గేరు మార్చి స్పీడ్ పెంచిన బిఆర్ఎస్.. రెడ్ సిగ్నల్ తో కారు జోరుకు బ్రేక్ వేసిన కాంగ్రెస్-Congress vs BRS

Spread the love

ఒక పక్కన వెయ్యి రోజుల తమ పాలనలో సాధించిన ప్రగతి గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారాలు చేసుకుంటుండగా.. మరోపక్క రేవంత్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో హామీల అమలులో విఫలం అయ్యిందంటూ కేటీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ ఛార్జ్ షీట్ విడుదల చేసింది.
ఇలా కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన గురించి ఎవరి పంథాలో వాళ్లు ప్రచారాలు చేసుకుంటున్న సమయంలోనే గత సోమవారం నుంచి అసెంబ్లీ వర్షాకాలం సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలను ఇరు పార్టీలు కసరత్తు చేశాయి.

రాజకీయ పార్టీలు అసెంబ్లీ సమావేశాలప్పుడే ఎందుకు హడావుడి చేస్తాయి?

మీరు గమనించండి.. దాదాపు ప్రతి రాజకీయ పార్టీ అసెంబ్లీ సమావేశాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. అధికార పక్షమైనా..ప్రతిపక్షమైనా సరే తమ పార్టీ ప్రజా ప్రతినిధులతో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం గురించి పక్కా ప్లాన్ చేసుకుంటాయి. ప్రభుత్వాన్ని ఎలా ఇరకాటంలో పెట్టాలా? అని ప్రతిపక్షం వ్యూహం సిద్ధం చేసుకుంటే.. ప్రతిపక్షాన్ని ఎలా కట్టడి చేయాలా? అని అధికార పక్షం వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటుంది.

రోజువారీ నిరసనలకు, ఆందోళనలకు.. అసెంబ్లీ సమావేశాల్లో చేసే నిరసనలకు విరుద్ధాలు ఏంటంటే కవరేజీలో తేడాలు ఉంటాయి. ఎమ్మెల్యేల సస్పెన్షన్ వార్తలకు వచ్చే కవరేజ్, అదే ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడిన మాటలకు రావు.

ఏ ఎమ్మెల్యే అయినా పూర్తిస్థాయిలో అసెంబ్లీలో మాట్లాడిన మాటలను ప్రత్యక్ష ప్రసారం లో మీరెప్పుడైనా చూసారా? చూసి ఉండరు. అదే ఎమ్మెల్యే సభ నుంచి సస్పెండ్ అయితే రోజంతా టీవీ వార్తల్లో లైవ్ కవరేజ్ చూసి ఉంటారు కదా? అదే మన ప్రజాస్వామ్యంలో ఉన్న గమ్మత్తు.. అదే మన మీడియా టీఆర్పీలో ఉన్న మ్యాజిక్కు.

కాబట్టి ఆ ఫార్ములా ప్రకారం సభలో రేవంత్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా బిఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. మరి వాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే అధికార పార్టీ వాళ్ళు ఊరికే చూస్తూ కూర్చుంటారా? వీళ్లూ ఒక ప్లాన్ రెడీ చేసుకున్నారు.

బిఆర్ఎస్ ప్లాన్ ఏంటి?

నల్ల చొక్కాలు ధరించి ఊరేగింపుగా అసెంబ్లీ మొదటిరోజు సమావేశాలకు హాజరు అయి నిరసనలు తెలపడానికి బిఆర్ఎస్ ప్లాన్ చేసుకుంది. అనుకున్నట్టుగానే కేటీఆర్, హరీష్ రావుల నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీల నాయకులు నల్ల చొక్కాలు ధరించి ఊరేగింపుగా అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరారు. మామూలుగా వాళ్ళ దోవన వాళ్ళు నడుచుకుంటూ వస్తే మీడియాకు టీఆర్పీ ఎలా వస్తుంది? ఇలాంటి నిరసనల్లో పోలీసులు ఎంటర్ అయితేనే కదా కథ పాకాన పడేది. అందరి అదృష్టం పండి పోలీసులు ఎంటర్ అయ్యారు. ఇది సాధారణంగా జరిగేదే.

అయితే ఈ అవకాశాన్ని కేటీఆర్, హరీష్ రావులు విజయవంతంగా ఉపయోగించుకున్నారు. ఆవేశంలో హరీష్ రావు ఒక అడుగు ముందుకు వేసి తన టీ షర్ట్ కూడా విప్పేసారు. ఇంకేముంది? మీడియాకు కావలసినంత ముడి సరుకు దొరికింది. అయితే ఇదే సమయంలో హరీష్ రావు తన మెడలో ఉన్న గోల్డ్ చైన్ ను జాగ్రత్తగా తీసి జేబులో వేసుకున్నారు. ఇంకేముంది? సోషల్ మీడియాకు కూడా ముడి సరుకు దొరికింది. పది పైసల అగ్గిపెట్టె దొర్కలేదు కానీ పోలీసోల్లని చూడగానే తన మెడ కాడ ఉన్న గోల్డ్ గొల్సు తీసి సక్కంగా లోనేసుకున్నాడు అని సీఎం రేవంత్ కూడా హరీష్ రావు మీద సెటైర్ వేశారు.

కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటి?

సరే మళ్ళీ అసలు విషయానికి వస్తే బిఆర్ఎస్ అనుకున్న ప్రకారంగానే వాళ్ళ నిరసన కార్యక్రమం విజయవంతం అయ్యింది. అయితే ఈ క్రమంలో, ఈ దూకుడులో ఎమ్మెల్సీ తాత మధు చేసిన వివాదాస్పద వాఖ్యల వల్ల బిఆర్ఎస్ పార్టీ డిఫెన్సులో పడితే.. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుని గేమ్ ప్లాన్ తమకు అనుకూలంగా మార్చుకుంది.

స్పీకర్ ను ఉద్దేశించి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలను సామాజిక వర్గ సమస్యగా మార్చడంలో రేవంత్ నాయకత్వంలోని శ్రేణులు విజయవంతం అయ్యాయి. ఇంకేముంది? మొత్తం గేమ్ మారిపోయింది.

రేవంత్ అంతటితో ఆగిపోలేదు. వెంటనే ప్లాన్ బి కూడా అమలు చేశారు. స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఎర్రవల్లి లోని కేసీఆర్ ఫామ్ హౌస్ ముట్టడికి పిలుపు ఇచ్చారు.

దీంతో అందరి దృష్టి అసెంబ్లీ నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్ మీదకి మళ్ళింది. ఇక్కడ కూడా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మరో పొరపాటు చేశారు. పోలోమంటూ బిఆర్ఎస్ నాయకులందరూ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి బయలుదేరారు. దాంతోరేవంత్ తన మీదకి (అసెంబ్లీ) దూసుకొస్తున్న నిరసనను విజయవంతంగా ఎర్రవల్లి బాట పట్టించారు.

ఎర్రవల్లి చేరుకున్న బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ శ్రేణుల ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతంగా ఎదుర్కున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ అదే దూకుడులో బిఆర్ఎస్ నాయకులు ఇంకో పొరపాటు చేశారు. ఎస్సీ నాయకులు నిరసనలు చేసిన స్థలాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేసి కాంగ్రెస్ నెత్తిన పాలు పోసారు.

ఈ అవకాశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చక్కగా ఉపయోగించుకుంది. మళ్ళీ సామాజిక వర్గ కార్డును బయటికి తీయడంతో బిఆర్ఎస్ నాయకులు రెండోసారి డిఫెన్సులో పడాల్సి వచ్చింది.

ఇదంతా ఇలా ఉంటే నిరసనను ఎర్రవల్లి వైపు డైవర్ట్ అయ్యేలా చేయడం వెనుక రేవంత్ అసలు వ్యూహం వేరొకటి ఉంది. ఆరోగ్య కారణాల రీత్యా గత సంవత్సరాల నుంచి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈసారి ఎలాగైనా కేసీఆర్ ను అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానంలో కూర్చోబెట్టి ఆయన్ని ఇరకాటంలో పెట్టాలనే వ్యూహం కూడా ఆయన సిద్ధం చేసుకున్నారని పార్టీ వర్గాల్లో టాక్.

దూకుడు పెంచిన బిఆర్ఎస్

ఆలస్యంగా తమ పొరపాట్లను గుర్తించిన బిఆర్ఎస్ నాయకత్వం కాంగ్రెస్ ప్లాను కు విరుగుడుగా భూముల అంశాన్ని ఎత్తుకున్నారు. 22A భూ చట్టం వల్ల నష్టపోతున్న రైతులు, ఇతర లబ్ధిదారుల తరపున వకాల్తా పుచ్చుకుని మళ్ళీ తనదైన శైలిలో పోరాట పంథాలోకి వచ్చారు.

బిఆర్ఎస్ ఎత్తుకున్న ఈ అంశం జనంలోకి బాగా వెళ్లింది. దానికి తోడు కేటీఆర్, హరీష్ రావులు 22 A అంశం మీద పక్కా కసరత్తు చేసి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వివరణ ఇవ్వక తప్పింది కాదు.

అందుకే సంబంధిత మంత్రి పొంగులేటి ఈ అంశం మీద అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరణ ఇచ్చారు. 22 A విషయంలో ప్రభుత్వం మీద కేటీఆర్, హరీష్ రావులు పెట్టిన వత్తిడి ఫలించింది.

మరోపక్కన కేటీఆర్ తమ మహిళా ఎమ్మెల్యేలతో ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేసి అందరి దృష్టిని అటు మళ్ళించారు. మీరు గమనించారా? రేవంత్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనా కాలం మొత్తంమీద ఈ స్థాయిలో బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది తక్కువ.

రంగంలోకి కేసీఆర్

దీనికి కారణం కొద్దిరోజుల క్రితం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి రేవంత్ ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కునే విషయంలో పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. పోరాట పంథాలో కేటీఆర్ తీరు ఒకరకంగా ఉంటుంది.. కేసీఆర్ తీరు ఇంకో రకంగా ఉంటుంది. కేటీఆర్ పోరాటం సాధారణ రాజకీయ పంథాలో సాగితే.. కేసీఆర్ పోరాటం మాత్రం ఉద్యమ పంథాలో ఉంటుంది.

జీవన్ రెడ్డి తమ పార్టీలోకి రావడం వల్ల కానీ , మంత్రి కొండా సురేఖ బర్తరఫ్ విషయంలో కానీ బిఆర్ఎస్ పార్టీకి ఆశించిన స్థాయిలో రాజకీయ లబ్ది కలగలేదు. ఈ రెండు ఉదంతాలు రేవంత్ నాయకత్వం మీద ఎలాంటి ప్రతికూల ప్రభావాలు చూపించలేదు.

అందుకే కేసీఆర్ రైతు సమస్యలు , ఇరిగేషన్ ప్రాజెక్టులు , భూ సమస్యలు ప్రధాన అంశంగా తెలంగాణా ఉద్యమ పంథాలో మరో పోరాటం నడపడానికి వ్యూహం సిద్ధం చేస్తున్నారు.

ఏది ఏమైనా తాజా పరిణామాలతో బిఆర్ఎస్ పార్టీ పోరాట పంథాలో స్పృష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఈ వ్యూహాలకు పదును పెట్టే వ్యక్తి కేసీఆర్ అయితే మాత్రం తెలంగాణా రాజకీయాల్లో కొత్త మార్పులు కనిపిస్తాయి.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *