“అన్నా ! నంబర్ ప్లేట్ లేని వెహికల్స్ తిరుగుతున్నాయి .. మాకెందుకో అనుమానంగా ఉంది .. రోడ్ క్లోజ్ చేసేస్తాం అన్నా”
డిసెంబర్ 25 రాత్రి నిరాహార దీక్ష శిబిరంలో ఉన్న వంగవీటి మోహన రంగాను అనుచరులు ఆందోళనగా అడిగారు
వారు ఇలా అడగటం వెనుక చిన్న నేపధ్యం ఉంది
అసలు గొడవ ఎక్కడ్నుంచి మొదలైంది ?
దీనికి మూడురోజుల ముందు విజయవాడ గిరిపురం వాసులకు ఇళ్ల పట్టాల కోసం ఆందోళన చేయడానికి ఇంటినుంచి వంగవీటి బయలుదేరారు
సరిగ్గా అదే సమయంలో స్థానిక ఇంటలిజెన్స్ పోలీస్ కానిస్టేబుల్ నుంచి రంగాకు ఒక మెసేజ్ వచ్చింది
ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని , పెద్దఎత్తున ఏదో కుట్ర జరగబోతున్నట్టు అనుమానంగా ఉందని ఆ సందేశం సారాంశం
ఇక్కడో విషయం చెప్పాలి
రంగాను అభిమానించే వాళ్ళు జనంలోనే కాదు పోలీసుల్లో కూడా ఉన్నారు
అయినా ఆ రోజుల్లోనే ఆయనకు ఇంటలిజెన్స్ డిపార్ట్మెంట్ ను మించిన సొంత నెట్ వర్క్ ఉంది
ఆ నెట్ వర్క్ సాయంతోనే ఏ క్షణాన అయినా శత్రువులు తనని మట్టుబెట్టటానికి పొంచి ఉన్నారని తెలుసుకున్నారు
దేవినేని మురళి హత్య తర్వాత ఆయన అనుచరులు రంగాని కొత్త సంవత్సరం చూడనివ్వమని శపధం చేసిన నేపథ్యంలో డిసెంబర్ చివరి వారంలో శత్రుమూకలు విజయవాడ చేరుకున్నాయని ఆయనకు సంకేతాలు అందాయి
ఇప్పుడు ఆయనకు జీవన్మరణ పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది
ఆ క్షణాన అనుచరులందరూ కలిసి రంగాను కొన్నాళ్లపాటు అజ్ఞాతంలోకి వెళ్లాల్సిందిగా వేడుకున్నారు
ఆ సమయంలో రంగా ముందు రెండు ఆప్సన్స్ ఉన్నాయి
మొదటిది శత్రువులకు దొరక్కుండా కొన్నాళ్లపాటు అజ్ఞాతంలోకి వెళ్లడం
రెండోది చావో రేవో నమ్ముకున్న ప్రజలకోసం పోరాటం కొనసాగించడం
రంగా రెండో మార్గమే ఎంచుకున్నాడు
డిసెంబర్ 22 ఏం జరిగింది ?
గిరిపురం వాసులకు ఇళ్లపట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ వంగవీటి డిసెంబర్ 22 ఉదయం ఇంటినుంచి బయలుదేరారు
ఆయన ఇల్లు బందర్ రోడ్డు రాఘవయ్య పార్క్ దగ్గర ఉంది
ఇంటినుంచి PWD గ్రౌండ్స్ దగ్గరికి వచ్చేసరికి పోలీసులు ఆయన కారును ఆపారు
కార్లో మారణాయుధాలు ఉన్నాయని సమాచారం వచ్చింది కాబట్టి తనిఖీ చేయాలన్నారు
గంటపాటు ఆయన్ని ముందుకుపోనివ్వకుండా వాహనాలు తనిఖీ చేసి ఆయుధాలు లేకపోవడంతో పోలీసులు వదిలేసారు
ప్రజా సమస్యల మీద బయలుదేరిన శాసన సభ్యుడ్నిఒక టెర్రరిస్ట్ మాదిరి చూస్తూ అవమానపరిచేలా ప్రవర్తించడం సరికాదని వాదిస్తూ వంగవీటి అక్కడే రోడ్డు మీద నిరసనకు కూర్చున్నారు
రంగా నిరాయుధుడిగా బయట తిరుగుతున్నాడని , అవకాశం కోసం పొంచి ఉన్న శత్రువులకు సమాచారం అందచేయడం కోసమే పోలీసులు వాహనాల తనిఖీ చేసారని ఆయన అనుచరులు ఆరోపణలు చేసారు
రంగా రోడ్డుమీద నిరసనకు కూర్చున్నారని తెలియగానే ఊళ్లకు ఊళ్ళు జనాలు లారీల్లో బయలుదేరారు
జనప్రవాహంతో బందర్ రోడ్డు నిండిపోవడంతో ప్రయాణీకులకు ఇబ్బంది అవుతుందని వంగవీటి భావించి నిరాహార దీక్షను తన ఇంటికి ఎదురుగా ఉన్న నిర్మల్ హృదయ్ భవన్ గోడకు అనుకుని ఉన్న ఫుట్ పాత్ మీదకు మార్చారు
అప్పుడు అనుచరులు ఏం చేసారు ?
అప్పటికే రంగాకు పొంచి ఉన్న ముప్పు గురించి అనుచరులకు అర్థమైంది
మరోపక్క ప్రధాన అనుచరులు కండిషన్ బెయిల్ మీద బందర్ లో ఉన్నారు
ప్రస్తుతం ఆయన పక్కనున్నది కూడా అతికొద్ది మంది అనుచరులు మాత్రమే
అందరికీ ఒకటి అర్థమైంది
రంగాను అంతమొందించటానికి ఏదో గూడుపుఠాణి జరుగుతుంది
ఒకపక్క రంగాను నిరాయుధుడిగా దొరికితే మట్టుపెట్టాలని కాచుకుకూచున్న శత్రు మూకలు , మరోపక్క ముఖ్యమైన అనుచరులు దూరంగా ఉండి ఆయన ఒంటరిగా ప్రజల్లోకి తిరుగుతుండటంతో ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందేమో అని భావించి ముందు జాగ్రత్తగా ఆయన నిరాహార దీక్షను ఇంట్లో కింది భాగంలో చేయించటానికి అనుచరులు ఏర్పాట్లు చేసారు
ఇంట్లో అయితే శత్రువులు ఆయన దరిదాపులకు రాకుండా అడుగడుగునా తనిఖీలు చేయొచ్చని వారి ఆలోచన
కానీ పిరికి ఆలోచనకు రంగా ఒప్పుకోలేదు
“నేను జీవించినా , మరణించినా జన నాయకుడిగా ఉండిపోతానే కానీ పిరికివాడిలా దాక్కుని నన్ను నమ్ముకున్న వాళ్ళని మోసం చేయలేను .. బయటే నిరాహార దీక్షకు ఏర్పాట్లు చేయండి ” అని అన్నారు
ఆయన మొండి ధైర్యానికి అనుచరులకు ఆశ్చర్యం వేసింది
ఏంటి ఈయన గుండె ధైర్యం?
ఒకపక్కన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని తెలిసినా ఇంకా ప్రజల మధ్యే ఉంటా అంటున్నారు ?
ఇంకొకళ్ళయితే ప్రజలు , అభిమానులు , అనుచరుల సంగతి తర్వాత బతికుంటే బలుసాకు తిని జీవించొచ్చు అని ఎప్పుడో పారిపోయేవాళ్లు కదా ?
మరి ఈయనేంటి ఇంత ధైర్యంగా ఉన్నాడు ?
ఆ కళ్ళలో ఎటువంటి బెదురు లేదేంటి ?
అయినా ఆయనకు నచ్చచెప్పాలని ప్రయత్నిస్తూ ” పోనీ ఇంటి ముందే వీధి గుమ్మం ముందు శిబిరం వేస్తే కొంతవరకు సురక్షితంగా ఉంటుంది అన్నా ” అని బతిమిలాడారు
కానీ ఆ సందు ఇరుగ్గా ఉండటంతో వచ్చే అభిమానులకు అసౌకర్యంగా ఉంటుందని , కాబట్టి ఇంటి ఎదురుగా బందర్ రోడ్డు నిర్మల్ హృదయ్ భవన్ గోడను ఆనుకుని ఉన్న ఫుట్ పాత్ అయితే పొరుగూర్లనుంచి తనని చూడటానికి వచ్చే జనాలకు ఇబ్బంది ఉండదని చెప్తూ అక్కడే నిరాహార దీక్షకు కూర్చున్నారు
ఉండవల్లితో వంగవీటి ఏం చెప్పారు ?
విషయం తెలుసుకున్న ఉండవల్లి అరుణ్ కుమార్ రంగాను పరామర్శించటానికి రాజమండ్రి నుంచి బయలుదేరారు
తాను కూడా విజయవాడ వచ్చి నిరసన దీక్షలో పాల్గొంటానని ఆయన వంగవీటికి చెప్పారు
వెంటనే రంగా ” నువ్వు రావొద్దు .. వస్తే నిన్ను కూడా చంపేస్తారు ” అని హెచ్చరించి ఆపేసారు
ఈ విషయం ఒక వీడియోలో ఉండవల్లి స్వయంగా చెప్పారు
అంటే అప్పటికే తనకు ప్రాణహాని ఉందని రంగాకు తెలుసా ?
అందుకే సాధ్యమైనంతవరకు తన పక్కన నిరసనలో ఎవరూ కూర్చోవద్దని ముఖ్యమైన నేతలను ఆయన ముందుగానే హెచ్చరించారా ?
ఎప్పుడైతే తనని రావొద్దని చెప్పారో రంగాకు పొంచి ఉన్న ప్రాణహాని సంగతి ఉండవల్లికి కూడా అర్థమైంది
ప్రజా సమస్యల సంగతి తర్వాత ముందు రంగా ప్రాణాలకు రక్షణ ఏదీ ?
వెంటనే ఆయన కొంతమంది కాంగ్రెస్ నాయకులతో కలిసి రంగాకు రక్షణ కల్పించాలని అప్పటి పోలీస్ బాస్ లతో పాటు ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసారు
అయినా ఫలితం లేకపోయింది
దీంతో కేంద్రమంత్రి శివశంకర్ చొరవతో రంగాకు ఇద్దరు గన్ మెన్ లను కేటాయించారు
గన్ మెన్లు అంటే ఇప్పటి నాయకుల సెక్యూరిటీ మాదిరి అధునాతన ఆయుధాలు ధరించిన మెరికల్లాంటి కమెండోలు కాదు
వారు కేవలం రివాల్వర్లు ఉన్న ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ స్థాయి పోలీసులు మాత్రమే
అందుకే అనుచరులు పోలీసుల మీద ఆధారపడకుండా సొంత రక్షణ ఏర్పాట్లు చేసుకున్నారు
డిసెంబర్ 25 సాయంత్రం ఏం జరిగింది ? ఒక చిన్నపిల్లవాడు రంగా చేతిలో పెట్టిన కాగితంలో ఏం రాసి ఉంది ?
అప్పటికే నిరాహారదీక్ష మొదలుపెట్టి మూడు రోజులు కావడంతో వంగవీటి నీరసంతో ఉన్నారు
మరోపక్క అన్ని జిల్లాలనుంచి జనం తండోపతండాలుగా శిబిరానికి వచ్చి రంగాను పరామర్శించడం మొదలుపెట్టారు
అంత నీరసంలో అందర్నీ పలకరించడంతో ఆయన బిపి డౌన్ అయిపోయింది
దీనితో ‘ దయచేసి రంగా గారిని ఎవరూ మాట్లాడించకండి ‘ అని బోర్డు పెట్టారు
వచ్చిన అభిమానులు ఒకరొకరుగా ఆయనకు అభివాదం చేస్తూ కన్నీరు పెట్టుకుంటూ ముందుకుపోతున్నారు
సరిగ్గా ఆ సమయంలో లైనులోనుంచి ఓ చిన్నపిల్లవాడు వంగవీటితో ఏదో మాట్లాడాలన్నట్టు సైగ చేసాడు
రంగా కూడా ఆ పిల్లవాడ్ని దగ్గరకు తీసుకురమ్మని అనుచరులకు సైగ చేయడంతో అతడ్ని డయాస్ మీదకు ఎక్కించారు
ఆ పిల్లవాడు వంగవీటి దగ్గరికొచ్చి ఆయన బుగ్గ మీద ముద్దుపెడుతూ ఓ కాగితం ఆయన చేతిలో పెట్టి ‘ మా నాన్న పోలీసు .. ఈ కాగితం నీకిమ్మన్నాడు ..ఆయన నీ ఫ్యాన్ ..మా నాన్నే కాదు మా ఫ్యామిలీ అంతా నీ ఫ్యాన్ లమే ..అని చెవిలో మెల్లిగా చెప్పాడు
వంగవీటి ఆ కాగితం తెరిచి చూస్తే అందులో ‘ ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త ‘ అని రాసి ఉంది
రంగా చిన్నగా నవ్వూతూ ఆ పిల్లవాడి బుగ్గన ముద్దుపెట్టి పంపించాడు
తన బుగ్గన ముద్దు పెట్టిన అంకుల్ తెల్లారేసరికి జీవించి ఉండడని ఆ క్షణాన ఆ పిల్లవాడికి తెలీదు
రంగా ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని తెలిసి కూడా చెప్పలేక ఓ మూగవాడు పడిన ఆవేదన ఏంటి ?
వంగవీటిని ప్రాణంకన్నా మిన్నగా అభిమానించేవాళ్లలో మురళి అని ఒక మూగ వ్యక్తి ఎప్పుడూ ముందుంటాడు
అతడి భయం ఒకటే
తమ నాయకుడిని తుదముట్టించడానికి శత్రువులు పొంచి ఉన్నారని
అతడి ధ్యేయం ఒకటే
ఎలాగైనా తమ నాయకుడిని కాపాడుకోవాలని
అందుకే నిద్రాహారాలు మాని మూడురోజులబట్టి శిబిరం దగ్గరే మకాం పెట్టాడు
తనే ఒక పోలీస్ గా మారి కొత్త వ్యక్తులు ఎవరైనా దిగారా అని విజయవాడలో ఉన్న లాడ్జీలు , బార్లు అన్నీ తిరిగాడు
అప్పుడు తెలిసింది అతడికి నగర శివార్లలో ఓ బార్ నుంచి మందు , లిక్కర్ పెద్దఎత్తున పార్సిల్స్ వెళ్లాయని
అంతే , విషయం చెప్దామని ఆఘమేఘాల మీద శిబిరానికి వస్తుంటే అతడి పక్కనుంచి ప్రత్యర్థులకు చెందిన జీపు వాయువేగంతో దూసుకెళ్లింది
దాంతో కీడు పసిగట్టిన అతడు ఓ కాగితం మీద వివరాలు రాసి వంగవీటి ముఖ్య అనుచరుడి చేతిలో పెట్టాడు
ఇది తెలిసిన అందరి మనసుల్లో ఆందోళన ఒకటే .. ఎలాగైనా రంగాను కాపాడుకోవాలి
అంతే ఆ మూగవ్యక్తి రంగా పక్కకుచేరి భీష్మించుకు కూర్చున్నాడు
విషయం తెలుసుకున్న దీక్షితులు అనే విద్యార్థి కూడా రంగా పక్కనకొచ్చి కూర్చున్నాడు
‘ఈ క్షణం నుంచి మేము కూడా నీతోకలిసి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాం అన్నయ్యా’ అని కదలకుండా కూర్చుండిపోయారు
ముంచుకొస్తున్న ముప్పు సంగతి తెలుసు కాబట్టి రంగా వారిని శిబిరంలో ఉండటానికి వీల్లేదన్నారు
కానీ వారు ఒప్పుకోలేదు
“అన్నయ్యా! చావైనా , బతుకైనా నీతోనే ” అని అక్కడ్నుంచి కదల్లేదు
డిసెంబర్ 25 రాత్రి ఏం జరిగింది ?
ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా కూడా వంగవీటి ధైర్యంగా ఉన్నప్పటికీ అనుచరులలో మాత్రం ధైర్యం స్థానంలో ఆందోళన వచ్చింది
నిజానికి రంగా ధైర్యం కూడా తనకోసం ప్రాణాలిచ్చే అభిమానులే
ఆయన ఏనాడూ తన రక్షణ కోసం స్వయంగా పోలీసుల సాయం కోరలేదు
పోలీసులకన్నా సొంత సైన్యం మీదే ఆయనకు నమ్మకం
అనుచరులు కూడా పోలీసుల మీద ఆధారపడకుండా తమ నాయకుడి రక్షణ కోసం వంతులవారీగా డ్యూటీలు వేసుకుని వేయి కళ్ళతో ఆయనకు పహారా కాస్తున్నారు
మరోపక్క అనుచరులు ఆ రోడ్డుమీద వెళ్లే ప్రతి వాహనం నంబర్లు రాసుకుంటున్నారు
ఇతర జిల్లాల రిజిస్ట్రేషన్ వాహనాలు కానీ, నంబర్ ప్లేట్లు లేని వాహనాలు కానీ వెళ్తుంటే ఆపి చెక్ చేసి పంపిస్తున్నారు
కానీ ఎన్నడూ లేని విధంగా పదే పదే నంబర్ ప్లేట్లు లేని జీపులు అటూఇటూ తిరుగుతుండటంతో అనుచరులకు అనుమానం వచ్చింది
అప్పుడు అడిగారు వంగవీటిని ,
” అన్నా ! మాకెందుకో అనుమానంగా ఉంది..బారికేడ్లు పెట్టి రోడ్ బ్లాక్ చేస్తాం ” అని
అనుచరుల ఆందోళన చూసి రంగా చిన్నగా నవ్వారు
ఆ క్షణాన కూడా ఆయన కళ్ళల్లో బెదురు లేకపోవడంతో అనుచరులు ఆశ్చర్య పోయారు
” వద్దు .. ఈరోజు క్రిస్మస్ కదా రోడ్ బ్లాక్ చేస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు .. పైగా పొరుగూళ్ళ నుంచి వెళ్లే అయ్యప్ప మాల వేసుకున్న భక్తులు కూడా ఇబ్బంది పడతారు ” అని వారించారు
అయినా సరే అనుచరులు అప్పటికప్పుడు కార్లు , జీపులు తెచ్చి శిబిరం ముందు రక్షణ గోడలా అడ్డుపెట్టారు
రంగా ఎప్పటిమాదిరే రాత్రి నిద్రకు ఉపక్రమించారు
కానీ ఆయన అనుచరులు మాత్రం రెప్ప వేయకుండా పహారా కాయడం మొదలుపెట్టారు
డిసెంబరు చలికి తోడు తెల్లవారు ఝామున పొగమంచు తోడవ్వడంతో వాళ్ళు కూడా కునికిపాట్లు పడుతూ ఉన్న సమయంలో ఒక్కసారిగా బాంబ్ శబ్దం వినిపించడంతో ఉలిక్కిపడి చూస్తే అంతా పొగ తప్ప ఎదురుగా ఎవరూ కనిపించడం లేదు
ఆ పొగలోనే బస్సుల్లో అయ్యప్పమాల వేసుకున్న కిరాయి హంతకులు ఆయుధాలతో శిబిరంలోకి దూరారు
తలవరకు దుప్పటి కప్పుకుని పడుకున్న దీక్షితులుని రంగా అనుకుని మొదటి వేటు వేశారు
ఈ అలజడికి లేచిన రంగా ” అరేయ్ వద్దురా ” అని అరిచేసరికి మూకలు ఆయన మీద పడి ఆయుధాలతో విచక్షణా రహితంగా దాడి చేసారు
ఇక్కడో విషయం గమనించాలి
అంత ప్రాణం మీదకు వచ్చినా వంగవీటి వెన్నుచూపి పారిపోకుండా తనని నమ్ముకున్న విద్యార్థిని చంపొద్దని శత్రువులను హెచ్చరించారు . దాంతో ఆయన కూడా వాళ్ళకి దొరికిపోయి బలయిపోయాడు
ఈయనకు కాపలాగా ఉన్న కానిస్టేబుళ్లు అప్పటికే గోడ దూకి పారిపోయారట
రంగా మీద కూడా వేటు వేసి దుండగులు బస్సులో పారిపోతుంటే వాళ్ళని ఆపాలని ఆ మూగవ్యక్తి బస్సుకు అడ్డం పడటంతో అతడి మీద కూడా బాంబ్ వేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు
హూ ఈజ్ దిస్ వంగవీటి ? – రాజీవ్ గాంధీ
విజయవాడలో శాసన సభ్యుడు వంగవీటి మోహన రంగా దారుణ హత్య అనే వార్త మొదటిసారిగా బీబీసీ వార్తల్లో కూడా ప్రసారం కావడంతో రాజీవ్ గాంధీ కూడా ఆశ్చర్యపోయి “హూ ఈజ్ దిస్ వంగవీటి ” అని తన సహచరులను అడిగారట
రంగా పోరాటాల గురించి తెలుసుకున్న తర్వాత తమ పార్టీలో ఇంత గొప్ప నాయకుడు ఉన్నందుకు గర్వంగా ఉందని రాజీవ్ గాంధీ చెప్తూ ఆయన మృతికి నివాళులు అర్పించారు
పై కథనం మొత్తం ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన ఇన్ పుట్స్ ఆధారంగా రాయబడింది
ఏదిఏమైనా జీవించింది కొద్దికాలమే అయినా బడుగు ,బలహీన వర్గాల కోసం పోరాడి అసువులు బాసిన రంగా చరిత్ర సృష్టించారు
ఆయన హత్య తర్వాత తాము అనాథలం అయ్యామని పేదలు కన్నీరుమున్నీరుగా విలపించారు
మరణించి 37 సంవత్సరాలు అవుతున్నా ఈ రోజుకీ ప్రజలు ఆయన్నితమ గుండెల్లో సజీవంగా నిలుపుకుంటున్నారంటే నాయకుడిగా వంగవీటి మోహన రంగా జన్మ ధన్యమైనట్టే !
