్టారు
సాంకేతికత ఎలా ఉందంటే ?
హర్రర్ నేపధ్యం ఉన్న సినిమాలకు బీజీఎమ్ ఉపిరిలాంటిది
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎంత మోగితే సన్నివేశం అంత పేలుతుంది
ఆ పరంగా చరణ్ పాకాల గట్టిగానే మోగించారు
హర్రర్ సినిమాలన్నీ దాదాపు చీకట్లోనే నడుస్తాయి
చీకటి అంటే లైట్లన్నీ ఆపి షూటింగ్ చేయడం కాదు
చూసే ప్రేక్షకుడికి చీకట్లో ఏదో జరుగుతుందనే ఫీలింగ్ రావాలి
కటిక చీకటిలో కూడా చూపించాలనుకున్న దృశ్యాన్ని భయపెట్టేలా చూపించాలంటే మంచి కెమెరా పనితనం ఉండాలి
ఇక్కడ కెమెరా బాగానే భయపెట్టింది
నిర్మాణ విలువల మీద ఇంకొంచెం శ్రద్ద పెట్టి ఉంటే బాగుండేది
ఎందుకంటే ఇలాంటి సినిమాలకు రాజీ పడని నిర్మాణం కూడా అవసరం
కొన్ని సన్నివేశాల్లో ఆ లోపం కనిపిస్తుంది
ముగింపు : ఈ మధ్య సినిమాల్లో దర్శకులు ఓ కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు
తాము చెప్పాలనుకున్న పాత కథలనే కొత్త పాయింటుతో వెండితెర మీద ఆవిష్కరిస్తున్నారు
ఈ మార్పు లేటెస్ట్ సినిమాలు చూసిన ఎవరికైనా అర్ధం అవుతుంది . శంబాల కూడా అంతే.
డైరెక్టుగా దయ్యాలు ,భూతాలు అంటూ ప్రేక్షకులను భయపెట్టకుండా ఆకాశం నుంచి ఉల్కను భూమ్మీదకు దింపి దానికి సైన్సును జోడించి నమ్మకాల మీద యుద్ధం ప్రకటించాడు
ఎందుకంటే అలా ఉల్కను దింపకపోతే ఆల్రెడీ చాలా సినిమాల్లో ఈ బండ భూతాలను చూసి చూసి ప్రేక్షకుడు భయపడటం ఎప్పుడో మానేసాడు . అందుచేత ఈ ఉల్క ఏర్పాటు అన్నమాట
సరే ఏదిఏమైనా కాసేపు హర్రర్ జోన్ లోకి వెళ్లి వద్దాం అనుకున్నవాళ్ళకి ఈ సినిమా నచ్చుతుంది . ఈ గోల వద్దు అనుకున్నవాళ్ళకి అస్సలు నచ్చదు
నటీనటులు : ఆది సాయికుమార్ , అర్చనా అయ్యర్ , రవివర్మ , హర్షవర్ధన్ తదితరులు
సంగీతం : శ్రీచరణ్ పాకాల
సినిమాటోగ్రఫీ : ప్రవీణ్
నిర్మాత : మహీధర్ రెడ్డి
దర్శకత్వం : యుగంధర్ ముని
విడుదల : 25 -12 -2025
రేటింగ్ : 2.5 / 5
