ప్రత్యేక తెలంగాణా సాధించిన ఉద్యమ నేతగా కేసీఆర్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది!

Spread the love

భారతదేశ చరిత్రలో ఎంతోమంది నాయకులు లక్ష్యసాధన దిశగా ఉద్యమాలు చేసారు . అయితే లక్ష్య సాధనలో ఒక్కో నాయకుడిది ఒక్కో పంధా . స్వరాజ్య సాధనలో భాగంగా స్వతంత్ర సంగ్రామంలో మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతంతో పోరాటం చేస్తే , బుల్లెట్ కు బుల్లెట్ తోనే సమాధానం చెప్పాలని భగత్ సింగ్ పోరాటం చేసాడు . ఆజాద్ హింద్ ఫోజ్ పేరిట సుశిక్షుతులైన సైనికులను తయారుచేసుకుని సుభాష్ చంద్రబోస్ పోరాటం చేస్తే , తెల్లవారితో పోరాటానికి గెరిల్లా యుద్ధమే సరైన మార్గమని మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటం చేసాడు .

ఉద్యమ పంధా వేరు కావొచ్చు .. కానీ అందరి లక్ష్యం ఒకటే.. వీరిలో కొందరు ఉద్యమ పోరాటంలో అసువులుబాసి అమరులు అయ్యారు . మరికొందరు ఉద్యమంలో విజయులై చరిత్ర పుటల్లో నిలిచిపోయారు . కానీ చరిత్ర ఉద్యమంలో అమరులు అయినవారికన్నా , ఉద్యమంలో విజయం సాధించినవారినే ఎక్కువగా గుర్తుపెట్టుకుంటుంది . నిజానికి స్వతంత్ర సంగ్రామంలో అసువులుబాసిన అందరికీ చరిత్రలో అదే గుర్తింపు దక్కిందా ? అంటే జవాబు లేని ప్రశ్నగా మిగిలిపోతుంది .

ఇప్పుడీ ఉపాధ్ఘాతం ఎందుకంటే ఈరోజు తెలంగాణా రాష్ట్రం అవతరించిన రోజు .. ఉద్యమకారులు ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని అధికారికంగా సాధించుకున్న రోజు . తరతరాలుగా సాగుతున్న తెలంగాణా ఉద్యమానికి పరిష్కారం లభించిన రోజు . మొట్టమొదటిసారిగా కేసీఆర్ నాయకత్వంలో అవతరించిన ఉద్యమ పార్టీ పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణా సాధించిన రోజు .. పైన చెప్పినట్టు తెలంగాణా ఉద్యమంలో కేసీఆర్ ఎందరో నాయకులు , కవులు , కళాకారులు , సకల జనులు పోరాటం చేసారు . ఈ పోరాటంలో కొందరు అమరులయ్యారు .. మరికొందరు విజయులయ్యారు . అయినా చరిత్ర పుటల్లో మొదటి పేజీలో కేసీఆర్ పేరు ప్రముఖంగా ఉంటుంది .

ఈ ఉద్యమం ఇప్పటికిప్పుడు మొదలైంది కాదు .. దశాబ్దాల క్రితమే మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగింది . అప్పట్లోనే వేలాదిమంది ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయారు .అయినా ప్రత్యేక తెలంగాణా దక్కలేదు . కానీ కేసీఆర్ అనే ఒక బక్కపలచని మనిషి ఈ విజయాన్ని సాధించారు . మహామహులకే సాధ్యం కాని లక్ష్యాన్ని కేసీఆర్ ఎలా సాధించగలిగారు ? ప్రత్యేక తెలంగాణా సాధనలో కేసీఆర్ పన్నిన వ్యూహాలు ఏంటి ? ఆయన ఎంచుకున్న ఉద్యమ పంధా ఎటువంటిది ? అనే విషయాలను ఒకసారి గుర్తుచేసుకుందాం .

కేసీఆర్ రాజకీయ జీవితం

కేసీఆర్ రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీతోనే మొదలయ్యింది . డెబ్భైయ్యవ దశకంలో విద్యార్థి నాయకుడిగా , యువజన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా అప్పట్లోనే కేసీఆర్ చురుకైన పాత్ర పోషించాడు . ఈయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మదన్ మోహన్ ను తన గురువుగా భావించి పార్టీలో అంచలంచలుగా ఎదిగాడు . అయితే తదనంతర కాలంలో తన పొలిటికల్ కెరీర్ కోసం ఏకంగా తన గురువు మదన్ మోహన్ మీదే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు . దాంతో ఆయన పొలిటికల్ కెరీర్ కు తాత్కాలికంగా బ్రేక్ పడింది .

