సుమంత్ ప్రభాస్ , అనంతిక సనీల్ కుమార్ జంటగా నటించిన రోమాంచకం మూవీ ( Romanchakam Movie) సెప్టెంబర్ 3, 2026 న థియేటర్లలో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సందీప్ రెడ్డి వంగా నిర్మాణ సారధ్యం వహించిన ఈ చిత్రానికి వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు. లవ్, కామెడీ డ్రామా జానర్లో రూపొందిన రోమాంచకం మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథేంటంటే?
అన్వేష్ (సుమంత్ ప్రభాస్) పోలీస్ లాకప్ లో కూర్చుని తన ప్రేమ కథను చెప్పడంతో మొదలౌతుంది.
కట్ చేస్తే,
అన్వేష్ తన స్నేహితులతో కలిసి ఓ స్టార్టప్ కంపెనీ నడుపుతుంటాడు. ఇదే సమయంలో అతడు రోమాంచకం పేరుతో అమ్మాయిలను, అబ్బాయిలను కలిపే ఒక డిజిటల్ ప్లాట్ ఫామ్ ను ప్లాన్ చేస్తాడు.
అన్వేష్ ప్లాన్ చేసిన యాప్ ను అతడి స్నేహితుల్లో ఒక్కడు మినహా మిగిలిన వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. అయితే ఇదే సమయంలో అన్వేష్ కు చెన్నై నుంచి మైధిలి (అనంతిక సనీల్ కుమార్) అనే అమ్మాయినుంచి కాల్ వస్తుంది. రోమాంచంకం యాప్ ద్వారా ఇద్దరూ ఫ్రెండ్స్ అవుతారు. వారి స్నేహం ప్రేమగా మారుతుంది.

దాంతో అన్వేష్ ను కలవటానికి మైథిలి చెన్నై నుంచి హైదరాబాద్ వస్తుంది. హైదరాబాదులో అన్వేష్ స్నేహితుడి ఫ్లాట్ లో ఇద్దరూ మొదటిసారి కలుసుకుంటారు. ప్రియురాలిని కలుసుకున్న సంతోషంలో అన్వేష్ ఉండగానే ఊహించని సంఘటన జరుగుతుంది. హఠాత్తుగా మైథిలి కనిపించకుండా పోతుంది?
అన్వేష్ ను కలవటానికి వచ్చిన మైథిలి హఠాత్తుగా మాయం అవడం వెనుక అసలు కారణం ఏంటి?
స్నేహితులు అనుమానపడినట్టు మైథిలి సూసైడ్ చేసుకుందా?
చివరకు ఈ వీళ్లిద్దరి లవ్ స్టోరీ ఎలాంటి ముగింపు తీసుకుంది? అనేది మిగిలిన కథ.
ఎలా ఉంది?
కథ చదివారు కదా? రొటీన్ స్టోరీ అనిపిస్తుందా? అవును.. రొటీన్ స్టోరీ మాదిరే అనిపిస్తుంది కదా? అయితే ఈ మూవీలో స్పెషాలిటీ ఏంటటా? అంటే తెలంగాణా యాసలో దర్శకుడు నడిపిన కామెడీ కథనమే ఈ సినిమాలో స్పెషాలిటీ.
ప్రేక్షకులు చాలావరకు కామెడీ సినిమాల్లో కథను వెతుక్కోరు. దర్శకుడు మనకి ఎంతవరకు కితకితలు పెట్టగలిగాడు అనేదే చూసుకుంటారు. ఈ సినిమాలో దర్శకుడు ఇదే ఫార్ములాని నమ్ముకుని ఫాలో అయ్యారు. ఆ ప్రయత్నంలో ఆయన కొంతవరకు సక్సెస్ అయ్యారు.
కొంతవరకు అని ఎందుకంటున్నానంటే వైద్యానికైనా, హాస్యానికైనా డోస్ అనేది చాలా ఇంపార్టెంట్. రోగి త్వరగా కోలుకోవాలని డాక్టర్ ఓవర్ డోస్ ఇంజెక్షన్ ఇస్తే అతడు కోలుకోకపోగా పుటుక్కుమంటాడు. అలాగే కితకితలు కూడా.. ప్రేక్షకులను అదే పనిగా నవ్వించేయాలని దర్శకుడు కంకణం కట్టుకుని అమాంతం కామెడీ డోస్ పెంచేస్తే కితకితలు పుట్టకపోగా కొత్తగా కుతకుతలు మొదలౌతాయి.
ఈ సినిమాలో జరిగింది అదే. ఫస్టాఫ్ అంతా అన్వేష్ మిత్ర బృందంతో తెలంగాణా యాసలో కామెడీ పండించడం.. రొమాంచకం యాప్ ద్వారా చెన్నై అమ్మాయి మైథిలి, హైదరాబాద్ కుర్రోడు అన్వేష్ ఫ్రెండ్స్ అవడం , వారి స్నేహం ప్రేమగా మారడం వరకు కామెడీ, లవ్ వంటి అన్ని ఈక్వేషన్స్ లను బ్యాలెన్స్ చేసుకుంటూ సినిమాని రన్ చేసిన దర్శకుడు సెకండాఫ్ లో మాత్రం ఆ ఈక్వేషన్స్ అన్నీ పక్కన పెట్టేసి కేవలం కితకితలమీదనే ఎక్కువగా ఫోకస్ పెట్టడంతో కథనం గాడి తప్పింది.
ఆ స్పీడులో కొన్ని సాగతీత సన్నివేశాలు స్పీడ్ బ్రేకర్ల మాదిరి అడ్డొచ్చి ఇబ్బంది పెడతాయి. లాజికల్ గా కూడా కొన్ని సన్నివేశాలు కన్విన్సింగ్ గా ఉండవు. హైదరాబాద్ నుంచి చెన్నై చేరిన అన్వేష్ కాంటాక్ట్స్ ను మైథిలి బ్లాక్ చేయడం.. అలాగే చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన మైథిలి హఠాత్తుగా మాయం అవడం వెనుక అల్లుకున్న కారణాలు బలహీనంగా అనిపిస్తాయి.
మైథిలి మిస్ అయిన తర్వాత దర్శకుడు నడిపిన కామెడీ డ్రామా సుదీర్ఘం అవడంతో అదేదో సినిమాలో సుత్తి వేలు.. వీరభద్రం గారితో అన్న డైలాగ్ గుర్తుకొస్తుంది. పంజాగుట్ట పోలీస్ ఇన్స్పెక్టర్ ఎపిసోడ్ కానీ, అన్వేష్ అనే పేరుగల ఇంకో ప్రియుడి మీద కోపంతో హాస్పిటల్లో చేరిన అమ్మాయి ఎపిసోడ్లు కానీ ఓవర్ డోస్ ల జాబితాలోకి చేరతాయి.
ఈ ఓవర్ డోస్ కామెడీ జోష్ లో దర్శకుడు మైథిలి సంగతి మర్చిపోయినట్టున్నారు. దాంతో హీరో అన్వేష్ తో పాటు మైథిలి ఏమైపోయిందో ? అని మనం కూడా వెతకడం మొదలుపెడతాం. చివరకు ఎలాగైతేనేమి మైథిలి మళ్ళీ దొరికిందిలే అని అన్వేష్ తో పాటు మనమూ సంతోషపడుతున్న సమయంలో దర్శకుడు క్లైమాక్సుని చెన్నైకి మార్చారు. క్లైమాక్స్ కూడా అంతే.. ఓవర్ డోస్ తో మనల్ని నిరాశ పరుస్తుంది.
సరే కామెడీ సంగతి అలా ఉంచితే, సోషల్ మీడియా ప్రభావం ఈ సినిమా మీద బాగా ఉన్నట్టుంది. అసలు బూతులు చాలవన్నట్టు ఈ మధ్య సోషల్ మీడియాలో కొంతమంది పండితులు పేరడీ బూతులు తయారు చేసి వదులుతున్నారు. రోమాంచకం మూవీలో అలాంటి ఒకట్రెండు పేరడీ బూతు పదాలను వాడారు. ఇది ఫ్యామిలీ ఆడియన్స్ కు కొంచం ఇబ్బంది కలిగిస్తుంది.
ఒక అమ్మాయితో తమిళ పదాన్ని పట్టుకుని కావాలని బూతు అర్థం ధ్వనించేలా చెప్పించడం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ఇక ఈ స్నేహితులు ఐదుగురు గుమికూడి ఒకేసారి బిగ్గరగా అరుచుకునే సన్నివేశాలు రిపీట్ కావడం విసుగు తెప్పిస్తుంది.
ఈ లోపాల సంగతి అలా ఉంచితే స్నేహితుల మధ్య తెలంగాణా యాసలో జరిగే సంభాషణలు ఈ సినిమాకి ప్రధాన బలం. అరే.. య్.. ఏం మనుషుల్రా బై మీరు? అనే డైలాగ్ చాలాసార్లు రిపీట్ అయినా బాగానే ఉంది. అన్వేష్ ఇంట్లో తల్లితండ్రులతో నడిపిన ఫ్యామిలీ డ్రామా రక్తి కట్టింది. కొడుకు మీద తండ్రి విసుక్కోవడం.. బిడ్డ ఆకలి తీర్చడం కోసం తల్లి తపన పడటం.. వంటి సన్నివేశాలు చాలా సహజంగా ఉండి ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయి.
