Home » రాజా చెయ్యి వేస్తే అది రాంగై పోదులే .. రాజాసాబ్ టికెట్ రేట్ల పెంపుకు తెలంగాణ ప్రభుత్వ అనుమతి !

రాజా చెయ్యి వేస్తే అది రాంగై పోదులే .. రాజాసాబ్ టికెట్ రేట్ల పెంపుకు తెలంగాణ ప్రభుత్వ అనుమతి !

Spread the love

” ఇకపై టికెట్ రేట్లు పెంచేది లేదు ..ఇదే ఆఖరు.. ఈ విషయమై నిర్మాతలు ఎవరూ ప్రభుత్వం దగ్గరికి రావద్దు ” అని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి ఇలా ప్రకటన ఇచ్చి కొన్ని రోజులు అయ్యిందో లేదో నిన్న అర్ధరాత్రి ప్రభాస్ మూవీ రాజాసాబ్ టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇస్తూ హోమ్ సెక్రెటరీ జీవో ఇచ్చేసారు

నిజానికి మంత్రిగారి ప్రకటనకు చాన్నాళ్ల ముందే సీఎం రేవంత్ కూడా సినిమా టికెట్ రేట్ల పెంపుకు అనుమతులు ఇచ్చేది లేదని స్పృష్టంగా చెప్పేసారు

కానీ ఏమైందో ఏంటో కానీ సీఎం చెప్పిన తర్వాత కూడా టికెట్ రేట్లు పెంచుకోవడానికి తెలంగాణా ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది

సీఎం , మంత్రుల ప్రకటనలతో సినీ ప్రియులు సంతోషపడిపోయారు
కానీ వారి సంతోషం అధికారుల జీవోలతో నీటి బుడగలు అయిపోయాయి

దాంతో ఇకపై మూవీలు ఓటిటిలోకే వచ్చాక చూద్దామని ఫిక్స్ అయిపోయిన సగటు ప్రేక్షకుడిలో తిరిగి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశలు నింపారు

“ఇదే లాస్ట్ .. కావాలంటే మీ హీరోలను రెమ్యునరేషన్ తగ్గించుకోమని చెప్పండి .. వాళ్ళకి కోట్లలో ఇస్తూ టికెట్ రేట్ల పెంపు కోసం మాత్రం మా దగ్గరికి ఎందుకు వస్తారు ? ఇకపై ఈ విషయం గురించి మాట్లాడటానికి మా దగ్గరికి ఎవరూ రాకండి ” అంటూ సీరియస్ గా తేల్చి చెప్పేసారు

ఆయన ప్రకటనతో మళ్ళీ సగటు ప్రేక్షకుడిలో ఆశలు చిగురించాయి

చెప్పింది మంత్రిగారు
పైగా సినిమాటోగ్రఫీ మంత్రి గారు
ఆయన మాటలకు విలువ లేకుండా ఉంటుందని ఎలా అనుకుంటారు ?
ఇంకా పైగా ఆయన నిర్ణయం తీసుకుంటే ఎవర్నీ లెక్కపెట్టరని మంచి పేరు కూడా ఉంది

పోనీలే ఇన్నాళ్ళకైనా మంచి నిర్ణయం తీసుకున్నారు
ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటే పైరసీ సినిమాలతో పనేముంది ? అనుకున్నారు

అలా అనుకుని ముచ్చటపడేంతలోపే రాజాసాబ్ జీవో చూసి షాక్ అయ్యారు

ఈ విషయం మంత్రికి తెలిసే జరిగిందో , తెలియక జరిగిందో తెలీదు కానీ ఈ ఉదంతంతో అధికారులకు , మంత్రులకు మధ్య సమన్వయం లేదని మాత్రం తెలుస్తుంది

జీవో అయితే రాత్రికి రాత్రి బయటకు వచ్చింది కానీ ప్రయత్నాలు మాత్రం గత మూడు రోజులుగా జరుగుతూనే ఉన్నాయి

కనీసం ఈ మూడు రోజుల్లోనైనా అధికారులు ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారో లేదో తెలీదు

ఒకవేళ ఆయన నోటీసు కి తీసుకువచ్చి ఉంటే మంత్రి గారే ఒక ప్రకటన చేసి ఉంటే క్లారిటీ ఉండేది

పోనీ తమ మూవీకి టికెట్ల రేట్ల పెంపుకు ప్రభుత్వ అనుమతి కోరిన నిర్మాతలు అప్లికేషన్ లో చూపిన కారణం చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టక తప్పదు

తాము భారీ బడ్జెట్ తో సినిమా తీసాం కాబట్టి టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వాల్సిందిగా కోరారు

ఇదేమన్నా సహేతుకంగా ఉందా ?

సినిమా నిర్మాణం అనేది పూర్తిగా నిర్మాతల సొంత రిస్క్ మీద నడిచే వ్యాపారం

మేము ఎక్కువ ఖర్చు పెట్టి సినిమా తీసాం కాబట్టి అధిక ధరలకు టికెట్లు అమ్ముకుని దోచుకుంటాం అంటే అదేం పద్దతి ?

కావాలంటే నిర్మాణ వ్యయం తగ్గించుకుని లో బడ్జెట్లోనే సినిమాలు తీసుకోండి

సంవత్సరానికి పది ,ఇరవై సినిమాలు చేసిన ఎన్టీఆర్ , ఏఎన్నార్ , కృష్ణలాంటి హీరోలకే ఇంతింత రెమ్యునరేషన్లు లేవు

వాళ్ళు తమ రెమ్యునరేషన్ తగ్గించుకుని నిర్మాతలకు లాభాలు పంచారు

మరి ఇప్పుడు ?

ఒక్కో హీరో రెండేళ్లు ,మూడేళ్లు ఒక్క సినిమానే చేస్తూ పైసా కూడా తగ్గకుండా రాజాసాబ్ లా కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు

మళ్ళీ ఇంకో సినిమాకి సైన్ చెయ్యాలంటే ఏడాది పాటు విదేశాల్లో విలాసాలు పూర్తి అయిన తర్వాతనే చేస్తున్నారు

ఎక్కడికి పోతుంది ఈ వ్యాపారం ?

బాల్కనీ టికెట్ 40 రూపాయలు ఉన్న రోజుల నుంచి 400 రూపాయల రోజుల్లోకి వచ్చేసాం

ఆ రోజుల్లో 40 రూపాయల టికెట్ను వందకు అమ్మితే నేరం
బ్లాక్ టికెట్లు అమ్మితే కేసులు ,కోర్టులు

ఈరోజు అదే టికెట్లను మొదటిరోజు ప్రీమియర్ షో పేరుతొ ఎక్కువ రేటుకు అమ్ముకుంటే లీగల్ , అంతా చట్టబద్దం

దోచుకోవడం తెలిసినోడికి దోపిడీలు చట్టబద్దం చేయించుకోవడం తెలియకుండా ఉంటుందా ?

పైగా సింగిల్ స్క్రీన్స్ దాదాపు మాయమైపోయి మల్టీప్లెక్సులు వెలిసి సినిమా వ్యాపారాన్ని కార్పొరేట్ లెవెల్ కి తీసుకెళ్లి పాప్ కార్నులు , సమోసాల్లో కూడా ప్రేక్షకుల జేబులకు చిల్లులు పెడుతున్నారు కదా

ఇట్టా చేయబట్టే కదా ఐ బొమ్మ రవిలాంటి పైరసీకారుడికి సోషల్ మీడియాలో మద్దతు వస్తుంది

ఏపీలో ఈ కాస్త డ్రామా కూడా లేదు
అడగ్గానే టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఉదారంగా పర్మిషన్లు ఇచ్చింది

ప్రీమియర్ షోకు 1,000 రూపాయల రేటుకు ఓకే చెప్పేసింది

మొదటి పదిరోజులు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అదనంగా 150 రూపాయలు , మల్టీప్లెక్సులలో 200 వరకు ప్రొసీడ్ అయిపోండి అంటూ పర్మిషన్లు ఇచ్చేసారు

కోట్లలో ఖర్చుపెట్టి సినిమా తీసినవాడికి ఆ మాత్రం ప్రోత్సాహం ఇవ్వొద్దూ ? అనుకున్నట్టున్నారు

అందుకే అనుమతులు రావడం ఆలస్యం నిర్మాతలు గేట్లు ఓపెన్ చేసి అభిమానులు చేసిన ధన సాయంతో తమ పెట్టుబడులకు లాభాలను తెచ్చుకుని సంతోషపడ్డారు

కానీ తెలంగాణా కొద్దిగా ఇబ్బంది పెట్టింది
టికెట్లు పెంచుకుని అమ్ముకునేందుకు అడిగిందే తడవుగా అనుమతులు ఇవ్వలేదు

నిర్మాతలు కోర్టుకు కూడా పోయారు
అనుమతి ఇచ్చే అధికారం హోమ్ సెక్రెటరీ పరిధిలో ఉంది కాబట్టి వెళ్లి ఆయన్ని కలవండి అంది

దాంతో బంతి హోమ్ సెక్రెటరీ ఛాంబర్లో పడింది

ఎలాగైతేనేమి నిన్న అర్ధరాత్రి నుంచి తెలంగాణాలో కూడా టికెట్ రేట్లు పెంచి అమ్ముకోవడానికి జీవో ఇచ్చేసారు

ఈరోజు నుంచి 11 వరకు సింగిల్ స్క్రీన్స్ లో 105 , మల్టీప్లెక్సులలో 132 రూపాయలు అదనంగా వసూలు చేసుకోవచ్చు

మళ్ళీ 12 నుంచి 18 వరకు 62 రూపాయలు , 89 రూపాయలు చొప్పున ఎక్సట్రా రేట్లకు అమ్ముకోవచ్చు

అయితే వచ్చిన లాభాల్లో 20 శాతం ఫిలిం ఫెడరేషన్ కార్మికుల సంఘానికి జమ చేయాలని కండిషన్ పెడుతూ అనుమతులు ఇచ్చారు

ఈ 20 శాతం కథ ఏంటి అనుకుంటున్నారా ?

దానికో చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంది

ఎంత పెద్ద సినిమా అయినా , చిన్న సినిమా అయినా కార్మికుడు లేనిదే పని జరగదు
సినిమా నిర్మాణంలో లైట్ బాయ్ నుంచి మేకప్ బాయ్ వరకు ప్రతి ఒక్కడి కష్టం ఉంటుంది

ఒక సినిమా హిట్ అయి లాభాలొస్తే ఏటికేడు హీరోల రెమ్యునరేషన్లు పెరిగిపోతాయి
కానీ కార్మికుల వేతనాలు మాత్రం అంతే ఉంటాయి

ఇదే విషయం మీద కొద్దినెలల క్రితం సినీ కార్మికులు సమ్మె చేస్తే , ఆఖరికి సీఎం జోక్యం చేసుకుని ఇకపై నిర్మాతలు 20 శాతం లాభాలు కార్మికులకు పంచుతామంటేనే టికెట్ రేట్ల పెంపుకు అనుమతులు ఇస్తామని చెప్పి వారిచే సమ్మె విరమింపచేశారు

దీనిప్రకారం టికెట్ రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వ అనుమతులు పొందిన నిర్మాణ సంస్థలు ఆ టికెట్లు అమ్మగా వచ్చిన లాభాల్లో 20 శాతం తప్పనిసరిగా కార్మికుల వెల్ఫేర్ ఫండ్ లో జమచేయాలి

ఇక్కడ చిన్న మెలిక ఉంది , గమనించారా ?

కార్మికులు జీతాలు పెంచమని అడిగింది కోట్లు ఖర్చు పెట్టి హీరోలకు రెమ్యునరేషన్లు ఇస్తున్న బడా నిర్మాతలని

హీరోగారికి ఎంతైనా పెడతాం కానీ మీకు మాత్రం పైసా పెంచేది లేదని మొదట్లోనే మొండికేశారు సదరు పెద్దమనుషులు
పెంచితే కానీ సమ్మె విరమించేది లేదు అని వీళ్ళు కూడా మొండికేసి కూర్చున్నారు
ఫలితంగా కోట్ల వ్యాపారం స్థంభించిపోయింది

ఇప్పుడు ఆ ఇరవై శాతం ఎవరిస్తారు ?

ఆ సమస్యకు పరిష్కారం వెర్రి అభిమానుల రూపంలో దొరికారు

నిర్మాత జేబులోనుంచి అదనంగా పైసా తీసి కార్మికులకు ఇవ్వక్కర్లేదు
ప్రీమియర్ షోలలో వెయ్యి రూపాయలు పెట్టి టికెట్లు కొనుక్కుని చూసే అభిమాని జేబులోనుంచే నిర్మాతకు లాభాలు వెళ్లడంతో పాటు సినీ కార్మికులకు 20 శాతం అదనపు వేతనం రూపంలో అందుతుంది
సమస్య సింపుల్ గా పరిష్కారం అయిపోయింది

టికెట్ రేట్లు పెంచితే పెంచారు మన 20 శాతం వచ్చేస్తుంది కదా అని కార్మికులు హ్యాపీ
20 శాతం పొతే పోయింది .. పెంచిన టికెట్ రేటులోనుంచే కదా ఇస్తుంది అని నిర్మాతలు హ్యాపీ
వెయ్యి రూపాయలు అయితేనేమి ప్రీమియర్ షోలోనే అభిమాన హీరోగారి సినిమా చూసేసాం అని అభిమాని హ్యాపీ
ఇంతింత రేట్లు పెట్టుకుని సినిమా చూసే బదులు నాలుగు రోజులాగి ఓటిటిలో చూడొచ్చు ..అనుకుని పానీపూరి తింటూ సగటు ప్రేక్షకుడు కూడా హ్యాపీ

ముగింపు : టికెట్ రేట్ల పెంపు విషయంలో ప్రభుత్వాలనుంచి , బడా నిర్మాతలనుంచి మార్పు ఆశించటం అత్యాశ అవుతుంది

మార్పు అభిమానులలో రావాలి

నిన్న అర్ధరాత్రి హైద్రాబాదులో మీడియా కోసం ఓ థియేటర్లో రాజాసాబ్ ప్రీమియర్ షో వేశారు

ఎలా తెలిసిందో ప్రభాస్ ఫాన్స్ అంటూ వందలాదిమంది యువత బైకులు వేసుకుని థియేటర్ దగ్గరికి వచ్చారు

ఈ ప్రీమియర్ మీడియా వారికోసమే , ఇతరులకు అనుమతి లేదని చెప్తున్నా వినిపించుకోకుండా తోసుకుని థియేటర్లోకి వస్తుండటంతో సిబ్బంది వాళ్ళని కర్రలతో గొడ్డుని బాదినట్టు బాదారు

ఒక్కొక్కళ్ళకి వీపులు విమానం మోతమోగినట్టు మోగిపోయాయి
నిజంగా ఆ టైములో మీ ఇంట్లోవాళ్ళు టీవీల్లో ఆ దృశ్యాలను చూస్తే వారి ఫీలింగ్స్ ఎలా ఉంటాయో ఆలోచించారా ?

మొదటిరోజే హీరోగారి మూవీని చూసెయ్యాలనే అత్యుత్సాహంతో అమ్మానాన్నలు ఇచ్చిన పాకెట్ మనీతో సినిమాకి తగలేసేబదులు నాలుగు రోజులాగి టికెట్ రేట్లు తగ్గిన తర్వాత అవే డబ్బులతో అమ్మానాన్నలను కూడా తీసుకెళ్లి చూపించండి

మీ సంతోషాలను కుటుంబ సభ్యులతో కలిసి పంచుకోండి
అది మీ హీరోకి మీరిచ్చే నిజమైన గౌరవం అవుతుంది

అసలామాటకొస్తే ఇంట్లో పొద్దున్న లేస్తే మీ కళ్ళముందే కనిపించే మీ నాన్నే మీ జీవితంలో మొదటి రియల్ హీరో అని గుర్తించండి

మీరిచ్చే డబ్బులతో విలాసవంతమైన జీవితాలు గడుపుతున్న హీరోలు రేపు ఏదైనా అవసరం అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాడో రాడో తెలీదు కానీ అమ్మానాన్నలు ఖచ్చితంగా వస్తారు
అందుకే మార్పు అభిమానులలోనే రావాలి

ఇప్పుడే అందిన వార్త
టికెట్ రేట్లు పెంచుతూ హోమ్ సెక్రెటరీ ఇచ్చిన జీవోని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!