ఈ పరిస్థితుల్లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి ఎన్నికలకు దిగడంతో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టిడిపిలో జాయిన్ అయి 1985 సిద్ధిపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు . కేసీఆర్ రాజకీయ జీవితంలో దక్కిన మొదటి విజయం ఇది . ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు . మొదటిదశలో ఎన్టీఆర్ క్యాబినెట్లో ఆయనకు స్థానం దక్కనప్పటికీ రెండో దశలో మంత్రి పదవి దక్కింది . అక్కడ్నుంచి 1999 వరకు కేసీఆర్ కు వెనుతిరిగి చూసుకునే అవసరం పడలేదు . అయితే టిడిపి చంద్రబాబు నాయకత్వంలోకి రావడం , కేసీఆర్ కు ప్రాధాన్యత తగ్గించి డిప్యూటీ స్పీకర్ పదవికి పరిమితం చేయడం వంటి సంఘటనలు ఆయన కొత్త రాజకీయ ఆలోచనలు చేయడానికి నాంది పలికాయి . ఆ ఆలోచనలనుంచి పుట్టిందే తెలంగాణా రాష్ట్ర సమితి .

టీఆరెస్ ఆవిర్భావం

అనుకున్నదే తడవు కేసీఆర్ యాక్షన్ ప్లాన్ లోకి దిగారు . 2001 ఏప్రిల్ నెలలో టీడీపీ సభ్యత్వానికి , డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి అదే నెలలో హైదరాబాద్ జలదృశ్యం ప్రాంగణంలో తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటును ప్రకటించారు . అయితే కేసీఆర్ ప్రకటనను ఎవరూ పెద్ద సీరియస్ గా తీసుకోలేదు . మహామహులకే సాధ్యం కానిది ఈ బక్కపలచని మనిషి వల్ల ఏం సాధ్యం అవుతుందని అవహేళన చేసారు . కానీ కేసీఆర్ రూటే సెపరేటు .. వ్యూహాలు పన్నడంలో కేసీఆర్ దిట్ట . ఆ విషయం ఆయన్ని హేళనచేసిన వారు తొందర్లోనే తెలుసుకున్నారు .

కేసీఆర్ వ్యూహం

నిజానికి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం కేసీఆర్ కొత్తగా మొదలుపెట్టింది కాదు . దశాబ్దాలనుంచి ఏదోఒక విధంగా ఉద్యమం నడుస్తుంది . కవులు , కళాకారులు తమ జానపదాలతో ప్రత్యేక తెలంగాణా స్ఫూర్తిని గ్రామగ్రామాన రగిలిస్తున్నారు . ప్రొఫెసర్ జయశంకర్ , కోదండరాం వంటి మేధావులు వివిధ వేదికలలో తమ గళాలను వినిపిస్తున్నారు . కానీ ఉద్యమ పోరాటంలో ఎవరి దుకాణం వాళ్లదే . ఎవరి పంధా వాళ్లదే . ప్రచార లోపమో , సమన్వయలోపమో కానీ ఉద్యమ ఆకాంక్షలు పూర్తిగా ప్రజల్లోకి చేరలేదు . సరిగ్గా కేసీఆర్ ఇక్కడే సరైన స్టెప్ తీసుకున్నాడు . ఒంటరిగా పోరాటాలు చేస్తున్న వివిధ గ్రూపులను , నాయకులను ఒక తాటిమీదకు తీసుకువచ్చాడు . టీఆరెస్ రూపంలో వాళ్లందరికీ ఒక వేదిక చూపించాడు . అంతే ఒకరొకరుగా అందరూ టీఆరెస్ వేదిక సాక్షిగా ఉద్యమ పోరాటంలో భాగస్వామ్యులు అయ్యారు . మొదటిదశ వ్యూహంలో కేసీఆర్ విజయం సాధించారు . కేసీఆర్ బలం అమాంతంగా పెరిగింది . ఇప్పుడు కేసీఆర్ ఒంటరి కాదు .. ఆయన వెనుక కవులు ,కళాకారులు , ఉద్యమ గ్రూపులు , మేధావులు చేరారు .

లీడ్ తీసుకున్న కేసీఆర్

స్టెప్ టు లో కేసీఆర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఉద్యమాన్ని నడిపించడంలోనూ , ఉద్యమకారులను సమన్వయం చేయడంలోనూ లీడ్ తీసుకున్నారు . కవులు , కళాకారులను గ్రామగ్రామాన ప్రచారం చేయడానికి అవకాశాలు కల్పించాడు . వివిధ వేదికల ద్వారా ప్రచారం చేసే బాధ్యతను మేధావులకు అప్పగించాడు . మరోపక్క కేసీఆర్ కూతురు కవిత జాగృతి సంస్థ ద్వారా తెలంగాణా సాంస్కృతిక వికాసానికి , పునరుజ్జీవనానికి చురుగ్గా ప్రజల్లో తిరిగింది . తెలంగాణా సంస్కృతికి ప్రతీకలైన బతుకమ్మ వంటి పండుగ వేడుకలను ఊరూవాడా పెద్దఎత్తున చేపట్టడంతో తెలంగాణా ప్రజల్లో కొత్త ఉత్సాహం వచ్చింది . ఈలోపు కేసీఆర్ ఖాళీగా కూర్చోలేదు . తెలంగాణా చరిత్రను , భాషను , యాసను ఔపోసన పట్టేసాడు . బహిరంగ సభల్లో తన వాక్చాతుర్యంతో ప్రజలకు దగ్గర అయ్యాడు . ప్రతిరోజూ ఏదో ఒక కార్యక్రమాలతో ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం మొదలుపెట్టాడు .

రాజకీయ ప్రయత్నాలు

ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో కేసీఆర్ తన ప్రయత్నాలను ఆపలేదు . లక్ష్య సాధన కోసం రాజకీయంగా కూడా దారులు వెతికాడు . 2004 లో సిద్ధిపేట అసెంబ్లీ , కరీమ్ నగర్ లోక్ సభ స్థానం నుంచి గెలిచి ప్రత్యేక తెలంగాణా ఇస్తామన్న హామీతో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో కేసీఆర్ చేరారు . అయినప్పటికీ ప్రత్యేక తెలంగాణా విషయంలో కాంగ్రెస్ పార్టీనుంచి సానుకూల స్పందన రాకపోవడంతో కేంద్రమంత్రి పదవితో పాటు లోక్ సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి ఢిల్లీ వదిలి తిరిగి రాష్ట్రానికి వచ్చి పోరాటం చేయడం మొదలుపెట్టాడు . ఇలా 2008 వరకు ఎన్నికలు , రాజీనామాల చుట్టూ కేసీఆర్ రాజకీయం నడిచింది . ఈ పరిస్థితుల్లో ఉద్యమ తీవ్రతను కేంద్రనాయకుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా కేసీఆర్ కు లభించింది .

ఓయూ విద్యార్థుల ఉద్యమం

నిజానికి తెలంగాణా ఉద్యమంలో రాష్ట్రం మొత్తం జరిగిన పోరాటాలు ఒకెత్తు .. ఒక్క ఓయూలోనే జరిగిన పోరాటం ఒకెత్తు . ఒకరకంగా చెప్పాలంటే ఉద్యమ ప్రభావం హైద్రాబాదులో మినహా మిగిలిన జిల్లాల్లో కానీ , గ్రామాల్లో కానీ అంతగా ఏమీ లేదు . కానీ ఓయూ విద్యార్థులు చేసిన పోరాటాలు టీవీల్లో చూసినవారికి ఒళ్ళు గగుర్పొడుస్తుంది . పోలీసుల తుపాకీ గుళ్లకు ఎదురెళ్లి మరీ ఓయూ స్టూడెంట్ నాయకులు పోరాటాలు చేసారు . ఓయూ క్యాంపస్లో జరిగిన పోరాటాలు టీవీల్లో చూసినవాళ్ళకి సరిహద్దులో యుద్దాలు జరుగుతున్నాయా ? అన్న అనుమానం వస్తుంది . ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లింది .. ఉద్యమ పోరాటాన్ని అత్యంత ప్రచారంలోకి తెచ్చింది ఓయూ విద్యార్థులే . ప్రత్యేక తెలంగాణా సాధనలో కేసీఆర్ నాయకత్వ పటిమ ఎంత ఉందో , ఓయూ విద్యార్థుల పోరాట పటిమ అంతే ఉంది . వీళ్ళ పోరాట స్పూర్తితో వీధుల్లోకి దిగి పోరాటాలు చేసి అసువులుబాసిన శ్రీకాంతాచారి లాంటి ఎందరో ఉద్యమకారుల త్యాగాలు కూడా ఉన్నాయి . కేసీఆర్ మరియు తెలంగాణా సమాజం ఓయూ విద్యార్థులకు , అసువులు బాసిన అమరులకు రుణపడి ఉండాలి .

కేసీఆర్ నిరాహారదీక్ష – తెలంగాణా రాష్ట్ర సాధన

ప్రత్యేక తెలంగాణా బిల్లును పార్లమెంటులో పెట్టి ఆమోదించాలని డిమాండ్ చేస్తూ 2009 నవంబర్ 29 కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రకటన చేసారు . పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి జైలుకు తరలించడంతో కేసీఆర్ జైలులోనే నిరాహారదీక్ష కంటిన్యూ చేయడంతో పోలీసులు ఆసుపత్రిలో చేర్చారు . ఆసుపత్రిలో కూడా నిరాహారదీక్ష కొనసాగించడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది . కేసీఆర్ పదకొండు రోజుల నిరాహారదీక్ష తో దిగొచ్చిన కేంద్రం ప్రత్యేక తెలంగాణా కు ఆమోదం తెలిపి ప్రక్రియ మొదలుపెట్టింది . ఆ విధంగా దశాబ్దాలుగా ఎదురుచూసిన తెలంగాణా ప్రజల కల ఒక బక్కపలచని వ్యక్తి పోరాటంతో నెరవేరింది . 2014 జూన్ రెండున తెలంగాణా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసారు . ఈరోజు తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు .


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!