ఓటిటిలోకి వచ్చిన లోకేశ్ కనగరాజ్ DC మూవీ ఎలా ఉందంటే?- (DC Movie Review)

Spread the love

లోకేష్ కనగరాజ్ DC మూవీ రివ్యూ అండ్ రేటింగ్

నటీనటులు : లోకేశ్ కనగరాజ్ , వామికా , సంజనా కృష్ణమూర్తి తదితరులు
సంగీతం : అనిరుధ్
సినిమాటోగ్రఫీ : ముఖేష్
నిర్మాత : కళానిధి మారన్
దర్శకత్వం : అరుణ్ మాదేశ్వరన్
ఓటిటి : సన్ నెక్స్ట్
స్ట్రీమింగ్ :(04-09-2026)
రేటింగ్ : 2 .75 / 5

తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ DC (DC Movie) ఈరోజు నుంచి (సెప్టెంబర్,4 2026) ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అవుతుంది. గత నెలలో (ఆగస్టు 7, 2026) థియేటర్లలో రిలీజ్ అయిన ఈ తమిళ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ కలెక్షన్లతో దూసుకుపోయింది. ఇప్పుడు అదే సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్లో ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చింది.

లోకేశ్ కనగరాజ్ తలైవా రజనీ కాంత్ కి వీరాభిమాని. ఇటీవల తన దర్శకత్వంలోనే కూలీ సినిమా తీసి హిట్ కొట్టాడు. దర్శకుడిగా హిట్ కొట్టిన లోకేశ్ కనగారాజ్ ఇప్పుడు DC మూవీతో వెండితెర మీద హీరోగా మెరిశాడు. ఇప్పుడు DC మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథేంటంటే?

తన తల్లిని చంపినవాళ్ళని మర్డర్ చేసి జైలు జీవితం అనుభవిస్తున్న దేవదాస్ (లోకేశ్ కనగరాజ్) అక్కడ్నుంచి తప్పించుకుని సర్కార్ గ్యాంగులో చేరతాడు. దేవదాస్ తన గ్యాంగుతో ఆయుధాలతో వెళ్తున్న పోలీస్ వ్యాన్ మీద దాడి చేసి అందులో ఉన్న తుపాకులను ఎత్తుకుపోతాడు.

ఇదిలా ఉండగా కొడుకు చదువుల కోసం ఓ తండ్రి తన పొలం అమ్మి ఆ డబ్బులతో పట్నం వెళ్తుండగా దారిలో ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ చూసి దౌర్జన్యంగా అతడి దగ్గర్నుంచి డబ్బులు లాక్కుని చంపేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న అతడి తండ్రి తన కొడుకుని పోలీసులు అన్యాయంగా చంపేశారని , మనవడిని చదివించాలంటే తనకు ఆ డబ్బులు అవసరమని దేవదాస్ దగ్గరికి వచ్చి చెప్పుకుని కన్నీరు పెట్టుకుంటాడు.

దాంతో ఎస్సై నుంచి ఆ డబ్బులను వసూలు చేసి అతడికి ఇప్పించే బాధ్యత దేవదాస్ తీసుకుంటాడు. ఈ క్రమంలో దేవదాస్ ఎస్సై దగ్గర్నుంచి ఆ డబ్బులను వసూలు చేసి అతడ్ని చంపేస్తాడు. పోలీసుల ఆయుధాలు దొంగతనం జరగడం , వెంటనే ఎస్సై మర్డర్ జరగడంతో పోలీస్ అధికారులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని కేసును ఇన్వెస్టిగేట్ చేసే బాధ్యతను ఇన్స్పెక్టర్ భోగరాజ్ కు అప్పచెబుతారు.

ఈ కేసులో ఇన్స్పెక్టర్ భోజరాజ్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టడంతో దేవదాస్ తన గ్యాంగుతో కలిసి కొంతకాలం పోలీసులకు దొరక్కుండా ఉండటానికి ఓ లాడ్జిలో తలదాచుకుంటాడు. అక్కడ బార్ లో పాటలు పాడే పార్వతితో (సంజనా కృష్ణమూర్తి ) పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతున్న సమయంలో ఇన్స్పెక్టర్ భోగరాజ్ స్పెషల్ టీమ్ తో ఆ లాడ్జీలోకి ఎంటర్ అవుతాడు.

అప్పుడు ఏమౌతుంది? దేవదాస్ పోలీసులకు దొరికిపోతాడా? ఈ దాడిలో పార్వతి ఏమౌతుంది? ఈ సంఘటన తర్వాత దేవదాస్ జీవితంలోకి చంద్ర ( వామికా ) రావడంతో ఎటువంటి పరిణామాలు జరుగుతాయి? అనేది మిగిలిన కథ.

ఎలా ఉంది?

కథలా చెప్పుకోవాలంటే DC లో పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. కథనం గురించి చెప్పుకోవాలంటే మాత్రం చాలా ఉంది. కథ గురించి సింపుల్గా చెప్పాలంటే పోలీస్.. క్రిమినల్ ఆటల మధ్యలో ఓ గులాబీ ప్రేమ ఎంటర్ అయితే ఏమౌతుంది? పిస్తోలుకి , గులాబీకి మధ్య ప్రేమ అల్లుకుని రాసుకున్న కథ ఇది.

సాధారణంగా లవ్ స్టోరీలన్నీ గ్రీనరీ చుట్టూ తిరుగుతాయి. కానీ ఇందులో మాత్రం ఎరుపు చుట్టూ తిరుగుతుంది. పొద్దున లేస్తే తుపాకీ పట్టుకుని మర్డర్లు చేస్తూ సిల్వర్ స్క్రీన్ ను ఎరుపెక్కించేవాడి జీవితంలోకి ఓ గులాబీ బాల ఎంటర్ అయితే ఎలా ఉంటుంది? అనే ఆలోచనకు ప్రతి రూపమే DC మూవీ. అందుకే దర్శకుడు క్లైమాక్సులో సింబాలిక్ గా పిస్టల్ మీద గులాబీ పెట్టినట్టున్నారు.

అలా అని ఈ సినిమాని పూర్తిగా లవ్ స్టోరీ క్యాటగిరీలోకి వేయలేం. హీరో.. హీరోయిన్లు పార్కుల చుట్టూ తిరుగుతూ డ్యూయెట్లు పాడుకోవడం ఏమీ ఉండదు. కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని ఊసులు చెప్పుకోవడాలు అసలే ఉండవు. అసలు తమది ప్రేమో కాదో కూడా వాళ్ళకే సరిగా తెలీదు. చివరివరకు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. సరే వాళ్ళ ప్రేమల వరకు బాగానే ఉంది. ఈ లవ్ స్టోరీ మొత్తాన్ని గ్యాంగ్ వార్ చుట్టూ తిప్పడం మాత్రం మనకు విసుగు తెప్పిస్తుంది.

ఎంతసేపూ ఆ దేవదాస్ తన ప్యాంటులో పిస్తోలు పెట్టుకోవడం, వీలున్నప్పుడల్లా తాగడం , మధ్య మధ్యలో కొన్ని మర్డర్లు చేసుకుంటూ పోవడం , పోలీసుల ఛేజింగుల నుంచి తప్పించుకోవడాలు వంటి కార్యక్రమాలను పనిగా పెట్టుకుంటాడు.

ఈ యజ్ఞంలో అతడి పక్కన చేరి తుపాకులు అందివ్వడం చంద్ర తన పనిగా పెట్టుకుంటుంది. ఇక భోగరాజ్ అనే ఇన్స్పెక్టర్ చివరివరకు వీళ్ళని ఛేజ్ చేసే పనినే పనిగా పెట్టుకుంటాడు. ఇంతా చేసి క్లైమాక్సులో ఆ క్యారెక్టర్ పడుకుంటుంది. దాదాపు సెకండాఫ్ అంతా కథనం ఇదే ఫార్మాట్లో రన్ అవుతుంటుంది. ఫైట్, మర్డర్, ఛేజింగ్ ఫార్మాట్లో సెకండాఫ్ రన్ అవుతుండటంతో కొంత విసుగు వస్తుంది. మొదట్లో పోలీసులు కొట్టేసిన సొమ్ములు అతడి తాత చేతిలో హీరో పెట్టడానికి క్లైమాక్స్ వరకు ఇంత తతంగం చూడాలి.

మార్చిలో ఫెయిల్ అయినవాడికి సెప్టెంబరులో సప్లిమెంటరీ రాసుకునే అవకాశం ఉన్నట్టు ఇందులో హీరో కూడా పోలీసుల వల్ల ఫస్ట్ అటెంప్ట్ లో ఫెయిల్ అయిన తన ప్రేమను సెకండ్ అటెంప్ట్ లో చంద్ర ద్వారా దక్కించుకుంటాడు. ఇదో డ్యూయల్ ప్రేమ. అంటే ఒక మొబైలులో రెండు సిమ్ముల మాదిరి అన్నమాట. ఒకటి పాడైతే ఇంకోటి వాడుకోవచ్చు.

అసలుకు ఫస్టాఫ్ లో దేవదాస్ తో పాటు మనమూ ఆ విజయవాడ అమ్మాయి పార్వతి తో కనెక్ట్ అవుతున్న సమయంలో దర్శకుడు బ్రేకింగ్ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో తెలీదు. దాని తర్వాత రెండో అమ్మాయి చంద్ర రాకతో స్టోరీలో మళ్ళీ రీ కనెక్ట్ అవడానికి కొంత సమయం పట్టింది. నిజానికి ఇదే స్టోరీని ఆ విజయవాడ అమ్మాయితో కూడా నడిపించొచ్చు. కొత్తగా వైజాగ్ అమ్మాయి చంద్రను దింపాల్సిన అవసరం లేదు.

ఈ సినిమాలో దర్శకుడు చేసిన గొప్ప పని ఏంటంటే హీరో క్యారక్టర్ పెర్ఫెక్ట్ గా రాసుకున్నాడు. హీరో తాగుతాడు.. మర్డర్లు చేస్తాడు.. కానీ ఆడవాళ్ళకి గౌరవం ఇస్తాడు. ఆడవాళ్లలో తన తల్లిని చూసుకుంటాడు.

పార్వతిని అయినా, చంద్రని అయినా కనీసం తాకను కూడా తాకడు. వేశ్య వృత్తిలో ఉన్న చంద్రని అందరూ ఆకలి చూపులు చూసినా దేవదాస్ మాత్రం ఆమెను ప్రేమతో చూస్తాడు. దేవదాస్.. చంద్రల క్యారక్టర్ల మధ్య దర్శకుడు చక్కటి అనుబంధాన్ని మాత్రమే చూపించిన విధానం బాగుంది.

వేశ్య పాత్ర అయినా ఎక్కడా వల్గారిటీ జోలికి పోకుండా చంద్ర పాత్రను మలచిన తీరు కూడా బాగుంది. ఎంత వేశ్య జీవితం గడిపినా ఆమెలో కూడా మాతృత్వం ఉంటుంది. అమ్మ మనసు ఉంటుంది. తనకు జీవితంలో గర్భం రాకుండా చేసాడని ఆమె కసిదీరా డాక్టర్ ను చంపిన సన్నివేశం సినిమాకి హైలెట్ అవుతుంది.

ఎవరెలా చేశారు?

ఈ సినిమాలో మనకి హీరో కనిపించడు.. దేవదాస్ మాత్రమే కనిపిస్తాడు. ఒకవేళ హీరో కనిపించి ఉంటే అప్పుడే సినిమా గాల్లో కలిసిపోయేది. హీరోయిజం కనిపించదు.. ఒక మామూలు గ్యాంగ్ స్టర్ కనిపిస్తాడు.

నిజం చెప్పాలంటే లోకేష్ కనగరాజ్ ని హీరోగా పెట్టి సినిమా తీయాలంటే సాహసమే అని చెప్పాలి. కానీ దర్శకుడు అతడి పాత్రను పెర్ఫెక్ట్ గా డిజైన్ చేసుకున్న తర్వాతనే ఆ సాహసం చేశాడనిపిస్తుంది. డీ గ్లామర్ తో హీరో పాత్ర నడపాలంటే అందుకు కొన్ని ఈక్వేషన్స్ సరిపోవాలి. దర్శకుడి ఈక్వేషన్స్ వమ్ము చేయకుండా లోకేష్ కనగరాజ్ తన పాత్రకు న్యాయం చేశాడు.

ఇక చంద్ర పాత్రలో వామిక ఒదిగిపోయింది. ముఖ్యంగా డాక్టర్ ను చంపే సన్నివేశంలో ఆమె నటనకు పూర్తి మార్కులు పడతాయి. అలాగే పార్వతి పాత్రలో సంజనా కృష్ణమూర్తి నటన బాగుంది.

ఇక కొన్ని సన్నివేశాల్లో ఇన్స్పెక్టర్ భోగరాజ్ ను చూస్తుంటే వెన్నెల కిషోర్ డూప్ ఏమో అని అనుమానం వస్తుంది. అయినా పోలీస్ ఆఫీసర్ గెటప్ లో బాగానే నటించాడు.

సాంకేతికత

అనిరుధ్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్ అవుతుంది. కొన్ని సన్నివేశాల్లో అతడు అందించిన బీజీఎం మంచి హైప్ ఇస్తుంది.
ముఖేష్ అందించిన సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది.
కళానిధి మారన్ రేంజులో కాకపోయినా నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి.

విశ్లేషణ

యాక్షన్, థ్రిల్లర్ జానర్ మూవీలు ఇష్టపడేవాళ్లకి DC మూవీ నచ్చుతుంది. ఫస్టాఫ్ లో పాత్రల పరిచయానికి, దేవదాస్, సింగర్ ల మధ్య చిన్న లవ్ ట్రాక్ నడపడానికి కేటాయించిన దర్శకుడు సెకండాఫ్ మాత్రం దేవదాస్,చంద్రల చుట్టూనే కథ నడిపారు.

కాకపోతే ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ పూర్తి యాక్షన్ మోడ్ లోనే కథనం రన్ అవుతుంది. ఈ క్రమంలో వచ్చే కొన్ని యాక్షన్ సన్నివేశాలు థ్రిల్ పంచకపోగా విసుగు తెప్పిస్తాయి. హిట్ అండ్ రన్ మాదిరి రిపీటెడ్ సీన్స్ రావడంతో కథ అక్కడక్కడే తిరుగుతున్న ఫీలింగ్ వస్తుంది. అన్నట్టు DC అంటే దేవదాస్ , చంద్ర అని దర్శకుడి భావం అని మనం అర్ధం చేసుకోవాలి.

ఓవరాల్ గా సినిమా అంతా పక్కా కమర్షియల్ ఫార్మాట్లో రన్ అవుతుంది. క్లైమాక్స్ కూడా మనం ఊహించిన విధంగానే ఉండటంతో కొత్తదనం అనిపించదు. యాక్షన్ థ్రిల్లర్ జానర్లో ఫక్తు కమర్షియల్ సినిమా చూడాలనుకునేవారు సన్ నెక్స్ట్ ఓటిటిలో DC సినిమాని తెలుగులో చూడొచ్చు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *