Mahendragiri Varahi Movie Review – విలక్షణమైన పాత్రలో బ్రహ్మానందం- మహేంద్రగిరి వారాహి మూవీ రివ్యూ !

Spread the love

సుమంత్ ప్రధాన పాత్రలో నటించిన మహేంద్రగిరి వారాహి మూవీ ( Mahendragiri Varahi movie ) ఈ రోజు శుక్రవారం (11-09-2026) థియేటర్లలో రిలీజ్ అయ్యింది. లక్ష్మణ్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించగా , సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. వెండితెర మీద నవ్వులు పంచే బ్రహ్మానందం ఈ సినిమాలో మాత్రం ఓ డిఫరెంట్ రోల్ లో కనిపిస్తారు.

ఇప్పుడు మహేంద్రగిరి వారాహి మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథేంటంటే?

కథ 1826 నాటి కాలంతో మొదలౌతుంది. 200 సంవత్సరాల క్రితం మహేంద్రగిరి సంస్థానాన్ని ఏలుతున్న జమీందారీ వంశ పాలకుడు అరాచకాలు చేస్తూ ప్రజలను పీడిస్తూ ఉంటాడు. స్త్రీలోలత్వంతో కనిపించిన మహిళలను చెరుస్తుంటాడు.

ఇదిలా ఉండగా మహేంద్రగిరిలోని వారాహి అమ్మవారి దేవాలయ పూజారికి విగ్రహం పాదాల చెంత ఒక పసి బాలిక కనిపించడంతో ఆ పాపకు ముత్యాలమ్మ అని పేరు పెట్టుకుని పెంచుతాడు.

ఆ జమిందారు ముత్యాలమ్మని తన 33 వ జన్మ తిథి నాడు చంపడంతో మహేంద్రగిరి వంశ వారసులు ఎవరైనా సరే సరిగ్గా తమ 33 వ జన్మతిథి నాడు మరణిస్తారని వారాహి అమ్మవారు శాపం పెట్టినట్టు ప్రచారంలోకి వస్తుంది. వారాహి అమ్మవారి శాపం ప్రకారం 200 సంవత్సరాల క్రితం నుంచి ప్రస్తుతం వరకు మహేంద్రగిరి వంశ వారసులు తమ 33 వ జన్మతిథి నాడు అనూహ్యంగా మరణిస్తూ ఉంటారు. వారిలో రాజేంద్ర వర్మ ( సిద్దు జొన్నలగడ్డ), నరేంద్ర వర్మలు కూడా ఉంటారు.

కట్ చేస్తే దేవుళ్ళని, నకిలీ బాబాలను నమ్మని సిద్ధార్థ్ (సుమంత్ ) అనుకోని పరిస్థితుల్లో మహేంద్రగిరి వస్తాడు. అక్కడే తన అన్నను కూడా కోల్పోతాడు. వారాహి అమ్మవారి శాపం గురించి తెలుసుకున్న సిద్ధార్థ్ ఇందులో ఏదో కుట్ర ఉందని అనుమానిస్తాడు.

వారాహి అమ్మవారి శాపం వెనుక ఉన్న అసలు నిజాలు ఏంటి?
మహేంద్రగిరి వంశ వారసులు సరిగ్గా తమ 33 వ జన్మతిథి నాడే మరణించడం వెనుక ఉన్న రహస్యం ఏంటి?
వారాహి అమ్మవారి శాపానికి సిద్దార్ట్ అన్నయ్య మరణానికి ఉన్న లింక్ ఏంటి?
చివరికి మహేంద్రగిరి మిస్టరీ గుట్టు విప్పడానికి సిద్ధార్థ్ ఏం చేస్తాడు? అనేది మిగిలిన కథ.

ఎలా ఉంది?

దేవుళ్ళు, మూఢ నమ్మకాల చుట్టూ అల్లుకున్న క్రైమ్ ఫిక్షన్ కథే మహేంద్రగిరి వారాహి మూవీ. 200 సంవత్సరాల క్రితం తమ వంశస్తులు చేసిన పాపాల ఫలం వారాహి అమ్మవారి శాపం రూపంలో నేటికీ తమను ఎలా వెంటాడుతుందో రాజేంద్ర వర్మ పాత్రకు ఇచ్చిన ముగింపు ద్వారా సినిమా ప్రారంభంలోనే దర్శకుడు నేరుగా చెప్పేశారు.

