Arulvaan Movie Review – ఫీల్ గుడ్ మూవీ!

Spread the love

ఈ మధ్య కాలంలో వచ్చిన చక్కటి ఫీల్ గుడ్ మూవీలలో అరుల్వాన్ మూవీ ఒకటి (Arulvaan Movie). జులై 17 న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ తమిళ్ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సెప్టెంబర్ 4 , 2026 నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో తమిళ్ వెర్షన్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో స్ట్రీమింగ్ అవుతుంది.

అందమైన కొండ ప్రాంతాల్లో కథనాన్ని నడిపిస్తూనే చదువు ప్రాముఖ్యత గురించి చక్కటి సందేశం ఇస్తూ దర్శకుడు చిత్రాన్ని మలిచిన తీరు ఆకట్టుకుంటుంది. ఇప్పుడు అరుల్వాన్ మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథేంటంటే?

తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న ఓ కొండల్లో కురుంజి అనే ట్రైబల్ బాలిక తన తల్లితండ్రులతో కలిసి నివసిస్తూ ఉంటుంది. వీరితో పాటు కొండమీద అతికొద్ది మంది ట్రైబల్ కుటుంబాలు మాత్రమే ఉంటాయి. కొండల్లో మష్రూమ్ పంటలు పండించి అమ్ముకోవడం వాళ్ళ జీవనాధారంగా ఉంటుంది.

వీళ్ల విలేజీకి చెందిన పిల్లలు చదువుకోవాలంటే పది కిలోమీటర్లు దట్టమైన అటవీ మార్గంలో నడుచుకుంటూ కొండ దిగువన ఉన్న స్కూలుకు వెళ్ళాలి. దాంతో తల్లితండ్రులు భయపడి ఆడపిల్లలను బడికి పంపేవారు కాదు.

కానీ కురుంజికి మాత్రం బడికి వెళ్ళి చదువుకోవాలని కోరిక. అదే విషయం తల్లిని అడిగితే ఆడపిల్లకు చదువు ఎందుకని ఒప్పుకోదు. కురుంజిని చదివించడానికి తండ్రి ఒప్పుకుంటాడు కానీ పది కిలోమీటర్లు అడవిలో నడుచుకుంటూ వెళ్లాల్సి రావడంతో భయపడతాడు.

ఇదిలా ఉండగా కొంతమంది ఫారినర్స్ తో కుమ్మక్కు అయి వీరి భూములను ఆక్రమించాలని ప్లాన్ చేసిన ఫారెస్ట్ రేంజర్ ఊరి పెద్ద అయిన కురుంజి తాతకు మాయమాటలు చెప్పి అక్కడి ట్రైబల్స్ విలేజ్ ఖాళీ చేసి వెళ్ళిపోయేవిధంగా తయారుచేసిన అగ్రిమెంట్ మీద వేలిముద్ర వేయించుకుని మోసం చేస్తాడు.

దీంతో చదువురాని తనను ఆ ఫారెస్ట్ రేంజర్ మోసం చేశాడని గ్రహించిన ఆయన తన మనవరాలు కురుంజి చేత బాగా చదువుకుంటానని ఒట్టేయించుకుని ఆత్మహత్య చేసుకుంటాడు.

చదువు లేకపోవడం వల్లనే తమ ఊరి వారు అన్యాయంగా మోసపోతున్నారని గ్రహించి తాను బాగా చదువుకోవాలని కురుంజి నిర్ణయించుకుంటుంది. తన ఊరికి స్కూల్ మంజూరు కావాలంటే కలెక్టర్ ను కలవాలని తెలుసుకుంటుంది.

అప్పుడు కురుంజి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది?
తన ఊరికి స్కూల్ మంజూరు కావడానికి ఆ పిల్ల ఏం చేస్తుంది?
ఊరి పెద్దలు చెప్పినట్టు కలెక్టర్ ను కలుస్తుందా?
చివరకు కలెక్టర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు? అనేది మిగిలిన కథ.

ఎలా ఉంది?

ఈ మధ్య కాలంలో వచ్చిన ఫీల్ గుడ్ మూవీల్లో అరుల్వాన్ కూడా ఒకటని చెప్పవచ్చు. కాంక్రీట్ జనారణ్యంలో మగ్గిపోతున్న మనకు.. కొండల్లో కోనల్లో చుట్టూ అందమైన పచ్చని చెట్ల మధ్య ప్రకృతి ఒడిలో జీవనాలు కొనసాగిస్తున్న ట్రైబల్స్ యొక్క ఆచార వ్యవహారాలు , సంస్కృతి, సాంప్రదాయాలు ఏ విధంగా ఉంటాయో దర్శకుడు కళ్ళకుకట్టినట్టు చూపించారు.

ఈ సినిమాలో కనిపించే అందమైన ప్రకృతి దృశ్యాలు మన మనసులకు ఆహ్లాదాన్ని పంచుతాయి. ఒక అందమైన దృశ్య కావ్యాన్ని చూస్తున్న అనుభూతిని ఇస్తుంది. వీలుంటే అలాంటి ప్రదేశాలను ఒకసారి చుట్టిరావాలనిపిస్తుంది. నిజ జీవితంలో కూడా ఒక రచయిత రిమోట్ ఏరియాలలో బతుకులు ఈడుస్తున్న ట్రైబల్స్ జీవితాల మీద అధ్యయనం చేసి పుస్తకం రాసారు. అదే విషయాన్ని సినిమాలో కూడా చూపించారు.

కనీస రహదారి సౌకర్యం కూడా లేని ఎక్కడో కొండ కోనల్లో అడవి తల్లిని నమ్ముకుని బతుకులు ఈడుస్తున్న ట్రైబల్స్ జీవన విధానాల మీద ఫోకస్ చేస్తూ దర్శకుడు ఫస్టాఫ్ లో కథనాన్ని నడిపిన తీరు ఆకట్టుకుంటుంది.

ముఖ్యంగా కురుంజి మెచ్యూర్ అయ్యిందని తెలిసినప్పుడు అక్కడి ట్రైబల్స్ ఆచరించిన ఆచార వ్యవహారాలు చూసినప్పుడు కొత్తగా అనిపిస్తుంది. మెచ్యూర్ అయిన ఆడపిల్లకు ఐదు రంగు రాళ్లను అందించి వాటిలో ఆమె సెలెక్ట్ చేసుకునే రాయిని బట్టి కాబోయే భర్తను అక్కడి ట్రైబల్స్ గురువు నిర్ణయించడం వింత ఆచారంగా అనిపిస్తుంది.

ట్రైబల్స్ భూముల మీద కొందరు ఫారినర్స్ కన్ను పడటం, వాళ్ళకి ఓ ఫారెస్ట్ రేంజర్ తోడవ్వడం , చదువు లేని ఊరి పెద్దను మోసం చేయడం వంటి సన్నివేశాలతో ఫస్టాఫ్ రన్ చేసిన దర్శకుడు సెకండాఫ్ వచ్చేసరికి చదువు ప్రాముఖ్యత అనే సందేశం మీద ఫోకస్ పెట్టి కథనాన్ని నడిపించుకుంటూ వచ్చారు.

ఓవరాల్ గా ఫస్టాఫ్ లోనూ, సెకండాఫ్ లోనూ దర్శకుడి స్క్రీన్ ప్లే టాలెంట్ కనిపిస్తుంది. దర్శకుడు ఎంచుకున్న లొకేషన్స్ ఈ సినిమాకి ప్లస్ అవుతాయి.

ఫస్టాఫ్ లో ప్రకృతి దృశ్యాలకు కనెక్ట్ అయి ఆహ్లాదం పొందిన మనం.. సెకండాఫ్ వరకు వచ్చేసరికి మాత్రం కురుంజితో పాటు మనమూ భావోద్వేగ సంఘర్షణలో పడతాం.

దట్టమైన అరణ్యంలో జంతువుల మధ్య తిరిగినా ఏనాడు భయపడని తనకు జనారణ్యంలో మనుషులను చూస్తే మాత్రం భయమేస్తుందని కురుంజి చెప్పే డైలాగ్ మనసులని పిండేస్తుంది. ముఖ్యంగా కురుంజి హాస్పిటల్ సీన్ మాత్రం హృదయాలను మెలిపెడుతుంది. సినిమా స్టార్టింగులో కురుంజి ఆక్సిడెంట్ సన్నివేశంతో మొదలెట్టిన దర్శకుడు అసలు స్టోరీని నేరేట్ చేసుకుంటూ క్లైమాక్సులో మళ్ళీ అక్కడికే వచ్చిన తీరు బాగుంది.

అయితే దర్శకుడు కురుంజి తల్లితండ్రుల పాత్రలను అర్దాంతరంగా ముగించిన తీరు సరిగా అనిపించదు. నిజానికి కురుంజితో పాటు ఆమె తల్లితండ్రుల పాత్రకు కూడా మంచి స్కోప్ ఉంది. చదువుకోవాలనే కురుంజి ఆశయానికి తండ్రి ప్రోత్సాహం కూడా ఉంటుంది. అసలు సినిమాకి ఫస్టాఫ్ లో కురుంజి తండ్రి హీరో అయితే సెకండాఫ్ లో కలెక్టర్ హీరో అవుతాడు. అలాంటిది కురుంజి తండ్రి పాత్రను దర్శకుడు ఎందుకు ముగించాడో తెలీదు. బహుశా కథనంలో మరింత ఎమోషన్స్ క్యారీ కావడం కోసం దర్శకుడు ఆ పాత్రలను ఆ విధంగా రాసుకుని ఉంటారు.

ఇక కలెక్టర్ ఎపిసోడ్ తో దర్శకుడు కావలసినంత ఎమోషనల్ డ్రామా పండించారు. దర్శకుడు చేసిన ఇంకో మంచి పనేంటంటే కమెడియన్ వీటివి గణేష్ తో ఎంతవరకు కామెడీ చేయించాలో అంతవరకే చేయించారు.

ఇక క్లైమాక్స్ వరకు వచ్చేసరికి దర్శకుడు రొటీన్ కమర్షియల్ ఫార్మాట్లో ముగించేశారు. అందుకే క్లైమాక్స్ మనకు కొత్తగా ఏమీ అనిపించదు. గతంలో ఇలాంటి ముగింపులతో ఆల్రెడీ బోలెడు సినిమాలు చూసేసామ్ కాబట్టి కొత్తగా వావ్ అనుకునేది ఏమీ ఉండదు.

కాకపోతే కురుంజి , కలెక్టర్ల పాత్ర ద్వారా దర్శకుడు ఇచ్చిన సందేశం మాత్రం హృదయాలను టచ్ చేస్తుంది.

ఇప్పటికీ చాలా కొండ ప్రాంతాల్లో స్కూల్ సౌకర్యాలు లేవనీ.. అయినా కూడా చాలామంది ఆడపిల్లలు మైళ్ళ దూరం నడిచి గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుని ఐఏఎస్, ఐపీఎస్ లు అయ్యారని వార్తల్లో చూపించిన క్లిప్పులను క్లైమాక్సులో చూపిస్తూ దర్శకుడు నేటి విద్యార్ధులకు ఇన్స్పిరేషన్ కలిగించే ప్రయత్నం చేశారు.

ఎవరెలా చేశారు?

ఈ సినిమాకి కురుంజి నటనే ప్రధాన బలం అవుతుంది. తనకిచ్చిన పాత్రకు ఆ అమ్మాయి పూర్తి న్యాయం చేసింది. పాత్రకు తగ్గట్టుగా హావభావాలను ప్రదర్శించి ఆకట్టుకుంది.
ఆమె తర్వాత కలెక్టర్ నటన కూడా బాగుంది.
కురుంజి తల్లితండ్రుల నటన కూడా బాగుంది.

సాంకేతికత

జీవి ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం బాగుంది.
సుకుమార్ అందించిన సినిమాటోగ్రఫీ ఈ సినిమాను ఒక మెట్టు పైకి చేరుస్తుంది. చక్కటి ప్రకృతి దృశ్యాలను అద్భుతంగా క్యాప్చర్ చేశారు.
నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

విశ్లేషణ

మీరు చక్కటి ఫీల్ గుడ్ మూవీ చూడాలనుకుంటున్నారా ? అయితే మీ వాచ్ లిస్టులో అరుల్వాన్ మూవీని కూడా చేర్చుకోండి. ఫస్టాఫ్ లో చక్కటి ప్రకృతి దృశ్యాలను చూసి హాయిగా రిలాక్స్ అవుతారు. ఇక సెకండాఫ్ లో రన్ అయిన భావోద్వేగాల సంఘర్షణలలో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు.

చదువుని లక్ష్యంగా చేసుకుని కొంతమంది ఆడపిల్లలు జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగడం చాలామందికి ఇన్స్పిరేషన్ ఇస్తుంది. ఎందుకో అరుల్వాన్ అనేది ఒక సినిమాలా అనిపించదు. కొండకోనల్లో నివసించే ట్రైబల్స్ జీవితాలను కళ్లముందు చూస్తున్నట్టు ఉంటుంది.

ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉన్న ఈ తమిళ్ సినిమాను ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూడాల్సి ఉంటుంది.

నటీనటులు: అరవ్, అరుల్నితి, వీటివి గణేష్ తదితరులు
సంగీతం: జీవి ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ: ఎమ్. సుకుమార్
నిర్మాత: శరవణన్
దర్శకత్వం: గణేష్ వినాయక్
ఓటిటి: అమెజాన్ ప్రైమ్
విడుదల: 4-09-2026
రేటింగ్: 3.5 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *