దుల్కర్ సల్మాన్.. సాత్విక వీరవల్లి ప్రధాన పాత్రల్లో నటించిన ఆకాశంలో ఒక తార సినిమా (Aakasamlo oka Tara Movie) 20-11-2026 న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. అదే రోజు దుల్కర్ సల్మాన్ తండ్రి మమ్ముట్టి నటించిన ఓం సినిమా కూడా థియేటర్లలో రిలీజ్ అయ్యింది.
ఓవరాల్ గా తండ్రీ కొడుకుల సినిమాలలో కొడుకు సినిమానే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఇందుకు కారణం కథే.
ఇప్పుడు ఆకాశంలో ఒక తార ఎలా ఉందో చూద్దాం.
కధేంటంటే?
గోదావరి జిల్లా పాలలంక గ్రామానికి చెందిన కల్పన ( సాత్విక వీరవల్లి ) చిన్నతనం నుంచే తాను బాగా చదువుకుని పెద్దయ్యాక ఆస్ట్రోనాట్ కావాలని కలలు కంటూ ఉంటుంది. తన లక్ష్యాన్ని గురించి స్కూల్లో చెప్పినప్పుడు చాలామంది ఎగతాళి చేస్తారు. నువ్వున్న పరిస్థితుల్లో పాలలంక దాటటమే కష్టం.. అలాంటిది అంతరిక్షంలోకి ఎలా వెళ్తావ్? అంటూ సూటిపోటి మాటలు అంటారు. ఎవరెంత హేళన చేసినా కల్పన మాత్రం కుంగిపోకుండా తన లక్ష్యాన్ని మరింత దృఢం చేసుకుంటుంది.
పదో తరగతి జిల్లా ఫస్టులో పాసైన కల్పనను ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా పై చదువులకు పంపకుండా ఆమె తండ్రి క్యాబ్ డ్రైవర్ అయిన కృష్ణకు (దుల్కర్ సల్మాన్ ) ఇచ్చి పెళ్లి చేస్తాడు. తండ్రి వల్ల తన లక్ష్యానికి చేరువ కాలేకపోతున్నానని బాధ పడుతున్న కల్పనకు కృష్ణ అండగా నిలబడతాడు. ఆస్ట్రోనాట్ కావాలనే ఆమె లక్ష్యానికి కృష్ణ అన్ని విధాలుగా సహకారం అందిస్తాడు.

భర్త కృష్ణ సహకారంతో కల్పన తన లక్ష్యాన్ని చేరుకుంటుందా? కల్పన లక్ష్యానికి మద్దతుగా నిలబడిన కృష్ణ నాలుగేళ్ల పాటు ఆమెకు దూరంగా గుజరాత్ ఎందుకు వెళ్లాల్సి వస్తుంది? ఆస్ట్రోనాట్ కావాలనే లక్ష్యంలో కల్పన ప్రయాణం ఎలా సాగుతుంది? చివరకు కల్పన తన లక్ష్యాన్ని చేరుకుంటుందా? అనేది మిగిలిన కథ.
ఎలా ఉంది?
చిన్నప్పుడు మన స్కూల్ బయట కర్రకు చిన్న టెలి స్కోప్ యంత్రంలాంటిది తగిలించుకుని పావలా ఇస్తే అందులోనుంచి అంతరిక్షం చూపించే వ్యక్తి గుర్తున్నాడా? అప్పట్లో ఆ చిన్న ప్రొజెక్టర్ లాంటి యంత్రంలో కన్ను పెట్టి ఆకాశంలో నక్షత్రాలను..చందమామను చూసి వావ్ అని ఆశ్చర్యపోయాం కదా? ఎస్.. మనలో చాలామందికి అదొక వినోద సాధనం.. కానీ కల్పన లాంటి అమ్మాయికి మాత్రం అదొక కలల సాధనం.
అందుకే దర్శకుడు మన చిన్ననాటి జ్ఞాపకంతోనే ఆకాశంలో ఒక తార చూపించారు. సినిమా ప్రారంభంలో నాజర్ పాలలంక గ్రామానికి వచ్చి అక్కడి స్కూల్ పిల్లలకు తన దగ్గరున్న ప్రొజెక్టర్ తో అంతరిక్షాన్ని చూపించి ఎడ్యుకేట్ చేయాలనుకుంటాడు. ఆ ప్రదర్శనను చూసిన పిల్లలందరూ చప్పట్లు కొట్టి వెళ్ళిపోతారు.. ఒక్క కల్పన తప్ప.
అప్పుడా పిల్ల ” అలా అంతరిక్షంలోకి వెళ్లాలంటే నేను ఏం చదవాలి?” అని అమాయకంగా అడుగుతుంది. ఆ పిల్ల లక్ష్యాన్ని గుర్తించిన నాజర్ ఆమెకు కల్పనా చావ్లా ఫోటో ఇస్తూ ఆస్ట్రోనాట్ అవమని చెప్తాడు.
ఎక్కడో మారుమూల పల్లెలో ఉన్న ఒక చిన్నపిల్ల తాను పెద్దయ్యాక ఆస్ట్రోనాట్ అవుతానంటే అందరూ ఎగతాళి చేసిన వాళ్ళే.. ఒక్క నాజర్ మినహా.. నువ్వు పెద్దయ్యాక ఆస్ట్రోనాట్ అయి కల్పనా చావ్లా అంత పేరు తెచ్చుకోవాలి అని ఆశీర్వదిస్తాడు. అందుకే ఆ పిల్లకు నాజర్ అంటే అంత గౌరవం..అంతరిక్షంలోకి అడుగుపెట్టిన కల్పన తన కృతజ్ఞతలను తెలియచేసే సన్నివేశాన్ని దర్శకుడు అద్భుతంగా మలిచాడు. తాను ఒక వ్యక్తితో ప్రత్యేక కాల్ ద్వారా మాట్లాడాలనుకుంటున్నాని అంతరిక్షం నుంచి కల్పన కోరడంతో ఆమెకు నాజర్ తో మాట్లాడటానికి కనెక్ట్ చేస్తారు. నిజంగా ఈ సన్నివేశం సినిమాకే హైలెట్.. కల్పన కాల్ తో ఆనందం పట్టలేని నాజర్ “అంతరిక్షం నుంచి భూమి ఎలా కనిపిస్తుంది?” అని ఆమెను అడుగుతాడు.
“చెప్పడం కాదు.. భూమి ఎలా ఉందో మీరు కూడా చూడండి మాస్టారూ ” అంటూ కల్పన అంతరిక్షం నుంచి భూమిని చూపిస్తుంది. నిజంగా ఫోటోగ్రఫీ పని తీరు గురించి చెప్పుకోవాలంటే ఈ ఒక్క సన్నివేశం చాలు.. భూమిని అంత అందంగా ఇంకెవరూ చూపించలేరేమో? కథతో పాటు ఇలాంటి చిన్న చిన్న విజువల్ వండర్స్ ప్రేక్షకులని బాగా ఎంగేజ్ చేస్తాయి.
దర్శకుడు సాధినేని పవన్ అద్భుతమైన దర్శకత్వ ప్రతిభ ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది.. ఏ సన్నివేశం చూసినా ఫ్రెష్ గానే కనిపిస్తుంది. పాలలంక గ్రామంలో కథను మొదలు పెట్టి అమెరికా స్పేస్ సెంటర్ దాకా.. అక్కడ్నుంచి అంతరిక్షం దాకా నడిపించిన కథనంలో ఎక్కడా అపశృతులు లేవు.. కథతో పాటు మనల్నీ అంతరిక్షంలోకి తీసుకెళ్లిన అనుభూతి కలుగుతుంది.
కొన్ని సినిమాల్లో కథ ఎంత బాగున్నా పాత్రల ఎంపికలో పొరపాటు చేస్తే వ్రతం చెడి ఫలితం కూడా దక్కదు. కానీ ఈ సినిమా కోసం దర్శకుడు ఎంపిక చేసిన క్యాస్టింగ్ పెర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. ఈ పాత్రకు వీళ్ళు అవసరం లేదు అని మనం అనుకునే పని లేకుండా ప్రతి పాత్రనూ జాగ్రత్తగా రాసుకున్నారు.
ఆస్ట్రోనాట్ అనేది అందరికీ అర్థమయ్యే సబ్జెక్ట్ కాదు.. కానీ సామాన్యులకు కూడా అర్థమయ్యేలా దర్శకుడు స్క్రీన్ ప్రెజెన్స్ చేసిన విధానం బాగుంది. ఎంతవరకు ఆస్ట్రోనాట్ క్లాసులు చూపించాలో అంతవరకే చూపించడంతో మనకు విసుగు అనేది రాదు..
చదువంటే ప్రేమ ఉన్న కృష్ణ.. అదే చదువును నమ్ముకుని ఆస్ట్రోనాట్ కావాలనే భార్య కల్పన.. ఈ రెండు పాత్రలే సినిమాని నడిపించాయి. కృష్ణ గారూ అంటూ భార్య.. అమ్మలు అంటూ భర్త పిలుచుకోవడం ఎంత బాగుందో.. ఆ అమాయకత్వం.. ఆ మంచితనం మనల్ని భలే కట్టిపడేస్తాయిలే.
భార్య చదువులకు అవసరమయ్యే ఫీజులు కట్టడానికి కృష్ణ గుజరాత్ లో ట్రక్ డ్రైవర్ పనికి కుదిరినప్పుడు అతడికి హిందీ మాట్లాడే బిజిలి (రుహాని శర్మ ) పరిచయం అవుతుంది. ఈ ఇద్దరి మధ్య అనుబంధాన్ని కూడా లైన్ దాటకుండా చక్కగా చూపించారు.
కల్పన తన లక్ష్య సాధనలో ఎన్నో అవమానాలను.. హేళనలను.. ఎదుర్కొన్నా భర్త కృష్ణ ఇచ్చిన సహకారంతో వాటన్నిటినీ అధిగమించి ముందుకు వెళ్తుంది. ఇలాంటి కథనానికి గుండె తడి చేసే సంభాషణలు మరింత బలాన్ని ఇచ్చాయి. చాలాచోట్ల ఒకట్రెండు వాక్యాలలో చక్కటి డైలాగులు పడ్డాయి.
ఒక సన్నివేశంలో కల్పన తన తండ్రితో మాట్లాడుతూ ” అమ్మని నువ్వు పెట్టిన హింసలకు అసలు నిన్ను క్షమించకూడదు నాన్నా.. కానీ కృష్ణ గారిలాంటి దేవుడ్ని నాకు భర్తగా అందించి కోపానికి అవకాశం లేకుండా చేశావు నాన్నా” అంటూ ఏడుస్తుంది.
ఆడపిల్ల అంటే గుండెల మీద భారం అనుకుని ఆమె ఆశయాలను.. లక్ష్యాలను పట్టించుకోకుండా చిన్న వయసులోనే పెళ్ళి చేసే ప్రతి ఒక్క తల్లితండ్రులు చూడాల్సిన సినిమా ఇది. తల్లో.. తండ్రో.. భర్తో.. ఎవరో ఒకరు ఆడపిల్ల లక్ష్యాలకు అండగా నిలబడితే కల్పనా చావ్లా లు మరింత మంది పుట్టుకొస్తారు అనడంలో సందేహం లేదు.
నిజానికి నిజ జీవితంలో కూడా గోదావరి జిల్లాకు చెందిన ఒక అమ్మాయి తన బామ్మ ఇచ్చిన ప్రోత్సాహంతో బాగా చదువుకుని నాసా స్పేస్ సెంటర్ లో ట్రైనీ ఆస్ట్రోనాట్ హోదాలో జాయిన్ అయ్యిందని ఎప్పుడో వార్తల్లో చదివా.. కానీ దర్శకుడు నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందించినట్టు ఎక్కడా క్రెడిట్స్ ఇవ్వలేదు. నిజ జీవితంలో ఆస్ట్రోనాట్ గా ఎదిగిన ఆ గోదావరి జిల్లా అమ్మాయిని కూడా చూపించి ఉంటే బాగుండేది.
ఓవరాల్ గా మొదటినుంచి క్లైమాక్స్ వరకు ఒక చక్కటి సినిమా చూసిన అనుభూతి మనకు కలుగుతుంది. ముఖ్యంగా జీవితంలో తమకంటూ కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకున్న ఆడపిల్లలు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. ఆడపిల్లలే కాదు.. వారి తల్లితండ్రులు కూడా చూడాల్సిన్ సినిమా.. అలాగే నేటి సమాజానికి కృష్ణ లాంటి వ్యక్తుల అవసరం కూడా ఉందని సినిమా నిరూపిస్తుంది.
ఎవరెలా చేసారు ?
కృష్ణ ..కల్పన అనే రెండు బలమైన పిల్లర్లకు సపోర్టింగ్ గా ఇంకొన్ని పిల్లర్లను దింపి దర్శకుడు ఆకాశంలో ఒక తారకు గట్టి పునాదులు ఏర్పరిచాడు. కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్ పూర్తిగా ఒదిగిపోయాడు. మొదటినుంచి క్లైమాక్స్ వరకు చాలా సెటిల్డ్ గా నటించాడు. ముఖ్యంగా బిజిలితోను ..రోహిణితో ఉన్న సన్నివేశాలు బాగా పండాయి.
ఇక కల్పన పాత్రలో సాత్విక వీరవల్లి నటన చాలా బాగుంది. మొదటి సినిమాతోనే దుల్కర్ సల్మాన్ లాంటి ఇమేజ్ ఉన్న నటుడి పక్కన నటించడం ఆమె అదృష్టం. అయితే అదృష్టం సంగతి పక్కనబెట్టి నటిగా సాత్విక ప్రూవ్ చేసుకుంది. ముఖ్యంగా కృష్ణ గారు అంటూ ముఖంలో ఆమె పలికించిన భావాలు బాగున్నాయి.
రోహిణి పాత్రలో శృతిహాసన్ కు కూడా మంచి రోల్ దక్కింది. తనకు దక్కిన పాత్రకు శృతిహాసన్ న్యాయం చేసింది. ఫస్టాఫ్ లో కనిపించిన బిజిలి పాత్రలో రుహానీ శర్మ నటన కూడా బాగుంది.
మురళి శర్మ , చైతన్య జొన్నలగడ్డ నటన షరా మాములుగా ఉంది.
సాంకేతికత
జీవి ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా అంతరిక్షం సీన్లలో బిజిఎం చాలా బాగుంది.
అలాగే సుజిత్ సారంగ్ అందించిన ఫోటోగ్రఫీ అద్భుతంగా ఉంది.. ముఖ్యంగా అంతరిక్షం నుంచి భూమిని చూపిస్తున్న సీన్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తుంది.
నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
విశ్లేషణ
మీకు ట్రాన్స్ఫార్మర్లు పగిలిపోయే హీరో ఎలివేషన్లు కావాలా? చెవులు పగిలిపోయే డ్రమ్ముల మోత కావాలా? టీఎంసీల లెక్కన పారే రుధిరం సీన్లు కావాలా? సొరకాయ కోతలు.. బీరకాయ మూతలు కావాలా? హీరో పక్కన గెంతులేసే అర్థనగ్న హీరోయిన్ కావాలా?.. ఐటమ్ సాంగులు కావాలా? అయితే ఈ సినిమా చూడకండి. డిజప్పాయింట్ అవుతారు.
ఆస్ట్రోనాట్ కావాలనే లక్ష్య సాధనలో పాలలంక గ్రామం నుంచి అంతరిక్షం దాకా ఒక మామూలు పల్లెటూరి అమ్మాయి సాగించిన అద్భుతమైన ప్రయాణం చూడాలనుకుంటున్నారా? ఆ అమ్మాయి లక్ష్య సాధనలో కృష్ణ లాంటి మంచి వ్యక్తి అందించిన ప్రోత్సాహం చూడాలనుకుంటున్నారా? అయితే ఆకాశంలో ఒక తార చూడండి..నచ్చుతుంది.
నటీనటులు : దుల్కర్ సల్మాన్ , సాత్విక వీరవల్లి , శృతిహాసన్ , రుహాని శర్మ , మురళి శర్మ , చైతన్య జొన్నలగడ్డ తదితరులు
సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్
నిర్మాత: సందీప్ గుణ్ణం
దర్శకత్వం: పవన్ సాధినేని
థియేటర్ విడుదల: 20-11-2026
రేటింగ్: 3.5 /5
