నిన్న తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైద్రాబాదులోని తన నివాసంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి .. వివాదాస్పదం అయ్యాయి. ఇన్నాళ్లు తెలంగాణా మీద పూర్తిస్థాయిలో దృష్టి పెట్టని పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం నాడే ఇకపై తాను తెలంగాణాలోనూ తిరుగుతానని ..దమ్ముంటే తనని ఆపండని కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసరడం వెనుక ఉన్న కారణాలు ఏంటి ? ఆంధ్రప్రదేశ్ కూటమి రాజకీయాల్లో కీలకంగా మారి డిప్యూటీ సీఎం పదవిలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణాలో కూడా చక్రం తిప్పుదామని భావిస్తున్నారా ? త్వరలో జరగబోయే GHMC ఎన్నికల్లో జనసేన కూడా పోటీ చేస్తుందని తేల్చి చెప్పడం ద్వారా తెలంగాణాలో ఉన్న జనసైనికులను పవన్ కళ్యాణ్ ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారా ? అనే విషయాలను విశ్లేషణ చేసుకుందాం .
అసలు వివాదం ఎప్పుడు మొదలైంది ?
తెలంగాణాకు చెందిన ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , మంత్రి నాదెండ్ల మనోహర్ లు ఢిల్లీలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కలిసి ఏపీ మాజీముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ప్రస్తుతం ఉన్న కేసుల్లో అరెస్ట్ చేసి జైల్లో పెట్టించాల్సిందిగా కోరినట్టు తనదగ్గర సమాచారం ఉందని చెప్పడంతో జనసైనికులు ఆగ్రహం చెంది తప్పుడు సమాచారం చెప్పినందుకు గాను ఏపీలో పలు పోలీస్ స్టేషన్లలో ఆయన మీద కేసులుపెట్టారు . దరిమిలా ప్రొఫెసర్ నాగేశ్వర్ ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేయనున్నట్టు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేసాయి. ఈ దశలో నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తితో , పవన్ కళ్యాణ్ మీద గౌరవంతో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని మీడియాతో చెప్పారు . పవన్ కళ్యాణ్ కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ పొరపాటున ఆ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని కాబట్టి ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేయమని జనసైనికులకు విజ్ఞప్తి చేసారు . కానీ వీళ్ళిద్దరూ వివాదం ముగిసిందని చెప్పినప్పటికీ తెలంగాణా మేధావులు మాత్రం అందుకు అంగీకరించలేదు .
పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో సమావేశం పెట్టిన తెలంగాణా మేధావులు
ప్రొఫెసర్ నాగేశ్వర్ ను అరెస్ట్ చేయడానికి ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారని , ఆయన ప్రయత్నాలను తామంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నామని ప్రెస్ క్లబ్ లో సమావేశమైన వక్తలు విమర్శించారు . కానీ మాజీ సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది .. నిప్పు తిరిగి రాజుకుంది . పాశం యాదగిరి నేరుగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ మూడు పెళ్లిళ్లు చేసుకున్న నువ్వు నీతులు మాట్లాడేటోడివా ? అంటూ ఎగతాళి చేసారు . ప్రొఫెసర్ నాగేశ్వర్ జోలికి వచ్చినా , తెలంగాణా జోలికి వచ్చినా ఖబడ్డార్ అంటూ హెచ్చరికలు చేసారు . నిజానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వాఖ్యల కన్నా పాశం యాదగిరి చేసిన వ్యాఖ్యలు జనసైనికుల్లో మరింత ఆగ్రహం తెప్పించాయి . పాశం యాదగిరి వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పవన్ కళ్యాణ్ వరకు విషయం వెళ్ళింది .
పవన్ కళ్యాణ్ ఏం చేసారు ?
