అప్పుడు వైఎస్ లానే ఇప్పుడు రేవంత్ కూడా కాంగ్రెస్ పార్టీలో సూపర్ పవర్ లీడర్ గా ఎదుగుతున్నారా ?రేవంత్ వస్తుంటే లేచి నిలబడి మరీ స్వాగతం చెప్పిన రాహుల్ గాంధీ !

Spread the love

అప్పుడు వైఎస్ లానే ఇప్పుడు రేవంత్ కూడా కాంగ్రెస్ పార్టీలో సూపర్ పవర్ లీడర్ గా ఎదుగుతున్నారా ?
రేవంత్ వస్తుంటే లేచి నిలబడి మరీ స్వాగతం చెప్పిన రాహుల్ గాంధీ !

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చక్రం తిప్పి రెండు సార్లు ముఖ్యమంత్రి పదవి అధిష్టించిన సంగతి అందరికీ తెలిసిందే

ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని వైఎస్ ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తున్నా సమీకరణాల దృష్ట్యా ఆయన 2004 వరకు ఆగాల్సి వచ్చింది

నిజానికి వైఎస్ రాజకీయ కెరీర్ పీక్ కు వెళ్ళింది 2004 సంవత్సరం నుంచే

కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మండుటెండలో పాదయాత్రలు చేసి పార్టీని అధికారంలోకి తీసుకురావడంతో సోనియాకు అత్యంత సన్నిహితుడిగా మారిపోయారు

2004 లో ముఖ్యమంత్రి పదవిని అధిష్టించిన వైఎస్ కు పార్టీ అధిష్టానం పాలనలో పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది

దానితో ఆయన ఆరోగ్యశ్రీ , విధ్యుత్ సంస్కరణలకు శ్రీకారం చుట్టి ప్రజల్లో పేరు సంపాదించుకున్నారు

వైఎస్ మీద నమ్మకంతో 2009 లో కూడా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యత ఆయనకే అప్పచెప్పారు సోనియా

సోనియాకు మాట ఇచ్చినప్రకారమే వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండోసారి కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి అధికారంలోకి వచ్చి తిరిగి ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు

రెండోసారి ముఖ్యమంత్రి పదవిని అధిష్టించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొద్ది నెలలకే హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించడంతో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వ సమస్య ఎదుర్కొంది

వైఎస్ మాదిరి ప్రజల్లో మాస్ లీడర్ గా పేరున్న నేత ఎవరూ లేకపోవడంతో సీనియర్ నేత రోశయ్యకు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు

అప్పటినుంచి కాంగ్రెస్ పార్టీ నాయకత్వ సమస్య ఎదుర్కొంటూనే ఉంది

2014 లో ఏపీ విభజన అనంతరం జరిగిన ఎన్నికలలో టీఆరెస్ పార్టీ అధినేత కేసీఆర్ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు

విభజనతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ దాదాపు తుడిచిపెట్టుకుపోగా తెలంగాణాలో చతికిలపడింది

2014 నుంచి 2023 వరకు షుమారు 9 సంవత్సరాల 187 రోజుల కేసీఆర్ పాలన సాగింది

ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణాలో పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రజల్లో మాస్ లీడర్ గా పేరున్నటిడిపికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి కి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది

2023 లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ సారధ్యంలో 119 స్థానాల్లో 64 స్థానాలు గెల్చుకుని పార్టీ అధికారంలోకి వచ్చింది

దరిమిలా ముఖ్యమంత్రి పదవికి అధిష్టానం ఆయన పేరునే ఖరారు చేసింది

కాంగ్రెస్ పార్టీలాంటి జాతీయ పార్టీలో ప్రాంతీయస్థాయిలో ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం అంటే కత్తి మీద సాములాంటిదే

సీఎం అటు అధిష్టానానికి జవాబుదారిగా ఉండాల్సిరావడంతో పాటు ఇటు స్థానికంగా మంత్రివర్గ సభ్యులను ,ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ పనిచేయాల్సి ఉంటుంది

కానీ ఏం మాయ చేస్తున్నాడో ఏమిటో కానీ రేవంత్ ఈ రెండు విషయాల్లో చక్కగా మ్యానేజ్ చేసుకుంటూ సక్సెస్ అయ్యాడు

కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో, నాయకులలో ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న నాయకులకు కొదవ లేదు

లోపల ఏముందో తెలీదు కానీ ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్న నాయకులు కూడా బహిరంగంగా రేవంత్ నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు

ఈ విషయంలో రేవంత్ చాలా చాకచక్యంగా పార్టీ నాయకులను హ్యాండిల్ చేస్తున్నారు

జగ్గారెడ్డి లాంటి నాయకుడు కూడా పదేళ్లు తెలంగాణకు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటారని ఆ తర్వాత మాత్రమే ముఖ్యమంత్రి రేసులో తానుంటానని పార్టీ వేదికలో చెప్పారు

అదే తోవలో మిగిలిన మంత్రుల ప్రకటనలు కూడా ఉన్నాయి

మరోవైపు రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ పెరిగిందని వస్తున్న పుకార్లకు చెక్ పెడుతూ నిన్న ఢిల్లీ ఏఐసీసీ భవన్ లో కులగణన మీద జరిగిన సదస్సులో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ రేవంత్ రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తారు

కులగణన సర్వే విజయవంతం గా పూర్తిచేసిన తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు
ప్రస్తుతం బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా రేవంత్ మోడల్ ను ఫాలో అవుతున్నారని ఆయన పొగడ్తలు కురిపించారు

అన్నిటికన్నా ఆశర్యకరమైన విషయం ఏంటంటే ఈ సదస్సులో కులగణన సర్వే పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి రేవంత్ రెడ్డి నడిచివస్తుండగా ముందు వరుసలో ఆశీనులైన రాహుల్ గాంధీ లేచి నిలబడి మరీ రేవంత్ కు షేక్ హ్యాండ్ ఇచ్చారు

రేవంత్ కూడా ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చి పక్కనే కూర్చున్న మల్లికార్జున్ ఖర్గేకు కూడా ముందు షేక్ హ్యాండ్ ఇచ్చి వెంటనే పాద నమస్కారం కూడా చేసారు

ఏదిఏమైనా ఢిల్లీలో జరిగిన సదస్సులో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం సీఎం రేవంత్ రెడ్డికి పూర్తి గౌరవం ఇవ్వడమే కాకుండా తెలంగాణాలో ఆయన పని తీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేసింది

ఈ పరిణామాలన్నీ గమనిస్తుంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి సూపర్ పవర్ నాయకుడిగా ఎదుగుతున్నారని రాజకీయ పరిశీలకులకు ఇట్టే అర్ధమౌపోతుంది !

పరేష్ తుర్లపాటి


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!