ప్రస్తుతం తెలంగాణా రాజకీయాల్లో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వివాదం ఉత్కంఠత రేపుతుంది.సురేఖ వ్యవహారంలో సుదీర్ఘ చర్చలు , వివరణల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఆమెను పదవినుంచి తప్పించేందుకు రంగం సిద్ధం చేసింది. తన వాదన వినిపించడానికి సురేఖ ఢిల్లీ పెద్దలను కలిసినా ఉపయోగం లేకుండా పోయింది. అంతిమంగా అధిష్టానం రేవంత్ మాటకే విలువిచ్చింది. తాజా సమాచారం ప్రకారం సీఎం ఆదేశాలతో కొండా సురేఖను బర్తరఫ్ చేయడానికి రంగం సిద్ధం అవుతుంది.
ఈ నేపథ్యంలో అసలు కొండా సురేఖ వివాదం ఎప్పుడు మొదలైంది? సీఎం రేవంత్ మీద కూతురు చేసిన ఆరోపణలను ఆమె ఎందుకు ఖండించలేదు? ఈ పరిస్థితుల్లో రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? బీసీ వర్గానికి చెందిన మహిళా క్యాబినెట్ మంత్రిని బర్తరఫ్ చేస్తే తెలంగాణా రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయి? ఈ విషయంలో రేవంత్ మాస్టర్ ప్లాన్ ఏంటి ? అనే విషయాలను ఒకసారి విశ్లేషణ చేసుకుందాం.
జీవన్ రెడ్డితో మొదలైన కుదుపు
ఆ మధ్య సీనియర్ నేత జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ నాయకత్వానికి వ్యతిరేకంగా ధ్వజమెత్తి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ లో చేరిన విషయం అందరికీ తెలిసిందే.
అయితే జీవన్ రెడ్డి వివాదం తెలంగాణా కాంగ్రెస్ రాజకీయాల మీద ఆశించిన ప్రభావం చూపలేదు. ఆయన రాజీనామా రేవంత్ సర్కార్ మీద కూడా ఎటువంటి ప్రభావం చూపలేదు. ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం రేవంత్ వైపే నిలబడటంతో రాజకీయంగా ఆ వివాదంలో జీవన్ రెడ్డి సాధించింది శూన్యం అయ్యింది.
ఎలాగైతేనేమి జీవన్ రెడ్డి వివాదం ముగిసిపోయింది అనుకుంటున్న తరుణంలో తాజాగా మొదలైన క్యాబినెట్ మంత్రి కొండా సురేఖ వివాదం రేవంత్ సర్కార్ ను ఇరుకున పడేసింది.
రేవంత్ వర్సెస్ కొండా సురేఖ వివాదం ఎలా మొదలైంది?
సీఎం రేవంత్.. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ల మధ్య వివాదం ఇప్పుడు మొదలైంది కాదు. సమ్మక్క సారలక్క జాతర కాంట్రాక్ట్ పనుల్లో జరుగుతున్న అవినీతి పనులు సీఎం దృష్టికి రావడంతో ఆయన జాతర కాంట్రాక్ట్ పనులు పారదర్శకంగా నిర్వహించే బాధ్యతను మరో మంత్రి సీతక్కకు అప్పగించారు. సహజంగా ఈ పరిణామాలు సురేఖ అసంతృప్తికి కారణం అయ్యింది.
అప్పుడే రేవంత్ తీరు మీద సురేఖ తన అసంతృప్తిని పార్టీ అంతర్గత వేదికల్లో వ్యక్తం చేశారు. దీనికి తోడు అవినీతి ఆరోపణల మీద మంత్రి పీఏ పైన పోలీసులు కేసు నమోదు చేయడంతో రేవంత్.. సురేఖల మధ్య విభేదాలు బయటపడ్డాయి. అప్పుడే మొదటిసారిగా కొండా సురేఖ కూతురు సుష్మిత పోలీసుల తీరును దుయ్యబడుతూ సీఎం రేవంత్ ను కూడా బహిరంగంగా విమర్శించారు.
రేవంత్ పై మరోసారి విమర్శలు చేసిన సుష్మిత
ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అయితే ఆయన పర్యటనలో మంత్రి కొండా సురేఖ పాల్గొనకపోవడం చర్చనీయాంశం అయ్యింది.
సీఎం పర్యటనలో భాగంగా పరకాలలో జరిగిన బహిరంగ సభలో రాబోయే ఎన్నికల్లో తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కే పార్టీ టికెట్ ఇవ్వడం జరుగుతుందని ప్రకటించారు.
పరకాల టికెట్ ఆశిస్తున్న సుష్మితకు రేవంత్ ప్రకటన ఆగ్రహం తెప్పించింది. దాంతో ఆమె పరకాలలోనే జరిగిన వేరే కార్యక్రమంలో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పరకాల స్థానం నుంచి తానే పోటీ చేస్తానని.. అసలు పరకాలలో ఎవరికి టికెట్ ఇవ్వాలో నిర్ణయించడానికి రేవంత్ ఎవరు? తమ్ముడి షెల్ కంపెనీకి రేవంత్ 200 కోట్లు ధారాదత్తం చేశారని నేరుగా సీఎం ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదం అయ్యింది.
సీఎం రేవంత్ ఆగ్రహం
సుష్మిత చేసిన వ్యాఖ్యల పట్ల సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుష్మిత ఆరోపణలను రేవంత్ ఎంత సీరియస్ గా తీసుకున్నారంటే లండన్ పర్యటనలో ఉండి కూడా అప్పటికప్పుడు కొంతమంది ఎమ్మెల్సీలతో హైదరాబాదులో మీడియా సమావేశం ఏర్పాటు చేయించి కూతురి విషయంలో మంత్రి సురేఖ తీరును తప్పు పడుతూ ఖండించారు.
టీపీసీసీ కూడా సుష్మిత వాఖ్యలను సీరియస్ గా తీసుకుంది.
మామూలుగా అయితే మంత్రిని పిలిపించి మాట్లాడేవారేమో? కానీ ఈ ఇష్యూని రేవంత్ సీరియస్ గా తీసుకోవడంతో కొండా సురేఖ కు క్రమశిక్షణా కమిటీ నోటీస్ కూడా ఇచ్చింది. అయితే కూతురు చేసిన వ్యాఖ్యలకు తనకు నోటీస్ ఇవ్వడం సరికాదని క్రమశిక్షణా కమిటీకి ఆమె లేఖ రాయడంతో వేదిక ఢిల్లీకి మారింది.
రేవంత్ కి రాఖీ కట్టిన కొండా సురేఖ
ఒకపక్కన ఈ వివాదం నడుస్తుండగానే కొండా సురేఖ స్వయంగా రేవంత్ ఇంటికి వెళ్లి ఆయనకు రాఖీ కట్టడంతో ఇద్దరి మధ్య రాజీ కుదిరిందేమోనని పార్టీ వర్గాలు కూడా ఆశ్చర్యపోయాయి. కానీ అది నివురుగప్పిన నిప్పు మాత్రమే అని సురేఖ ఢిల్లీ పర్యటనతో తేలింది.
ఢిల్లీ పర్యటనలో మారిన సురేఖ స్వరం
అప్పటిదాకా కూతురి వాఖ్యలతో తనకు సంబంధం లేదని చెప్తూ వచ్చిన సురేఖ ఢిల్లీలో ఖర్గే తదితర పార్టీ పెద్దలను కలిసిన తర్వాత తన స్వరం మార్చింది. పదేళ్లు తనను తాను సీఎం అని రేవంత్ ఎలా ప్రకటించుకుంటారని నేరుగా విమర్శనాస్త్రాలు సంధించింది.
ఆమె అంతటితో ఆగలేదు. ఒకవేళ తన మీద చర్యలు తీసుకోవాలని అధిష్టానం ఆలోచిస్తే తన వెనుక ఉన్న 16 శాతం సామాజిక వర్గాన్ని కూడా దృష్టిలో పెట్టుకోమని బీసీ కార్డ్ బయటికి తీసి మరీ నేరుగా హెచ్చరిక జారీ చేశారు.
ఈ సాయంత్రం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన కొండా సురేఖ
ఢిల్లీ పర్యటనతో కొండా సురేఖ కు అధిష్టానం ఆలోచన చూచాయగా తెలిసిపోయింది. అధిష్టానం తన రాజీనామా కోరడంతో ఆమె స్ట్రాటజీ మారిపోయింది. అధిష్టానం మాట విని మంత్రి పదవికి రాజీనామా చేయాలా ? లేకపోతే మంత్రి పదవితో పాటు శాసన సభ్యత్వానికి , పార్టీకి కూడా రాజీనామా చేయాలా ? తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలి? అనే విషయాల్లో అనుచరుల అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఈ మధ్యాహ్నం 2 గంటలకు తన నివాసంలో అనుచరులు, కార్యకర్తలతో సురేఖ సమావేశం ఏర్పాటు చేశారు.
నిజానికి ఈ విషయంలో ఆమె ఇప్పటికే తుది నిర్ణయానికి వచ్చారని రాజకీయ వర్గాల్లో టాక్. రాజీనామా బదులు బర్తరఫ్ అయితేనే ప్రజల్లో సానుభూతి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆమె భావిస్తున్నారు. అందుకే తన నిర్ణయాన్ని అనుచరులకు చెప్పిన తర్వాతనే 3 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
సురేఖ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది?
ఒకవేళ ప్రభుత్వం తనని బర్తరఫ్ చేస్తే శాసన సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి ఆ స్థానంలో కొండా సురేఖ తన కూతుర్ని దింపే అవకాశం ఉంది. అయితే తన కూతురి రాజకీయ భవిష్యత్తు కోసం బిఆర్ఎస్ లోకి వెళ్లాలా ? లేకపోతే బిజెపిలోకి వెళ్లాలా ? అనే అంశం మీద కూడా ఈ సాయంత్రం ఆమె నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాజకీయాల్లో సుదీర్ఘ కాలం క్రియాశీలక పాత్ర పోషించిన కొండా సురేఖ ఇకపై తన కూతురు సుష్మిత రాజకీయ భవిష్యత్తు మీద దృష్టి పెట్టొచ్చు.
అధిష్టానం కఠిన నిర్ణయం ఎందుకు తీసుకుంది?
క్యాబినెట్ మంత్రి అయ్యుండి ఏకంగా సీఎం మీదనే ఆమె కూతురు ఆరోపణలు చేయడం, ఈ విషయంలో తనకేం సంబంధం లేదన్నట్టు కొండా సురేఖ తన వాదనలు వినిపించడం ఏ రాజకీయ పార్టీ అధిష్టానానికి నచ్చదు. బహిరంగ వేదికల మీద చేసిన ఈ ఆరోపణల ప్రభావం తమ పార్టీ , ప్రభుత్వం మీద కూడా పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆమె రాజీనామాకు పట్టుబడతారు.
ప్రభుత్వం మీద కానీ , పార్టీ మీద కానీ బహిరంగంగా ఆరోపణలు చేస్తే ఉపేక్షించేది లేదని గతంలో రాహుల్ గాంధీ పార్టీ వేదికల్లో పలుమార్లు శ్రేణులను హెచ్చరించారు. సురేఖ నేరుగా ఆరోపణలు చేయకపోయినా కూతురి ఆరోపణలకు బాధ్యత తీసుకోకపోవడంతో ఈ వివాదంలో ఆమె పరోక్ష మద్దతు కూడా ఉందని అందరికీ అర్థమైంది. అందుకే రేవంత్ తో భేటీ అయిన తర్వాత రాహుల్ గాంధీ కూడా ఆమె బర్తరఫ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
రేవంత్ కార్యాచరణ ఎలా ఉంటుంది?
సురేఖ వ్యవహారంలో రేవంత్ కార్యాచరణ లండన్ లోనే నిర్ణయమైపోయింది. అందుకే క్షణం ఆలస్యం చేయకుండా అక్కడనుంచే మంత్రాంగం నడిపి హైద్రాబాదులో ఎమ్మెల్సీలతో ప్రెస్ మీట్ పెట్టించి కొండా సురేఖ తీరును తప్పు పట్టించారు. ఈ విషయంలో ఆమె సామాజిక వర్గానికి చెందిన వారి నుంచే వ్యతిరేకత రావడం , తనకు మద్దతుగా ఎవరూ ముందుకు రాకపోవడంతో సురేఖ డిఫెన్సులో పడ్డారు.
దాంతో ఢిల్లీ పోయి అధిష్టానం పెద్దలను కలిసి రేవంత్ మీద ఆరోపణలు చేసినా అవి పెద్దగా వర్కౌట్ కాలేదు. పైగా పదేళ్లు రేవంత్ తనని తాను సీఎంనని ఎలా చెప్పుకుంటారని ? ప్రశ్నిస్తూ ఆమె చేసిన ఆరోపణల్లో కూడా పెద్ద పస లేదు. నిజానికి ఇది ఇప్పటిదాకా ఢిల్లీ పెద్దలకు తెలియని విషయం కాదు.
పార్టీ అధినేతలుగా కేసీఆర్ కానీ , వైఎస్ జగన్మోహన రెడ్డి కానీ ముప్పై ఏళ్ళు తామే రాష్ట్రానికి సీఎంలమని చెప్పుకున్నారంటే అర్ధం ఉంది. కానీ ఒక జాతీయ పార్టీలో రాష్టానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్ పదేళ్లు తానే ముఖ్యమంత్రిని అని చెప్పుకున్నారంటే ఖచ్చితంగా ఢిల్లీ పెద్దలకు తెలిపిన తర్వాతనే ప్రకటన చేసి ఉంటారని ఎవరికైనా అర్ధమౌతుంది. పైగా రాహుల్ గాంధీ రోజూ తనతో వాట్సాప్ చాట్ లో ఉంటారని రేవంత్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రాహుల్ గాంధీ సంపూర్ణ మద్దతు లేకుండా రేవంత్ అలాంటి ప్రకటనలు చేయలేడనేది బహిరంగ రహస్యం.
సురేఖ బాటలో మరికొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఇలాంటి ఆలోచన చేస్తే అసలుకే మోసం వస్తుందన్న సంగతి రేవంత్ కు బాగా తెలుసు. అందుకే ఈ సమస్య పరిష్కారం కావడం అధిష్టానానికన్నా రేవంత్ కే ఎక్కువ అవసరం. తిరుగులేని తన నాయకత్వానికి సురేఖ రూపంలో ప్రశ్న ఎదురైందని కూడా ఆయనకు తెలుసు.. అందుకే ఆ ప్రశ్నకు సమాధానం కూడా ఆయన రెడీ చేసుకుని సిద్ధంగా ఉన్నారు.
అందుకే రేవంత్ తన దగ్గర ప్లాన్ బి ఎప్పుడూ రెడీగా ఉంచుకుంటారు. ఎప్పుడైతే ఢిల్లీలో కొండా సురేఖ బీసీ కార్డు బయటికి తీసిందో రేవంత్ అప్పటికప్పుడు చకచకా పావులు కదిపారు. రాష్ట్రంలో ఉన్న బీసీ నాయకులతో టచ్ లోకి వచ్చారు. బీసీ నాయకులకు నామినేటెడ్ పదవుల పందేరానికి తెర తీశారు. ఆఘమేఘాల మీద లిస్ట్ కూడా రెడీ అయిపొయింది. దాంతో బీసీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు.
ముగింపు
తెలంగాణా రాజకీయాల్లో ఉత్కంఠత రేపుతున్న ఈ వివాదంలో కొండా సురేఖ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుంది అనేది కాసేపట్లో తెలుస్తుంది.