పవన్ కళ్యాణ్ గురించి రెండురకాలుగా చెప్పుకోవచ్చు .. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో .. డిప్యూటీ సీఎం అయిన తర్వాత .. మీరు గమనించే ఉంటారు .. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో పవన్ కళ్యాణ్ ప్రతి విషయం మీద దూకుడుగా వెళ్ళేవాళ్ళు . కత్తి మహేష్ తో జరిగిన గొడవలో పవన్ కళ్యాణ్ ఎంత దూకుడుగా వెళ్లారో అందరికీ తెలుసు . ప్రజారాజ్యం సమయంలో కూడా ఆయన తీరు అగ్రెసివ్ గా ఉండేది . బహిరంగ సభల్లో ఆయన ఇచ్చే ఉపన్యాసాల్లో పిడికిలి బిగించడం , ఆవేశంతో ఊగిపోవడం తూచా తప్పకుండా ఉండేవి . డిప్యూటీ సీఎం అయిన తర్వాత హోదా రీత్యా దూకుడు , ఆవేశం తగ్గి కొంత పెద్దరికం వచ్చింది . అయినా పవన్ కళ్యాణ్ లోపల ఇప్పటికీ ఒక ఆవేశపరుడు ఉన్నాడని ఆయన్ను దగ్గర్నుంచి చూసినవాళ్లకు తెలుసు . మళ్ళీ ఇన్నాళ్లకు ప్రొఫెసర్ నాగేశ్వర్ , పాశం యాదగిరి తదితరుల వ్యాఖ్యలతో పవన్ కళ్యాణ్ లోని లోపలి మనిషి బయటికి వచ్చాడు . నిన్న పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ చూసినవాళ్లకు కూడా ఈ విషయం అర్ధం అవుతుంది . తన కోపానికి కారణం పవన్ కళ్యాణే స్వయంగా చెప్పాడు . అసలు వివాదం మొదలవడానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ కారణమని , దానికి కొంతమంది తెలంగాణా మేధావులు ఆజ్యం పోశారని ఆయన మండిపడ్డారు . ఆ ఆవేశం నుంచి పుట్టిందే తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం రోజున తెలంగాణాలో బహిరంగ సభ పెట్టాలనే ఆలోచన .
ఇవన్నీ బయటికి కనిపించే కారణాలు .. కానీ బయటికి కనిపించని కారణాలు కూడా కొన్ని ఉన్నాయి .
ఆప్ తరహా విస్తరణ
ఢిల్లీ పీఠం అధిష్టించిన తర్వాత కేజ్రీవాల్ అంతటితో ఆగలేదు . తన దృష్టిని ఇతర రాష్ట్రాల మీద పెట్టారు . ఢిల్లీ ఎన్నికల్లో కూడా ఆప్ అధికారం దక్కించుకోవడంతో కేజ్రీవాల్ ఫోకస్ మిగిలిన రాష్ట్రాల మీద పడింది . అందులో భాగంగానే ఏపీ , తెలంగాణలతో సహా పలు రాష్ట్రాల్లో పార్టీ కార్యాలయాలను తెరిచారు . ప్రస్తుతానికి వస్తే పవన్ కళ్యాణ్ కూడా జనసేనను విస్తరించే ఆలోచనలు చేస్తున్నారు . అందులో భాగంగానే కేరళలో కూడా కార్యాలయం ఏర్పాటుచేయడానికి కొంతమంది నాయకులు ముందుకువచ్చారు . మిగిలిన రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా ముందునుంచి తెలంగాణాలో కూడా జనసేనని విస్తరించే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారు . అందుకే గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జనసేన అభ్యర్థులను నిలిపాడు . చాపకింద నీరులా తెలంగాణాలో మెల్లిగా జనసేన సభ్యత్వాలను చేర్పించడం మొదలుపెట్టాడు .ఇప్పటికే లక్షమంది జనసైనికులు పార్టీ సభ్యత్వం స్వీకరించారని ఆయన చెప్తున్నారు . ఏపీలోనే ఆయనకు దిక్కులేదు .. ఇంకా ఇతర రాష్ట్రాలకు కూడానా ? అని ఆశ్చర్యపోకండి .. గత ఎన్నికల్లో ఆఖరి నిమిషంలో పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ అయ్యారనే సంగతి మర్చిపోకూడదు . ఏమో రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూహించగలరు ?
కూటమి రాజకీయాలు
తెలంగాణాలో కూడా ఏపీ తరహా కూటమి రాజకీయాలు నడపడానికి రంగం సిద్ధం అవుతుంది . GHMC ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని బీజేపీ , జనసేన నాయకులు బయటికి చెప్తున్నా ఎన్నికల నాటికి పొత్తు రాజకీయాలు చేయాలని ఆలోచన చేస్తున్నాయ్ . మెల్లిగా స్థానిక సంస్థల్లో బలం పెంచుకుని వచ్చే అసెంబ్లీ ఎన్నికలనాటికి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని బీజేపీ , జనసేనలు ఇప్పట్నుంచే పావులు కదుపుతున్నాయి . అందుకే పవన్ కళ్యాణ్ తెలంగాణాలో రాజకీయ కార్యకలాపాలు చేయడానికి బీజేపీ రాష్ట్ర నాయకత్వం బహిరంగంగా సమర్ధించింది . మూడో దశలో చంద్రబాబు కూడా రంగంలో దిగడానికి ఆలోచనలు జరుగుతున్నాయి . మరి వీరి ప్రయత్నాలకు తెలంగాణా సమాజం ఎంతవరకు మద్దతు ఇస్తుందో తెలీదు . అయినా ఇకపై తెలంగాణాలో కూడా జనసేన రాజకీయాలు చేస్తుందని , దమ్ముంటే ఆపండి అంటూ నిన్ననే పవన్ కళ్యాణ్ స్పృష్టంగా చెప్పేసారు.
జనసేనకు దక్కని ఆహ్వానం
తెలంగాణా ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం తరపున సత్కరించే ఏర్పాట్లలో భాగంగా ప్రభుత్వం అన్ని పార్టీల సమావేశం ఏర్పాటు చేసింది . వివిధ పార్టీల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు అన్ని పార్టీలకు ఆహ్వానం పంపింది. ఆ జాబితాలో బీజేపీ , టిడిపి , ఎంఐఎం , ఆప్ , వైసిపి పార్టీలతో సహా కొన్ని పార్టీలు ఉన్నాయి కానీ జనసేన లేదు . ఈ పరిణామం జనసేనకు మింగుడుపడలేదు . ఆప్ వంటి పార్టీకి కూడా ఇన్విటేషన్ పంపిన ప్రభుత్వం జనసేనకు పంపకుండా తీసిపడేయడం పవన్ కళ్యాణ్ కు ఆగ్రహం తెప్పించింది . కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే తమల్ని అవమానించిందని జనసేన భావించింది .
పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు ?
ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలతో వివాదం మొదలైందని , ఆయన్ను అడ్డుపెట్టుకుని కొంతమంది తెలంగాణా నాయకులు విద్వేష రాజకీయాలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు . నిన్న హైద్రాబాదులోని తన నివాసంలో కార్యకర్తల సమక్షంలో మీడియాతో మాట్లాడుతూ మరోసారి పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు . తెలంగాణాలో తిరిగితే తన నాలుక కోస్తామని కొందరు అంటున్నారు . ఇప్పుడే నేను డిసైడ్ అయిపోయా .. ఇకపై నేను తెలంగాణాలో తిరుగుతా .. GHMC ఎన్నికల్లో పోటీ చేస్తా .. ఎవరాపుతారో రండి .. నన్ను తెలంగాణలోకి రానివ్వపోవడానికి ఎవరికీ హక్కు లేదు . తెలంగాణా అనేది భారతదేశంలో అంతర్భాగం ..తెలంగాణాపైన నాకు కూడా ప్రేమ ఉంది . తెలంగాణా కళాకారుడైన గద్దర్ తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని .. అడిగిన వెంటనే ఆయనకు కారు కూడా కొనిచ్చానని చెప్పుకొచ్చారు . తెలంగాణాలో తాను పదెకరాల చెరువు ఆక్రమించినట్టు చేసిన ఆరోపణలను కూడా ఆయన ఖండించారు . నిన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ , బిఆర్ఎస్ పార్టీలు కౌంటర్ కూడా ఇచ్చాయి . చూడాలి .. ముందు ముందు ఈ వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి .
ముగింపు : తెలంగాణాలో కాలుమోపి పవన్ కళ్యాణ్ అనుకున్నది సాధిస్తాడా ? లేకపోతే ఆయన్ని తెలంగాణాలో అడుగుపెట్టనివ్వం అని సవాల్ చేసిన నాయకులు నెగ్గుతారా ? అనే విషయాలు తెలియాలంటే వేచి చూడాలి . ప్రస్తుత పరిణామాల పట్ల రాజకీయ వర్గాలే కాదు ఇరురాష్ట్రాల ప్రజలు కూడా ఆసక్తితో ఉన్నారు .