ఎవరెలా చేశారు?
అన్వేష్ పాత్రకు సుమంత్ ప్రభాస్ పూర్తిగా న్యాయం చేశాడు. ఇతడి హావభావాలు బాగుంటాయి. హీరోగా భవిష్యత్తులో ఇంకో మెట్టు పైకి ఎదిగే అవకాశాలు ఉన్నాయి.
మైథిలి పాత్రలో అనంతిక నటన కూడా బాగుంది.
ఈ సినిమాకి మెయిన్ పిల్లర్స్ హీరో స్నేహితులుగా నటించిన నలుగురు కుర్రాళ్ళు. ఈ సినిమాలో హీరోతోపాటు వీళ్ళకి కూడా సమానమైన క్రెడిట్స్ దక్కుతాయి.
సాంకేతికత
వాసుకి వైభవ్ అందించిన సంగీతం బాగానే ఉంది.
పవన్ పప్పుల అందించిన సినిమాటోగ్రఫీ పర్లేదు.
నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.
విశ్లేషణ
కామెడీ జానర్లో మూవీలు ఇష్టపడేవారికి రోమాంచకం సినిమా నచ్చుతుంది. అది కూడా ఫస్టాఫ్ బాగానే ఉంటుంది. సెకండాఫ్ మాత్రం తీసుకునే డోస్ బట్టి ఉంటుంది.
సోషల్ మీడియా లవ్ స్టోరీలకు దర్శకుడు కామెడీ టచ్ అద్ది తెలంగాణా యాసలో రోమాంచకం సినిమాని తెరకెక్కించారు. లవ్ స్టోరీలు అనగానే కట్చీఫులు తడిసిపోయే భావోద్వేగాల సంఘర్షణ, నాలుగు డ్యూయెట్లు.. రెండు ఏడ్పు పాటలు..ప్రియుడు.. ప్రియురాలి మధ్య ఎడబాటు.. క్లైమాక్సులో ట్రాజెడీ చేయడమో , సుఖాంతం చేయడమో వంటి సీరియస్ సినిమాలు మనకి గుర్తుకొస్తాయి కదా.. కానీ దర్శకుడు అలాంటి ఫార్మాట్ జోలికి పోకుండా ప్రేమ కథని లైట్ తీసుకుని కామెడీతో నడిపించేశారు.
ఓవరాల్ గా దర్శకుడు ప్రేమకథని సీరియస్ టోన్ లో కాకుండా సింపుల్గా కామెడీ జానర్లో చెప్పుకుంటూపోయారు . మైనే ప్యార్ కియా , మరోచరిత్ర వంటి డీప్ లవ్ స్టోరీల జోలికి పోకుండా నేటి ఆన్లైన్ ట్రెండుకి తగ్గట్టుగా కథ రాసుకుని తెరకెక్కించారు. ఇందులో హీరో , హీరోయిన్లు చేసే అల్లరే కనిపిస్తుంది కానీ అమర ప్రేమ కనిపించదు. బీర్ల కోసం , బార్ల కోసం మన చుట్టూ చేరి అరేయ్ ఒరేయ్ అంటూ హంగామా , హడావుడి చేసే నలుగురు స్నేహితులే కనిపిస్తారు. ఇదే ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ.
మొత్తానికి ఈ సినిమా ద్వారా మనల్ని ఏడిపించడం కన్నా నవ్వించడానికే దర్శకుడు గట్టి ప్రయత్నం చేశాడు. అట్టి ప్రయత్నాన్ని మాత్రం అభినందించాల్సిందే. కథతో సంబంధం లేకుండా సరదాగా కాసేపు నవ్వుకున్నామా? లేదా? అనుకుని చూసేవాళ్ళకి ఈ మూవీ నచ్చుతుంది.
నటీనటులు: సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్ కుమార్, ఉపేంద్ర లిమాయే తదితరులు
సంగీతం: వాసుకి వైభవ్
సినిమాటోగ్రఫీ: పవన్ పప్పుల
నిర్మాత: సందీప్ రెడ్డి వంగా
దర్శకత్వం: వేణుగోపాల్ రెడ్డి
థియేటర్ విడుదల: 03-09-2026
రేటింగ్: 2.75/5