అయితే అప్పటికి మనకి తెలిసింది అదొక్కటే. ఆ శాపం వెనుక ఉన్న అసలు కారణాలను దర్శకుడు సెకండాఫ్ లో మెల్లిగా రివీల్ చేసుకుంటూ వచ్చారు. ఫస్టాఫ్ లో మాత్రం దర్శకుడు తన కథనాన్ని వారాహి అమ్మవారి శాపం, మహేంద్రగిరి వంశ వారసులను బలిగొనటం చుట్టూనే తిప్పారు.

మధ్యలో మాత్రం దేవుళ్ళు మూఢ నమ్మకాలకు సిద్ధార్థ్ వ్యతిరేకం అని ఎస్టాబ్లిష్ చేయడానికి దర్శకుడు ఇండియా – భూటాన్ బోర్డర్లో బల్విందర్ సింగ్ ఆత్మ అంటూ కొంత డ్రామా నడిపారు. నిజానికి ఈ ఎపిసోడ్ కి మహేంద్రగిరి వారాహి కథకు అసలుకు సంబంధమే ఉండదు. ఒకరకంగా చెప్పాలంటే ఈ ఆత్మల ఎపిసోడ్ కథనాన్ని సాగతీయడానికి పనికొస్తుందే తప్ప దర్శకుడు చెప్పాలనుకున్న కథను రన్ చేయడానికి అవసరం లేదు. నకిలీ ఫకీర్ ఎపిసోడ్ కూడా అంతేకానీ కాస్తలో కాస్త నయం. కథకు కనెక్టివ్ గానే ఉంటుంది.

ఎప్పుడైతే సిద్ధార్థ్ మహేంద్రగిరి వస్తాడో అక్కడ్నుంచి నడిచే కథనం మనల్ని ఎంగేజ్ చేస్తుంది. తన అన్నయ్య మరణానికి, వారాహి అమ్మవారి శాపానికి ఉన్న లింక్ ఏంటో కనుక్కోవడానికి సిద్ధార్థ్ చేసే ఇన్వెస్టిగేషన్ పార్ట్ మనలో కొంత ఉత్సుకతను రేకెత్తిస్తుంది.

ప్రీ క్లైమాక్స్ నుంచి వారాహి అమ్మవారి శాపం వెనుక ఉన్న లోగుట్టును ఒకటొకటిగా విప్పుకుంటూ వచ్చిన దర్శకుడు క్లైమాక్సు ట్విస్ట్ ద్వారా అసలు విషయాన్ని రివీల్ చేసిన తీరు మలయాళం మిస్టరీ సినిమాలను గుర్తు చేస్తుంది.

ముఖ్యంగా బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ పాత్రల ద్వారా దర్శకుడు క్లైమాక్సులో మనల్ని సర్ప్రైజ్ చేస్తాడు. ఆ ట్విస్ట్ ఏంటో ఇక్కడ చెబితే స్పాయిలర్ అవుతుంది. అదేదో థియేటర్లోనే చూస్తే కిక్ వస్తుంది. ఇన్నాళ్ళు వెండితెర మీద బ్రహ్మానందం కనపడగానే మనకు అప్రయత్నంగా నవ్వు వస్తుంది కదా? కానీ ఈ సినిమాలో మనం డిఫరెంట్ బ్రహ్మీని చూస్తాం.

హార్ట్ ఆపరేషన్ అయిన తర్వాత సినిమాలు తగ్గించుకున్న బ్రహ్మానందం తిరిగి ఈ సినిమాలో ఫుల్ లెన్త్ లో విలక్షణమైన పాత్రలో కనిపించారు. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ ల ఆఖరి ఇరవై నిమిషాల నటన ఈ సినిమాకి హైలెట్ అవుతుంది.

కాకపోతే ఈ సినిమా కూడా మలయాళం సినిమాల మాదిరి స్లో నేరేషన్ లో సాగుతుంది. ఒక్కోసారి ఈ స్లో నేరేషన్ మనకి విసుగు తెప్పిస్తుంది. ఇక స్లో నేరేషన్ సంగతి వదిలేస్తే దర్శకుడు సినిమా స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో మూవీని రన్ చేశారు అని చెప్పవచ్చు. అనవసరమైన పాటలు, ఫైట్లు, కామెడీల జోలికి వెళ్లకుండా ఒకే టెంపోలో దర్శకుడు చివరివరకు కథనాన్ని నడిపిన తీరు ఆకట్టుకుంటుంది.

ఎవరెలా చేశారు?

హీరోగా సినీ కెరీర్ మొదలెట్టిన సుమంత్ సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారక్టర్ ఆర్టిస్టుగా దూసుకుపోతున్నారు. ఈ మధ్య వచ్చిన న్యూటన్ థర్డ్ లా మూవీలో కూడా సుమంత్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలాగే మహేంద్రగిరి వారాహి సినిమాలో కూడా సిద్ధార్థ్ పాత్రలో సుమంత్ నటన బాగుంది.

ఎప్పుడూ నవ్వించే బ్రహ్మానందం అవసరమైతే తనదైన సరికొత్త స్టైల్ నటనతో మనల్ని సర్ప్రైజ్ చేయగలడని నిరూపించారు. ఇకనుంచి బ్రహ్మీని విలక్షణమైన పాత్రలలో కూడా చూడొచ్చు.

వెన్నెల కిశోర్ కూడా రొటీన్ కు భిన్నంగా తనదైన మార్క్ చూపించారు.
సిద్దు జొన్నలగడ్డ కనిపించింది కాసేపైనా సాలీడ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.
ఇక ఒకప్పటి హీరో సురేష్ ఇందులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలో మెరిశారు. ఆ మధ్య లావుగా తయారైన సురేష్ ఈ సినిమాలో సన్నబడిపోయారు.
కమెడియన్ ఆలీ కూడా కాసేపే కనిపిస్తాడు.

సాంకేతికత

అనూప్ రూబెన్ అందించిన సంగీతం బాగుంది. వారాహి అమ్మవారి ఆలయం బ్యాక్ డ్రాప్ లో అందించిన బిజిఎం సినిమాకి అదనపు బలాన్ని ఇస్తుంది.
ప్రతాప్ అందించిన సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది కానీ వారాహి అమ్మవారి విజువల్స్ ఇంకా బాగా ఇంపాక్ట్ ఇచ్చేలా శ్రద్ధ పెట్టాల్సింది.
నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

విశ్లేషణ

మూఢనమ్మకాలను అడ్డం పెట్టుకుని మనుషులు ఎలాంటి అరాచకాలు చేస్తారు? అనే లైన్ ఆధారంగా దర్శకుడు కథను అల్లుకుని తెరకెక్కించారు. వారాహి అమ్మవారి ఆలయం కోసం వేసిన సెట్టింగ్ చాలా బాగుంది. కానీ దానికి తగ్గట్టుగా గ్రాఫిక్ వర్క్స్ లేవు. దర్శకుడు గ్రాఫిక్స్ మీద ఇంకొంచం శ్రద్ధ పెట్టి ఉంటే ఇంకా బాగుండేది.

200 సంవత్సరాల నుంచి నేటివరకు మహేంద్రగిరి వంశ వారసులు అనుమానాస్పదంగా మరణిస్తున్నా పోలీసులకు చిన్న క్లూ కూడా దొరక్కపోవడం , హీరో మాత్రం మహేంద్రగిరికి రాగానే అన్నీ తెలిసిపోవడం దర్శకుడి సినిమాటిక్ లిబర్టీ అనుకోవాలి.

అలాగే 33 సంవత్సరాలకు ముందు కొంతమంది ఆర్టిస్టులు ఎలా ఉంటారో 33 సంవత్సరాల తర్వాత కూడా అలాగే ఉంటారు. బ్రహ్మానందానికి 33 సంవత్సరాల క్రితం విగ్గు ఉంటుంది.. తర్వాత ఉండదు.. అంతే తేడా. ఆర్టిస్టుల మేకప్ విషయంలో ఇంకొంచం శ్రద్ధ పెట్టాల్సింది.

ఫస్టాఫ్ లో కేవలం పాత్రల పరిచయానికి , స్టోరీ ఇంట్రడక్షన్ కి కేటాయించిన దర్శకుడు సెకండాఫ్ మాత్రం నేరుగా అసలు కథలోకి తీసుకెళ్తారు. ఆ పరంగా చూసుకుంటే ఫస్టాఫ్ కన్నా సెకండాఫ్ మనల్ని ఎంగేజ్ చేస్తుంది.
ఓవరాల్ గా మహేంద్రగిరి వారాహి సినిమా మనల్ని నిరాశ పరచదు. బాగానే ఉంటుంది.

నటీనటులు : సుమంత్, సిద్దు జొన్నలగడ్డ,వెన్నెల కిషోర్,బ్రహ్మానందం, ఆలీ , రాజీవ్ కనకాల తదితరులు
సంగీతం: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ: ప్రతాప్
నిర్మాత: లక్ష్మణ్
దర్శకత్వం: సంతోష్ జాగర్లపూడి
విడుదల: 11-09-2026
రేటింగ్: 3/5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *