మలయాళ నటుడు కుంచకో బోబన్ ప్రధాన పాత్రలో నటించిన ఉన్మాదం సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఉన్మాదం (Unmadham Movie) సెప్టెంబర్ 4, 2026 నుంచి ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ సోనీ లివ్ లో తెలుగు ఆడియో సౌకర్యంతో స్ట్రీమింగ్ అవుతుంది.
జులై 31 న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ తెలుగు ఆడియోలో కూడా అందుబాటులోకి రావడంతో , ఆ జానర్ మూవీలు ఇష్టపడే ఆడియన్స్ వాచ్ లిస్టులోకి చేరింది.
ఇప్పుడు ఉన్మాదం మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథేంటంటే?
కేరళలోని కొంగడ్ పోలీస్ స్టేషన్లో పనిచేసే షెల్లికి ( కుంచకో బోబన్) రైటర్ గా స్థిరపడాలని కోరిక. తాను రాసిన కథను వెండితెర మీద చూసుకోవాలని పోలీస్ ఉద్యోగానికి లీవ్ పెట్టి మరీ ప్రొడ్యూసర్ల వెంటపడుతూ ఉంటాడు. షెల్లి రాసిన కథను చదివిన ఒక ప్రొడ్యూసర్ ఆ కథను రిజెక్ట్ చేస్తూ అతడు పనిచేసే పోలీస్ డిపార్ట్మెంట్ కేసులకు సంబంధించి ఏదైనా క్రైమ్ స్టోరీ రాసి పట్టుకూరమ్మని సలహా ఇస్తాడు.
షెల్లి తన ఉద్యోగాన్ని , ఫ్యామిలీని పట్టించుకోకుండా సినిమాలనీ, కథలనీ తిరుగుతుండటంతో విసిగిపోయిన అతడి భార్య సౌమ్య ( లిజోమల్ జోస్ ) పుట్టింటికి వెళ్లిపోతుంది. సినిమాల్లో రైటర్ గా తనకు సరైన అవకాశాలు రాకపోవడంతో షెల్లి తిరిగి ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. అయితే పోలీస్ స్టేషన్ కు అందిన ఓ కంప్లైంట్ విషయంలో ఎంక్వైరీకి వెళ్లిన షెల్లిని చూసి ఓ వృద్ధుడు చనిపోవడంతో పనిష్మెంట్ కింద అతడ్ని వీరే పోలీస్ స్టేషన్ కు ట్రాన్స్ఫర్ చేస్తారు.

అక్కడ డ్యూటీలో జాయిన్ అయిన షెల్లి పొరపాటున వార్డ్ రోబ్ లో ఉన్న 174 నంబర్ ఫైల్ ను టచ్ చేస్తాడు. అది గమనించిన స్టేషన్ రైటర్ ఆ ఫైల్ ను ఎవరు టచ్ చేస్తే వారి ఒంటిపై రక్తం చిందుతుందని, అరిష్టాలు జరుగుతాయని.. ఇంకెప్పుడూ ఆ ఫైల్ జోలికి వెళ్ళొద్దని షెల్లిని హెచ్చరిస్తాడు.
ఇంతకీ ఆ 174 నంబర్ ఫైల్ లో ఏముంటుంది?
ఆ ఫైల్ టచ్ చేయడానికి పోలీసులు ఎందుకు భయపడతారు?
షెల్లి రాయబోయే కథకు.. ఆ ఫైల్ కు ఉన్న లింక్ ఏంటి? అనేది మిగిలిన కథ.
ఎలా ఉంది?
ఓ పోలీస్ ఫైల్ ఆధారంగా దర్శకుడు ఉన్మాదం కథ అల్లుకున్నారు. పోలీస్ ఉద్యోగం చేసే షెల్లి రైటర్ కావాలని ప్రొడ్యూసర్ల వెంటపడుతుండటంతో సినిమా మొదలౌతుంది.
ఈ క్రమంలో అతడికి సినీ ఫీల్డ్ నుంచి ప్రోత్సాహం రాకపోవడం , ఉద్యోగానికి న్యాయం చేయలేక సతమతం అవడం, ఫ్యామిలీకి సమయం కేటాయించలేకపోవడంతో భార్యకు దూరం అయ్యే పరిస్థితులు రావడంతో ఫస్టాఫ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా మోడ్ లో రన్ అవుతుంటుంది. కథలో సంఘర్షణ కూడా ఫస్టాఫ్ లోనే ఎక్కువ తిరుగుతుంది. షెల్లి చేసే వృత్తికి, అతడి ప్రవృత్తికి మధ్య ఫ్యామిలీ ఏ విధంగా నలిగిపోతుంది అనే పాయింట్ మీద దర్శకుడు ఫోకస్ పెట్టి కథనాన్ని నడిపించాడు.
ఎప్పుడైతే పోలీస్ స్టేషన్లో 174 నంబర్ ఫైల్ టచ్ చేస్తే ప్రమాదం ఎదురవుతుందని తెలుస్తుందో అక్కడ్నుంచి కథనం క్రైమ్ థ్రిల్లర్ మోడ్ లోకి టర్న్ అవుతుంది. ఆ డేంజరస్ ఫైల్ వెనుక ఉన్న బ్యాక్ గ్రౌండ్ స్టోరీని కూడా దర్శకుడు వెంటనే రివీల్ చేయలేదు. మెల్లిగా ఆ ఫైల్ చుట్టూ కథనాన్ని నడుపుకుంటూ ముందుకుపోయాడు. రైటర్ గా షెల్లీ రాయబోయే కధకు ఆ ఫైల్ ను ముడిసరుకుగా చూపిస్తూ దర్శకుడు స్టోరీని నేరేట్ చేసిన విధానం బాగుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నావ్ కాబట్టి నీ డిపార్ట్మెంట్లో ఇన్వెస్టిగేషన్ చేసిన కేస్ ఫైల్ నే స్టోరీగా రాసుకుని రమ్మని ఒక ప్రొడ్యూసర్ చెప్పడం , షెల్లికి తమ స్టేషన్లో ఆ డేంజరస్ ఫైల్ గురించి తెలియడానికి లింక్ పెట్టి కధనాన్ని నడిపించిన తీరు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.
ఆరేళ్ల క్రితం ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయిన ఓ అమ్మాయికి సంబంధించిన కేస్ ఫైల్ అని మాత్రమే అప్పటికి మనకి తెలుస్తుంది. ఇక్కడే మనకి కొన్ని ప్రశ్నలు ఎదురౌతాయి. ఆ అమ్మాయి నిజంగా ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయిందా? లేకపోతే ఎవరన్నా మర్డర్ చేసి రైల్వే ట్రాక్ పక్కన పడేసారా? ఎవరికీ అనుమానం రాకుండా అప్పటి సీఐ ఆ ఫైల్ ను ఎందుకు క్లోజ్ చేశాడు?
ఈ ప్రశ్నలకు సమాధానంగా దర్శకుడు సెకండాఫ్ నడిపారు. అయితే అప్పటివరకు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మోడ్ లో సాగిపోతున్న కథనానికి దర్శకుడు సైకలాజికల్ , హార్రర్ టచ్ ఇవ్వడంతో కొంత విసుగు తెప్పిస్తుంది. ఇలాంటి హార్రర్ సైకలాజికల్ థ్రిల్లర్ సీన్లు గతంలో చాలా సినిమాల్లో చూసేసాం కాబట్టి కొత్తగా మనకు థ్రిల్ పంచకపోగా సాగతీసినట్టు అనిపిస్తుంది. దయ్యం పట్టిందని షెల్లి వింతగా ప్రవర్తించే సన్నివేశాలు బోర్ కొడతాయి. అదీ కాసేపే.. తిరిగి అతడు ఇన్వెస్టిగేషన్ మోడ్ లోకి రాగానే స్టోరీ అనూహ్యమైన మలుపు తీసుకుంటుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి ట్రైన్ ఆక్సిడెంట్ మిస్టరీ కేసు చిక్కుముడులని విప్పుకుంటూ రావడం కొంత ఎంగేజ్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ ఎడిటింగ్ పార్ట్ మనల్ని కొంత కన్ఫ్యూజ్ చేస్తుంది.
తన దగ్గర అన్ని ఆధారాలు ఉంచుకుని బిల్డర్ దగ్గర అతడు పది లక్షలు ఎందుకు డిమాండ్ చేశాడో తెలీదు. అతడ్ని పట్టించాలనే తాను డబ్బులు డిమాండ్ చేశానని షెల్లి చెప్పే రీజన్ సరిగా అతకలేదు.
ఆ ఎపిసోడ్ పక్కనపెడితే మూవీ స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు దర్శకుడు ఒకే టెంపోలో కధనాన్ని నడిపించారు. అనవసరమైన కామెడీలు , డ్యూయెట్ల జోలికి పోకుండా క్రైమ్ థ్రిల్లర్ జానర్లోనే స్టోరీని రన్ చేసుకుంటూపోయారు. దర్శకుడు క్లైమాక్స్ రాసుకున్న తీరు కూడా బాగుంటుంది. చివర్లో అతిథి పాత్రలో మరో మలయాళ నటుడు సౌబిన్ సాహిర్ చేత డైలాగ్ చెప్పించిన సీన్ సినిమాకి ఇంట్రెస్టింగ్ ఎండ్ ఇస్తుంది.
ఎవరెలా చేశారు?
ఉన్మాదం సినిమా స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు దాదాపు ప్రతి ఫ్రేమ్ లో కుంచకో బోబన్ కనిపిస్తాడు. ఈ సినిమాలో అతడి నటనలో రెండు షేడ్స్ చూస్తాం. దాదాపు ఫస్టాఫ్ అంతా భార్యకు ఎదురు చెప్పలేని భర్తగా, పిల్లలను ప్రేమించే తండ్రిగా కుంచకో బోబన్ ఒక ఫ్యామిలీ మ్యాన్ మ్యానరిజంలో కనిపిస్తాడు.
చేసేది పోలీస్ ఉద్యోగం అయినా అతడిలో ఆ రఫ్నెస్ ఎక్కడా కనిపించదు. యూనిఫామ్ వేసుకున్నా, సివిల్ డ్రెస్ లో ఉన్నా ఒకేలా ఉంటాడు. ఇక సెకండాఫ్ లో సివిల్ డ్రెస్ లో ఉన్నా కూడా పోలీస్ మ్యానరిజం ఫాలో అయ్యే డిఫరెంట్ షేడ్ లో కనిపిస్తాడు. ఓవరాల్ గా కుంచకో బోబన్ సినిమాని తన భుజాల మీద వేసుకుని నడిపించాడు. ఒకరకంగా చెప్పాలంటే వన్ మ్యాన్ ఆర్మీ అన్నమాట.
ఇక అతడి భార్య సౌమ్య పాత్ర పోషించిన లిజోమల్ జోస్ నటన కూడా బాగానే ఉంది. కాకపోతే ఈ పాత్ర మొదటినుంచి చివరివరకు రుసరుసలాడుతూనే ఉంటుంది.
మిగిలినవాళ్ళు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతికత
ముజీబ్ మజీద్ అందించిన సంగీతం బాగానే ఉంది.
అర్జున్ సేతు అందించిన సినిమాటోగ్రఫీ పర్లేదు.
నిర్మాణ విలువలు కూడా పర్లేదు.
విశ్లేషణ
సైకలాజికల్ థ్రిల్లర్ జానర్లో మూవీలు ఇష్టపడేవారికి ఉన్మాదం మూవీ నచ్చుతుంది. ఫస్టాఫ్ కొద్దిగా స్లో నేరేషన్ అనిపించినా సెకండాఫ్ మాత్రం పరుగులు పెడుతుంది.
ముఖ్యంగా 174 నంబర్ ఫైల్ గురించి బయటికి వచ్చినప్పటినుంచి కథనం మనల్ని ఎంగేజ్ చేస్తుంది. మధ్యలో వచ్చే హార్రర్ ఎలిమెంట్ కాస్త విసిగిస్తుంది. తిరిగి ప్రీ క్లైమాక్స్ నుంచి కథనం మనల్ని ఎంగేజ్ చేస్తుంది.
క్లైమాక్స్ సీన్ సౌబిన్ సాహిర్ తో ప్లాన్ చేయడం సినిమాకి ప్లస్ అవుతుంది.
ఓవరాల్ గా సినిమా పెద్ద బోర్ ఏమీ కొట్టదు. సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలు చూడటానికి ఇష్టపడేవారు సోనీ లివ్ లో తెలుగు ఆడియోలో కూడా అందుబాటులో ఉన్న ఉన్మాదం మూవీపై ఓ లుక్కేయండి.
నటీనటులు: కుంచకో బోబన్ , లిజోమల్ జోస్ తదితరులు
సంగీతం: ముజీబ్ మజీద్
సినిమాటోగ్రఫీ: అర్జున్ సేతు
నిర్మాత: అభిషేక్
దర్శకత్వం: కిరణ్ దాస్
ఓటిటి / స్ట్రీమింగ్ : సోనీ లివ్
రిలీజ్: (04-09-2026)
రేటింగ్: 2.75/ 5
