త్వరలో జరగబోయే విజయవాడ మేయర్ ఎన్నికలు రసవత్తరంగా జరగనున్నాయి. టీడీపీ.. బీజేపీ.. జనసేన కూటమిలు పొత్తులో భాగంగా విజయవాడ మేయర్ స్థానానికి జరిగే ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున వంగవీటి రాధాకృష్ణ పేరును ఖరారు చేశాయి. అలాగే వైసీపీ తరపున రాయన భాగ్యలక్ష్మి పేరును ఆ పార్టీ ప్రకటించింది.
ఇంతవరకు బాగానే ఉంది. ఎందుకంటే విజయవాడ మేయర్ పదవికి జరిగే ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని అందరూ భావించారు. అప్పటి పరిస్థితికి నిజం కూడా అదే.. రాజకీయ పండితులు కూడా టీడీపీ.. జనసేన.. బీజేపీ వెర్సెస్ వైసీపీ కోణంలోనే విశ్లేషణలు చేశారు. సోషల్ మీడియాలో కూడా విజయవాడలో ఈ రెండు రాజకీయ పార్టీలకు ఉన్న ఓట్ బ్యాంక్ కోణంలోను.. అభ్యర్ధుల బలాబలాలు.. అనుభవం కోణంలోను చర్చలు జరిగాయి.
ఏబీ వెంకటేశ్వర రావు ఎంట్రీ
అయితే విజయవాడ మేయర్ స్థానానికి మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగడంతో ఒక్కసారిగా చర్చల సరళి మారిపోయింది. అప్పటిదాకా పార్టీల పరంగా.. అభ్యర్ధుల బలాబలాల ఆధారంగా జరిగిన విశ్లేషణలు రూపు మార్చుకుని క్యాస్ట్ ఈక్వేషన్ల టర్న్ తీసుకుంది.
స్వతంత్ర అభ్యర్దిగా రంగంలోకి దిగిన ఏబీ వెంకటేశ్వర రావు కు మద్దతు ఇచ్చే విషయంలో మిగిలిన పార్టీలు అప్పటికి నిర్ణయం కూడా తీసుకోలేదు. మరోపక్క కూటమికి ధీటుగా సరైన అభ్యర్ధిని పోటీలో దింపే అన్వేషణలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ పరిస్థితుల్లో ఏబీ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని వామపక్షాలు నిర్ణయించుకున్నాయి. వామ పక్షాల నిర్ణయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించి ఏబీ అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించింది. దీంతో ఇండియా కూటమి బలపర్చిన స్వతంత్ర అభ్యర్థిగా ఏబీ వెంకటేశ్వర రావు కూడా పోటీలోకి వచ్చారు.
క్యాస్ట్ పాలిటిక్స్
ఇంతవరకు ఓకే.. మామూలుగా అయితే ఏబీ ఎంట్రీతో మేయర్ పదవికి త్రిముఖ పోటీ జరుగుతుందనే కోణంలో విశ్లేషణలు జరగాలి. కానీ కొంతమంది ఆ స్థానంలో సోషల్ మీడియాలో కమ్మ.. కాపు సామాజిక వర్గాల పేరుతో సరికొత్త చర్చలను లేవదీస్తున్నారు. వంగవీటి రాధాకృష్ణ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాగా.. ఏబీ వెంకటేశ్వర రావు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో సరికొత్త చర్చకు తెర తీశారు.
ఈ చర్చ ఇటు కూటమికి.. అటు వైసీపీకి తలనొప్పులు తెచ్చిపెడుతుంది. టీడీపీకి బలంగా ఉన్న కమ్మ సామాజిక వర్గం ఓట్లను చీల్చడానికి ఏబీ వెంకటేశ్వర రావు ను పావుగా వాడుకోవడానికి బరిలోకి దింపారని ఒక వాదనను లేవనెత్తుతున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా ఏపీలో.. మరీ ముఖ్యంగా విజయవాడలో కుల రాజకీయాల ప్రాముఖ్యత రోజు రోజుకీ తగ్గుకుంటూ వస్తుంది. నాలుగు దశాబ్దాల క్రితం బద్ద శత్రువులుగా మెలిగిన రెండు సామాజిక వర్గాలు మెల్లిగా పాత వైరాలను మర్చిపోయి ఒకటవుతున్నారు. మరీ ముఖ్యంగా రాజకీయాల్లో ఈ పరిస్థితులు కల్పిస్తున్నాయి.
ఎనభయ్యవ దశకంలో వంగవీటి.. దేవినేనిల మధ్య వర్గ వైరుధ్యాలు ఉండేవి. నిజానికి ఈ వర్గ వైరుధ్యాలను వ్యక్తిగత కోణంలో చూడాలి. కానీ అప్పట్లోనే ఇరువురి వ్యక్తిగత వర్గ పోరాటాలను కొంతమంది కుల నాయకులు మొత్తం ఇరు సామాజిక వర్గాల మధ్య పోరాటంగా చిత్రీకరించడంతో రెండు సామాజిక వర్గాల మధ్య దూరం కూడా పెరిగిపోయింది. ఈ పరిస్థితి కాపునాడుతో పతాక స్థాయికి చేరింది.
వంగవీటి మోహన రంగా హత్య తర్వాత ఆయన భార్య రత్నకుమారి క్రియాశీలక రాజకీయాల్లోకి రావడంతో విజయవాడ రాజకీయ ముఖ చిత్రంలో మార్పులు రావడం మొదలయ్యాయి. దూరం జరిగిన ఆ రెండు సామాజిక వర్గాలను రత్నకుమారి కలుపుకుంటూ వెళ్ళారు. దానికి తోడు రత్నకుమారి టీడీపీ పార్టీలో చేరడం.. తల్లి బాటలో వంగవీటి రాధాకృష్ణ కూడా టీడీపీలో చేరడంతో విజయవాడలో కుల రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి.
అందివచ్చిన అవకాశాన్ని చంద్రబాబు కూడా వ్యూహాత్మకంగా వాడుకోవడంతో టీడీపీ కి సొంత సామాజిక వర్గానికి అదనంగా కాపు సామాజిక వర్గం మద్దతు కూడా గణనీయంగా పెరిగింది. ఒక రకంగా మారుతున్న పరిణామాలు విజయవాడకు మంచే చేశాయి. కులాలకే పెద్ద పీట వేస్తూ సామాజిక వర్గ వైషమ్యాలతో విడిపోయిన వాళ్ళు ప్రస్తుతం కలిసిపోయి అభివృద్ధిలో పోటీ పడుతున్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామాలే.
అయితే ప్రస్తుతం ఏపీలో విచిత్రకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. సోషల్ మీడియాలో కొంతమంది పనిగట్టుకుని వంగవీటి రాధాకృష్ణ.. ఏబీ వెంకటేశ్వర రావు ల మధ్య పోటీ మీద క్యాస్ట్ కోణంలో చర్చలు లేవదీస్తున్నారు. మానిపోయిన గాయాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నారు. అనేక ఆటుపోట్లను తట్టుకుని కోలుకున్న విజయవాడ మీద మరోసారి కుల పంజా విసురుదామని చూస్తున్నారు. ఇది మంచి పరిణామం కాదు.
రంగంలోకి దిగిన రత్నకుమారి
కమ్మ సామాజిక వర్గం ఓట్లు వంగవీటి రాధాకృష్ణ కు పడకుండా చీల్చేందుకే ఏబీ వెంకటేశ్వర రావు ను రంగంలోకి దించారని ఒక వాదన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ తిరుగుతుంది. కానీ ఆ పరంగా ఏబీ ప్రభావం వంగవీటి రాధాకృష్ణ మీద అంతగా ఉండకపోవచ్చు. ఎందుకంటే రాధాకృష్ణ తల్లి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు.. తమ సామాజిక వర్గం ఓట్లు చీలకుండా ఇప్పటికే ఆమె రంగంలోకి దిగారు. రత్నకుమారికి ఉన్న పరిచయాలు.. అనుభవం ఖచ్చితంగా రాధాకృష్ణకు ఉపయోగపడతాయి. అందుకే రాధా గెలుపు మీద ఆమె చాలా ధీమాగా ఉన్నారు. ఇప్పుడు విజయవాడ మేయర్ పదవికి బరిలో ఉన్న ముగ్గురు అభ్యర్ధుల బలాబలాల గురించి ఒకసారి చూద్దాం.
వంగవీటి రాధాకృష్ణ
తరచూ పార్టీలు మారుతాడు అనే అభిప్రాయం మినహా రాధాకృష్ణ నాయకత్వం మీద కార్యకర్తల్లో..అభిమానుల్లోనూ మంచి అభిప్రాయం ఉంది. కుల రాజకీయాలు చేయకపోవడం.. సెటిల్మెంట్లకు దూరంగా ఉండటం.. స్థానిక సమస్యల మీద పూర్తి అవగాహన ఉండటం రాధా కు కలిసొచ్చే అంశాలు.

అయితే 2004 లో జరిగిన ఎన్నికల్లో మొదటిసారి ఎమ్మెల్యే అవడం మినహా రాధాకృష్ణ రాజకీయ జీవితంలో ఎదుగు బొదుగు పెద్దగా లేదు. పైగా ఈ 22 సంవత్సరాల ఆయన రాజకీయ జీవితంలో ప్రత్యక్ష ఎన్నికల్లో రెండుసార్లు ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్యే పదవీ కాలం మినహా మిగిలిన సంవత్సరాలలో ప్రజా సమస్యల మీద కన్నా తండ్రి విగ్రహావిష్కరణల మీదనే ఆయన ఎక్కువ ఫోకస్ పెట్టారని ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఏబీ వెంకటేశ్వర రావు
ఏబీ వెంకటేశ్వర రావు మాజీ ఐపీఎస్ అధికారి.. ఏపీలో ఇంటిలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన అనుభవం ఉంది. ఆయన ఇంటిలిజెన్స్ చీఫ్ గా ఉన్న సమయంలోనే ఏపీ రాజకీయాల పల్స్ పట్టి చూసారు. కాబట్టి ఏపీ రాజకీయాల మీదా.. నాయకుల మీదా ఆయనకు పూర్తి అవగాహన ఉంది. ఈయనకు వామపక్షాలు.. కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించడం కలిసొచ్చే అంశం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువ ట్రెండింగ్ అవుతున్నారు.

అయితే గత ప్రభుత్వ హయాంలో ఆయన అవినీతి ఆరోపణలు ఎదుర్కుని సస్పెండ్ కూడా అయ్యారు. అక్కడ్నుంచి ఆయన సమయమంతా ప్రభుత్వం మీద పోరాటం చేయడంతోనే సరిపోయింది. చివరికి కోర్ట్ ఆదేశాలతో రిటైర్మెంట్ ముందు రోజు సీట్లో కూర్చుని మాజీ అధికారి హోదాలో బయటపడ్డారు.
రాయన భాగ్యలక్ష్మి
బీసీ వర్గానికి చెందిన రాయన భాగ్యలక్ష్మి గత ప్రభుత్వ హయాంలో విజయవాడ మేయర్ గా పనిచేశారు. ఆ అనుభవం ఈవిడకు అక్కరకు వస్తుంది. విజయవాడ అభివృద్ధి మీద.. స్థానిక సమస్యల మీద ఇప్పటికే అవగాహన ఉంది.. బీసీ వర్గానికి చెందిన మహిళ కావడం.. మాజీ మేయర్ గా గడించిన అనుభవం భాగ్యలక్ష్మికి కలిసొచ్చే అంశం.

అయితే కూటమి అభ్యర్ధి వంగవీటి రాధాకృష్ణ కు ప్రధాన ప్రత్యర్థిగా బరిలోకి దిగిన రాయన భాగ్యలక్ష్మి ప్రచార లోపం వల్లనో.. కార్యకర్తలు.. నాయకులతో సమన్వయం చేసుకోలేకపోవడం వల్లనో కానీ ప్రచార రేసులో ఏబీ వెంకటేశ్వర రావు కన్నా వెనుకబడిపోతున్నారు.
ముగింపు
సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నట్టు క్యాస్ట్ పాలిటిక్స్ అనేవి ఏబీ వెంకటేశ్వర రావు కు కొంత మేరకు సపోర్ట్ చేస్తుందేమో కానీ గెలవడానికి ఎంత వరకు ఉపయోగపడుతుంది అనేదే అసలు ప్రశ్న? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఓటర్లు కులాల ఆధారంగా కాకుండా విజయవాడ అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చే అభ్యర్థికే మేయర్ పీఠం అప్పగిస్తారనేది మాత్రం నూరు శాతం నిజం .. అందులో అనుమానమే లేదు.
