ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల తీరు ఇంతేనా?-AP Local Body Elections

Spread the love

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది మొదలు కలుగులో దాక్కున్న రౌడీలు బయటికి వచ్చేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలంటే రాజకీయ నాయకులకు పని. కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుతం ఆ దశ దాటి రౌడీలకు పని కలిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

ఇక ఈ ఎపిసోడ్లో రాజకీయ నాయకులు సేఫ్ అయితే నిందలు పడేది మాత్రం పోలీసులు. ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా వారి ఆరోపణలకు పోలీసులే మొదటి టార్గెట్ అవుతున్నారు.

మీరు గమనించండి.. ఇదే పోలీసులను తాము అధికారంలో ఉన్నప్పుడు పల్లెత్తు మాట అనని నాయకులు..ప్రతిపక్షంలోకి రాగానే ప్రభుత్వ తొత్తులు అనే ట్యాగ్ తగిలిస్తారు. రాజకీయ నాయకులు ఆడే ఈ ఆటలో బలి పశువులు అయ్యేది పోలీసులు.. రౌడీలే.

పుంగనూరులో మొదలైన గొడవ

అన్నమయ్య జిల్లా పుంగనూరు నామినేషన్ కేంద్రంలో నామినేషన్ వేయడానికి స్థానిక సంస్థల ఎన్నికలకు పోటీ చేసే అన్ని పార్టీల అభ్యర్ధులు చేరుకుంటున్నారు. రిటర్నింగ్ అధికారి అభ్యర్ధుల నుంచి నామినేషన్లు స్వీకరించి అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇస్తారు. ఇందులో విశేషం ఏముంది? ఇది సహజంగా జరిగే ప్రక్రియే కదా అనుకుంటున్నారా? అంత సజావుగా నామినేషన్ల ప్రక్రియ జరిగితే ఇక మన ప్రజాస్వామ్యం గురించి చెప్పుకునేది ఏముంటుంది?

అభ్యర్ధుల నుంచి నామినేషన్ ఫారాలు లాక్కుని చించేయడం.. ఏకగ్రీవం కోసం అభ్యర్ధులను నామినేషన్ వేయకుండా బెదిరించడం.. కొత్త పద్దతి. ఈ పద్ధతి ఇప్పుడు కొత్తగా మొదలైంది కాదు. గత ప్రభుత్వ హయాంలోనూ జరిగింది.. ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనూ జరుగుతుంది.

పోలీసులు మాత్రం అప్పుడూ.. ఇప్పుడూ ఒకరే. ఆనాటి ప్రతిపక్షంతోనూ.. ఈనాటి ప్రతిపక్షంతోనూ ప్రభుత్వ తొత్తులు అని నిందలు పడేది కూడా వారే. ఆనాడు కుప్పంలో జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాలను అడ్డుకోకుండా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు అన్నవారే..ఈరోజు పుంగనూరులో పోలీసులు సమర్థవంతంగా పనిచేశారు అని కితాబులు ఇస్తున్నారు.

అలాగే పుంగనూరు ఘటనలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు అని ఈరోజు ఆరోపణలు చేస్తున్న పార్టీ నాయకులే ఆనాడు కుప్పం ఎన్నికల్లో ఇదే పోలీసులు సమర్థవంతంగా పనిచేశారని కితాబు ఇచ్చారు. ఇదంతా చూస్తుంటే అదేదో నీవు చేస్తే సంసారం సామెత గుర్తుకు రాదూ? ఎటు తిరిగి రాజకీయ నాయకుల రెండు నాలుకల కాటుకు బలయ్యేది పోలీసులే.

నాలుగు రోజుల క్రితం పుంగనూరు లో జరిగిన గొడవల్లో చాలామంది పోలీసులకు గాయాలు అయితే ఒక పోలీసుకు మాత్రం కంటి చూపు కూడా పోయిందని వార్తలు వచ్చాయి. పుంగనూరులో తమ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమానికి వైసిపి ఎంపీ మిధున్ రెడ్డి హాజరయ్యారు. కానీ ఆయన రాక టిడిపి కార్యకర్తలకు ఇంకోలా అర్ధమయ్యింది. దాంతో ఒక్కసారిగా వందలాదిమంది కార్యకర్తలు మూకుమ్మడిగా తరలివచ్చి వైసిపి కార్యకర్తల మీద దాడి చేసారు. షరా మాములుగా ఈ దాడులను ఆపటానికి ప్రయత్నించిన కొంతమంది పోలీసుల తలలు పగిలాయి.

ప్రస్తుతం ఏపీలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న పోలీసుల పరిస్థితి ఎలా ఉందంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ చెప్పినట్టు నడుచుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నిజానికి ఈ సమస్య ఒక్క ఏపీకే పరిమితం కాదు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితులు ఉంటాయి.

అలా అని అధికార పార్టీ చెప్పినట్టు నడుచుకునే పోలీసుల జీవితాలకు జీవితాంతం ఢోకా లేదు అనుకోవడానికి కూడా లేదు..గత ప్రభుత్వానికి అనుకూలంగా పని చేసిన కొంతమంది పోలీస్ అధికారులు నేటి ప్రభుత్వంలో ఎక్కడా పోస్టింగులు అలాట్ కాక గాల్లో వేలాడుతున్నారు. నెక్స్ట్ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ పరిస్థితి కూడా అంతేనని కొంతమంది రాజకీయ నాయకులు ఇప్పటినుంచే పోలీసులను బెదిరిస్తున్నారు.

ఎన్నికల కమిషన్

సరే.. స్థానిక పోలీసులు రాష్ట్ర ప్రభుత్వ అధికారాల పరిధికి లోబడి పనిచేయాలి కాబట్టి కొంత వత్తిడికి లోనయి పనిచేశారని అనుకుందాం. కానీ ఎన్నికల కమిషన్ అలా కాదే.. రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థ హోదాలో విచక్షణాధికారాలు కలిగి ఉంది. ఎన్నికలు పారదర్శకంగా.. ప్రశాంతంగా జరిపించడానికి ఆ సంస్థకు పూర్తి అధికారాలు ఉన్నాయి. ఎన్నికల ప్రక్రియలో ఇలాంటి గొడవలు జరుగుతున్నాయంటే అది పోలీసుల వైఫల్యం అనేకన్నా ఎన్నికల కమిషన్ వైఫల్యం అనడమే సబబుగా ఉంటుందేమో? ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు పోలీసుల చేత సమర్థవంతంగా పని చేయించుకునే బాధ్యత ఎన్నికల కమిషన్ మీదే ఉంటుంది.

మరి ప్రజాస్వామ్య స్పూర్తికి విఘాతం కలిగేలా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులను బెదిరించడం.. నామినేషన్ పత్రాలు చించేయడం.. బలవంతపు ఏకగ్రీవాలు చేస్తున్నా అధికారులు సరైన చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు. గతానుభవాల దృష్ట్యా ఎన్నికల ప్రక్రియను మరింత సమర్థవంతంగా ఎందుకు నిర్వహించలేకపోతున్నారు అనే ప్రశ్నలు తలెత్తుతాయి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ కార్యకర్తలు.. నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని .. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని.. తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారిని కలిసి ఫిర్యాదు కూడా చేశారు. (గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు కూడా అప్పటి ఎన్నికల సంఘం ప్రధాన అధికారిని కలిసి ఇదే మాదిరిగా కంప్లైంట్ చేశారు)

ఇది కాకుండా ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతున్న పరిణామాల మీద ఫిర్యాదు చేస్తూ వైఎస్ జగన్ రాష్ట్ర గవర్నర్ ను కూడా కలిసి విజ్ఞాపన పత్రం అందచేశారు. అదనంగా హైకోర్టులో పిటిషన్ కూడా వేసారు. జగనే కాదు.. ఏ ప్రతిపక్ష నేత అయినా కూడా ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని భావిస్తే న్యాయం కోసం ఈ మూడు మార్గాలను అనుసరించడం మినహా మరో మార్గం లేదు.

ఇదిలా ఉండగా ప్రతిసారీ సరిగ్గా ఎన్నికల సమయంలోనే సంఘవిద్రోహ శక్తులు జొరబడి ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగిఇస్తున్నారనే సంగతి గత కొద్ది సంవత్సరాలుగా ఏపీ ప్రజలు..అధికారులు.. నాయకులు చూస్తునే ఉన్నారు. మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా? అంటే ఉందనే సమాధానం వస్తుంది.

ఆన్లైన్ పద్ధతి

ఈ సందర్భంగా కొంతమంది నాయకులు ఆన్లైన్ నామినేషన్ల పద్దతి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన కూడా బాగానే ఉందనిపిస్తుంది.. ప్రస్తుతం మనం డిజిటల్ యుగంలో ఉన్నాం. పాత కాలం నాటి విధానాలకు విరుద్ధంగా చాలా రంగాల్లో పేపర్ లెస్ విధానం నడుస్తుంది. అదే పద్ధతిని నామినేషన్ల విషయంలో కూడా ఎందుకు పాటించకూడదు?

ముందుగా అభ్యర్ధుల నుంచి ఆన్లైన్ లో నామినేషన్లు సబ్మిట్ చేసే అవకాశం కల్పించి స్క్రూటినీ సమయంలో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ను పరిశీలించవచ్చు కదా? ఈ ప్రక్రియ వల్ల అభ్యర్ధులకు నామినేషన్లు దాఖలు చేయడం మరింత సులువు అవుతుంది. ఈ విధానం వల్ల నామినేషన్ కేంద్రాల వద్ద రాజకీయ పార్టీల కార్యకర్తలు చేసే అనవసరమైన హడావుళ్లు తగ్గుతాయి. అధికారులకు.. పోలీసులకు కూడా పని వత్తిడి తగ్గుతుంది.

సెకండ్ స్టెప్ లో అధికారులు టోకెన్ సిస్టమ్ లో అభ్యర్ధులను విడి విడిగా పిలిపించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోర్టల్ లోనే నమోదు చేస్తే పని తేలిక అవడమే కాకుండా పారదర్శకంగా కూడా ఉంటుంది. అన్నట్టు ఈ తతంగం అంతా నామిషన్స్ ఘట్టానికే.. దాని తర్వాత ఒక్క దొంగ ఓటుకూడా పోల్ అవకుండా ప్రతి ఒక్కరి ఓటు భద్రంగా బ్యాలట్ బాక్సులోకి చేర్చడం ఇంకో ఘట్టం అన్నమాట.

ముగింపు

ప్రజాస్వామ్యానికి ఎన్నికలు పట్టుగొమ్మ లాంటిది. ఎన్నికలు ఎంత సజావుగా.. ఎంత పారదర్శకంగా.. ఎంత ప్రశాంతంగా జరిగితే అంత బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడుతుంది. ప్రజాస్వామ్యం ఎంత బలంగా ఉంటే ప్రభుత్వాలు అంత సుస్థిరంగా ఉంటాయి.. ప్రభుత్వాలు ఎంత సుస్థిరంగా ఉంటే ఓటేసిన పౌరుల భద్రత అంత సుస్థిరంగా ఉంటుంది.

అందుకే ప్రభుత్వాలు ప్రజాస్వామ్యం అనే బలమైన పునాదుల మీద పరిపాలన చేసేలా చేయించే బాధ్యత ఎన్నికల సంఘం మీదనే ఉంటుంది. అది స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి ..అసెంబ్లీ ఎన్నికలు కానివ్వండి .. పార్లమెంట్ ఎన్నికలు కానివ్వండి .. ఎన్నికల సంఘం తలుచుకుంటే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తన వంతు బాధ్యత నిర్వహించడం పెద్ద కష్టమైన పనేమీ కాదు.. మాజీ ఎన్నికల ప్రధాన అధికారి టి ఎన్ శేషన్ గారిని స్పూర్తిగా తీసుకుని పనిచేస్తే చాలు.. ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *