మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి.. తమిళ్ హీరో ధనుష్..నసీరుద్దీన్ షా..ఇంద్రాన్స్.. సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ఓం మూవీ (OM Movie) ఈరోజు (నవంబర్ 20, 2026 ) ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయ్యింది.
ఈ సినిమాలో మమ్ముట్టితో పాటు ధనుష్.. నసీరుద్దీన్ షా .. ఇంద్రాన్స్ ..సాయి పల్లవి వంటి తారాగణం నటించడం.. ధనుష్ నటించి నిర్మించిన సినిమా కావడంతో ఈ పాన్ ఇండియా సినిమా మీద విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే అందరి అంచనాలకు తగినట్టుగా సినిమా ఉందో లేదో ఇప్పుడు చూద్దాం.
కధేంటంటే?
కథ ఏపీ.. తమిళనాడులలో జరుగుతున్న ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుంది.
సినిమా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్రను పోలిన సూర్య ప్రతాప్ నాయుడు ప్రమాణ స్వీకారంతో మొదలై క్లైమాక్సులో హీరో ధనుష్ కు మెడల్ ఇవ్వడంతో ముగుస్తుంది.
నూతన ముఖ్యమంత్రిగా సూర్య ప్రతాప్ నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజునే ఏపీ తమిళనాడు రాష్ట్రాలను కేంద్రంగా చేసుకుని జరుగుతున్న ఎర్ర చందనం స్మగ్లింగ్ రాకెట్ ను చేధించాలని పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటారు.
ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్న పెద్ద తలకాయలను పట్టుకునే బాధ్యత నిత్యారెడ్డి (సాయి పల్లవి) అనే ఐపీఎస్ ఆఫీసర్ కు అప్పగిస్తారు. ఈ కేసును టేకప్ చేసిన నిత్యారెడ్డి ఆపరేషన్ మోల్ పేరుతో అండర్ కవర్ ఆపరేషన్ ఏజెంట్ ను నియమిస్తుంది.
నిత్యారెడ్డి ఇన్వెస్టిగేషన్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ లో తమిళనాడుకు చెందిన కార్తికేయన్ (మమ్ముట్టి) , ఏపీలో కడపకు చెందిన గోవర్ధన రెడ్డి (శివాజీ రాజా ) , దుబాయిలో ఉంటున్న అబ్దుల్ హమీద్ ల ( నసీరుద్దీన్ షా ) పాత్ర ఉంటుందని తెలుసుకుంటుంది.

వీళ్ళని పట్టుకోవడానికి నిత్యారెడ్డి నియమించిన అండర్ కవర్ ఆపరేషన్ ఏజెంట్ ఎవరు? ఫోటోగ్రాఫర్ పేరుతో కార్తికేయన్ కు దగ్గరైన తిరు (ధనుష్) అసలు రూపం ఏంటి? కార్తికేయన్ ఎర్ర చందనం స్మగ్లింగ్ లోకి దిగడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి? చివరకు నిత్యారెడ్డి ఆపరేషన్ మోల్ పేరుతో చేపట్టిన ఆపరేషన్ లక్ష్యాన్ని సాధిస్తుందా? అనేది మిగిలిన కథ.
ఎలా ఉంది?
ఏపీ..తమిళనాడులలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా కథ రాసుకున్నట్టు సినిమా ప్రారంభంలోనే దర్శకుడు చెప్పేశారు. ఆయన చెప్పిన వాస్తవ సంఘటనలు కూడా మనకు తెలిసినవే.. రెండు రాష్ట్రాల పరిధిలోని కొన్ని అడవులను లక్ష్యంగా చేసుకుని కొంతమంది ఎర్ర చందనం చెట్లను నరికి విదేశాలకు తరలించి కోట్లు సంపాదిస్తున్నారనే సంగతి కూడా మనకు తెలిసిందే.
ఇంతకుముందు వీరప్పన్.. పుష్ప వంటి సినిమాల్లో ఈ ఎర్ర చందనం స్మగ్లింగ్ కథలు చూసేసాం. కాబట్టి ఓం సినిమా కథ మనకు తెలియని కొత్త కథేమీ కాదు. అయితే గత సినిమాలకూ..ఈ సినిమాకూ ఉన్న చిన్న వ్యత్యాసం ఏంటంటే.. ఈ సినిమాలో కూలి డబ్బుల కోసం ఎర్ర చందనం చెట్లను నరికే కూలీల కోణాన్ని దర్శకుడు బలంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు.
గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేసే బడా నేతలు రాజకీయంగా పెద్ద పొజిషన్లలోనో.. ఆర్ధికంగా సెటిల్ అయి విదేశాల్లోనో ఉంటారు కదా.. మరి గంధపు చెట్లను నరికే కూలీల పరిస్థితి ఎలా ఉంటుంది? కూలీ సంగతి దేవుడెరుగు.. పోలీస్ కేసులు అవుతాయి..ఒక్కోసారి అదే పోలీసుల చేతుల్లో ప్రాణాలు కూడా పోతాయి. రిస్క్ తీసుకునేది కూలీలు అయితే డబ్బులు సంపాదించి సుఖపడేది బడా నేతలు.. వారిలో దుబాయిలో ఉండే అబ్దుల్ హమీద్.. కడప గోవర్ధన రెడ్డి.. కార్తికేయన్ లాంటి వారు ఎందరో? ఈ పాయింటులో కధనం నడుస్తుంది.
ఇక సినిమా ప్రారంభమే కార్తికేయన్ ను అరెస్ట్ చేయడానికి వచ్చిన ఏపీ పోలీసులను ధనుష్ నేతృత్వంలో అక్కడి కుర్రాళ్ళు తరిమి కొట్టడంతో మొదలౌతుంది. ఆ తర్వాత మరో పావుగంటలో కథ మొత్తం మనకి తెలిసిపోతుంది.. ఇంక ఆ తర్వాత చెప్పుకోవడానికి ఏముంటుంది? అసలే తెలిసిన కథ.. ఆపైన దర్శకుడు తను చెప్పాలనుకున్న కథను మొదటి అర్థగంటలోనే చెప్పేశారు? ఇంక క్యూరియాసిటి ఏముంటుంది?
అసలు విషయం చెప్పేముందు కనీసం పోకిరీలో మహేష్ బాబు.. పూరి జగన్నాథ్ ల మాదిరి క్లైమాక్స్ వరకు ఆగొద్దూ? ధనుష్ పాత్ర ఏంటో ముందే తెలిసిన తర్వాత మిగిలిన డ్రామా ఏంటో మనకు తెలియకుండా ఉంటుందా? కొంచం గుప్పిట ఉంచుకోవద్దూ? మూసి ఉన్నంత వరకే గుప్పిటలో ఏం ఉందో అన్న యంగ్జైటీ మనకు ఉంటుంది.. ఒకసారి గుప్పిట తెరిచిన తర్వాత ఇంకేముంటుంది? ఈ సినిమాలో జరిగింది అదే.. ఎప్పుడు గుప్పిట మూయాలో.. ఎప్పుడు గుప్పిట తెరవాలో అనే విషయంలో దర్శకుడు తడబడ్డాడు.
ఇక ఈ సినిమాలో నటించిన ధనుష్.. మమ్ముట్టి.. సాయి పల్లవి లు వయసులో తేడాలు ఉన్నా నటనలో మాత్రం హేమాహేమీలే.. కొన్ని కటౌట్లకు ఉండే బ్రాండ్ వాల్యూలు మామూలుగా ఉండవు. వాడుకున్న వాళ్లకు వాడుకున్నంత.. అటువంటి వారిలో మమ్ముట్టి.. మోహన్ లాల్.. రజనీ కాంత్.. కమల్ హాసన్ లాంటి వాళ్ళు కొందరున్నారు.
జైలర్ 2 చూడండి.. తలైవాని దర్శకుడు బాగా వాడుకున్నాడు.. కేవలం ఆయన బొమ్మని పెట్టుకుని వీర ఎలివేషన్లతో..భారీ బిజిఎంతో హిట్ కొట్టాడు. దీన్నే వాడుకోవడం అంటారు. ఎందుకో ఈ సినిమాలో మమ్ముట్టిని పూర్తిస్థాయిలో వాడుకోలేదు అనిపిస్తుంది.
మమ్ముట్టి నుంచి ప్రేక్షకులు ఆశించే పంచ్ డైలాగులు లేవు.. భారీ ఎలివేషన్లు లేవు.. ఈ సినిమాలో మమ్ముట్టి గంధపు చెక్కల డాన్ లా అనిపించడు.. ఒక అమాయకమైన ఫ్యామిలీ మ్యాన్ మాదిరి అనిపిస్తాడు. ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ మాఫియా నడిపేవాడికి బిజినెస్ ఎలా చేయాలో తెలీదు.. కాస్త పరిచయంలోనే ఓ అపరిచితుడికి తన రహస్యాలన్నీ చెప్పేస్తాడు. పైగా ఆ కుర్రాడి దగ్గరే పాఠాలు నేర్చుకుంటూ ఉంటాడు.. కార్తికేయన్ ఎక్కడుంటాడో పోలీసులకు తెలుసు.. అయినా అరెస్ట్ చేయరు.. మొదట్లో ఓ ప్రయత్నం చేస్తారులెండి.. లాజికల్ గా ఈ సన్నివేశాలు కన్విన్సింగ్ గా అనిపించవు.
ఈ మధ్యలో శ్రీలీల గోల చిరాకు తెప్పిస్తుంది.. ఒకటో క్లాసు పిల్ల మాదిరి డబ్బింగ్ చెప్పడం శ్రీలీల మానుకోవాలి. తాతా మనవళ్ళ మధ్య నడిచే సన్నివేశాలు మనల్ని కొద్దిగా టచ్ చేస్తాయి.
ఇంటర్వెల్ దాకా ఈ ప్రహసనం నడుస్తుంది. అయినా యాక్షన్ సన్నివేశాలే కాబట్టి మనకు పెద్దగా బోర్ కొట్టదు.. యాక్షన్ సీన్స్ అయిపోయిన తర్వాత దర్శకుడు సెకండాఫ్ లో అదనంగా ఎమోషన్స్ సీన్స్ లోకి మనల్ని తీసుకెళ్తాడు.
ఎన్కౌంటర్ లో ధనుష్ తండ్రి చనిపోవడం.. గంధపు చెట్లను నరికే మలయాళీ కూలీల కష్టాలు.. ధనుష్ రివెంజ్ మోడ్ లోకి టర్న్ అవడం వంటి సన్నివేశాలలో దర్శకుడు కూలీల మీద ఫోకస్ పెట్టారు. నిజానికి దర్శకుడు ఈ సినిమాలో చెప్పాలనుకుంది ఈ కూలీల గురించే.. కానీ ఆ విషయం చెప్పడానికి సెకండాఫ్ దాకా టైమ్ తీసుకున్నాడు.
సెకండాఫ్ లో మమ్ముట్టి గ్యాంగును పట్టుకోవడానికి సాయిపల్లవి స్పెషల్ ఫోర్స్ తో ఎటాక్ చేసిన సీన్ బాగానే ఉంది కానీ గూస్ బంప్స్ అంటారే.. అలాంటి ఫీల్ అయితే రాలేదు. నిజానికి ఈ సినిమాలో ఆ సీన్ హైలెట్ అవ్వాలి.. కానీ ఎక్కడో ఏదో మిస్ అయ్యింది.
ముందునుంచీ కథనం ప్రిడిక్టబుల్ గా సాగుతుంది కాబట్టి కనీసం మమ్ముట్టితో ఇలాంటి యాక్షన్ సీన్ల కోసం మనం ఎదురు చూస్తాం. కానీ ఈ విషయంలో కూడా ఆశించిన స్థాయిలో సంతృప్తి కలగలేదు. ఇక క్లైమాక్స్ అయితే రొటీన్ ఫార్మాట్లో ముగిసి థ్రిల్ పంచలేదు.. మమ్ముట్టి అప్రూవర్ గా మారాడు కాబట్టి అంతే అనుకోవాలి.
ఎవరెలా చేశారు?
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి రేంజ్ తెలిసిన అభిమానులు ఆయన నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఈ సినిమాలో కార్తికేయన్ పాత్రలో మమ్ముట్టిని చూస్తుంటే ఒక సాదాసీదా క్యారక్టర్ ఆర్టిస్టు మాదిరి అనిపించాడే కానీ ఆయన మార్క్ స్టైల్ కనిపించలేదు. ఇది మమ్ముట్టి తప్పు కాదు.. ఆయన నుంచి పూర్తిస్థాయిలో నటన రాబట్టుకోలేకపోయిన దర్శకుడి వైఫల్యం.
ధనుష్ నటన ఎప్పటిలా బాగానే ఉంది.. ఓ పాటలో ప్రభుదేవా స్టైల్ లో స్టెప్పులు వేసి అదరగొట్టాడు.
నసీరుద్దీన్ షా పాత్రను ఇంకా పవర్ఫుల్ గా రాసుకుంటే బాగుండేది. ఇంద్రాన్స్ నటన బాగుంది.
సాయి పల్లవి చక్కటి యాక్టర్.. ఆమె చేత కర్తవ్యం విజయశాంతి రేంజిలో నిత్యారెడ్డి ఐపీఎస్ అనే పాత్రను వేయించారు.. కానీ పోలీస్ గెటప్ తనకి అంతగా సూట్ కాలేదనిపిస్తుంది. అయినా క్లైమాక్స్ సీన్ లో చక్కటి పెర్ఫార్మెన్స్ చూపించింది.
ఇక శ్రీలీలకు సరైన స్కోప్ దక్కలేదు అనిపిస్తుంది. ధనుష్ భార్య పాత్రలో ఆమె పాత్ర పరిమితంగా ఉంది.
మమ్ముట్టి భార్యగా రేణు దేశాయ్ నటన బాగుంది.. ఇకపై రేణు దేశాయ్ రెగ్యులర్ గా సినిమాల్లో నటించవచ్చు.
మిగిలిన వాళ్ళు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతికత
సాయి అభ్యంకర్ అనిందించిన సంగీతం బాగానే ఉంది కానీ యాక్షన్ సీన్లను మరో మెట్టు ఎక్కించే స్థాయిలో మాత్రం లేదు.. యాక్షన్ సీన్లలో పెర్ఫెక్ట్ బిజిఎం తోడైతే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేది.
ఎజిల్ అరసు ఫోటోగ్రఫీ కూడా బాగానే ఉంది.
నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి.
విశ్లేషణ
ఏపీ.. తమిళనాడు రాష్ట్రాల్లో జరుగుతున్న గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా దర్శకుడు కథ అల్లుకుని తెరకెక్కించారు. ఓకే.. అంతవరకు బాగానే ఉంది..దర్శకుడు పదేపదే చంద్రబాబును పోలి ఉన్న పాత్రను చూపించడం వెనుక ఉదేశ్యం ఏమై ఉంటుంది? ఎర్ర చందనం స్మగ్లింగ్ అనేది అంతకుముందూ ఉంది.. ఇప్పుడూ ఉంది.. అదో నిరంతర ప్రక్రియ.
అయితే సినిమాలో ఓ పాత్ర ద్వారా సూర్య ప్రతాప్ నాయుడు (చంద్రబాబు) సీఎం అయిన తర్వాత ఎర్ర చందనం స్మగ్లర్ల మీద ఫోకస్ పెట్టారని చెప్పిస్తారు. అదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టు బ్యాక్ గ్రౌండ్లో చూపిస్తారు. పోలీస్.. క్రిమినల్స్ మధ్య నడిచే కథలో దర్శకుడు ప్రత్యేకంగా చంద్రబాబు ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చినట్టు? ఓకే.. చూపిస్తే చూపించారు.. అలాంటప్పుడు చంద్రబాబు పాత్రను మరింత బాగా కనెక్ట్ అయ్యేలా చూపించాలి కదా ? ప్యారడైజ్ లో ప్రియదర్శి వేసిన కేసీఆర్ పాత్ర పేలినట్టు ఇందులో ఆ పాత్ర పేలలేదు.
ఈ మధ్య ప్యారడైజ్ సినిమాలో కూడా ప్రియదర్శితో కేసీఆర్ ను పోలిన పాత్రను చేయించి పొలిటికల్ వర్గాలను కూడా ఆకర్షించారు.. ఈ సినిమా విషయంలో కూడా దర్శకుడు అదే ఫార్ములాను ఫాలో అయ్యారేమో అనిపిస్తుంది.
ఇక రాయలసీమ వాసులను ఫ్యాక్షన్ నేపధ్యంలో చూపించడం పట్ల ఇప్పటికే అక్కడి వారు సోషల్ మీడియా వేదికల ద్వారా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రత్యేకంగా కడపకు చెందిన గోవర్ధన రెడ్డి అంటూ శివాజీ రాజాతో వేయించిన స్మగ్లర్ పాత్ర పట్ల వారి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి?
ఓవరాల్ గా ఓం సినిమా ఒక యాక్షన్ మోడ్ లో రన్ అవుతుంది. ఎర్ర చందనం కూలీల కష్టాలు దర్శకుడు కళ్ళకు కట్టినట్టు చూపించారు.
నటీనటులు: మమ్ముట్టి , ధనుష్, నసీరుద్దీన్ షా , ఇంద్రాన్స్ , సాయి పల్లవి, శ్రీలీల, రేణు దేశాయ్ తదితరులు
సంగీతం : సాయి అభ్యంకర్
సినిమాటోగ్రఫీ : కె ఎజిల్ అరసు
నిర్మాత : శ్రద్దా అగర్వాల్ , ధనుష్
దర్శకత్వం : రాజ్ కుమార్ పెరియస్వామి
థియేటర్ విడుదల: 20-11-2026
రేటింగ్: 2.75/5
