Aasha Movie Review2026 (OTT) – మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ!

Spread the love

జోజు జార్జ్, ఊర్వశి ప్రధాన పాత్రల్లో నటించిన ఒరిజినల్ మలయాళం మర్డర్ మిస్టరీ ఆశ మూవీ ( Aasha Movie) సెప్టెంబర్ 11 న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఇప్పుడు అదే సినిమా తెలుగు ఆడియోతో అక్టోబర్ 16 ,2026 తేదీ నుంచి ZEE 5 లో స్ట్రీమింగ్ అవుతుంది.

మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ మూవీల్లో జోజు జార్జ్ మూవీలకు ఉండే క్రేజ్ సంగతి అందరికీ తెలిసిందే. అందుకే ఆయన నటించిన సినిమాలను ఓటిటిల్లో వెతుక్కుని మరీ చూసే తెలుగు ఆడియన్స్ కూడా చాలామంది ఉన్నారు.
మరి ఆశ మూవీ కూడా జోజు జార్జ్ ఇమేజ్ కు తగినట్టుగా ఉందో? లేదో ఇప్పుడు చూద్దాం.

కధేంటంటే?

ఆశ కి (ఊర్వశి) ఇద్దరు కూతుళ్లు.. ఒక కూతురు పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ అయిపోగా.. రెండో కూతురు తల్లి దగ్గరే ఉంటుంది. ఆశది ముందునుంచీ దుందుడుకు స్వభావం. దేనికీ భయపడే రకం కాదు. అలాంటి ఆశ ఓరోజు అనుకోకుండా ప్రమాదకర పరిస్థితుల్లో ఇరుక్కుంటుంది. తన కూతురుతో కలిసి కారులో వెళ్తుండగా వెనకనుంచి ఓ ట్రక్ దూసుకువచ్చి కారును రాసుకుంటూ వెళ్ళి ఓ చెట్టుకు గుద్దుకుని ఆగిపోతుంది.

దాంతో ఆ ట్రక్ నడుపుతున్న డ్రైవర్ కమ్ ప్లంబర్ జీమోన్ (జోజు జార్జ్).. అతడి అసిస్టెంట్ ఆసిఫ్ లు.. ఆశ తో గొడవ పడతారు. తప్పు నీదంటే నీదని ఒకరితో ఒకరు గొడవ పడటంతో చివరికి ఆశ అతడి మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు జీమోన్ మీద కేసు నమోదు చేస్తారు.

తన మీద పెట్టిన కేసు విత్ డ్రా చేసుకోమని జీమోన్ .. ఆశని బెదిరిస్తాడు.. కానీ ఆశ మాత్రం కేసు విత్ డ్రా చేసుకోవడానికి ఒప్పుకోదు. ఇది జరిగిన మర్నాడే ఆశ కూతురు ఓ ఆక్సిడెంట్ బారిన పడటంతో అది చూసిన కొంతమంది ఆమెను హాస్పిటల్లో ఐసియులో చేర్పించి వెళ్లిపోతారు.

కూతురి ప్రమాదం సంగతి తెలుసుకున్న ఆశ హాస్పిటల్ కు చేరుకుని అక్కడి సీసీ కెమెరా ఫుటేజ్ లను చూస్తుంది. దాంట్లో జీమోన్ కనిపించడంతో తనమీద కక్షతో అతడే ఈ దారుణానికి ఒడిగట్టాడని భావిస్తుంది.

అప్పుడు ఆశ ఏం చేస్తుంది? తన కూతురి మీద దాడి చేసిన ప్లంబర్ జీమోన్ .. అతడి అసిస్టెంట్ ఆసిఫ్ ల మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఎలా ప్లాన్ చేస్తుంది? అసలు ఆశ కూతురి ఆక్సిడెంట్ కీ.. ప్లంబర్ జీమోన్ కూ ఉన్న కనెక్షన్ ఏంటి? అనేది మిగిలిన కథ.

ఎలా ఉంది?

కథ చదివారుగా? సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ మూవీలకు కావాల్సిన ప్రధాన ముడి సరుకు పుష్కలంగా ఉంది. మరి ఈ ముడి సరుకులతో మంచి మసాలా వంటకం వండి వారిస్తే ఘుమఘుమలు రావాలి కదా? కానీ అలా రాలేదు..ఎందువల్లా? ఎక్కడో ఏదో ఫ్లేవర్ మిస్ అయ్యింది.

వంటకంలో దినుసులన్నీ సమపాళ్లలో పడితేనే టేస్ట్ బాగుంటుంది.. కొంచం ఉప్పు తగ్గినా చాలు.. చప్పగా అయిపోతుంది..ఈ సినిమాలో జరిగింది అదే.. దర్శకుడు సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో మంచి కథనే రాసుకున్నాడు.. కానీ తాను రాసుకున్న కథను తెరకెక్కించడంలో తడబడ్డారు.

అది ఎలా అంటారా? ఆశ స్వతంత్ర భావాల గురించి.. దుందుడుకు స్వభావం గురించి దర్శకుడు సినిమా స్టార్టింగులోనే బ్యాంక్ క్యాషియర్ తో జరిగిన గొడవలో పరిచయం చేసేసాడు. ఆ సీన్ తో ఆశ ధైర్యస్తురాలని మనకు కూడా అర్థమైంది. మనకు అలా అర్థం కావాలనే దర్శకుడు స్టార్టింగులోనే ఆ సీన్ పెట్టారు.. ఓకే.. ఆశ పాత్ర పరిచయం బాగానే ఉంది.

నెక్స్ట్ ఏంటి? ఓ ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి ప్రమాదానికి కారణం అయ్యాడని ఆశ అతడి మీద పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెడుతుంది. ఆమె కూతురు.. పోలీసులు నచ్చచెప్పినా.. ట్రక్ డ్రైవర్ బెదిరించినా ఆమె కేసు విత్ డ్రా చేసుకోదు.. ఇదీ ఓకే.. ఆమె ధైర్యస్తురాలు కాబట్టి కేసు విత్ డ్రా చేసుకోవడానికి ఒప్పుకోదు.

తన కూతురు ఆక్సిడెంట్ లో గాయపడటం వెనుక జీమోన్ కుట్ర ఉందని ఆమె భావించి వాళ్ళని కిడ్నాప్ చేస్తుంది. ఇదీ ఓకే.. ఆమె ధైర్యస్తురాలు కాబట్టి వాళ్ళని కిడ్నాప్ చేసిందనుకుందాం. వాట్ నెక్స్ట్? ఇక్కడనుంచి కథ ముందుకు వెళ్లదు.. అక్కడక్కడే తిరుగుతుంటుంది.

ఇందుకు ప్రధాన కారణం పాత్ర స్వభావం మారిపోవడమే.. దైర్యం నుంచి గందరగోళానికి ఆశ పాత్ర స్వభావం మారిపోవడంతో ఇక అక్కడ్నుంచి దర్శకుడు ఏం చెప్పదల్చుకున్నాడో అర్థం కాక ప్రేక్షకులు కూడా గందరగోళంలోకి వెళ్తారు.

సినిమాలో పాత్ర గందరగోళంలోకి వెళ్తే పర్లేదు.. కానీ సినిమా తీసే దర్శకుడు గందరగోళంలోకి వెళ్తే మాత్రం ఇబ్బంది అవుతుంది. సెకండాఫ్ నుంచి ఈ సినిమాలో జరిగింది అదే. అంతోటీ జోజు జార్జ్ ను తాళ్లతో కట్టి ఇంట్లో పడేసిన ఆశకు ఆ తర్వాత ఏం చేయాలో తెలీదు.. ఆమెకే కాదు.. దర్శకుడికి కూడా ఏం చేయాలో తెలియలేదేమో అనిపిస్తుంది.

జోజు జార్జ్ మందు అడిగితే మందు తాపించడం.. యూరినల్స్ అంటే కింద మగ్గు పెట్టడం వంటి అవసరం లేని సాగతీత సీన్లతో దర్శకుడు మాగ్జిమం కథనాన్ని ముందుకు లాక్కెళ్లారు.

అసలు మలయాళం ఇండస్ట్రీలో జోజు జార్జ్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది.. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ మూవీలలో జోజు జార్జ్ నటన పెట్టింది పేరు అంటారు. అలాంటి జోజు జార్జ్ నుంచి దర్శకుడు పూర్తిస్థాయిలో నటన రాబట్టుకోకపోగా దాదాపు సెకండాఫ్ అంతా ఆయన్ని ఓ గదిలో నేలమీద పడుకోబెట్టేయడం చాలామందికి రుచించదు.

మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలనగానే ముందు మన ఆడియన్స్ ట్విస్టులు ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఇందులో అలాంటి ట్విస్టులు తగలకపోవడం డిజప్పాయింట్ చేస్తుంది. పోనీ క్లైమాక్స్ అయినా డిఫరెంట్ గా ముగిస్తారేమో అనుకుంటే అది కూడా సాదాగానే ఎండ్ అయ్యింది.

క్లైమాక్స్ లో అందరికంటే జోజు జార్జ్ ఎక్కువ రిలాక్స్ అయినట్టున్నాడు. ఎందుకంటే దాదాపు సెకండాఫ్ నుంచి కట్టిన కట్లు క్లైమాక్స్ లో విప్పడంతో ఒక్కసారిగా ఒళ్ళు విరుచుకుని మరీ ఆ పాత్ర నిష్క్రమించింది.

ఎవరెలా చేశారు?

ఆశ పేరు చూడగానే అర్థమైపోతుంది.. ఈ సినిమా కథలో లేడీ ఓరియంటెడ్ పాత్ర ప్రధానంగా సాగుతుంది అని. టైటిల్ కి తగ్గట్టుగానే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆశ నే కనిపిస్తుంది. ఆశ పాత్ర పోషించిన ఊర్వశి నటనలో వంక పెట్టాల్సిన పని లేదు.. తన పాత్రను బాగానే పోషించింది.

ఇక ఈ సినిమాలో జోజు జార్జ్ పాత్ర చూస్తే జాలేస్తుంది. అసలు ఈ పాత్రకు జోజు జార్జ్ ఎలా ఒప్పుకున్నారో అని ఆశ్చర్యం కూడా వేస్తుంది. ఈ సినిమాలో ఆయన నటనకు పెద్దగా స్కోప్ దక్కలేదు. దాదాపు సెకండాఫ్ అంతా చేతులు.. కాళ్ళకు కట్లతో నేల మీద పడుకోవడానికి జోజు జార్జ్ అవసరం లేదు.. ఏ జూనియర్ ఆర్టిస్ట్ అయినా సరిపోతాడు.
మిగిలినవాళ్ళు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతికత

గోవింద్ వసంత అందించిన సంగీతం బాగానే ఉంది. కాకపోతే ఎందుకో సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ మూవీల్లో ఉండే బిజిఎం కరువైనట్టు అనిపిస్తుంది.
మధు నీలకందన్ అందించిన ఫోటోగ్రఫీ కూడా యావరేజ్ గా ఉంది.
నిర్మాణ విలువలు పర్లేదు.

విశ్లేషణ

భర్త తోడు లేని ఓ మహిళ తన తొందరపాటుతనం వల్ల అనుకోని పరిస్థితుల్లో ఊహించని ప్రమాదంలో ఇరుక్కుంటుంది. పోలీస్ భాషలో చెప్పాలంటే మర్డర్ మిస్టరీ కేసు.. మరి ఈ కేసునుంచి ఆమె ఎలా బయటపడుతుంది అనేది ప్రధాన కథ.

ఇందుకోసం దర్శకుడు రాసుకున్న పాయింట్ థ్రిల్లింగ్ గానే ఉంది కానీ ఎందుచేతనో అదే కథను తెర మీద చూస్తే థ్రిల్లింగ్ రాలేదు. ఈ సినిమాలో నటీనటుల నటన బాగున్నా దర్శకత్వ లోపం స్పృష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు సాగతీతలా అనిపిస్తాయి.

ఇక ఈ సినిమాలో లాజిక్కుల గురించి దర్శకుడు అస్సలు పట్టించుకోలేదు. జోజు జార్జ్ కనిపించకుండా పోవడంతో పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్ మరీ హోమ్ గార్డుల స్థాయిలో ఉంది. వాళ్ళ కన్నా ఆశానే నయం.. హాస్పిటల్లో సీసీ కెమెరా ఫుటేజ్ చూసి జోజు జార్జ్ ను కనిపెడుతుంది. అంతిమంగా ఈ సినిమాలో పోలీస్ ఇన్వెస్టిగేషన్ పార్ట్ చాలా వీక్ గా ఉంది. అన్నట్టు ఈ సినిమా కధలో జోజు జార్జ్ హ్యాండ్ కూడా ఉందట.

అందుచేత లాజిక్కుల జోలికి పోకుండా వన్ టైమ్ వాచ్ కింద మూవీ చూడాలనుకునేవాళ్లు ఆషా సినిమా మీద ఓ లుక్కేయండి.

నటీనటులు: జోజు జార్జ్, ఊర్వశి తదితరులు
సంగీతం: గోవింద్ వసంత
సినిమాటోగ్రఫీ: మధు నీలకందన్
నిర్మాత: వినాయక అజిత్
దర్శకత్వం: సఫర్ సనాల్
ఓటిటి: ZEE 5
స్ట్రీమింగ్ డేట్: 16 -10 -2026
రేటింగ్: 2 /5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *