ఓటిటిలోకి వచ్చిన హనుమాన్ అంశ్ సినిమా ఎలా ఉందంటే? – Hanuman Ansh Movie Review

Spread the love

నీమ్ కరోలి బాబా జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన హనుమాన్ అంశ్ సినిమా (Hanuman Ansh Movie ) ఈరోజు నుంచి (27-11-2026) ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఒరిజినల్ హిందీ మూవీని ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూడాల్సి ఉంటుంది. అక్టోబర్ లో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వసూళ్లను సాధించింది.
ఇప్పుడు హనుమాన్ అంశ్ మూవీ ఎలా ఉందో చూద్దాం.

కధేంటంటే?

లక్ష్మీనారాయణ ( సోభినవ్ సత్య ) తల్లి చిన్న తనంలోనే చనిపోతుంది. తల్లి మీద ప్రేమ పెంచుకున్న లక్ష్మీనారాయణ ఆమెను వెతుక్కుంటూ బయలుదేరుతాడు.. తన తల్లి రాముడి దగ్గరికి వెళ్ళిందనీ.. అందుకే తాను కూడా ఆ రాముడి పాదాల చెంతకే చేరతానని అందరికీ చెప్తుంటాడు. చిన్నప్పటి నుంచే ఎప్పుడూ సీతారాం అంటూ ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు.

ఈ పరిస్థితుల్లో అతడి తండ్రి రెండో పెళ్లి చేసుకుంటాడు.. దాంతో లక్ష్మీనారాయణ తన తల్లి కోసం రామ నామ జపం చేసుకుంటూ అడవుల బాట పడతాడు. ఈ ప్రయాణంలో లక్ష్మీనారాయణ ఎంతో మంది సాధువులను కలుసుకుంటారు. యుక్త వయసు వచ్చేసరికి అతడు నీమ్ కరోలి అనే గ్రామంలో హనుమంతుడి విగ్రహాన్ని ప్రతిష్టించి చాన్నాళ్లు అక్కడే ఉండిపోతాడు. దాంతో ఆయనకు నీమ్ కరోలి బాబా అనే పేరు స్థిరపడిపోయింది.

లక్ష్మీనారాయణ అనే పిల్లవాడు ఆధ్యాత్మిక బాట పట్టడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి? నీమ్ కరోలి బాబా అవతారం ఎప్పటినుంచి మొదలైంది? నీమ్ కరోలి బాబా మహిమలు ఏంటి? అనేది మిగిలిన కథ.

ఎలా ఉంది?

ఒకానొక సందర్భంలో నీమ్ కరోలి బాబా దయతో తాను ఒక రిస్క్ నుంచి ఎలా బయటపడింది అనేది నాస్తికుడైన డాక్టర్ రామానంద్ తన మనవడికి వివరిస్తున్న సంఘటనతో సినిమా ప్రారంభం అవుతుంది.

స్వతంత్ర పోరాటంలో పాలుపంచుకుంటున్నందుకు బ్రిటిష్ పోలీసులు తన కోసం వెతుకుతుండటంతో డాక్టర్ రామానంద్ ఒక మారుమూల గ్రామంలోని సత్రంలో దాక్కుంటాడు. భయంతో గదిలోనే ఉండటంతో వారం రోజుల నుంచి ఆహారం లేక ఆకలికి మలమల మాడుతూ ఉంటాడు. సరిగ్గా ఈ పరిస్థితుల్లో నీమ్ కరోలి బాబా వచ్చి అతడ్ని తన గదికి తీసుకెళ్లి కడుపు నిండా ఆహారం పెడతాడు. మరికాసేపట్లో పోలీసులు అక్కడికి రాబోతున్నారు కాబట్టి నైనిటాల్ వైపు వెళ్ళమని చెప్తాడు. సరిగ్గా ఆయన చెప్పినట్టే కాసేపట్లో బ్రిటిష్ పోలీసులు అక్కడికి వస్తారు. కానీ డాక్టర్ రామానంద్ అప్పటికే అక్కడినుంచి బయటపడతాడు. దేవుళ్ళను.. బాబాలను నమ్మని అతడు మొదటిసారి నీమ్ కరోలి బాబాకు చేతులెత్తి దండం పెడతాడు.

దర్శకుడు ఈ సన్నివేశం ద్వారా నీమ్ కరోలి బాబా పాత్ర పరిచయం చేస్తాడు. ఇక అక్కడ్నుంచి బాబా ప్రయాణం ఎలా సాగింది అనే విషయాలను వివరిస్తూ కథనం సాగుతుంది. చిన్న తనంలోనే బాబా తల్లి మరణించడం.. ఆ పిల్లవాడిలో ఆధ్యాత్మిక భావనలు కలగడం.. సీతారాముల ధ్యానం చేసుకుంటూ అడవుల బాట పట్టడం..ఈ ప్రయాణంలో సాధువులను కలుసుకోవడం వంటి అంశాలతో ఫస్టాఫ్ సాగుతుంది.

చిన్న తనంలో బాబా ను ఎవరూ సాధువుగా పరిగణించకపోగా ఎగతాళి చేస్తారు. ఒక సన్నివేశంలో ఆకలితో ఉన్న తోటి పిల్లలకు చిన్న బాబా తన చేతిలో అన్నం సృష్టించి పెట్టడంతో గ్రామస్తులు అందరూ అనాటి నుంచి అతడిలోని సాధువును గుర్తించి నమస్కారాలు చేస్తారు. అయితే ఈ బాబా ఏ ఒక్కచోట స్థిరంగా ఉండకుండా ఒకచోటి నుంచి ఇంకో చోటికి మారుతూ ప్రయాణం సాగిస్తూ ఉంటాడు.

ఇక సెకండాఫ్ నుంచి బాబా యుక్త వయసులో సాగిన ప్రయాణం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. నీమ్ కరోలి అనే గ్రామంలో చిన్న గుహ లాంటిది ఏర్పాటు చేసుకుని అందులోనే రోజుల తరబడి ఉంటూ ధ్యానం చేసుకోవడం.. ఎన్ని రోజులైనా బాబా బయటికి రాకపోవడంతో ఒక గ్రామస్తుడు గుహలోకి వెళ్ళి చూడగా ఒంటినిండా సర్పాలతో బాబా శివుడిలా కనిపించడం.. బ్రిటిష్ అధికారి అహంకారంతో కదులుతున్న రైలు నుంచి బాబాను దింపేసినప్పుడు.. రైలు ఎంతకీ ముందుకు కదలక అక్కడే ఆగిపోవడం.. తప్పు తెలుసుకున్న బ్రిటిష్ అధికారి బాబా ను క్షమించమని కోరడం.. భర్త ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని బాబా ఒక మహిళకు ముందుగానే చెప్పడం..ప్రాణాపాయం నుంచి ఆమె భర్తను కాపాడటం వంటి సీన్లు ఎమోషనల్ గా బాగా పండాయి.

దర్శకుడు సినిమాటిక్ లిబర్టీ తీసుకోకుండా సాధ్యమైనంత వరకు బాబా బయోగ్రఫీని ఉన్నది ఉన్నట్టుగా చూపించటానికి ప్రయత్నం చేశారు. నీమ్ కరోలి బాబా జీవిత చరిత్ర గురించి ఇప్పటికే ఇంటర్నెట్ లో పూర్తి సమాచారం ఉంది. దానికే దర్శకుడు చిత్ర రూపం ఇచ్చారు.

అయితే దర్శకుడు నీమ్ కరోలి బాబా బాల్యం నుంచి యుక్తవయసు వచ్చే వరకు మాత్రమే ఆయన జీవిత చరిత్ర ను టచ్ చేశారు. వృద్ధాప్యంలో బాబా గారి పయనం ఎక్కడి వరకు సాగింది? చివరికి బాబా ఎక్కడ స్థిర పడ్డారు? అనే విషయాలను సంపూర్ణంగా చూపించలేకపోయారు. బహుశా రెండో భాగంలో చూపిస్తారేమో ?

ఇంకోటి ఈ సినిమాలో గ్రాఫిక్స్ ఎక్కడా వాడలేదు.. నిజానికి ఈ సినిమాకి నీమ్ కరోలి బాబా అనే టైటిల్ పెడితే యాప్ట్ గా ఉండేది..హనుమాన్ అంశ్ అనే టైటిల్ పెట్టారు కానీ సినిమా అంతా బాబా జీవిత చరిత్ర ఆధారంగానే సాగుతుంది. రామాయణ చరిత్ర కానీ.. హనుమాన్ జీవిత చరిత్ర కానీ ఎక్కడా టచ్ చేయలేదు. సినిమా మొత్తంమీద బాబా గారు చెక్కిన ఒక హనుమాన్ శిలా విగ్రహం మాత్రం చూపిస్తారు.

చివర్లో మాత్రం నిజ జీవితంలోని నీమ్ కరోలి బాబా స్థాపించిన హనుమాన్ మందిరాలు.. ఆశ్రమాలు చూపిస్తారు. ఓవరాల్ గా ఈ సినిమా ఒక సాధువు కోణంలోనూ.. ఒక భక్తుడి కోణంలోనూ ఆవిష్కరించారు. దర్శకుడు సినిమాటిక్ లిబర్టీ తీసుకోలేదు కాబట్టి హనుమాన్ గ్రాఫిక్కులు వాడలేదు అనుకుంటా.

ఎవరెలా చేశారు?

ఈ సినిమా మొత్తం నీమ్ కరోలి బాబా కనిపిస్తారు. ఆ పాత్రలో సోభినవ్ సత్య బాగానే నటించారు కానీ ఓవరాల్ గా చూస్తే ఇంకా బాగా నటించాల్సింది అనిపిస్తుంది. మిగిలిన వాళ్ళు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతికత

సాదు సుశీల్ తివారీ అందించిన సంగీతం డివోషనల్ లైన్ కు తగ్గట్టుగా బాగానే ఉంది.
విశాల్ ఫోటోగ్రఫీ కూడా బాగానే ఉంది.
ఇలాంటి సినిమాలకు ఉండాల్సిన స్థాయిలో అయితే నిర్మాణ విలువలు లేవు.. యావరేజ్ గా ఉన్నాయి.

విశ్లేషణ

హనుమాన్ అంశ థియేటర్లలో రిలీజ్ అయినప్పుడు విపరీతమైన పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.. రెండు కోట్లతో తీసిన ఈ సినిమా 400 కోట్లకు పైనే వసూలు చేసి రికార్డులు తిరగ రాసిందని వార్తలు బయటికి వచ్చాయి.

బహుశా థియేటరిక్ ఎక్స్పీరియన్స్ సినిమాని ఒక మెట్టు పైన నిలిపి ఉంటుంది. కానీ ఓటీటీలో చూస్తే మాత్రం ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ గా అనిపిస్తుంది.

దర్శకుడు నేల విడిచి సాము చేయకుండా ఒక సాధువు కోణంలో కథను ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.. ఈ సినిమాలో ఎక్కడా కమర్షియల్ హంగులు ఉండవు. అందుచేతనేమో ఓటిటిలో చూస్తున్నప్పుడు గూస్ బంప్స్ లాంటి ఫీలింగ్ రాలేదు.. ఒకట్రెండు సన్నివేశాలు మాత్రం ఎమోషనల్ గా కనెక్ట్ అయి భావోద్వేగాలను పంచుతుంది. క్లైమాక్స్ మాత్రం అసంపూర్తిగా ముగించినట్టు అనిపించింది.

కాబట్టి థియేటర్ రిలీజ్ నాటి భారీ అంచనాలు ఏమీ పెట్టుకోకుండా సోనీ లివ్ ఓటిటిలో ఈ సినిమా చూడండి.

నటీనటులు: సోభినవ్ సత్య , చందన్ ఆనంద్ , రాజీవ్ మిశ్రా తదితరులు
సంగీతం: సాధు సుశీల్ తివారీ
సినిమాటోగ్రఫీ: విశాల్ భవ
నిర్మాత: రాగిణి సోనా
దర్శకత్వం: విశాల్ చతుర్వేది
ఓటీటీ: సోనీ లివ్
స్ట్రీమింగ్ డేట్: 27-11-2026
రేటింగ్: 2.75/5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *