ఏపీలో మరో సం’కుల’ సమరానికి రంగం సిద్దం అవుతుందా? విజయ్ సాయి రెడ్డి (Vijaysai Reddy) వ్యూహం ఏంటి?

Spread the love

రాజ్యసభ మాజీ సభ్యుడు , వైసీపీ మాజీ నేత విజయ్ సాయి రెడ్డి (Vijaysai Reddy) నిన్న (సెప్టెంబర్ 7,2026) విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొత్త పార్టీ ఏర్పాటు ప్రకటన చేశారు.

2029 ఎన్నికలే లక్ష్యంగా తన కార్యాచరణ ఉండబోతున్నట్టు ఆయన చెప్పారు. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఇకపై తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని, వ్యవసాయం చేసుకుంటానని ప్రకటనలు చేసి కొంతకాలం వ్యూహాత్మక మౌనం పాటించిన విజయ్ సాయి రెడ్డి తాజాగా తిరిగి పాలిటిక్స్ లో రీ ఎంట్రీ ఇవ్వడం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏమీ కాదు కానీ నిన్నటి మీడియా సమావేశంలో ఏపీని కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలే పాలించాలా? మిగిలిన సామాజిక వర్గాలకు అధికారంలో ఎందుకు స్థానం దక్కటం లేదు? అని ఆయన వేసిన ప్రశ్న ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది.

విజయ్ సాయి రెడ్డి ప్రశ్న 2029 ఏపీ ఎన్నికల్లో మరో సంకుల సమరానికి నాంది కాబోతుందా? అనే అనుమానాలు రేకెత్తిస్తుంది. తాజా పరిణామాలపై ఒకసారి విశ్లేషణ చేసుకుందాం.

ఎవరీ విజయ్ సాయి రెడ్డి?

ఈ ప్రశ్నకు ఆయన రాజ్యసభ మాజీ సభ్యుడనీ, వైసీపీ మాజీ నేత అని ఇప్పుడైతే చప్పున సమాధానం చెప్పొచ్చు కానీ కొంత ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే విజయ్ సాయి చార్టర్ అకౌంటెంట్ గా మాత్రమే ఆయనకు గుర్తింపు ఉండేది.

నిజానికి ఈ విజయ్ సాయి రెడ్డికి, జగన్ మోహన్ రెడ్డికి..వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలోనే వృత్తిపరమైన సంబంధాలు ఉన్నాయి. రాజకీయాల్లోకి రాక ముందు వైఎస్ జగన్ వ్యాపారవేత్త అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన వ్యాపారాలకు సంబంధించిన ఆడిటింగ్ పనులన్నీ విజయ్ సాయి చేతుల మీదుగానే జరిగేవి.

అప్పట్లో రాజశేఖర్ రెడ్డి పాలనా వ్యవహారాలన్నీ తన మిత్రుడైన కేవీపీ రామచంద్రరావు ద్వారానే చక్కబెట్టుకునేవారు. అందుకే కేవీపీకి క్యాబినెట్ ర్యాంకు ప్రభుత్వ సలహాదారు పదవి కట్టబెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి.. ఢిల్లీలో కానివ్వండి.. పాలనా వ్యవహారాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి.. కేవీపీ ఒక వారధిలా పనిచేశారు.

ఆయన హయాంలో మూడో వ్యక్తికి స్థానం కల్పించలేదు. అయితే రాజశేఖర్ రెడ్డి మరణాంతరం వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చి సొంత పార్టీ పెట్టుకోవడం, కేవీపీ మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోవడంతో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి.

ఒకవేళ కేవీపీ కూడా జగన్ వెంటే ఉంటే ఎలా ఉండేదో తెలీదు కానీ మారిన సమీకరణాలతో జగన్ తన సొంత కోటరీని సృష్టించుకోవాల్సి వచ్చింది. అప్పటికి ఉన్న పరిస్థితుల్లో జగన్ పక్కన వ్యాపారపరమైన కోటరీ మాత్రమే ఉంది. ప్రస్తుతం వైసీపీలో చక్రం తిప్పుతున్న సజ్జల సాక్షి పేపర్ నుంచి రాగా, విజయ్ సాయి రెడ్డి జగన్ వ్యాపార సామ్రాజ్యాల నుంచి వచ్చారు.

