అక్షయ్ కుమార్.. పరిణితి చోప్రా ప్రధాన పాత్రల్లో నటించిన మిషన్ రాణిగంజ్ సినిమా (Mission Raniganj Movie) 2023 అక్టోబర్లో థియేటర్లలో రిలీజ్ అయ్యింది. డిసెంబర్ 2023 నుంచి ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కాకపోతే ఒరిజినల్ హిందీ మూవీని ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూడాల్సి ఉంటుంది.
1989 లో వెస్ట్ బెంగాల్ లోని రాణిగంజ్ బొగ్గు గనుల్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా దర్శకుడు కథ అల్లుకుని ఈ సినిమాను తెరకెక్కించారు.
ఇప్పుడు మిషన్ రాణిగంజ్ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కధేంటంటే?
వెస్ట్ బెంగాల్ లోని రాణిగంజ్ బొగ్గు గనుల్లో వందలాది గని కార్మికులు షిఫ్టుల వారీగా పనిచేస్తూ ఉంటారు. అలా ఒకరోజు అర్ధరాత్రి కార్మికులు షిఫ్ట్ మారే సమయంలో బొగ్గు గనిలో బ్లాస్ట్ సంభవించి నీరు వరదలా ముంచెత్తుతుంది. బొగ్గు గనిలో జరిగిన ఈ బ్లాస్ట్ లో కార్మికులందరూ మరణించి ఉంటారని అధికారులు అంచనాకు వస్తారు. మరోపక్క రెస్క్యూ ఆపరేషన్ చేసి తమవారిని కాపాడాలని బొగ్గు గని కార్యాలయం ముందు కార్మికుల కుటుంబ సభ్యులు ధర్నా చేస్తారు.
ఈ పరిస్థితుల్లో కోల్ ఇండియా లో పనిచేసే ఆఫీసర్ జస్వంత్ సింగ్ గిల్ (అక్షయ్ కుమార్) అక్కడికి వస్తాడు. రెస్క్యూ ఆపరేషన్ చేయకుండా కార్మికులు చనిపోయారని ఎలా నిర్ణయిస్తారని అధికారులను ప్రశ్నిస్తాడు. జస్వంత్ సింగ్ గిల్ మాటలతో అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాలని నిర్ణయిస్తారు. మిషన్ రాణిగంజ్ పేరుతో జస్వంత్ సింగ్ గిల్ రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెడతాడు.

బొగ్గు గనుల్లో ఇరుక్కుపోయిన 65 మంది కార్మికులను జస్వంత్ సింగ్ కాపాడుతాడా? అధికారులు అతడికి ఏ విధంగా సహకరిస్తారు?
చివరికి జస్వంత్ సింగ్ గిల్ మొదలు పెట్టిన మిషన్ రాణిగంజ్ ఆపరేషన్ సక్సెస్ అవుతుందా? అనేది మిగిలిన కథ.
ఎలా ఉంది ?
1989 లో వెస్ట్ బెంగాల్ లోని రాణిగంజ్ బొగ్గు గనుల్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా దర్శకుడు కథ అల్లుకుని ఈ సినిమాను తెరకెక్కించారు అని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా? రియల్ ఇన్సిడెంట్ లను తెరకెక్కించే దర్శకులు రెండు రకాలుగా ఉంటారు. మొదటి రకం దర్శకులు వాస్తవాలను ఉన్నది ఉన్నట్టుగా తెరకెక్కిస్తారు. ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు. జరిగిన సంఘటన కళ్ళముందు ఉంచటానికి ప్రయత్నం చేస్తారు.
ఇక రెండో రకం దర్శకులు రియల్ ఇన్సిడెంట్ కి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి వదులుతారు. అంటే అసలు గోరంత అయితే కల్పితం కొండంత ఉంటుందన్నమాట. చాలామందికి రెండో రకమే నచ్చుతుంది.. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన మసాలాలు అన్నీ ఇందులో ఉంటాయి.
ఇప్పుడు ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే మొదటి రకానికి చెందుతుంది. రియల్ ఇన్సిడెంట్ లను ఉన్నది ఉన్నట్టుగా చూడటానికి ఇష్టపడే ఆడియన్స్ కూడా ఉంటారు. అలాంటి వారికి మిషన్ రాణిగంజ్ నచ్చుతుంది.. ఇక మొదటి రకం వారికి పెద్దగా నచ్చకపోవచ్చు.
ఇక ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే విధులలో నిర్లక్ష్యం వహించే అధికారులు ఉన్నచోటే సమర్థవంతమైన నిజాయితీ కలిగిన అధికారులు కూడా ఉంటారని సేన్..జస్వంత్ సింగ్ గిల్ పాత్రల ద్వారా తెలుస్తుంది.
ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్ చేయకుండానే ప్రమాదంలో గని కార్మికులు మరణించారని రికార్డులలో రాసుకుని వారి కుటుంబాలకు నష్ట పరిహారం ఇచ్చి ఇష్యూని క్లోజ్ చేయాలని సేన్ అనే ఆఫీసర్ ఆలోచన. రెస్క్యూ ఆపరేషన్ చేసి స్వయంగా నిర్ధారణ చేయకుండా ప్రకటనలు చేయకూడదనేది జస్వంత్ సింగ్ ఆలోచన. అదే డిపార్ట్మెంట్లోలో సేన్ లాంటి అవినీతి పరులైన అధికారులు ఉన్నారు.. జస్వంత్ సింగ్ లాంటి నిజాయితీ పరులైన అధికారులు కూడా ఉన్నారు.
చివరకు అధికారులు జస్వంత్ సింగ్ ఆలోచనకే మద్దతు ఇస్తారు. అక్కడ్నుంచి మిషన్ రాణిగంజ్ ఆపరేషన్ మొదలౌతుంది.
ప్రమాదం జరిగిన భూమి అడుగున ఉన్న బొగ్గు గనిలోకి వెళ్ళే మార్గాలు మూసుకుపోయాయి.. ప్రమాదంలో ఎంతమంది మరణించారు? ఎంతమంది బతుకున్నారో తెలీదు. తెలుసుకోవడం ఎలా? అనుకునే సమయంలో బొగ్గు గనిలో ఇరుక్కుపోయిన తన యజమాని ఏడుపును అతడి పెంపుడు కుక్క పసిగడుతుంది. ఆ కుక్క మూగ సైగలతో జస్వంత్ ను అలెర్ట్ చేస్తుంది. మనుషులు చేయలేని పని ఒక మూగ ప్రాణి చేస్తుంది.
ఇలా ఫస్టాఫ్ అంతా బొగ్గు గని అధికారుల అలసత్వం.. జస్వంత్ సింగ్ యాక్షన్ ప్లాన్ ల చుట్టూ కథనం నడుస్తుంది. ఇక ఈ సినిమాకి ప్రధాన బలం సెకండాఫ్.. అందులోనూ క్లైమాక్స్ సీన్స్ అని చెప్పుకోవాలి. సెకండాఫ్ సీన్స్ చూస్తే నిజంగా మిషన్ రాణిగంజ్ ఆపరేషన్ చేస్తున్నారా? అన్నంత సహజంగా దర్శకుడు పిక్చరైజ్ చేశారు. సైట్ ప్లాన్ కోసం సర్వేయర్ ను పిలిపించడం.. డ్రిల్లింగ్ పనుల కోసం ఇంజనీర్ ను పిలిపించడం.. ఒక పాయింటులో రిగ్ చేయడం వంటి సన్నివేశాలు చాలా సహజంగా అనిపించి మనల్ని ఎంగేజ్ చేస్తాయి.
క్లైమాక్స్ సీన్స్ చూస్తే అక్షయ్ కుమార్ నిజంగా క్రేన్ సాయంతో బొగ్గు గనుల్లోకి వెళ్తున్నాడా? అనిపిస్తుంది. క్లైమాక్సులో ఒక సీన్ మనల్ని బాగా టచ్ చేస్తుంది. జస్వంత్ సింగ్ భార్య (పరిణితి చోప్రా) సైట్ దగ్గరికి వచ్చినప్పుడు సీనియర్ ఆఫీసర్ ఆమె దగ్గరికి వచ్చి జస్వంత్ కి ఏమీ కాదని ఏదో సర్ది చెప్పే ప్రయత్నం చేయబోతుండగా జస్వంత్ భార్య నవ్వుతూ ” నా భర్త గురించి నాకు కంగారు లేదు.. గనుల్లో ఇరుక్కుపోయిన ఆఖరి కార్మికుడిని కూడా బయటపడేసిన తర్వాతనే అతడు బయటికి వస్తాడు.. అన్నట్టు కంగారులో నా భర్త ఐ డ్రాప్స్ వేసుకోవడం మర్చిపోయాడు.. ఇవి వేసుకోకపోతే అతడి విజన్ ఇంపాక్ట్ అవుతుంది” అంటూ గని లోపలికి వెళ్తున్న క్రేన్ ద్వారా ఆ ఐ డ్రాప్స్ బాటిల్ ను పంపిస్తుంది.
టైటిల్స్ క్రెడిట్స్ అప్పుడు 1989 లో మిషన్ రాణిగంజ్ ఆపరేషన్ లో పాల్గొన్న రియల్ హీరో జస్వంత్ సింగ్ గిల్ ఫోటోలను చూపిస్తారు. ఒక సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్ చేసి షుమారు 65 మంది గని కార్మికులను కాపాడినందుకు అప్పట్లో ప్రభుత్వం ఆయనకు లక్ష రూపాయల బహుమానం ప్రకటించింది. అదనంగా జస్వంత్ సింగ్ కు డిపార్ట్మెంట్ ప్రమోషన్ కూడా ఇచ్చింది. సినిమా చివర్లో రియల్ హీరో జస్వంత్ సింగ్ గిల్ ఫోటోలను చూసినప్పుడు సెల్యూట్ చేయకుండా ఉండలేం.
ఎవరెలా చేశారు?
జస్వంత్ సింగ్ గిల్ పాత్రలో అక్షయ్ కుమార్ జీవించేశాడు.. చాలా సన్నివేశాల్లో మనకు అక్షయ్ కుమార్ కనిపించడు.. జస్వంత్ సింగ్ మాత్రమే కనిపిస్తాడు.
ఇక అక్షయ్ కుమార్ భార్య పాత్రలో పరిణితి చోప్రా నటించినప్పటికీ సినిమాలో ఆమె పాత్రకు పెద్దగా స్కోప్ దక్కలేదు. కానీ క్లైమాక్స్ సీన్ లో పరిణితి చోప్రా చక్కటి పెర్ఫార్మెన్స్ చూపించింది.
మిగిలినవాళ్ళు కూడా తమ పాత్రల్లో చాలా సహజంగా నటించారు.
సాంకేతికత
సందీప్ శిరోద్కర్ అందించిన సంగీతం బాగుంది.. ముఖ్యంగా మైన్స్ నేపథ్యంలో వచ్చిన సీన్లలో బిజిఎం స్కోర్ బాగా అదనపు బలాన్ని ఇచ్చింది.
ఆసీమ్ మిశ్రా ఫోటోగ్రఫీ పని తీరు కూడా బాగుంది.. బొగ్గు గనుల్లో తీసిన సన్నివేశాలను చాలా సహజంగా క్యాప్చర్ చేశారు.
నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి.
విశ్లేషణ
ముందే చెప్పినట్టు ఇదో రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తీసిన సినిమా. దర్శకుడు ఎటువంటి కమర్షియల్ హంగుల జోలికి వెళ్లకుండా వాస్తవాలను ఉన్నది ఉన్నట్టుగా చూపించటానికి ప్రయత్నం చేశారు. ఈ కోణంలో దర్శకుడి ప్రయత్నం అభినందనీయం.
అయితే ప్రేక్షకుడి కోణంలో కమర్షియల్ హంగులు లేని సినిమా ఎంతవరకు నచ్చుతుంది అనేది ఖచ్చితంగా చెప్పలేం. మిషన్ రాణిగంజ్ అనేది ఓ రియల్ హీరో కథ. పోలీస్.. ఆర్మీ.. మెడికల్ రంగాలలో రియల్ హీరోల కథలను ఇప్పటికే చాలా సినిమాల్లో చూసేసాం.. ఆ జాబితాలో ఇప్పుడు ఓ కోల్ మైన్ ఆఫీసర్ కూడా చేరారు. ఇలాంటి నిజాయితీ పరులైన ఆఫీసర్ల కథలు మరిన్ని వెలుగులోకి రావాలంటే ఇలాంటి సినిమాలను మనం ప్రోత్సహించాలి.
వీలున్న వారు .. ఇప్పటికీ ఈ సినిమా చూడని వారు ఒరిజినల్ హిందీ మూవీని నెట్ ఫ్లిక్స్ లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూడండి.
నటీనటులు : అక్షయ్ కుమార్, పరిణితి చోప్రా తదితరులు
సంగీతం: సందీప్ శిరోద్కర్
సినిమాటోగ్రఫీ: ఆసీమ్ మిశ్రా
నిర్మాత: పూజ ఎంటర్టైన్మెంట్
దర్శకత్వం: సురేష్ దేశాయ్
ఓటిటి: నెట్ ఫ్లిక్స్ (1-12-2023)
రేటింగ్: 2.75/5
