“నేను సీఎంఓ నుంచి మాట్లాడుతున్నాను ..ఈ ఉదయం జరిగిన ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా హత్యతో విజయవాడలో ఆస్తి , ప్రాణ నష్టాలు జరుగుతున్నాయని రిపోర్టులు వస్తున్నాయి .. అక్కడ సీఎం గారి బంధువులు ఉన్నారు .. తక్షణం వారికి ప్రొటెక్షన్ కల్పించమని సీఎం గారు చెప్పారు “
హైద్రాబాదు నుంచి ఫోన్ చేసి విజయవాడ పోలీస్ బాసుకి ఆదేశాలు ఇచ్చారు సీఎంఓ అధికారి
“సర్ .. సిట్యుయేషన్ ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ .. ప్రస్తుత పరిస్థితుల్లో మనదగ్గరున్న ఫోర్స్ సరిపోవడం లేదు .. ఆందోళనకారులు తుపాకీ గుళ్ళని కూడా లెక్కచేయకుండా రోడ్ల మీదకు వచ్చారు .. మంగళగిరి బెటాలియన్ కి ఇన్ఫార్మ్ చేసాం సర్ .. అడిషనల్ ఫోర్స్ వస్తే కానీ పరిస్థితి మన కంట్రోల్ లోకి రాదు .. సర్ .. ఒక పోలీస్ అధికారిగా నేను చెప్పకూడదు .. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే నా ఫ్యామిలీని కూడా సేఫ్టీ ప్లేసుకు పంపేసా .. సర్ మీరు ఏమీ అనుకోకపోతే వారిని ఒక్క రెండ్రోజులు సేఫ్ ప్లేస్ లోకి వెళ్లిపొమ్మని చెప్పండి.. ఆస్తులు పోయినా ప్రాణాలు మిగులుతాయి.. ప్రస్తుతానికి అంతకుమించి మరో మార్గం లేదు .. ఇట్స్ మై రిక్వెస్ట్ ” సున్నితంగా మాట్లాడుతూనే విజయవాడలో ఉన్న కండిషన్ ని సూటిగా చెప్పేసాడు ఆ పోలీస్ అధికారి
విజయవాడలో ఉన్న సిట్యుయేషన్ గురించి అప్పటికే ఇంటలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఆయన టేబుల్ మీదే ఉన్నాయి కాబట్టి ఏమీ మాట్లాడలేక ఫోన్ పెట్టేసాడు ఆ అధికారి
ఇదీ వంగవీటి మోహన రంగా హత్య జరిగిన డిసెంబర్ 26 తెల్లవారు ఝామున విజయవాడలో పరిస్థితి
సీఎం బంధువులకే రక్షణ కల్పించలేని పరిస్థితి
విజయవాడలో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు వరుసకు చెల్లెలు అయ్యే బంధువులు కుటుంబంతో సహా ఉంటున్నారు
ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమ రావు , బాలయ్య లతో సహా ఇతర కుటుంబ సభ్యులు పనిమీద విజయవాడ వచ్చినప్పుడు వీరి ఇంటిలోనే దిగేవారు
ఈ త్రివిక్రమరావు కొడుకే నందమూరి కళ్యాణ చక్రవర్తి
ఆయన పేరు మీదే విజయవాడ గాంధీనగర్లో పెద్ద థియేటర్ కాంప్లెక్స్ కూడా కట్టారు
ఈ థియేటర్ వ్యవహారాలు చూసుకోవడానికి , ఫిలిం పంపిణీ వ్యవస్థలు చూసుకోవడానికి వారు తరచూ విజయవాడ వస్తూ ఇక్కడ మకాం పెట్టేవారు
ఎన్టీఆర్ మాత్రం సినిమా నటుడిగా ఉన్నప్పుడు కానీ , ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ ఎప్పుడూ ఈ ఇంట్లో విడిది చేయలేదు
హీరోగా ఉన్న రోజుల్లో విజయవాడ వచ్చినప్పుడు ఓ ప్రముఖ ఫిలిం డిస్ట్రిబ్యూషన్ గెస్ట్ హౌస్ లో దిగేవారు
ఆయన సీఎం అయిన తర్వాత బందర్ రోడ్ లో ఉన్న స్టేట్ గెస్ట్ హౌస్ కి మకాం మారింది
ఇదిలా ఉండగా రంగా హత్య వార్త తెలిసిన ఆందోళనకారులు గాంధీనగర్లో ఉన్న కళ్యాణ చక్రవర్తి థియేటర్ కి నిప్పంటించారు
ఎంతలా అంటే ఆ నిప్పుకి ఎగసిన మంటలు అదే పేటలో ఉంటున్న ఎన్టీఆర్ బంధువులకి కూడా కనిపించింది
దాంతో వాళ్లకి పరిస్థితి అర్థమైంది
నెక్స్ట్ ఆందోళనకారులు తమ ఇంటిమీదే పడతారని గ్రహించారు
వెంటనే అప్పటి పోలీస్ అధికారికి ఫోన్ చేసి రక్షణ కల్పించమని కోరారు
రక్షణ సంగతి దేవుడెరుగు
ముందు మీరు ఉన్నపళంగా ఆ ఇంటినుంచి ప్రాణాలతో బయటపడండి అని ఆయన హెచ్చరించారు
సీఎం బంధువులు చెప్తున్నా ఆయన పట్టించుకోకపోవడంతో వీరికి కోపం వచ్చింది
వెంటనే హైదరాబాదులో ఉన్న సీఎం ఎన్టీఆర్ కు ఫోన్ చేసారు
సీఎం లైనులోకి రాలేదు కానీ ఓ అధికారి మాట్లాడి విజయవాడ పోలీస్ అధికారితో మాట్లాడుతానని చెప్పి కాల్ కట్ చేసాడు
ఆ సందర్భంలోనే సీఎంఓ అధికారి విజయవాడ పోలీస్ బాసుతో మాట్లాడితే పైన చెప్పిన స్పందన వచ్చింది
మరోపక్క విషయం సాక్షాత్తు సీఎంవోకే చెప్పాము కాబట్టి సెక్యూరిటీ వస్తుందని సీఎం బంధువులు ధీమాగా ఇంట్లోనే ఉండిపోయారు
ఈలోపు కళ్యాణ చక్రవర్తి థియేటర్ కి నిప్పంటించిన ఆందోళనకారులు వాయువేగంతో వీరి ఇంటివైపుకు దూసుకువచ్చి ఇక్కడా నిప్పు పెట్టారు
కిందిభాగంలో మంటలు ఎగసిపడుతుండటంతో వారికి పరిస్థితి అర్థమైంది
ప్రాణభయంతో ఇంట్లోనుంచి పరుగులు పెట్టి అక్కడికి దగ్గర్లోనే ఉన్న ఒక కుటుంబాన్ని శరణు అడగటంతో వారు ఆశ్రయం ఇవ్వడంతో వారం రోజులపాటు వాళ్ళ ఇంట్లోనే బతుకు జీవుడా అనుకుంటూ బిక్కుబిక్కుమంటూ గడిపి చివరికి పోలీసుల సాయంతో హైద్రాబాదు చేరారు
ఆ రకంగా ఆ రోజు ఎన్టీఆర్ బంధువులు ప్రాణాలతో బయటపడ్డారు
ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే ఆ కుటుంబానికి ఆశ్రయం ఇచ్చి ప్రాణాలు కాపాడింది వంగవీటి మోహన రంగాకు అత్యంత సన్నిహితులు
అదే విషయం వారిని అడిగితే వంగవీటి రంగా జీవించి ఉన్నా ఇటువంటివాటిని ఆయన ప్రోత్సహించడు
పైగా రక్షణ కావాలని శత్రువు సైతం వచ్చి శరణు అడిగినా సరే తన ప్రాణాలను అడ్డం పెట్టి మరీ కాపాడేవాడని.. అందుకే ఆయన అంత గొప్ప నాయకుడు అయ్యాడని చెప్పారు
ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో వంగవీటి బాడీ
వార్త తెలిసిన జనం తండోపతండాలుగా రంగా ఇంటికి పరుగులు పెట్టారు
అక్కడ ఆయన నిరాహార దీక్ష చేసిన ప్రాంతం రక్తసిక్తంగా ఉంది
బాంబులు సృష్టించిన మంటలు ఇంకా ఎగసిపడుతూనే ఉన్నాయి
అక్కడ జనం తప్ప పోలీసులు లేరు
ఎవరో చెప్పారు , వంగవీటి బాడీని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారని
అయినా ఆయన గాయాలతో బతికి బయటపడతాడని ఆశతో జనం హాస్పిటల్ కి పరుగులు పెట్టారు
అప్పటికే చకచకా పోస్టుమార్టం పూర్తి చేసి ఆసుపత్రి ప్రాంగణంలో బల్లమీద ఆయన పార్దీవ దేహాన్ని ఉంచి భయంతో డాక్టర్లు , సిబ్బంది కూడా పారిపోయారు
రంగా ఏ జనాన్ని అయితే నమ్ముకున్నాడో అదే జనం ఆయన మీద పడి గుండెలవిసేలా రోదిస్తున్నారు
ఆయనను ఆ స్థితిలో చూసిన అభిమానులు తట్టుకోలేకపోయారు
విజయవాడలో ఏ వీధి చూసినా రంగన్నా , రంగన్నా అంటూ గుండెలుబాదుకుంటూ ఏడుస్తున్న జనం కనిపిస్తున్నారు
బీబీసీ వార్తల్లో రంగా హత్య వార్త ప్రసారం
మొట్టమొదటిసారి ఒక ఎమ్మెల్యే హత్య వార్తను బీబీసీ బులెటిన్ లో ప్రసారం చేయడంతో ప్రపంచం చూపు రంగా మీద పడింది
దేశీయంగా కూడా రాజకీయ వర్గాల్లో ఈ వార్త పెద్ద సంచలనం కలిగించింది
ఆంధ్రప్రదేశ్ లో అయితే ఏకంగా 53 రోజులు కర్ఫ్యూ నీడలో నడిచింది
రాష్ట్ర వ్యాప్తంగా 42 మంది ప్రాణాలు కోల్పోయారు
జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది
ఒకదశలో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తారని వార్తలు కూడా వచ్చాయి
తన భర్తది ప్రభుత్వ హత్య అని ఆయన భార్య రత్నకుమారి కూడా అప్పట్లో ఆరోపించింది
అలంకార్ థియేటర్ కి నిప్పు
ఆందోళనకారులు విజయవాడలో అన్ని థియేటర్లకు నిప్పు పెట్టలేదు
ప్రధానంగా కళ్యాణ చక్రవర్తి , అలంకార్ థియేటర్లకే నిప్పు పెట్టారు
కళ్యాణ చక్రవర్తి ఎన్టీఆర్ కుటుంబీకులది కాబట్టి మంట పెట్టారు
మరి అలంకార్ కు ఎందుకు పెట్టినట్టు ?
దానికో కారణం ఉంది
అప్పట్లో ఈ థియేటర్ యాజమాన్యం నవతా ఫిలిం పంపిణీదారుల చేతిలో ఉండేది
ఆ యాజమాన్యానికి ఎన్టీఆర్ కుటుంబానికి దూరపు చుట్టరికం ఉంది
ఈ విషయం అతి కొద్దిమందికే తెలుసు
అయితే టికెట్ల వెనుక టీడీపీని గెలిపించండి అని ప్రింట్ వేసి అమ్మడంతో వారి ఐడెంటిటీ బయటకి వచ్చింది
దాంతో మొదటిసారి నిప్పు పెట్టినప్పుడు పూర్తిగా అంటుకోలేదని రెండోసారి క్యాన్లకు క్యాన్లు కిరసనాయిలు పోసి మొత్తం నామరూపాలు లేకుండా చేసారు
ఇవే కాదు అన్నపూర్ణ థియేటర్ ఎదురు రాయ్ టైర్స్ షో రూమ్ , గోడౌన్లు బొగ్గు మసి అయ్యాయి
రోడ్ల మీద ఎక్కడ చూసినా గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్న జనం కనిపిస్తున్నారు
వంగవీటి హత్య జరిగినప్పుడు దేవినేని ఎక్కడున్నారు ?
మాములుగా విజయవాడలో ఉన్న రెండు వర్గాల్లో ఎవరైనా ఒక నాయకుడు కనిపించకుండా పొతే ఎవరికో మూడుతుందని భావించి ప్రత్యర్థులు జాగ్రత్త పడేవారు
కానీ రంగా హత్య జరిగినప్పుడు నెహ్రూ తన ఇంటిలోనే ఉన్నానని చెప్తున్నారు
తెల్లవారు ఝామున అనుచరులు ఆయన్ని నిద్రలేపి రంగా హత్య వార్త చెప్పడంతో ఉన్నపళంగా లుంగీతోనే ఆయన కారులో హైద్రాబాదు వెళ్లిపోయారు
విజయవాడలో ఇరుక్కుపోయిన నాదెండ్ల భాస్కర రావు
రంగా హత్య జరిగినప్పుడు నాదెండ్ల భాస్కర రావు తెనాలిలో ఉన్నారు
పొద్దున్నే విషయం తెలుసుకున్న ఆయన కారులో హడావుడిగా హైద్రాబాదు బయలుదేరారు
విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గరికి రాగానే ఆందోళనకారులు కారుని ఆపటంతో ఆయన జోహార్ రంగా అంటూ నినాదాలు ఇచ్చి దణ్ణం పెట్టడంతో ఆందోళనకారులు దారి ఇచ్చి వదిలారట
ఈ విషయం ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు
అయితే అప్పటికే ఆయన ఎన్టీఆర్ తో విభేదించి బయటికి రావడం , వంగవీటికి మద్దతుగా మాట్లాడి ఉండటంతో తేలిగ్గా బయటపడిపోయారు
రత్నకుమారికి సీఆర్పీఎఫ్ సెక్యూరిటీ
వంగవీటి మోహన రంగా హత్య తర్వాత కోర్ట్ ఆదేశాలతో 56 మంది సీఆర్పీఎఫ్ బలగాలతో ఆయన భార్య రత్నకుమారికి పటిష్టమైన భద్రత కల్పించారు
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిసినా రంగాకు ప్రభుత్వం ఎటువంటి గన్ మెన్లను కేటాయించలేకపోయింది
ఆయనకు రక్షణ కల్పించాలని పలువురు కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వానికి , పోలీసులకు మొరపెట్టుకున్నా సింగిల్ కానిస్టేబుల్ని కూడా కేటాయించలేదు
ఆఖరికి కేంద్రమంత్రి శివశంకర్ చొరవతో ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ స్థాయి సిబ్బంది ఆయనకు రక్షణగా నియమించబడ్డారు
ఈ ఇద్దరు కూడా ఆయన హత్య సమయంలో పారిపోయారు
ఇదే సీఆర్పీఎఫ్ సిబ్బందిలో ఒక వంతు రంగాకి కేటాయించినా ఆయన ప్రాణాలకు ప్రమాదం తప్పి ఉండేదేమో
తన భర్త హత్యకు అప్పటి టిడిపి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరుతూ ఆ పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రచారం చేసి ఆమె కూడా కాంగ్రెస్ తరపున శాసన సభ్యురాలిగా ఎన్నికయి అసెంబ్లీలో అడుగుపెట్టారు
మరోపక్క ఉయ్యురు ఆర్టీసీలో పనిచేసిన రంగా అన్న చలపతిరావు కూడా కాంగ్రెస్ టికెట్ మీద ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు
రంగా హత్య తర్వాత ఆయన కుటుంబంలో ఇద్దరు ఎమ్మెల్యేలు అవడమే కాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చింది
తరువాయి కాలంలో రత్నకుమారి టిడిపిలో చేరడంతో రాజకీయాలు మారిపోయాయి
వారసత్వ రాజకీయాల్లోకి వచ్చిన రంగా కొడుకు రాధాకృష్ణ కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ సాధించి ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు
దీంతో వంగవీటి కుటుంబంలో మొత్తం ముగ్గురు ఎమ్మెల్యేలు అయినట్టైంది
ఆ తర్వాత రంగా కొడుకు రాధా కాంగ్రెస్ కి రాజీనామా చేసి ప్రజారాజ్యంలోకి రావడం , ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడంతో వైసిపిలో జాయిన్ అయ్యారు
చివరికి అక్కడా ఇమడలేక టిడిపిలో జాయిన్ అయ్యారు
ప్రస్తుతం ఆయన అదే పార్టీలో కొనసాగుతున్నారు
తాజాగా రంగా కూతురు ఆశాకుమారి కూడా తండ్రి ఆశయాల కోసం పనిచేస్తానంటూ ప్రజా క్షేత్రంలోకి వచ్చింది
ముగింపు : కృష్ణాజిల్లా ఉయ్యురు దగ్గర కాటూరు లోని ఒక సాధారణ కుటుంబం నుంచి బతుకుదెరువు కోసం విజయవాడ వచ్చి చిన్న సైకిల్ షాపులో పనికి కుదిరిన వంగవీటి మోహన రంగా క్రమక్రమంగా నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకుని బడుగు బలహీన వర్గాల కోసం పోరాడుతూ కార్పొరేటర్ స్థాయినుంచి ఎమ్మెల్యే హోదా వరకు అంచెలంచెలుగా ఎదిగి అతిచిన్న వయసులో తన 41 ఏట హత్యకు గురై కన్నుమూశారు
ఆయన హత్య జరిగి 37 సంవత్సరాలు అయినా జనం ఆయన్ని ఇంకా గుండెల్లో పెట్టుకుని ఊరువాడా విగ్రహాలు ఆవిష్కరిస్తున్నారంటే నాయకుడిగా ఆయన జన్మకు సార్థకత లభించినట్టే !