ఈ ఇద్దరికీ గతంలో క్రియాశీలక రాజకీయాల్లో అనుభవం లేదు. ఒక రకంగా వీరి రాజకీయ భవిష్యత్తుకు జగన్ గట్టి పునాదులు వేసారు. సాక్షి పత్రికలో జర్నలిస్టుగా ఉన్న సజ్జల రామకృష్ణా రెడ్డి కేవీపీ స్థానంలో ప్రభుత్వ సలహాదారు పదవిని పొందారు.

జగన్ అండతో విజయ్ సాయి రెడ్డి ఏకంగా రాజ్య సభ సభ్యుడు కావడమే కాకుండా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత స్థాయికి కూడా ఎదిగారు. జగన్ తో పాటు కేసుల్లో ఇరుక్కున్న విజయ్ సాయికి ఈ పదవులతో దశ తిరిగింది. ఒక దశలో ఆయన ప్రధాని నరేంద్ర మోదీ కి కూడా సన్నిహితం అయ్యారు. పాలనా వ్యవహారాల్లో జగన్ ప్రభుత్వం తరపున సలహాదారుగా ఢిల్లీలో పనులన్నీ చక్కబెట్టేవారు.

పార్లమెంటులో కూడా తన వాక్ చాతుర్యంతో అన్ని పార్టీలను ఆకట్టుకున్నారు. దాంతో విజయ్ సాయి పరిచయాలు కూడా పెరిగాయి. అదే జగన్ కు చాలా విషయాల్లో కలిసి వచ్చింది.
రాజకీయాల్లో అతి తక్కువ కాలంలోనే విజయ్ సాయి ముందుకు దూసుకుపోవడమే కాకుండా వైసీపీలో నంబర్ టు అని పిలిపించుకునే స్థాయికి ఎదిగారు. పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ పనులు కావాలంటే జగన్ కన్నా ముందు విజయ్ సాయిని కలవాలనే సంకేతాలు కార్యకర్తల్లోకి బలంగా వెళ్ళాయి.

సహజంగా ఈ పరిణామాలు వైసీపీలో సీనియర్ నేతగా ఎదుగుతున్న సజ్జలలో అసంతృప్తికి దారి తీసింది. దాంతో జగన్ కోటరీలో మెల్లిగా విభేదాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో జగన్ కూడా సజ్జల వైపే మొగ్గి విజయ్ సాయిని దూరం పెట్టడం ప్రారంభించారు. అయినా అప్పటికి పార్టీ అధికారంలో ఉండటంతో విజయ్ సాయి కూడా బయటపడకుండా సంయమనం పాటించారు.

ఈ పరిస్థితుల్లో ఏపీలో వైసీపీ అధికారం కోల్పోవడంతో విజయ్ సాయి పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి బయటికి వచ్చేశారు. ఇకపై తాను రాజకీయాల్లోకి వచ్చేది లేదని, వ్యవసాయం చేసుకుంటానని అప్పట్లో విజయ్ సాయి ప్రకటన కూడా చేశారు.

బీజేపీ వైపు చూపు

వైసీపీకి రాజీనామా చేసి రాజకీయాలకు దూరం అని బయటికి ప్రకటనలు చేసినా బీజేపీలో చేరడానికి అంతర్గతంగా విజయ్ సాయి పావులు కదిపారు. అందుకోసం ఢిల్లీలో తనకున్న పరిచయాలను కూడా వాడారు. కానీ విజయ్ సాయి రెడ్డి వెనుక ఉన్న కేసులు ఆ పార్టీలో ఆయన చేరడానికి అడ్డుగా నిలిచాయి. దాంతో పరోక్షంగా ఆయన బీజేపీ తరపున పనిచేయడం మొదలుపెట్టారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి కూటమికి మార్గం సుగమం చేశారు.

పొలిటికల్ రీ ఎంట్రీ

కొంతకాలం క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న విజయ్ సాయి నిన్నటి మీడియా సమావేశంలో కొత్త పార్టీ ప్రకటన చేసి ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంకుల రాజకీయ సమరానికి రంగం సిద్ధం చేశారు.

కుల రాజకీయాలే లక్ష్యమా?

విజయ్ సాయి మాటలను బట్టి 2029 లో ఆయన కుల రాజకీయాలనే లక్ష్యంగా చేసుకున్నారని అర్ధం అవుతుంది. ఇప్పటివరకు ఏపీలో కమ్మ రెడ్డి సామాజిక వర్గాలే అధికారం దక్కించుకుంటూ వస్తున్నాయని, కాపు సామాజిక వర్గానికి చెందిన జనసేన మూడో స్థానానికి పరిమితం కావడంతో 2029 ఎన్నికల్లో కూడా కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన టీడీపీ, వైసీపీ పార్టీల మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని , అందుకే మిగిలిన సామాజిక వర్గాలకు కూడా అధికారం దక్కేలా తాను మెంటార్ పాత్ర పోషిస్తానని ఆయన చెప్తున్నారు. ఇందుకోసం ఆయన పక్కా గ్రౌండ్ వర్క్ కూడా చేశారు. రాజరికం నుంచి నేటివరకు రెడ్డి సామాజిక వర్గం పాలనా కాలాలను ప్రస్తావిస్తూ ఒక పుస్తకం కూడా రాసారు.

కేసీఆర్ ఫార్ములా

ప్లాన్ బి అమలు చేయడానికి విజయ్ సాయి కేసీఆర్ ఫార్ములాని ఎంచుకున్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాను పెట్టబోయే పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీలతో పాటు ఇతర సామాజిక వర్గాలకు అధికారంలో ప్రాధాన్యం కల్పించే విధంగా ఉంటుందని , తాను కానీ తన కుటుంబ సభ్యులు కానీ సీఎం పదవిని ఆశించటం లేదని.. ఒకవేళ తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ ని ముఖ్యమంత్రిని చేస్తామని ఆయన చెప్పడం గతంలో తెలంగాణా రాష్ట్ర సాధనలో కేసీఆర్ చెప్పిన మాటలను గుర్తుకు తెస్తున్నాయి.

గతంలో కేసీఆర్ కూడా ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం అవతరిస్తే తమ పార్టీ తరపున బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే అధికారం దక్కిన తర్వాత బీసీ హామీ పక్కన పెట్టి ఆయనే అధికార పీఠం మీద కూర్చున్నారు.

ఓట్ బ్యాంక్ చీల్చడమే లక్ష్యమా?

ఏపీలో రాజకీయాలన్నీ కుల ప్రాతిపదికనే జరుగుతాయనేది బహిరంగ రహస్యమే. విజయ్ సాయి చెప్పినట్టు ప్రస్తుతం ఏపీలో కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల చుట్టూనే అధికారం తిరుగుతుంది. పవన్ కళ్యాణ్ రాకతో కాపు సామాజిక వర్గానికి కూడా అధికారంలో సముచిత ప్రాధాన్యత దక్కింది. అయితే రాబోయే ఎన్నికల్లో తమ సామాజిక వర్గానికి పూర్తిస్థాయిలో అధికార పగ్గాలు దక్కాలని జనసేన నాయకులు కోరుకుంటున్నారు.

2029 ఎన్నికల నాటికి ఏపీలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని బీజేపీ కూడా ఇప్పటినుంచే పావులు కదుపుతుంది. అయితే ప్రస్తుతానికి బీజేపీ పవన్ కళ్యాణ్ ద్వారా తన కార్యాచరణ ద్వారా అమలుచేసుకుంటుంది.

ఈ పరిస్థితుల్లో విజయ్ సాయి కొత్త పార్టీ పెట్టి కుల రాజకీయాలకు తెర లేపితే ఆ ప్రభావం అందరికన్నా ముందు వైసీపీ మీదే పడుతుంది. రెడ్డి సామాజిక వర్గంతో పాటు వైసీపీ ఓట్ బ్యాంకుగా ఉన్న 40 శాతం ఓట్లను చీల్చడమే లక్ష్యంగా విజయ్ సాయి పార్టీ వ్యూహంగా ఉండొచ్చు. జగన్ ను టార్గెట్ చేసుకుని ఏపీలో పరోక్ష రాజకీయాలకు తెరలేపే ప్రయత్నమే విజయ్ సాయి కొత్త పార్టీ ప్రకటన అని ఇప్పటికే వైసీపీ వర్గాల్లో టాక్.

ముగింపు

రాజకీయాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి తమ పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయడం.. రెండోది ప్రత్యర్ధి పార్టీని అధికారంలోకి రానివ్వకుండా పనిచేయడం. ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో విజయ్ సాయి పెట్టబోయే పార్టీ అద్భుతాలు సృష్టించదు కానీ ఓట్ బ్యాంక్ చీల్చడానికి మాత్రం కొంతవరకు పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తిస్థాయిలో తను పెట్టబోయే పార్టీ విధి విధానాలను విజయ్ సాయి ప్రకటించిన తర్వాత కానీ ఆయన భవిష్యత్ వ్యూహంలో మరింత క్లారిటీ రాదు. అప్పటివరకు వేచి చూడాల్సిందే.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *